జయంతి వాసరచెట్ల తెలుగు కవిత: అపరిచిత యుద్దం

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచమంతా విస్తరించి అపరిచిత యుద్ధం చేస్తోంది. దాన్ని ఎదుర్కోవడం ఇప్పుడు ప్రపంచం చేయాల్సిన పని. దాన్ని కవితాత్మకంగా జయంతి వాసరచెట్ల చెప్పారు.

Jayanthi Vasarachetla Telugu poem on the silent war of Coronavirus Pandemic

ఇప్పుడు 
పలకరించుకోవడం
పలవరించుకోవడం
ఆత్మీయత పంచుకోవడం 
అనర్థం
ఒకరికి ఒకరం చేతిలో చేయి కలిపి 
అక్కున చేర్చుకోవడం నేరం
నేనెప్పుడూ అనుకోలేదు 
 పరిచయం లేని రోజును కలుసుకుంటానని
కనిపించని జీవి ఎర్రకిరీటం బోర్లించుకుని 
తానే రాజునని ప్రకటించుకుంటుందని
కాలాన్ని శాసించే మానవుడిపై 
 దండయాత్ర చేసి
ప్రపంచాన్నే స్తంభింపజేసి
సైలెంట్ గావైలెంట్ అవుతుందని
కాలాన్ని ప్రకృతి అగ్నిప్రవేశం చేయించినట్లు
ఎవరికి వారే నిశబ్దం తెరచాటున నిలబడి
కనిపించని శత్రువును వెతుకుతామని

ఇప్పుడు 
కాలు గుమ్మం దాటడం 
కూర్చున్నకొమ్మను నరుక్కోవడం

మనవ మేథకు అంతుపట్టని ఒక 
సవాలును ఎదుర్కోవడానికి 
సమాయత్తమవుతామని
అంతుచిక్కని ప్రశ్న కు జవాబు రాబట్టడం 
మనవంతయినప్పుడు
ఎవరికి వారే పరాయీలుగా మారి
ఆగిపోకుండా ప్రయాణం సాగించాలి
తిరిగి ప్రకృతి ని పరిచయం చేసుకుంటూ
మన సంస్కృతి సాంప్రదాయాలను
వెలిగిస్తూ
మనల్ని మనం కొత్తగా పరిచయం
చేసుకోవాల్సిందే
మహమ్మారితో 
అపరిచిత యుద్దం చేయాల్సిందే!!

ఇటీవల తన మొదటి   కవితా సంపుటి ' నేల విమానం'  ద్వారా తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించిన జయంతి వాసరచెట్ల వివిధ సామాజిక సమస్య లపై స్పందిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios