ఇరుగు పొరుగు: తెలుగులో మూడు ఉర్దూ కవితలు

ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ తెలుగు కవి వారాల ఆనంద్ మూడు ఉర్దూ కవితలను తెలుగులో అందించారు. ఆ కవితలను చదవండి.

irugu poorugu: Varala Anand provides three Urdu poems in Telugu

మూడో మనిషి 

వాళ్ళిద్దరూ చాలా గొప్ప స్నేహితులు 
మూడో మైనిషి పైన ద్వేషంతో 
వాళ్ళ స్నేహం మరింత విప్పారింది
వాళ్ళిద్దరూ చేతులు కలిపి 
మూడో మనిషిని తమ దారి నుండి 
ఆడ్డు తొలిగించారు
మరుక్షణమే వాళ్ళిద్దరూ 
శత్రువులుగా మారి పోయారు

ఉర్దూ: నిదా ఫజ్లీ 
ఇంగ్లిష్ : బాల్ రాజ్ కోమల్ 
తెలుగు: వారాల ఆనంద్ 

-------------------------


స్మృతి లేఖనం 

నేను సమాధి లోకి చేరగానే 
కాళ్ళూ చేతులూ బార్లా జాపి 
హమ్మయ్య ఇక 
నా ప్రశాంతత నెవరూ భంగ పరచరనుకున్నాను
ఈ రెండు గజాల స్థలం 
నాదే నావొక్కడిదే అనుకున్నాను
అందుకే
మట్టిలో కలిసి పోవడం ఆరంభించాను 
కాలాన్ని లెక్కించడమూ మానేసాను
చివరాఖరికి విశ్రాంతిగా వున్నాననుకున్నాను
కాని 
నా ప్రశాంతతను నా నుంచి లాగేశారు 
నేనింకా మట్టిలో మట్టినయి పోక ముందే
ఇంకో వ్యక్తి నా సమాధిలోకి 
ప్రవేశించాడు
ఇప్పుడు 
మరొకరి ‘స్మృతి లేఖనం’ 
నా సమాధి పై చెక్కబడింది. 

ఉర్దూ: మహమ్మద్ ఆల్వి 
ఇంగ్లిష్: అనిస్సుర్ రహమాన్ 
తెలుగు: వారాల ఆనంద్ 

==============


కలల ప్రవేశ ద్వారం మూసుకు పోయింది 

ఇవ్వాళ రాత్రి 
ఓ కొత్త సమస్యను 
బహుమతిగా ఇచ్చింది
నా కంటి నిద్రను దూరం చేసి 
కన్నీటితో నింపింది
తర్వాత రాత్రి నా చెవిలో 
గుస గుసగా చెప్పింది:
అన్ని పాపాల్నించి 
నిన్ను విముక్తం చేసాను
నువ్వు సంపూర్ణ స్వేచ్చను పొందావు 
ఇక ఎక్కడికయినా వెళ్ళొచ్చు
కాని
‘నిద్రా’, ‘అబద్దమూ’ మేల్కొని వుంటే 
ఇక 
కలల ప్రవేశ ద్వారం మూతబడ్డట్టే
     
ఉర్దూ మూలం: శార్యార్ (అఖ్లాజ్ మహమ్మద్ ఖాన్)
ఇంగ్లిష్: ఖైదర్ బక్త్, లెస్లీ లెవిన్ 
తెలుగు: వారాల ఆనంద్ 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios