Asianet News TeluguAsianet News Telugu

నల్లగొండ జిల్లా కథా సాహిత్యం

సమాజ నిర్మాణంలో కథా ప్రక్రియ ఇక్కడి చైతన్యంను తట్టి లేపింది. అలాంటి కథా సాహిత్యంలో నల్లగొండ జిల్లా పాత్రను విస్మరించలేం. ఒకప్పడు చిన్నపిల్లలకు నిద్రపోవడానికి తల్లిదండ్రులు చిన్న చిన్నకథలు చెప్పడం అలవాటు.

I chidanandam on Nalgonda dostrict short story writers
Author
Hyderabad, First Published Aug 27, 2020, 11:13 AM IST

రచయిత: ఐ.చిదానందం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో కథకులు ఉద్భవించారు. తెలుగు కథకు ప్రత్యేకతను తెచ్చిన జిల్లాగా నల్గొండ జిల్లాను చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణలోనే కాదు తెలుగులో సైతం తొలి కథ ప్రారంభం అయ్యింది ఈ నల్గొండ జిల్లా నుంచే. తెలుగు లో తొలి కథను బండారు అచ్చమాంబ రాసారు.  వీరు రాసిన 'గుణవతియగు స్త్రీ' తెలుగులో తొలి కథయనీ సంగిశెట్టి శ్రీనివాస్ నిర్దారించారు.

సమాజ నిర్మాణంలో కథా ప్రక్రియ ఇక్కడి చైతన్యంను తట్టి లేపింది. అలాంటి కథా సాహిత్యంలో నల్లగొండ జిల్లా పాత్రను విస్మరించలేం. ఒకప్పడు చిన్నపిల్లలకు నిద్రపోవడానికి తల్లిదండ్రులు చిన్న చిన్నకథలు చెప్పడం అలవాటు. కాని అదే కథ నేడు ప్రజలలో సామాజిక మార్పుకు, చరిత్ర వివరాలకు ఉపయోగపడుతుంది. కథ పరిమాణాన్ని బట్టి పెద్ద కథ (నవలిక), కథానిక, మినీకథ, గల్పిక, స్కెచ్, పేజీకథ, కాలం కథ, కార్డు కథ, ఇలా ఎన్నో కథలు నల్లగొండ జిల్లాలో వచ్చాయి. అలాగే కథా ప్రాధాన్యంను బట్టి సామాజిక , చారిత్రక , ఉద్యమ, ప్రపంచీకరణ , దళిత , స్త్రీ , రైతు ఇలా వివిధ  రకాల కథలతో వివిధ కోణాలలో నల్లగొండ కథా సాహిత్యం సాగింది.

*నల్లగొండ జిల్లా తొలి తరం కథకులు : 
  
నీలగిరి పత్రికను స్థాపించి తెలంగాణ పత్రికా లోకంకు వెలుగు బాటలు వేసిన రచయిత  షబ్నవీసు వెంకట రామ నరసింహ రావు. వీరు 1896 నవంబరు నెలలో షబ్నవీసు లక్ష్మీ నారాయణ రావు, రంగనాయకమ్మ లకు నల్లగొండ జిల్లా మామిళ్ళ గూడెం లో జన్మించారు. వీరు 1918, మార్చి18న నల్లగొండలో ఆంధ్ర సారస్వత నిలయంను స్థాపించారు. 1922 ఆగస్టు 24న మాడపాటి హనుమంతరావు, టేకుమల్ల రంగారావు, అక్కినేపల్లి జానకిరామారావు వంటి వారి ప్రోత్సాహాంతో తెలంగాణ జాగృతే లక్ష్యంగా నీలగిరి వారపత్రికను స్థాపించారు. ఉస్మానియా ముద్రణాలయం స్థాపించి  సంస్కారిణి గ్రంథమాల ద్వారా ప్రతినెల ఒక మంచిపుస్తకం అందించారు. షబ్నవీసు వెంకట రామ నరసింహ రావు స్వయంవరం (1927) అనే కథను రాసారు. ఇదీ శ్రీకృష్ణదేవరాయల సంచిక లో ప్రచురితం అయ్యింది. వీరి మరో కథ బాలిక విలాపం (1921). నీలగిరి పత్రిక నిర్వాహకులలో మరొకరు శేషభట్టర్ రామానుజాచార్యులు (1900) .  వీరు నీలగిరి పత్రికలలో వివాహోన్మాదం(1927) అనే  కథను రాసారు.
 
దేవరకొండ ప్రాంతంలో జన్మించిన అజ్మతుల్లా సయ్యద్ (1902-1970)వీరు కూడా కథలు రాసినట్లు తెలుస్తుంది. తెలంగాణ తొలి తరం కథల సంకలనంలో చోటు చేసుకున్న కథ గప్ చుప్ (1941). దీనిని నల్లగొండ జిల్లా వాసి గం.గోపాల రెడ్డి రాసారు. వీరి మరో కథ అప్పు (1940). ఇది ఆంధ్ర కేసరి పత్రికలో ప్రచురితం అయ్యింది.

జన్మించిన ప్రాంతం ఏదైనా తెలంగాణ ప్రాంతంతో మమైకమైన వ్యక్తి అంబడిపూడి వెంకటరత్నం (1908-1983). వీరు చండుర్ మండలంలో సాహితీ మేఖలను స్థాపించి సాహిత్యసేవను చేసిన వారు. వీరు రాసిన కథ 'మణి ' గోల్కొండ పత్రికలో ప్రచురితము అయ్యింది. విజయవాడలో ఆంధ్రమణి పత్రికను నడిపి  గోల్కొండ పత్రికలో పనిచేసిన రచయిత బి.ఎన్.శర్మ (1908). వీరు మృత్యు వర్షం అనే కథను రాసారు. ఇది సుజాత పత్రికలో ప్రచురితం అయ్యింది. బొంగులూరి నరసింహ  శర్మ గారు విజయవాడలో అంధ్ర వాణి పత్రికను కూడా నడిపారు. దేశోద్ధారక గ్రంథమాల స్థాపించి ప్రజల్లో చైతన్యం దీపం వెలిగించిన రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి (1915). వీరు నకిరెకల్లు మండలం మాధవపురంలో జన్మించారు. సాంఘిక ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితాన్ని అనుభవించిన వీరు ఆ అనుభవంతోనే జైలు లోపల (1952) అనే కథల సంకలనం ప్రచురించారు. దీనిలో మొత్తం  6-కథలు కలవు.  పై ఆరు కథలే కాకుండా అంతా ఏకమైతే , ఆలుకూలి , గాలిపటం, కాఫిర్లు, పతితుని హృదయం , చూపు, విశాలాంధ్ర, పరిసరాలు, బదనిక వంటి ఇతర కథలు కూడా కలవు.

పైడిమర్రి వెంకటసుబ్బారావు (1916) నల్గొండ జిల్లా, అన్నెపర్తికి చెందిన రచయిత, బహుభాషావేత్త. భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత. ఈయన 1916, జూన్ 10న పైడిమర్రి రాంబాయమ్మ, వెంకవూటామయ్య దంపతులకు నల్లగొండ కేంద్రానికి అతి సమీపంలో ఉండే అన్నెపర్తిలో జన్మించారు. వీరి కథలు ఉషస్సు (1945)కథా సంకలనం, తెలంగాణ తొలితరం కథలులో ‘నౌకరి’ (1956) కథ వచ్చింది. ఇది పరిసరాలు కథా సంకలనంలో ప్రచురితం. ఇవే కాకుండా రాజులు(1951) , పిల్లి పోడు(1953) , బడి గంటలు(1953) మొదలైన కథలు కలవు. చండూర్ మండలం కోటయ్య గూడెం కస్తాల కు చెందిన రచయిత ధవళా శ్రీనివాస రావు (1917).  సాహితీ మేఖల సంస్థతో మమైకమైన వ్యక్తి.  అంబడి పూడి గారికి విధేయ శిష్యుడు. ధవళా శ్రీనివాస రావు భాగ్య నగర్ పత్రికలో నేను ఎడ్పు మాన్పలేదు (1949) అనే కథ ను రాసారు.

*1930-40 ప్రాంత కథకులు
  
సినిమా ప్రపంచంలో జరుగుతున్న అశ్లీలంను, విచ్చలవిడితనంను చిత్రీకరణ చేస్తూ రాసిన కథ స్వప్న మాధుర్యం.  దీనిని బి.ఎన్.రెడ్డి (1933) రాసారు. తిరుమలగిరి లో తొండ గ్రామంలో జన్మించిన వారు చించా పట్టణం శ్రీరంగాచార్యులు(1935). వీరు వివిధ పత్రికలలో సాహిత్య వ్యాసాలు ,కథలు రాసారు. కృష్ణా జిల్లా మొఖాసాకల్వపూడిలో జన్మించి నల్లగొండ జిల్లాతో అనుబంధం కలవారు పొట్లూరి వెంకటేశ్వర రావు (1928). వీరి కలం పేరు వెంపో. వీరు రాసిన కథ లోతు తెలియని ప్రేమ. ఇది పరిసరాలు కథా సంకలనంలో ప్రచురితం అయ్యింది.

నోముల సత్యనారాయణ తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌ మరియు హిందీ భాషల్లో అనేక రచనలు చేశారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషా సాహిత్యాలను అనువాదం చేసి  ఒక చెరగని ముద్రని వేసుకున్నారు. వీరు కథలు కూడా రాసినట్లు తెలుస్తుంది. కాని వివరాలు లేవు. నల్లగొండలో యువ రచయితల సమితిని స్థాపించి దానికి అధ్యక్షులుగా సాహిత్య సమాఖ్య కార్యదర్శి గా ఉంటూ ఎందరికో ప్రోత్సహం అందించిన వ్యక్తి కొలనుపాక మురళీధర రావు (1940). వీరు వివిధ పత్రికలలో గేయాలు , వ్యాసాలు , కథలు రాసారు.

*1940-50 ప్రాంత కథ రచయితలు:
  
గరణైకుంట పెద్దవూర మండలంకు చెందిన కవి రచయిత కోట్రా మల్లికార్జున శర్మ (1941). వీరు రేడియో ద్వారా కౌశిక నామం తో చాలా మందికీ సుపరిచితులు. 111వచనాలతో భ్రమరాంభ మల్లికార్జున వచనాలు రాసారు. భావ చిత్రాలు(కవితా సంపుటి), స్వర్ణలత (నవల) తో పాటు నాగరీకం అనే కథా సంపుటిని రాసారు. కట్టంగూరు మండలం పరడ కు చెందిన గంజి గోవర్ధన్(1941)  ఆకాశ వాణి ద్వారా ఎన్నో ప్రసంగాలు ఇచ్ఛారు. వీరు వివిధ పత్రికలలో నాటికలు , కథానికలు రాసారు. బోయ జంగయ్య (1942) లోకం, హెచ్చరిక , దొంగలు మల్లెపూలు కథలు బాగా పేరుగాంచాయి. వీరి దున్న అనే కథా సంకలనం యువ రచయిత ద్వారా ఆవిష్కరణ చెంది ఎంతో యశస్సును కలిగించింది. చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంకు చెందిన వారు  బోయ జంగయ్య. వీరి కథ  మల్లెపూలు అమెరికా న్యూ జర్సీ వారు , ఆంధ్ర జ్యోతి వారు సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో బహుమతి అందుకుంది. వీరి కథలు గొర్రెలు , దున్న లు  రాష్ట్రంలోని రెండు విశ్వవిద్యాలయాలలో ఎం.ఏ తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఉన్నాయి.వీరు రాసిన కథా సంపుటాలు చూస్తే  లోకం (5-కథలు) , గొర్రెలు (4-కథలు), ఎచ్చరిక (6-కథలు) , దున్న (9-కథలు) , రంగులు (8-కథలు ), చీమలు (7-కథలు) తెలంగాణ వెతలు (8-కథలు) , కొత్త పాఠాలు (15-కథలు) , బడిలో చెప్పని పాఠాలు (13-కథలు), బోజ కథలు (26-కథలు), ఉప్పునీరు (10-కథలు), ఇప్పపూలు (7-కథలు) కలవు. ఇవే కాకుండా వివిధ పత్రికల్లో రాసిన 30-40 కథలు అదనంగా కలవు. వీరి దొంగలు కథ , ఎచ్చరిక కథ అనేక ముద్రణలు పొందింది. అంతే కాకుండా శ్రీశ్రీ స్మారక స్వర్ణ పురస్కారం (1981)ను పొందింది. వీరి కథలలో ప్రధానంగా దళిత చైతన్య భూమిక ఉంటుంది. చెరబండరాజు (1944) కలం పేరుతో దిగంబరకవులలో ఒకనిగా సుపరిచితమైన వ్యక్తి  "బద్ధం భాస్కరరెడ్డి". అకుంశాపురం లో జన్మించిన వీరు చిరంజీవులు (1985)అనే కథల సంపుటిని రాసారు. దీనిలో మొత్తం గా 10 కథలు కలవు.
 నల్లగొండ జిల్లాలోని యువ రచయితలనందరినీ  ఒక వేదిక మీదికి తెచ్చే ప్రయత్నంలో ఏర్పడిన సంస్థ యువ రచయితల సమితి వ్యవస్థాపకులు మేరెడ్డి యాదగిరి రెడ్డి(1947). వీరు తిప్పర్తి మండలం గడ్డికొండారంలో జన్మించారు. వీరు బాలకథలు రాయడంలో పేరు పొందారు. వీరు రాసిన కథలలో నారాయణ రావు అనే కథ సమర్పణ అనే కథాసంకలనంలోనూ, చావు అనే కథ దర్పణం సంకలనంలో చోటు చేసుకుంది. వీరి కథల సంపుటి బొడ్రాయి. దీనిలో ఉన్న 13 కథల్లో  తెలంగాణ గ్రామీణ ప్రాంతంలోని సంప్రదాయాలు, ప్రజల స్థితి గతులు, కష్టసుఖాలు , ప్రపంచీకరణ ప్రభావం కనబడుతవి.  ఈ గ్రంధానికి బొడ్రాయి అని పేరు పెట్టడంలోనే రచయితకు పల్లెల మీద ఉన్న ప్రేమ తెలుస్తుంది. అలాగే వీరి మరికొన్ని కథలు చూస్తే  ఓటన్న , కష్టేఫలి , ఓటు నోటు , తీర్పు , గాంధీ నగరం , వైద్యో నారాయణో హరి , కరువు , సమ్మె , నాగులు ,తీర్పు , గాంధీ నగరం , మరో సారంగధుని కథ , రక్తం తాగే మనుష్యులు , కొక్కొరొకో , ఆకలి , నీళ్లు , సత్యం వంటివి వివిధ పత్రికలలో ప్రచురితం అయ్యాయి. వీరి కొలిమి కథలో వడ్రంగి వారి బతుకు వెతలు కనిపిస్తాయి. నల్లగొండ జిల్లా కందిబండ గ్రామంకు చెందిన రచయిత నారప రాజు కోదండ రామారావు (1947). వీరి టేర్లిన్ చీర , దారి తప్పిన బాటసారి , నింద లేదే , పంతులు గారి పెట్టుబడి , తన దాకా వస్తే , ఒక గుమాస్తా కథ , నిజం నిద్రపోయింది వంటి కథలు వివిధ పత్రికలలో ప్రచురితం అయ్యాయి.

ఆత్మకూరు మండలంలో జన్మించిన వారు నూగూరు రంగాచార్యులు (1949). వీరు పాఠశాలలో పిల్లలకు బోధిస్తూ సాహిత్యంపై ఇష్టంను పెంచుకున్నారు. వీరు జిగిష అనే కవితా సంకలనం (1977)ను ప్రచురించారు. దీంతో పాటుగా వివిధ పత్రికల్లో  కథలు కూడా రాసినట్టు తెలుస్తుంది. నల్లగొండ జిల్లా యువ రచయితల సమితి స్థాపనలో ముఖ్య పాత్ర  పోషించిన వారు బీసం రాములు (1949) . వీరు నర్సింగ భట్లలో జన్మించారు. ఎన్నో కవి సమ్మేళనంలో పాల్గొని కవితలు వినిపించిన రాములు మోదుగు పూలు , ఓట్లు పాట్లు అనే కవితా సంపుటాలు రాసారు. అంతేకాకుండా కొన్ని కథలు కూడా రాసినట్లు తెలుస్తుంది. వృత్తి రీత్యా ఆడిటర్ అయినా సాహిత్యం పై ప్రేమతో రచనా వ్యాసంగంను కొనసాగించిన వారు దేవులపల్లి శ్యామ సుందర రావు (1949).  వీరు చివ్వెంల చందుపట్లలో జన్మించారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో స్థిర పడ్డారు. వీరు ఉదయించే సూర్యుడు అనే కవితలు రాసారు. అలాగే వీరు 1970-80 ల మధ్య 12 కథలు రాశారు.  వీటన్నింటిని కలిపి సంఘర్షణ పేరుతో ప్రచురితం చేసారు. దీనికి ప్రముఖ విమర్శకులు పుల్లాభట్ల వెంకటేశ్వర్లు గారు ముందు మాట ను రాశారు.

దేవులపల్లి ప్రభాకరరావు మంచి పాత్రికేయులుగా పేరు పోందిన బహుగ్రంథకర్త. ఈనాడు, ఆంధ్రభూమి, వార్త, ప్రజాతంత్ర తదితర పత్రికలలో అనేక సంవత్సరాలు, కాలమిస్టు, రచయిత. వీరు రాసిన ‘మహాకవి గురజాడ జీవితం- సాహిత్యం’ గ్రంథానికి యునెస్కో అవార్డు, జాతీయ సమైక్యతపై ‘నేను ఎవరు’ అనే పుస్తకానికి భారత ప్రభుత్వ అవార్డు, ‘అల్లూరి సీతారామ రాజు’ రేడియో నాటికకు జాతీయ అవార్డులను అందుకున్నారు. గాంధీ శకం, మన మహనీయు లు, చెప్పుకోదగ్గ మనుషులు, తెలంగాణ తేజోమూర్తులు, సమరం నుంచి స్వాతంత్య్రానికి, మహాకవి గురజాడ, సంపాదకీయాల సంకలనం, శ్రీకృష్ణ దేవరాయాంధ్రభాషానిలయం(నూటాపది సంవత్సరాల చైతన్య చరిత్ర), వ్యాసాలు, జ్ఞాపకాలు, పారిజాతాలు (కవితా సంకలనం) వీరి కలం నుండి వెలువడ్డాయి. గోలకొండ, విశాలాంధ్ర పత్రికలలో పలు రచనలు, కొన్ని ప్రత్యేక సంచికలకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు. అనువాదాలు, ఉద్యమ రచనలనెన్నింటినో చేశారు. ‘పెన్షనర్ మూవ్‌మెంట్’ మాస పత్రికకు సంపాదక వర్గ సభ్యులుగా ఉన్నారు. వీరి సాహితీ కృషికి మెచ్చి 2009లో పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం కీర్తి పురస్కారం, 2012లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాహిత్య పురస్కారాలనందించాయి. వ్యంగ్యం , హాస్యంగా ఎత్తిపొడుపుతో దేవులపల్లి  రాసిన కథ నా కొద్దు మంత్రి పదవి. దీనిలో యదార్థ చిత్రణ కలదు.

*1950-75 ప్రాంత కథా రచయితలు :
 
బుద్ధవరపు వెంకటరత్నం రాసిన కథ మన్నేపడుచు (1954). ఇది మన్నే ప్రాంతంలో ప్రజల ఆప్యాయత అనురాగాలను చిత్రించింది. సాంఘిక విషయ ప్రాధాన్యం గల కథలను రాసినవారు మందాడి కృష్ణారెడ్డి (1956). వీరు 1991లో మందాడి కథలు రాశారు. దీనిలో 10 కథలు  కలవు. వీరు  కనగల్ మండలం తిమ్మాజీగూడెంకు  చెందిన వారు. మాడ్గులపల్లి మండలం మర్రిగూడెంకు చెందిన రచయిత కట్టా శేఖర్ రెడ్డి (1961) వీరి కథలు సిరి శాపం , పరాజితులు అనేవి ఆంధ్ర జ్యోతి పత్రికలలో ప్రచురితం అయ్యాయి. లింగగిరి ప్రాంతం లో జన్మించిన రచయిత పుప్పాల కృష్ణమూర్తి (1961) వీరు జీవన చిత్రం పేరిట 10 కథలు రాసారు. వీరి రచనల పై పరిశోధనలు కూడా జరిగాయి. అవి పుప్పాల కృష్ణమూర్తి జీవిత చిత్రం - కథలు - పరిశీలన (ఎం.ఫిల్-2010-తెలుగు యూనివర్సిటీ)-ఎ.సైదులు, పుప్పాల కృష్ణమూర్తి కథలు -  పరిశీలన (ఎం.ఫిల్-2010-తెలుగు యూనివర్సిటీ)- కె.శివ .

ఎస్వీ రామారావు సంపాదకత్వంలో వెలువడిన సంకలనం సమర్పణ (1962). దీనిలోని కథ సమాంతర రేఖలు. దీనిని ప్రభాకర్ రాసారు. చీకటి వెలుగులు పత్రికను నిర్వహించి సాహిత్య కృషి  చేసిన  ఎలికట్టె శంకర్ రావు (1968) నల్లగొండ జిల్లా ఎర్రగూడెంకు చెందిన వారు. వీరు యాది అనే దీర్ఘ కవితను ప్రచురించారు. దీనితో పాటుగా నల్లగొండ జిల్లా కథల సంపుటి కి సంపాదకత్వం వహించారు. దీనిలో 31 మంది రచయితలు రాసిన కథలు కలవు. వీరు 2011 లో కూడా 69 మంది రచయితలు రాసిన 40 కథల సంకలనంకు సంపాదకత్వం వహించారు. అలాగే వీరే స్వయంగా తశ్వ బరుగు అనే కథలు రాసారు. జారుడు బండ ,ఉనికి పాట్లు , పరిగె చేను మొదలైనవి  వీరి ప్రసిద్ద కథలు. ఊకోండి ప్రాంత దీపకుంటలో జన్మించిన కవి ,రచయిత దొడ్డ రామ్మూర్తి (1968). వీరు బొక్కెన లొల్లి అనే పాటల సంపుటితో పాటు  బొండిగె అనే కథల సంపుటి ని రచించారు. చండూర్ మండలం గడ్డంవారి యడవల్లిలో జన్మించిన పులిపాటి గురు స్వామి (1970)  పూట కూళ్ళ ఇల్లు , ఒకటి రెండు మూడు , బొమ్మ బొరుసు, మట్టి బొమ్మ, సమిధ , అవినీతికి అటూ ఇటూ , పాల నలుపు , కాష్ఠం వంటి కథలు రాసారు. ఇవి వివిధ పత్రికలలో ప్రచురితం అయ్యాయి.

యెన్నం ఉపేందర్ (1971) గుమ్మడి వెల్లిలో జన్మించిన రచయిత. వీరు ఎండమావి అనే కథల సంపుటిని ప్రచురించారు. దీనిలో 32 కథలు కలవు. భూతం ముత్యాలు జూన్‌ 10, 1971లో నాంపల్లి మండలం తిరుమలగిరి గ్రామంలో భూతం మల్లయ్య, మల్లమ్మ దంపతులకు జన్మించారు. వీరు 2010లో దళిత మైనార్టీ జీవితాలను చిత్రీకరిస్తు బేగరి కథలను రాసారు. దీనిని గుంపు సాహితీ సంస్థ ప్రచురించింది. ఇందులో రజియా పేద ముస్లిం మహిళ ఎదుర్కున్న జీవిత కష్టాల గురించి రాశారు. 2012లో ఇగురం అనే నవల రాశారు. ఇవి సమాజంపై ఎంతో ప్రభావం చూపాయి. 2013లో మాండలికం (తెలంగాణ కుల వృత్తి పదకోశం) అనే డిక్షనరీని రాశారు. 2014లో బుగాడ కథలు (దళిత జీవితాలను ఉన్నది ఉన్నట్లుగా ఆవిష్కరించిన కథలు) రాశారు. ఇందులో మహిళల కష్టాలు, దు:ఖాలను వివరించారు. 2015లో నియతి ( నా ఆటో గ్రఫి ) ని రాశారు. ఇదీ మాండలిక బాషలో కలదు. దీనిలో 16 కథలు కలవు.

 ముల్కి తెలంగాణ సాహిత్య పత్రికకు సంపాదకుడి గా పనిచేసిన వారు స్కైబాబా(1972), వీరు కేశరాజు పల్లి లో జన్మించారు. వీరు ఖిల్లా , చోటి బహేన్ , ఛడక్తా చిరాగ్ , దస్తర్ , సుల్తానా , దావా , మొహబ్బత్ 1424 హిబ్రి వంటి కథలు రాసారు. స్కైబాబా 2011 లో ఆధూరె (ముస్లిం కథలు) అనే కథలసంపుటి రచించారు. దీనిలో ముస్లింలలోని పేదరికం , నిరుద్యోగం , నిరక్షరాస్యత వంటి అంశాలను రచయిత ప్రస్తావించారు. ఈ పుస్తకాన్నే వెజిటేరియన్స్ ఓన్లీ అనే పేరుతో ఓరియంట్ బ్లాక్ స్వాన్ అనే సంస్థ ఇంగ్లీషులోకి ప్రచురించింది. వీరు వతన్ కథల సంకలనంకు సంపాదకత్వం వహించారు. దీనిలో 39 మంది ముస్లిం కథకులు రాసిన 52 కథలు కలవు.

*ఇతర కథా రచయితలు : 
                 
తెలంగాణ తొలి తరం కథల సంకలనంలో చోటు చేసుకున్న రచయిత గం.గోపాల్ రెడ్డి. వీరు రాసిన కథలు గప్ చిప్. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి సాహిత్యం పై అభిమానంతో కథలు రాస్తున్నవారు చిన్నయ్య. వీరు 13 కథలతో పయిలం అనే కథల సంపుటిని వెలువరించారు. పుప్పాల కృష్ణమూర్తి రాసిన కథలు జీవిత చిత్రం (1993), విషవలయం , పిట్టగూడు , పాలపిట్ట,నసిరుద్దీన్ కథలు,స్వేచ్ఛ సౌందర్యం (2009) .

మధిర భానుమూర్తి రాసిన కథ సమర్ధుని అసమర్ధత. ఇది నాటి స్రవంతి పత్రికల్లో ప్రచురితమైంది. కొమ్మిడి మత్స్యందర్ రెడ్డి గారు  దాదాపు 50 కి పైగా కథలు , సంకోజు స్పర్శ కథల సంపుటి రాశారు. శంకరం యాముజుల గారు రాసిన కథ వలస.ఇది కుటుంబ సంబంధ బాంధవ్యాలను తెలిపిన కథ.
                 
బతుకమ్మ పండుగ గూర్చి ఉన్న కథ తోడు-బతుకమ్మ. దీనిలో తెలంగాణ ఆడపడుచులంతా పండుగకు ఇంటికి చేరి అత్తవారింట్లో భర్త అత్త వాళ్ళ కష్టాలు మర్చిపోయి అందర్నీ పలకరిస్తూ ఏ విధంగా బతుకమ్మ ఆడతారో  గౌరక్క అనే పాత్ర ద్వారా తెలపడం జరిగింది. చివరికి గౌరక్క చనిపోవడం జరుగుతుంది. ఈ విషాదాంత కథను రాసిన వారు హుమాయున్ సంఘీర్. నీలగిరి సాహిత్య సమితి ఏర్పాటు చేసి సాహిత్య కార్యక్రమాల వ్యాప్తికి కృషి చేసిన వారు ధరణికోట శ్రీనివాసులు. వీరు మా యింట్లో , పురాణా ఘరాణా , అన్నం లోకి అనే కథల సంపుటిని రాశారు. అన్నంలోకి సంపుటిలో  8 కథలు కలవు. దీనిలో బీద జనుల కష్టాలు, తెలంగాణ స్థితిగతులు కలవు. వీరి కథలలో చల్లపులుసు కథను గురించి ఆంధ్రవాఙ్మయ చరిత్రలో దివాకర్ల వెంకటావధాని ప్రస్తావించారు. మిర్యాలగూడ కు చెందిన రచయత ఎన్.కె.రామారావు. వీరు యువ రచయతల సమితి ద్వారా సాహిత్య సేవ చేశారు. వీరి కథల సంపుటి విధ్యుల్లత .  కోలాహలం లక్ష్మణరావు (మిర్యాలగూడ) ప్రేమకథలను సామాజిక అంశాలను రాయడంలో సుప్రసిద్ధులు. వీరు 19 కథలతో ప్రేమభిక్ష అనే కథల సంపుటిని వెలువరించారు.

నల్లగొండకే చెందిన రచయత కోదాటి శ్రీనివాస రావు. వీరు నా  కల అనే కథను రాసారు. ఇది తెనుగు పత్రికలో ప్రచురితం అయ్యింది. మరో రచయిత ఎస్.బి.సీతారామా రావు గారు రాసిన కథ గరీబ్బోన్ని. 1940 లో వెలువడిన కమ్మ తెరలు సంకలనంలో నల్లగొండ జిల్లా రచయితలు చెరకుపల్లి రఘౌత్తమ రావు , హరి కృష్ణారావు , బోయనపల్లి రంగారావు కథలున్నాయి. మరో రచయత మూటువూరు వేంకటేశ్వర రావు రాసిన కథలు నారదుని యాత్ర , జగడాల కథ గోల్కొండ పత్రికలలో అచ్చయినవి.

*సూర్యాపేట ప్రాంత రచయితలు: 
 
 గ్రంధాలయోద్యమంలో ప్రముఖ పాత్రను పోషించిన వారు గవ్వా మురహర రెడ్డి (1880) . పిల్లలమర్రి వీరి గ్రామం. వీరు వివిధ పత్రికలలో కొన్ని కథలు రాసారు. విశ్వనాథ శర్మ హనుమత్ గుండెపూడి (1914)  నాటికలు, గేయాలతో పాటుగా కథలు కూడా రాసినట్లు తెలుస్తుంది. కొల్లు మధుసూదన్ రావు (1914) గారు మోసం, దారి తప్పితే వంటి సామాజిక విషయాలపై కథలు రాసారు. మునగాల మండలం జగన్నాధపురంకు చెందిన వీరు జాతీయ  ఉత్తమ అధ్యాపకుడిగా కూడా  అవార్డు పొందిన వారు.  తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న రచయిత ఆవుల పిచ్చయ్య (1919). వీరు సూర్యాపేటలో జన్మించారు. పెద్ద చదువులు చదవకుండానే చిన్నతనం నుండే అభ్యుదయ భావాలు అలవరుచుకున్న వీరు సమాజంలో దుర్మార్గాన్ని ప్రశ్నిస్తూ కథలు వ్రాసిన గొప్ప రచయిత.  వీరి కథలన్నీ మీజాన్ పత్రికలో ప్రచురితం అయ్యాయి. వీరి కథలలో ఊరేగింపులు (1946) కథ దొడ్డి కొమరయ్య పోరాటంను తెలుపు కథ.  నిజాం కాలంలో అధికారులు ఊళ్లోకి వస్తున్నారంటే గ్రామ పట్వారినుండి సాధారణ ప్రజల వరకు అందరూ భయంతో వణికిపోయేవారు. ఆ విషయంతో  'దౌరా' అనే కథను వీరు రాసారు. మరో కథలో తమ తిండికి వెళ్లకున్నా వచ్చిన అధికారులకు తగిన విధంగా దావత్‌ ఏర్పాటుకు ప్రజలందరూ మూకుమ్మడిగా పని చేయాలి. అన్ని వృత్తుల వారు తగిన విధంగా అధికారులకు సేవలు చేయాలని వచ్చిన ప్రతిసారి గొల్లవాళ్లు వంతుల చొప్పున గొర్రెను ఇవ్వాలి. ఇంత చేసినా కనికరం లేకుండా పంటలు ఎండిపోయినా బలవంతంగా లెవిగల్లా (భూమిశిస్తు) వసూలు చేసిన దౌర్జన్యపు స్థితిగతులను 'దౌరా' కథ కళ్లకు కట్టింది. నిజాం పరిపాలనలో వున్న అవినీతి ని గురించి చెబుతూ ఆవుల పిచ్చయ్య ఆవేదనకు అక్షరరూపమే 'చపరాసి దినచర్య' అనే కథను రాసారు. రైతు చపరాసికి లంచం ఇచ్చి తన దరఖాస్తును సమర్పించుకోవడం. రోజంతా పడిగాపులు గాసినా తన పనికాకపోవడం వంటి ఉద్యోగుల అలసత్వాన్ని ఈ కథ తెలుపుతుంది. అలాగే వీరి ఇతర కథలు ఈతగింజ ఇచ్చి తాటిగింజ లాగిన జమీందార్ (1946) ,  హమాల్ దినచర్య (1946).  ప్రముఖ పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాస్‌ 'ఆవుల పిచ్చయ్య తెలంగాణ పోరాట కథలు' పేరుతో ఐదు కథల సంకలనాన్ని ప్రచురించారు.

 కాంచనపల్లి చిన వెంకటరామారావు తెలంగాణా విముక్తి పోరాటయోధుడు, రచయిత, న్యాయవాది. రాజకీయంగా పలు ఉద్యమాల్లో క్రియాశీలంగా ఉంటూనే రచనావ్యాసంగాన్నీ, న్యాయవాద వృత్తిని కొనసాగించాడు. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు దగ్గరలోని రావిపాడులో 1921 ఏప్రిల్ 10వ తేదీన తన అమ్మమ్మగారి ఇంట్లో కాంచనపల్లి చిన వెంకటరామారావు జన్మించాడు.ఇతని స్వగ్రామం పానగల్లు. ఇతని తండ్రి పేరు రామచందర్‌రావు, తల్లి పేరు శేషమ్మ. కాంచనపల్లి తన మేనమామ బోయినపల్లి విశ్వనాథం ప్రేరణతో సాహిత్యం పై  ఆసక్తిని పెంచుకున్నారు. కాంచనపల్లి చిన వెంకట రామారావు మా వూర్లో కూడానా అనే కథను రాశారు. దీనిలో వెట్టిచాకిరి , దౌర్జన్యాలను చిత్రీకరించారు. నలగొండ ప్రజల భాషలో వీరు కథలు రాశారు. వీరు 1967లో నల్లగొండలో ఏర్పాటయిన యువరచయితల సమితి తరఫున మాలిక, దర్పణం, సమర్పణ అనే కథా సంకలనాలను, సంఘర్షణ అనే కవితా సంకలనాన్ని వెలువరించారు. దర్పణం అనే త్రైమాసిక సాహిత్య పత్రికకు సంపాదకునిగా వ్యవహరించారు. 1970, 1974, 1983లలో మూడు సార్లు నల్లగొండ జిల్లా రచయితల మహాసభలను నిర్వహించారు. వీరు "మన ఊళ్ళో కూడానా.." అనే పేరుతో కథాసంపుటిని, "అరుణరేఖలు" అనే కవితా సంపుటిని, తన రష్యా పర్యటన అనుభవాలను "మధుర స్మృతులు" అనే పేరుతో గ్రంథస్తం చేశాడు. గొల్లసుద్దులు, బుర్రకథలు వంటి ప్రక్రియలలో కూడా కొన్ని రచనలు చేశారు.

 సి.వి.కృష్ణారావు అభ్యుదయ కవి. వీరు 1926, జూలై 3వ తేదీన రేవూరు గ్రామంలో జన్మించారు. వీరు రాసిన కథ నోటీసు. ఇది తెలంగాణ పోరాట కథా సంకలనం (1987) లో  ప్రచురితమైంది.  సూర్యాపేట ప్రాంతానికి చెందిన మరొక రచయిత గాలి రామచంద్రయ్య (1940). వీరు స్వర్గంసుఖం, దుస్సంప్రదాయ సమిధలు , స్వామి కటాక్షం, అనే కథలు రాశారు. వీరి  కథలన్నీ హేతువాద ధోరణిలో సాగుతాయి. ఈ ప్రాంతంకే చెందిన మరో రచయిత మామునూరు నరసింహారావు (1941). వీరి కథలు సంకలనంగా రాలేదు. కానీ చాలా పత్రికలలో ప్రచురితమై బహుమతులు కూడా పొందాయి. వాటిలో కొన్ని  సంధ్యారేఖ , కొన్ని గుహలు, కామిడి ఆఫ్ ఎర్రర్ , రాజీ , కాపరి , అపూర్వ విహంగం, రచయితలకు మాత్రమే , సంజీవినీ , జాయ, జంగమ తీర్ధం మొదలైనవి కలవు. గుండ్లపల్లి గ్రామం మఠంపల్లి మండలంకు చెందిన వారు జంగం చార్లేస్ (1943).  వీరి కలం పేరు జాత శ్రీ. వీరి కథా సంపుటాలు ప్రభంజనం (7-కథలు) , చలివేంద్రం (15-కథలు) .  వీరి కథలు కొన్ని వివిధ భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. సూర్యాపేట రేపాలకు చెందిన కె.ఎల్.నరసింహారావు రాసిన కథ అమరవీరుడు. ఇది 1948 లో విశాలాంధ్ర పత్రికలో వచ్చింది. ఇది నాటి పోరాటాల , తిరుగుబాటుల నేపధ్యంలో వచ్చింది.

*యాదాద్రీ-భువన గిరి ప్రాంత కథా రచయితలు : 
                    
దిగంబర కవులలో ఒకరు  నిఖిలేశ్వర్, వీరి అసలు పేరు కె.యాదవ రెడ్డి (1938). వీరు కవిత్వమే కాకుండా కథకునిగా మంచి రచనలను చేసిన వారు. వీరు కథావారధి (అనువాద కథలు-2015), నిఖిలేశ్వర్ కథలు (22-కథలు) రచించారు.ఈ కథలలో ‘కొండకింద భూమి’, ‘సూర్యుడు’ కథలు విప్లవపోరాటంకు సంబంధించిన కథలు , ‘ఆరని మంటలు’, ‘మనిషి - మట్టి’ కథలు యుద్ధ్థనేపథ్యంలో మానవీయతను కళ్లకు కడతాయి. ‘నల్లులు’, ‘జాలి’, ‘బాయి ఆగమైపోయింది’, ‘గడ్డం మనిషి’, ‘వసంతం ఇల్లెక్కడ?’ కథలు మధ్యతరగతి మానవ, ఆర్థిక సంబంధాలను తెలుపుతాయి. ముక్తవరం పార్థసారధి (1944)  రచయిత, అనువాదకుడు. వీరు మిణుగుర్లు అనే పేరిట కథా సంపుటిని వెలువరించారు. దీనిలో 35-కథలు కలవు. వీటితో పాటుగా మరో 18 కథలు దాకా రాసారు. ఇవన్నీ సమాజంలోని మనిషి ప్రవర్తనను, మానసిక ధోరణులను తెలియచేస్తాయి.
 
డా.దేవరాజు మహారాజు ఫిబ్రవరి 21, 1951 న వరంగల్ జిల్లా కోడూరు లో జన్మించారు. కానీ స్వగ్రామం వడర్తి  భువనగిరి. వీరు తెలంగాణ ప్రజల భాషలో తొలి కథల సంపుటి (కడుపు కోత ) ప్రచురించారు. వీరు 70 మంది భారతీయ కథానికా రచయితల్ని (హరివిల్లు, ఆంధ్రప్రభ వార పత్రిక 1991-92) వారి కథలతో సహా పరిచయం చేశారు. పిల్లల కోసం రాసిన చైనా జానపద కథలు నాలుగు పుస్తకాలుగా వెలువడించారు. వీరి కథా సంపుటాలు కడుపుకోత (1977), దీనిలో 10 కథలు , పాలు ఎర్రబడ్డాయ్‌ (1991) సంపుటి లో 14 కథలు , దేవరాజు మహారాజు కథలు (1993) లో 28 కథలు కలవు. అలాగే వీరు బాలసాహిత్యంలో బుజంగు (1984) , గురువుకు ఎగనామం (1984), చిన్నోడి ప్రయాణం (2006) వంటి రచనలు చేసారు.

 రాంరెడ్డి, సత్తెమ్మ దంపతులకు 1962, జులై 10 వ తేదీన జన్మించిన కవి , రచయత , విమర్శకులు కాసుల ప్రతాప రెడ్డి. వీరు యాదాద్రి - భువనగిరి జిల్లా, రాజాపేట మండలం, బొందుగుల గ్రామంలో జన్మించారు. కాసుల ప్రతాపరెడ్డి సుప్రభాతం అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేస్తున్న కాలంలో పలువురు కొత్త రచయితలను వెలుగులోకి తెచ్చారు. వీరు రాసిన వెంటాడిన అవమానం కథ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం లోనూ కాకతీయ విశ్వవిద్యాలయం లోనూ ఎం.ఎ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉంది. వీరు 17 కథలతో శిలువకు తోడిగిన మొగ్గ అనే కథా సంపుటిని వెలువరించారు.  ఇవే కాకుండా ఇంకా పాతిక దాకా కథలు రాశారు.
 
మరో రచయిత పెదకోట్ల చిన్నయ్య (1965) , వీరు బండ పగిలింది (1996) , ఎర్ర జెండా (1997) , వివక్ష  (1998), పంద్రాగస్టు (1998) , ఉప్పలి మాలమ్మ (1999) , మారిగాడు (2001), చక్రవర్తి కూర (2002) , బిగిస్తున్న ఉచ్చు (2002) వంటి కథలు రాశారు. ఈ కథలు మన కాలం కథలు , తెలుగు కథ-2001 వంటి కథా సంకలనాలలో ప్రచురితం అయ్యాయి. పెండెం జగదీశ్వర్ (1976) బాల సాహిత్యం లో కృషి చేసిన వారు.  బాల సాహితీరత్నగా పేరు పొందడమేకాకుండా 2005లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి కీర్తి పురస్కారం అందుకున్నారు. వీరు యాదాద్రి - భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామంలో జన్మించారు. ఆనంద వృక్షం (పర్యావరణ కథల సంపుటి), పసిడిమొగ్గలు, ఉపాయం, గజ్జలదెయ్యం, బాలల కథలు , విడ్డూరాల బుడ్డోడు, నూటపదహారు నవ్వులు, తానుతీసిన గోతిలో, ముగ్గురు అవివేకులు, విముక్తి, ఆంధ్రప్రదేశ్ జానపదకథలు, బడి పిలగాల్ల కతలు, మాతో పెట్టుకోకు వీరి రచనలు.

వీరు తెలంగాణ మాండలికంలో పిల్లల కథలతో `బడి పిలగాల్ల కతలు´(2015) అనే పుస్తకం రాసారు. ఇది తెలంగాణ మాండలికంలో వచ్చిన తొలి బాలల కథాసంకలనంగా ప్రశంసలందుకుంది. ఇందులోని 'నాకోసం యెవలేడుస్తరు?, వొంకాయంత వొజ్రం' కథలు మహారాష్ట్రలో ఆరవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకాలలో 2016-17 విద్యాసంవత్సరం నుండి పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టబడ్డాయి. వీరు తెలంగాణ మాండలికంలోనే 'గమ్మతి గమ్మతి కతలు,(2016), దోస్తులు చెప్పిన కతలు'(2018) పుస్తకాలను కూడా ప్రచురించాడు. వీరి `చెట్టు కోసం ´కథ 2007 నుండి 2016 వరకు మహారాష్ట్రలో ఆరవ తరగతి తెలుగులో పాఠ్యాంశంగా కొనసాగింది. ప్రభుత్వ తెలుగు పాఠ్య పుస్తకాల రచనలో పాల్గొన్నారు.
వయోజనులు, నూతన అక్షరాస్యుల కోసం స్టేట్ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో పలు పుస్తకాలు రాశారు. సాక్షరభారత్ వాచక రూపకల్పనలో పాలు పంచుకున్నారు.

బాల సాహిత్య గ్రంథాల ప్రచురణలో రాజీవ్ విద్యామిషన్ కు సేవలందించారు. నల్లగొండ జిల్లా ఆర్వీయం బాలల మాసపత్రిక `జాబిలి´కి సంపాదక వర్గ సభ్యునిగా పనిచేశారు. తెలంగాణ వాడుకభాషలో పిల్లలకోసం జగదీశ్వర్‌ రాసిన మూడో పుస్తకం ఈ ‘దోస్తులు చెప్పిన కతలు’. ఇందులో మొత్తం ముప్ఫై కథలున్నాయి. 

*నల్లగొండ ప్రాంత కథా రచయిత్రులు :
  
తెలంగాణలోనే కాదు తెలుగులోనే తొలి రచయిత్రి బండారు అచ్చమాంబ (1874) , వీరు స్త్రీల కోసం బృందావన స్త్రీ సమాజం స్థాపించారు. వీరి కథలు ఎక్కువగా హిందు సుందరి పత్రికలో వచ్చాయి. వీరు రాసిన స్త్రీ విద్య అనే కథ నూరేళ్ళ పంట (2002) అనే రచయిత్రుల కథ సంకలనంలో పునర్ ముద్రణను పొందింది. వీరి కథలు ధన త్రయోదశి (1902) , స్త్రీ విద్య (1902) , బీద కుటుంబం (1904).  నల్లగొండతో అనుబంధం కలవారు జి.అనసూయ గారు. వీరు నిశ్రద చిత్రాలు అనే కథలు రాసారు. నల్గొండ జిల్లా నకరికల్ మండలం ఆకారం గ్రామానికి చెందిన రచయిత్రి ముదిగంటి సుజాత రెడ్డి. వీరు విసుర్రాయి, మింగుతున్న పట్టణం,వ్యాపార మృగం వంటి కథసంపుటాలను  రచించారు. విసుర్రాయి సంపుటి లోని కథలు స్త్రీల జీవితాల్లోని విషాదాలను వేదనలను చిత్రీకరించాయి. దీనిలో రౌడీయిజం కథలో ఎషియన్ గేమ్స్ లో పాల్గొని దేశానికి కీర్తి తేవాలని కృషి చేస్తున్న హరిత,సరితలు . ఒకరు పశుబలంకి బలికాగా,  మరొకరు బలత్కాకరించబడ్డారు. న్యాయం చేయాల్సిన పోలీసులు సూటిపోటి మాటలతో వేధింపులుకు గురి చేయడం కథ ఇతివృత్తం. మరో కథ నేరమేమిటిలో ఆడపిల్ల స్కూటర్ నడపడాన్ని సహించలేని బస్సు డ్రైవర్ అహంకారంతో సుధ అనే అమ్మాయి  చనిపోవడానికి కారణం అవుతాడు. విసుర్రాయి కథల సంపుటిలో స్త్రీల జీవితాల లోని వివిధ కోణాలను చిత్రీకరించారు రచయిత్రి. దీనిలో బంధీ కథలో కాన్పు కోసం అమెరికాకు వెళ్లిన అన్నపూర్ణ అక్కడి పద్ధతులు సరిపడక ఉద్వేగానికి లోనైన స్త్రీ జీవితాన్ని చిత్రీకరించింది. జవాబులు లేని  ప్రశ్నలు కథలో మారమ్మ భర్త రైతు. అతడు అప్పుల బాధతో  ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆమె దుఃఖ తీవ్రతను కండ్లకు కట్టినట్టుగా చిత్రీకరించారు రచయిత్రి. కబ్జా కథలో తన ప్రత్యర్థిని గెలవలేక తనకు సొంత ఆస్తిగా స్త్రీ ని భావించి ఆమెను తన ప్రత్యర్థి మానభంగం చేశాడని మోసపూరిత కేసు పెట్టిన భర్తను అసహ్యంచుకున్న ఆత్మాభిమానం గల స్త్రీని చిత్రీకరించారు రచయిత్రి. మింగుతున్న పట్నం సంపుటిలో 17 కథలు కలవు. ఇవీ ప్రపంచీకరణ నేపద్యంలో సాగుతాయి. వ్యాపారం మృగం సంపుటిలో 20 కథలు కలవు. ఇవి కూడా ప్రపంచీకరణను సూచిస్తాయి. వ్యాపారంకు వున్న మృగ స్వభావాన్ని ఈ కథలు తెలుపుతాయి. నకరెకల్లు మండలం చందుపట్లకు చెందిన రచయిత్రి కందాళ గిరిలక్ష్మీ (1945). వీరు వివిధ పత్రికలలో కథలు , గేయాలు రాసారు.

మహిళా మార్గం  ఎడిటోరియల్ బోర్డు మెంబర్గా  పని చేసిన వారు జి రేణుక దేవి(1970). వీరు నల్గొండ జిల్లా వాసి. వీరు భావుకత , విడ్డూరపు మనిషి, పనిమనిషి , సంకెల , మొగ్గ ప్రపంచం , పురిటి నొప్పులే నయం , మార్పు ఎవరి లో ,అమ్మ కోసం , అమ్మ మనసు , తెల్లారబోతున్నది కథలతో పాటుగా మరో 15 కథలు దాకా రాసారు.  ఈ  కథలన్నీ వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. నల్లగొండ పొంచంపల్లి కి చెందిన రచయిత్రి డి.కల్పన (1977). వీరు సినిమా కు టైమయ్యింది, కలవని మగ్గం పోగులు అనే కథలు రాసారు.

మిర్యాలగూడలో  జన్మించిన దంత వైద్యురాలు డాక్టర్ శిరి. వీరు తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం(2018)ను అందుకున్నరు. వీరు బాలల కోసం కథలు రాశారు. మునుగోడు మండలం దుబ్బ కాల్వ గ్రామానికి చెందిన 7వ తరగతి అమ్మాయి ఎస్.కె.రూపిన్. వీరు తన తెలుగు మాస్టర్ దొడ్డి రామ్మూర్తి ప్రోత్సాహంతో దాదాపు పాతిక కథలు రాశారు.

*సూర్య పేట ప్రాంత రచయిత్రులు:
  
తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న కుంటుంబంలో జన్మించిన ముక్కాల రత్నమాల (1950). వీరు కుక్కడం గ్రామవాసీ. విరసం సభ్యురాలైన రత్నమాల నూతన పత్రికను నడిపారు. అలాగే ముగింపు (1973) , భార్య (1979) కథలను రచించారు. సూర్యాపేట నివాసి అయిన రచయిత్రి వనం సావిత్రినాథ్ (1951). వీరి కథలు వివిధ పత్రికలలో ప్రచురితం అయ్యాయి.  కోదాడ ప్రాంతంకు చెందిన కోట మర్తి రాధాహిమబిందు (1962) రెండు వారాలు , ఏడాది కో రోజు , మనసున మనసై..., అనుభవం , ఎడ్జస్టమేంట్ , చతుర్దీ పండుగ , సన్మానం , శలవా....శలవ్ , చుక్కల్లో పెద్ద చుక్క అనే కథలు రాసారు. ఇదే జిల్లా కు చెందిన మరో రచయిత్రి కొప్పురం శివజ్యోతి (1972) వీరు రాసిన మరక అనే కథ వార్త దిన పత్రిక లో ప్రచురితం అయ్యింది. మరో రచయిత్రి కోట్ల వనజాత కూడా కథలు రాసారు.

*ఇంకా మరి కొందరు రచయితలు:
  
నల్లగొండ జిల్లాలో కవిత్వం, నవలా, విమర్శ  వివిధ ప్రక్రియలలో ప్రఖ్యాతులైన సాహితీ పురుషులు సైతం కనీసం ఒక్కటి రెండు కథలైనా రాయడం విశేషం. అలాంటి వాటిని ఎలికట్టె శంకర్ గారు నల్లగొండ జిల్లా కథ ల పేరిట సంకలనం గా వేసారు. ఆ రచయతలు మరియు వివిధ పత్రికలలో వచ్చిన కథలు రచయితల పేర్లు చూస్తే....
               
కె.రాములు - విపరీత సాహసం , చరకుపల్లి హరికృష్ణ రావు - పల్లె బడి , వేనేపల్లి ఆంజనేయులు-పాడియావు , కె.ఎల్.నరసింహ రావు - శాంతి ప్రకటనలు, మండల్ రెడ్డి కోండల్ రెడ్డి - మూసిన తలుపులు , నటువా వెంకటయ్య -రామలక్ష్మీ , కోండపల్లి వెంకట శేష గిరి రావు - సంసార సాగరం , నిఖిలేశ్వర్-గడ్డం మనిషీ , ఆలీ - దఫన్ , సంజీవ్-రాకాసి కోన , మాళవత్ బాలాజీ నాయక్-జమిలి , దేవులపల్లి కృష్ణమూర్తి -మొదటి కథ , గుడిపాటి -గది , తెలిదేవర భానుమూర్తి -ఆడ పిట్టలున్నాయా , కొలనుపాక మురళీధర్ రావు -చిలుకల దండ , రామేశ్ హజారి -వాన కురిసిన రాత్రి , విద్వాన్ నాగం - అధిక + అరి , కె.వాసు- రంగు వెలసిన త్రికోణం , పి.సుదర్శన్-అప్పు కోసం , చెన్నుారి నాగరాజు - పిచ్చి , అలుగుబెల్లి  రామచంద్ర రావు - అంతరాలు , విద్వాన్ యానాల- ఆవిడ భర్త పెళ్ళి , దేవరాజు మహరాజు - సోదా , ఎన్.ఎస్.రాహుల్-ఒకే గూటి పక్షులు , వి.ఆర్.నన్నూరి-పైరు , గౌసు మోహియద్దీన్-హైవరస్, భోధనం నరసిరెడ్డి - ఓడలు ఓడలే , సుధాకర రావు -పగిలిన అద్దం , పోకల జోసెఫ్-అతుకుల బతుకులు , డి.ఎస్.ప్రకాశ రావు -ప్రవాసీ , బి.గోపయ్య-వాగ్దానం మీదేనా , పి.వి.బి.రాజు - న్యాయానికి నెత్తుర్లైదా , బి.రాములు -వ్యత్యాసాలు , వసంత్ రాయ్-అమెరికా డాక్టర్, ఎస్.మల్లా రెడ్డి -బతుకమ్మ బండి , మేకల మధుసూదన్-నాన్న చస్తే బాగుండును , జాతశ్రీ -గాయం ,  గుడిపూడి సుబ్బారావు -రెండు కోడిగుడ్ల కోసమా , శిరంశేట్టి కాంతరావు - వానపాములు , పిట్టల శ్రీనివాస్-వెలి.
                  
సయ్యద్ గఫార్-బండి కదిలింది ,కందుకూరి దుర్గా ప్రసాద్-దేవుళ్ళు , అంబటి వెంకన్న - ఆనోస్తే చెరువేది , పెరిమళ్ళ ఆనంద్-చివరికి , బెల్లి యాదయ్య - ఎర్రేద్దు , కాటేపల్లి లక్ష్మీ నరసింహ-పచ్చీసు , ఛందు తులసీ దాసు - బుక్కేడు బువ్వ , రూప్ కుమార్-లచ్చుంబాయి , నస్రీస్ ఖాన్-పంఛీ ఔర్ పిండ్రా , గాదె వెంకటేశ్- టోల్ గేట్ , పోకల జోసేఫ్-అతుకుల బతుకులు , నన్నూరి సత్తిరెడ్డి -వాగొచ్చింది,పోస్టోచ్చింది , కంచెర్ల సత్యపాల్ రెడ్డి -ఓ సిన్నోని కత , చరకుపల్లి రఘౌత్తమ రావు-కోవిల్లో , మునాస వెంకట్ - వల్లేక్కం , పగడాల నాగేందర్-ఉసురు , సుంకిరెడ్డి నారాయణ రెడ్డి -ఎండమావి , చిత్రం ప్రసాద్-పల్లె రాగమాల , పున్న అంజయ్య -పగ , పులిపాటి గురు స్వామి -ఐటి కప్ప , ధరణీ కోట సమీర కుమార్-ఆడు మారిండు , మూటుపూరు కృష్ణ మూర్తి -తప్పు , నిర్మల్-సమాధుల పై పునాదులు , శేషు -షోకాజ్  , ఓరుగంటి పురుషోత్తం -అందెగత్త , హర గోపాల్ -నీరెండలు.

*పరిశోధనలు : 
                 
కారణం ఏదైనా  ఈ జిల్లా లో లబ్ద ప్రతిష్టూలైన ఎంతో మంది కవులు ఉండి కూడా వారి పై సరైన పరిశోధనలు రాలేదనే చెప్పాలి. ఆయితే ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో మా పరిశోధక మిత్రులు దర్శనం ప్రకాశ్ నల్లగొండ జిల్లా కథలు సమగ్ర అధ్యయనం పై పరిశోధన చేస్తున్నారు       

Follow Us:
Download App:
  • android
  • ios