నీ పిడికిట్లో ఏమి దాచావు 
అత్యంత ఆసక్తితో అడిగింది 
ఓ తల్లి తన కూతుర్ని

ఆ అమ్మాయి కళ్ళూ పెదాలూ 
దేహం ముఖం 
ఆమె కొంటె నవ్వును దాచలేక పోయాయి

నా పిడికిట్లో నీలం తెలుపు 
సీతాకొక చిలుకను దాచాను 
చూడు అంటూ పిడికిలి తెరిచింది 
కానీ సీతాకొక చిలుక లేదు
ఉండాలమ్మా 
నేనే తోటలోంచి తెచ్చాను

తల్లి తన హృదయపు లోతుల్లోంచి 
గాఢమయిన నిట్టూర్పు విడిచింది

పాత కథే 
అర్థంలేని నష్టం ఓటమి లొంగుబాటు
ఫలితంగా అలవికాని దుఖం

నేనుకూడా చూశాను తల్లీ కలల్లో 
నీలం తెలుపు రెక్కల నడుమ 
అమాయక పడుచుదనాన్ని 
ఫెలుసయిన యవ్వనాన్ని 

కానీ వాటిని ఆశించేందుకు 
నాకు ధైర్యం లేక పోయింది
'అది నిన్నూ నాలాగే 
శూన్య నేత్రాల్ని మిగిల్చి 
ఎడారిగా చేసి ఎగిరిపోకుండా 
నీ వేళ్ళను బంధించు '
అంది తల్లి కూతురితో

ఆశ్చర్యాద్భుతాలు నిండిన చూపులతో 
కూతురు తల్లినే చూస్తూ వుండిపోయింది.

ఒరియా మూలం: ప్రవసినీ మహకుద్ 
ఇంగ్లీష్: ఏం. విజయలక్ష్మి 
తెలుగు : వారాల ఆనంద్