Asianet News TeluguAsianet News Telugu

కందుకూరి శ్రీరాములు తెలుగు కవిత: నా నమ్మకమే వేరు

పగలులో వెలుగే నా నమ్మకం !/నమ్మకం ఒక గొప్ప ధైర్యం !! నా నమ్మకమే వేరు  !!! అంటున్న కందుకూరి శ్రీరాములు కవితలోని నమ్మకాన్ని చూడండి.

Kandukuri Sreeramulu Ttelugu poem, Telugu Literature
Author
Hyderabad, First Published Dec 19, 2020, 5:40 PM IST

నమ్మకం ఒక గొప్ప ధైర్యం !
నమ్మకం 
బతుకును సుగంధ భరితం చేస్తుంది
నమ్మకం 
భవిష్యత్ ఆకాంక్షలకు 
నిచ్చనలేస్తుంది
అడుగు ముందుకు వేయటమో
ఆకాశాన్ని తేరిపార చూడటమో 
ఒక నమ్మకం !
ఆకు కదలికే  
నాలో తుఫాన్లు రేపుతుంది.
కాలం  మార్పే 
నాలో ఒక అంకురార్పణచేస్తుంది
నా సంస్కృతి 
నా సంప్రదాయం
ఒక నమ్మకం!
నా రచన 
నాకొక వేదం 
నేనో కవిని 
అది ఒకనమ్మకం !
 
 *     *    *    *    *

నా నమ్మకం వేరు
నా నమ్మకం 
నటన కాదు
ఒక వెలుగు !
ఒక సంఘర్షణ !
తరతరాలను మార్చే 
ప్రయత్నం !
నా నమ్మకం నది !
ఆలోచనల ప్రవాహాలు 
అంతర్గత సముద్రాలు
ఆవిర్ల ఆవేశాలు 
ఆక్రోశాల మేఘావృతాలు
ములుకులు లేని పలుకులు 
మలుపులొక 
కొత్త ఊహకు పునాది

నా నమ్మకం వేరు 
సిరాను నమ్ముతాను 
రాతను నమ్ముతాను 
జరుగుతున్న ఘోరాన్ని చూస్తాను !
రణాన్ని నమ్ముతాను 
రక్తాన్ని నమ్ముతాను 
కళ్ళల్లో జీరలు చూస్తాను !
ఆకాశం ఒంపిందంటే 
భూమి కంపించిందంటే నమ్ముతాను 
నిదురరాని కలలో 
ఊపిరాడక  చావటం చూస్తాను !
మెరవటం 
ఉరమటం నమ్ముతాను 
బురదలోంచి పద్మాన్ని వింతగా చూస్తాను !
సూర్యుణ్ణి 
చుక్కల్ని నమ్ముతాను
ఉదయ సంధ్యలోంచి
నిప్పులు చిమ్ముతున్న
ఎరుపు చూస్తాను !
చంద్రుణ్ణి 
నెలవంకల్ని నమ్ముతాను
కరోనాలోంచి బతుకు బరోసాను చూస్తాను
పగలును 
రాత్రిని నమ్ముతాను
జలప్రళయంలోంచి
పేదజీవి తలెత్తటం చూస్తాను !
రాత్రిలో పగలు చూడటం కాంక్షిస్తాను !
నీచరాజకీయాలోంచి
ప్రజాస్వామ్య పరిరక్షణను చూస్తాను !
పగలులో వెలుగే నా నమ్మకం !
నమ్మకం ఒక గొప్ప ధైర్యం !!
నా నమ్మకమే వేరు  !!!

Follow Us:
Download App:
  • android
  • ios