అనుబంధాల విందు మీల్స్ టికెట్ కథలు

మానవ సంబంధాల లోతులను తెలియచేసిన డాక్టర్ ప్రభాకర్ జైనీ కథా సంపుటి "మీల్స్ టికెట్" పై జయంతి వాసరచెట్ల చేసిన సమీక్ష.

Jayanthi Vasarachetla reviews Prabhakar Jaini short stories

నిజ జీవితంలో నిత్యం అనేక సంఘటనలు మన కళ్ళముందే జరుగుతూ ఉంటాయి. కొన్ని సంఘటనల్లో మనం పాత్రధారులుగా కూడా ఉంటాం. కొన్ని సంతోషాన్ని ఇస్తే కొన్ని బాధతో గుండె భారాన్ని పెంచుతాయి.   అలాంటి సంఘటనల సమాహారం 18 కథల సంపుటి డాక్టర్ ప్రభాకర్ జైనీ  రాసిన మిల్స్ టికెట్ కథాసంపుటి.  తెలుగు సాహితీవనం ఫేస్ బుక్ గ్రూప్ లో  పెట్టిన కథల పోటీలో పాల్గొని నా కథ ఉత్తమ కథగా  గెలుపొంది బహుమతిగా పొందిన కథల సంపుటి మీల్స్ టికెట్ . పుస్తకం చదవడం మొదలు పెట్టి ఆసాంతం చదివేలా చేసింది.

పుస్తకంలోని మొదటి కథ సంపుటి యొక్క టైటిల్ . "మీల్స్ టికెట్ "   ముఖ్యపాత్ర నరసింహారావు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు డైరెక్టర్.   అదే పని మీద హైదరాబాద్ నుండి తను పుట్టిపెరిగిన ఊరు  వరంగల్ కు వెళుతూ తన బాల్య స్మృతులను నెమరువేసుకుంటూ ఉంటాడు.  తను  పెరిగిన వాతావరణం, నెహ్రూ పార్క్ , జనగామలో  రైస్ మిల్లు తాతను గుర్తుచేసుకుంటూ కారు జనగాం దాటుతున్నంత సేపూ బాల్యస్మృతులు తరుముతుంటాయి.

అలాగే వరంగల్లులోని సొంతిల్లు చేరుకోగానే ఆలోచనలనుండి తేరుకుని కాసేపు ఇంట్లో గడిపి ఆకలిగా ఉంటే దగ్గర్లో ఉన్న తన స్నేహితుడి శంకర్ విలాస్ హోటల్ కి వెళ్లి  ఓనర్  ను పలకరిస్తాడు. టేబుల్ ముందు కూర్చుని భోజనం చేస్తున్న నరసింహం వాళ్ల మామయ్య గురుమూర్తి కనిపిస్తాడు.  బాగా బతికిన వాడు ఇలా అయిపోయాడని పలకరించాలని దగ్గరగా వెళ్లి పలకరించి పరిస్థితిని ఆరాతీస్తే వాళ్ళ మామయ్య  గురుమూర్తికి  కోట్లు ఎలా వచ్చాయో అలాగే పోయాయి.  భార్య చనిపోవడం వలన పిల్లలు వెళ్లిపోయారని అప్పటినుండి తనను ఎవరూ పట్టించుకోకపోవడంతో కొన్నాళ్ళు వృద్ధాశ్రమంలో గడిపానని చెప్తాడు.  ఇప్పుడు ముగ్గురు కొడుకులు కలిసి నెలకు 30 మీల్స్  టికెట్స్ కొనిస్తారని రోజుకు ఒక్కపూట హోటల్లో భోజనం చేస్తానని  మళ్ళీ తనే   చెప్తాడు . 

చలాకీగా తిరిగే మామయ్య అలా కనిపించేసరికి గుండె నీరైంది నరసింహానికి.   తనవెంట రమ్మని అంటే రానంటాడు.  ముందుకు వెళ్ళబోయి వెనక్కి వచ్చి నాకు రోజుకు ఒక్కపూట భోజనం చాలటం లేదురా సాయంత్రం మళ్ళీ  ఆకలేస్తుంది అని గురుమూర్తి చెప్పేసరికి మనసు ద్రవించి పోతుంది నరసింహానికి. స్నేహితునికి చెప్పి మూడుపూటలా అదే హోటల్లో భోజనం ఏర్పాటు చేస్తాడు.  ఈ కథలో విభిన్న కోణాలు కనిపిస్తాయి.  అన్యాయంగా అపహరించిన ఆస్తి ఎక్కువకాలం ఉండదు.  కన్న కొడుకుల నిర్లక్ష్యానికి గురైన ఒక తండ్రి బాధ.  అలాగే నేటి సమాజంలో విచ్ఛిన్నమవుతున్న అనుబంధాలు. ఎంత ఉన్నతస్థాయికి ఎదిగినా పుట్టి పెరిగిన ఊరును అక్కడి అనుబంధాలను మర్చిపోకూడదని కథ సారాంశం.

మరోకథ "సోల్ మేట్".  ఆత్మీయత అనుబంధాలతో పెనవేసుకున్న కుటుంబం అంటే ఎలా ఉంటుందో ఈ కథలో మనకు కనిపిస్తుంది.   కన్న కొడుకు ఇష్టాన్ని తన ఇష్టంగా కొడుకు సంతోషమే తన సంతోషంగా మార్చుకుని బ్రతుకుతున్న తల్లిదండ్రుల ఆదర్శం కనిపిస్తుంది.  భర్తకు గుండెపోటు రావడం చూసి తట్టుకోలేని భార్యకు గుండెపోటు వస్తుంది.  భార్యా భర్తల మధ్య ప్రేమ, అనుబంధం కనిపిస్తుంది.  కన్న కొడుకు పైచదువులకు విదేశాలకు వెళ్తాను  అంటే ఇష్టం లేకున్నా పంపిస్తారు తల్లిదండ్రులు.  ఐదు పదుల వయసులో సోషల్ కమ్యూనికేషన్ పెంచుకుని నవదంపతులు ఒకరి కోసం ఒకరు అన్నట్లు సాగుతుంది వారి దాంపత్యం.   కొడుకు ఒకమ్మాయిని ప్రేమించానని చెప్పగానే ఆ అమ్మాయితో పెళ్లి చేసి పంపుతారు.  తల్లిదండ్రులంటే విపరీతమైన ప్రేమ కొడుకుకు "ఐసీయూ"  లో ఉన్న తల్లిదండ్రులను చూసి తట్టుకోలేక పోతాడు.

తండ్రి కాస్త కోలుకుని తన భార్య నిర్జీవంగా ఉండడం చూసి తట్టుకోలేక తన మాటలను ఫోన్లో వాయిస్ రికార్డ్ చేసి భార్యకు వినిస్తాడు.  ఎన్నిసార్లు వినిపించిన స్పందన ఉండదు. అదిచూసి  డాక్టర్లు ఇదేమన్నా సినిమానా మాటలు విని  కదలిక రావడానికి అని నవ్వుతూ చెవిలోంచి ఇయర్ ఫోన్స్ తీయబోతారు.  ఒక చెయ్యి తీయకుండా ఆపుతుంది.  చూస్తే తన భార్య సీత కళ్ళు తెరిచింది.  అందరూ ఆశ్చర్యపోతారు.  భర్త భార్య దగ్గరికి వచ్చి చేతిలో చేయి వేసి ఇద్దరూ  ఒకేసారి కన్నుమూస్తారు. రచయిత ఈ కథలోని పాత్రల వ్యక్తిత్వం దెబ్బతినకుండా కుటుంబంలోని అనుబంధాల ప్రాముఖ్యతను కళ్లకు కట్టినట్లు చిత్రించాడు.

పల్లె సొబగులన్నీ  మాయమై నాగరికత సంతరించుకున్న నేటి నగరాలను నాటి ...నేటి పరిస్థితిని అద్దం పట్టిన మరోకథ "నగరపు నాగుపాము".   ఒక తరానికి మరొక తరానికి మధ్య ఆప్యాయతలు ఎలా తరిగిపోతున్నాయో
కళ్లకు కట్టాడు రచయిత . స్కూలుకు సెలవులు రాగానే అమ్మమ్మ  వాళ్ళ ఇంటికి పోయి గారాలు పోయేవాడు నరసింహ.  చిన్న కిరాణా కొట్టు నడిపించే అమ్మమ్మ అనంతలక్ష్మీ తాతయ్య రాజయ్య నరసింహ ను చాలా గారాబం చేసేవారు.  అనారోగ్యంతో తాతయ్య చనిపోయాక అమ్మమ్మ ముభావంగా ఉండసాగింది.  నరసింహ డిగ్రీ చదువుతున్నప్పుడు తన కన్న తండ్రి చనిపోతాడు.  అది తట్టుకోలేక అమ్మమ్మ తన  కూతురునీ పిల్లలను జనగామ తీసుకుని వెళ్తుంది.  అంతకుముందు ఆప్యాయంగా పలకరించే వాళ్ళు క్రమంగా ముక్తసరిగా మాట్లాడటం మొదలుపెడతారు.  కొంతకాలానికి నరసింహ అమ్మమ్మ తర్వాత అమ్మ కూడా చనిపోవడంతో ఆ ఆప్యాయతలు కరువై ఇప్పుడు జ్ఞాపకాల్లో మిగిలిపోయారు.   ఇక్కడ రచయిత
"విలోమానుపాతంలో నా వయసు పెరిగినకొద్దీ విలువలు తగ్గిపోసాగాయి." అని ఒక మాట అంటాడు . వాక్యం చదువుతుంటే మా గ్రామం గుర్తుకొచ్చింది.  జనగామ అనే గ్రామం ఇప్పుడు నాగరికతతో మెరుగులు దిద్దిన" నగరపు నాగుపాము" అంటాడు రచయిత.

మనసును ఆకట్టుకున్న మరో కథ "ఫ్రీడం ఫైటర్". లంచాలు ఇచ్చి పైరవీలు చేసి ఫ్రీడం ఫైటర్ టికెట్ తీసుకున్న శేఖరయ్య ,  స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని ప్రాణాలను ఫణంగా పెట్టిన సుప్రసన్నారావు ఒకే ట్రైన్ లో ప్రయాణం చేస్తుంటారు.  ట్రైన్ కండక్టర్ వారి పాస్ చూసి అన్నీ పాస్ లే మీరు నిజంగా పోరాటం చేసిండ్రా అని వెటకారంగా మాట్లాడుతాడు.  చివరకు ట్రైన్ కండక్టర్ కు సుప్రసన్నారావు బుద్ది చెప్తాడు.

మరో కథ "పాల ఐస్ క్రీం" నేటి కార్పోరేట్ చదువులు ఎలా ఉన్నాయో పూర్వపు చదువులు ఎలా ఉండేవో తెలియజేస్తుంది.  ఇప్పుడు పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో ఈ  కథ ద్వారా తెలియజేసారు రచయిత.

"డోంట్ వర్రీ బీ హ్యాపీ"  ప్రేమ అనుబంధం ఆప్యాయతల మధ్య అల్లుకున్న దాంపత్య జీవితం ఇంకా ఆస్వాదించాలనుకున్నా ఒక్కోసారి అనుకోకుండా అగాధంలోకి తీసుకు వెళ్తుంది.   ఇంకా కొన్ని రోజుల్లో తన జీవితం ముగిసిపోతుంది అని తెలిసిన శాంతి భర్త తన ఆస్తి వివరాలు అన్నీ శాంతకు వివరిస్తాడు.  బ్యాంకు లాకర్ ఎలా ఓపెన్ చేయాలి అనేది విడమర్చి చెప్తాడు.  ఆరోజంతా చిలిపి చేష్టలతో ఆటపట్టిస్తాడు, అల్లరి చేస్తాడు.  తన వ్యాధి గురించి భార్యకు తెలియకుండా జాగ్రత్త పడతాడు.  కానీ కథలోని ముగింపు భర్త చనిపోయాక భార్యకూడా చనిపోతుంది.  ముగింపు మనలను కంటతడి పెట్టిస్తుంది.  ఈ కథ  అనుబంధం తాలూకు మధురిమలు దాంపత్య జీవితాన్ని ఎంతగా పెనవేసుకుంటాయో తెలియజేస్తుంది.

ఏ కథ చదివినా అది మన జీవితంలో ఎక్కడో ఒక దగ్గర తారసపడినట్లు అనిపిస్తుంది.  ఇంకా పరిశ్వంగం, కొత్తగా రెక్కలొచ్చినవేళ, ఆ అమృత పాదాలు, కాళరాత్రి, సర్దుకున్నారా, ప్రాప్త కాలజ్ఞుడు,  నాయినా! రావే!,  శాంతి పావురం కథలు మనసును తట్టి కథలోని పాత్రలో మనం  లీనమయ్యేలా చేస్తాయి.  ఇంత చక్కని కథలను అందించిన డాక్టర్ ప్రభాకర్ జైనీకి హృదయపూర్వక శుభాకాంక్షలు.

ప్రతులకు: డాక్టర్ ప్రభాకర్ జైనీ
చరవాణి:7989825420

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios