ఇరుగు పొరుగు: రెండు తమిళ కవితలు
ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ కవి వారాల ఆనంద్ రెండు తమిళ కవితలను తెలుగులోకి అనువదించారు. ఆ అనువాదాలు చదవండి.
ప్రయాణం
ఎలాంటి తొందరలో నయినా
నేను విమాన ప్రయాణాన్ని ఇష్టపడను
ఓ బియ్యం బస్తాతో
సరదా ముచ్చట్లను ఆనందిస్తూ
జగడాలు, గందరగోళాలు
అరుపులు గొడవల నడుమ సాగే
రోడ్దమ్మటి ప్రయాణమే నాకిష్టం
అసలు
దూర ప్రయాణాలు అట్లాగే చేయాలి
ఏ ప్రయాణ మయినా కనీసం
పద్నాలుగేళ్ళకు తగ్గకుండా చేయాలి
అప్పుడే కదా
అయోధ్యకు తిరిగి వచ్చేందుకు
రామునికి అనుమతిచ్చింది.
తమిళం: క. నా. సుబ్రహ్మణ్యం
ఇంగ్లిష్: కే.వి.జ్వేలేబిల్
తెలుగు: వారాల ఆనంద్
----------------------------
సంగీత ప్రేరణతో
(సఫ్రి ఖాన్ కోసం)
అప్పటిదాకా
సూర్యుడు నిస్తేజంగా వున్నాడు
సముద్రపు అలలు ఎగిసి ఎగిసి
ఒడ్డుపై నా పాద ముద్రల్ని
తుడిచేసాయి
ఒక్కసారిగా సంగీతం ప్రవాహమై
నన్ను ప్రలోభ పెట్టింది
అప్పుడు
నా చెవుల్లో ధ్వనించేదేమిటి
జీవితమే
వేదన
అన్ని దిక్కుల్లో వణికి
అంతటా విస్తరించి
అన్నింటినీ కమ్మేసింది
నేను పైకి చూసాను
కడిగిన స్వచ్చమయిన కిరణాలతో
సూర్యుడు తేజోవంతంగా వున్నాడు.
తమిళం: సుకుమారన్
ఇంగ్లీష్: ఎం.ఎస్.రామసామి
తెలుగు: వారాల ఆనంద్