తపస్సు చేసినందుకు
తలలు నరుకుడు కొలువైన నేల

విలువిద్య నేర్చినందుకు
ఒప్పించి బొటనవేలు అడుక్కున్న గరిమ

ప్రశ్నల పదును చెప్పినందుకు
బంధించి విషమిచ్చి చంపిన పాఠం మనది

చనుబాల నడిగి ప్రాణాలు తాగొచ్చని 
నేర్పిన పురాణాల పూతన వైనం మనదే

మనసు విప్పినందుకు
ముక్కుచెవులు కోసిన ఘనమైన భూమి

పరస్త్రీల కామించే వెయ్యి కళ్ళనొదిలి
కన్నతల్లి తల నరికించిన తండ్రులున్న మనం

పరువు పేరున కులహత్యలు నేర్చిన వేటకొడవళ్ళతో నరికే కన్నవాళ్ళ మన్ను మనది

హోలిక దహనం పండుగ రంగుల్లో తడిసి
అ(హ)త్యాచారాలతో ఖాకులు అపరాత్రి దహనం

నాలుకలు కోసి నాభిని తవ్వి 
నడుపుతున్న మారణ హోమంలో ఎన్నెముకలిరిసే పాల"కు"లహంకారాన్ని 
కత్తిరించే రహస్య ఆయుధం ?
ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే ఔషధం ?
మీ వద్దే ఉన్నది వెతకండి
దొరికే వరకు వెతకండి.