Asianet News TeluguAsianet News Telugu

పన్నెండు రంగుల ఇంద్ర ధనుస్సు

హరగోపాల్ ప్రముఖ కవి, సాహిత్య పరిశీలకుడు. రమేష్ కార్తిక్ నాయక్ రాసిన బల్దేరు బండి కవిత్వాన్ని హరగోపాల్ పరామర్శించారు. కవిత్వంపై హరగోపాల్ రివ్యూను చదువుదాం.

Haragopal reviews Ramesh Karthik Naik poetry book
Author
Hyderabad, First Published Jun 15, 2020, 11:05 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

రమేశ్ కార్తీక్ నాయక్  ‘బల్దేర్ బండి’  పాలబుగ్గల లేతకవిత. అమాయికపు అద్దం కనిపించిందల్ల ఘుంగ్టో(అద్దాల ముసుగు) కాన్వాసుమీద, బొమ్మలపుస్తకంలో అతికేసుకుంటది. ఈ పుస్తకంలో కవితలన్నీ తడి,తడిగా వున్న కండ్లనతికించినట్లున్నయి. ఒక నిసర్గ, రమణీయ అరణ్యప్రభ కనిపిస్తుంది.

‘ఎన్నెన్ని మాంసపుతెరల్ని పరిచారో
దారిపొడుగునా ఎటుచూసినా
దేహపురంగుల్ని కప్పుకున్న మట్టితివాచీలు
తివాచీలపై వాలిన గాజురంగులు
ఎడారినేలని కొలుస్తూ ఏమిపట్టనట్టుంటాయి’ ... దుమ్మురేగిన ఎర్రమట్టిబాటల్లో తండాకాన్వాస్ మీద 
బల్దేర్ బండి.. ముద్రలు
‘లదణి కథలు చెప్పి
బండి నిద్రపోయాక మాయమైపోతాయి’... మానవనాగరీకంలో కోల్పోతున్న జీవనద్రవ్యంలో ఒక వర్ణం.. దుఃఖశబ్దాలతో బండి కూలిపోతున్నది...
గోమ్యాదాదా(తాత)
‘చెప్పకుండానే చుట్టసొరంగంలోకి కూరుకుపోతాడు
ఇంట్లోగోడకి జ్ఞాపకంగా
తోటలో మామిడి నీడైపోయాడు...’
అవన్నీ గుర్తుచేసుకుంటుంటే...
‘ధూజ్ణి(వణుకు) పుడుతుంది
గుమడిలు(గాయాలు) నదుల్లా కదలాడి
కళ్ళని ముంచెత్తితే
జ్ఞాపకాలు రాత్రిని దుప్పటిటా కప్పుకుంటాయి...

ఈ పిల్లగాడు ఏం రాస్తున్నడు... దేన్ని వర్ణిస్తున్నడు...అంతూ,పొంతూ లేని బతుకుయాదిని..
అందరు చూసిన బతుకుచిత్రాల్నే ఇప్పటిదాకా ఎవ్వరురాయని కవిత్వభాషలో బొమ్మలు,బొమ్మలుగా గీస్తున్నడు.
ఎన్ని ఉపమానాలు...ఎన్ని రూపకాలు, ఎన్నిప్రతీకలు.. కొత్త పదచిత్రాలు... ప్రతిభావంతుడైన ఈ కవి చేతిలో వెన్నముద్దలవంటి కవితాశిల్పాలు...
పెద్దకవుల వరుసలో ఈ కవినాయక్ పేరుకూడా చెప్పుకొండి. 
ఈ పదచిత్రాలు, రూపకాలు, కొత్తనుడికారాలు చూడండి:
‘‘విశ్వమంత రొట్టెలు,
ఆకలి కణాలు
లోయి(రక్తం)పిట్టలు
తోటలో మామిడినీడై పోయాడు ..గోమ్యా దాదా
పడవపింజల్లా మారిన ఊర్లు
దారినరం
మట్టిఊపిరితీగలు
పిట్టలదువ్వెనతో తలదువ్వుకుంటుంది ఆకాశం
పగటితువాలు
చెక్కెరబెడ్డల్ని పూసుకున్న వేపకాయలు
పసుపుకోటేసుకుని ఇప్పపూలు
కండ్లనిండా కోయిలలు
పెదవులనిండా పండుగలు
కొమ్మఒడిలో దీపశిల
సాపేసి నన్ను మధ్యలో అతికేస్తుంది నానమ్మ
కాలం పూర్వీకులెవరో రాత్రికి పగలుకు నడుమ నిద్రవంతెనను ఏర్పరిచారు
ఝీఁక్డి అతికించుకున్న ఇంటిదుప్పటిని కప్పుకున్నాం
రేయిపిట్ట
పొలంపువ్వు
అక్కరెక్కల్ని కప్పుకుని అమ్మా, నేను, మా గుడిసె వెచ్చగా నిద్రపోతాం
ఘుంగ్టో(అద్దాల ముసుగు) కాన్వాసు
గుడిసెకి ఆకలేసి నాయనమ్మను మింగింది
నడుముకొమ్మ
నా దళ్(గుండె)ని కన్నీళ్ళో నానబెట్టాను
నాలోనికి ఒక మన్క్యా(మనిషి)ని ధరించాలి
జనన రాయబారం
జీబ్(నాలుక)ని కప్పుకుని ఓ మక్కగింజ పడుకోనుంది...’’
ఇట్లా ఎన్నో..మరెన్నెన్నో

‘బల్దేర్ బండి’ లోని  
ప్రతికవిత లంబాడి తండాల దుఃఖాన్ని వడగట్టిన వస్త్రగాలం... 
ప్రతికవిత నర్మగర్భంగా చదివిన వారి గుండెల్లో దించే కంజర... 
ప్రతికవిత మర్మగర్భంగా ధ్వనించే పదకాహళి...

‘మా తండా ఓ పిట్టగూడు
మా ఇళ్ళు పగిలిన గుడ్లు
మా బతుకులు గాలిలో తేలుతున్న ఈకలు’... 
‘యాడి(అమ్మ)లంతా 
రాత్రిని ముస్తాబు చేస్తున్న 
నూనెబుడ్డిని నిద్రపుచ్చడానికి 
అడవిగీతం పాడుతారు
 ఎక్స్ ప్లాయిటెడ్ జీవితాలు. తండా కింత కన్న గొప్ప ఉపమానం ఎవరు చెప్పలేరు.

‘ఓడ్ టు లంబాడీస్’
ఇదొక 12 రంగుల ఇంద్రధనుస్సు... ఆఖరుది వాటర్ కలర్.. చెరువులు పోరగాల్లను చేపలు చేసి ఈదుతుంటయి.

 ఊర్ల నడుమ అడివిలో ఒక తండా వుంటది. తండాలో మనుష్యులు అందరి కన్నా కొంచెం ఎక్కువ సమానంగ బతుకడానికి తండ్లాడుతుంటరు. గోరుకొయ్యలు పొడువంగనె అయ్యలు పొలాలకు పోతరు. ఎగిరివారంగ అమ్మలు అంగట్ల కూరలో,కాయలో అమ్మపోతరు. తండా గుడిసెలల్ల ముసలోల్లు, పోరగాండ్లే తండ్లాడుకుంట ఉంటరు. తండాలల్ల మొదట బేరగాల్లే అయినా ఇపుడిపుడు పిల్లల్ని చదివించుకుంటున్నరు. గుడిసెలు పెంకుటిండ్లు, డాబా యిండ్లు అయితున్నయి. కొన్నిచోట్ల తండాలను తాకుకుంట రోడ్లొచ్చినయి. అక్కడ నాగరికత మారింది. అయినా, లంబాడా బతుకుల్లో అవిద్య, అభద్రత, అన్యాయాలు, అశాంతులెక్కువే. బతుకుతెరువు కోసం వాండ్లు చెయ్యని పనిలేదు.

అట్లా అని మార్పు ఇంకా రానేలేదు.
లంబాడాల వలసబతుకులు మారలేదు
‘ఆ వలస ఎవర్ని ఏమూల చేరుస్తుందో
ఎవర్ని రాజుగా మారుస్తుందో
ఎవర్ని బానిసగా మారుస్తుందో
వాళ్ళు నిర్ణయించుకున్న వలసే నిర్ణయించాలి’
** ** ** **
‘నేను
నా హృదయా(దల్)న్ని కన్నీళ్ళలో
నానబెట్టాను’...
‘నాలోనికి ఓ మనిషి(మన్క్యా)ని
పూలదండలా ధరించాలి
నన్ను నేను బలపరచుకోవడానికి’... ఇక్కడ కవి తన మేనిఫెస్టోని ప్రకటిస్తున్నాడు.
(నచ్చని శీర్షిక పేరు...తడిగా తగులుతున్న నటన)
 
ఈ కవి రాసిన 53 కవితలలో 12 కవితలు అచ్చమైన బంజారాజీవితాన్ని వర్ణించినవి, చిత్రించినవి. జీవితా నుభవాలు, అనుభూతులతో కవితలను రాసాడు. మనల్ని నేలమీదికి, నింగికి నడుమ ఊయలలూపే కవిత్వం ఇది. 

ఈ కవి బంజారా తండా కవే. ఇంకా బంజారా కవి కాలేదు... వ్యక్తీకరణలో, పదచిత్రాల కూర్పులో కొత్తదనం కనిపిస్తున్నది. అయితే కొంత అధివాస్తవిక భావనాధోరణి వుంది. 
 గాబ్రియల్ మార్క్వెజ్ గార్సియా కవిత్వంతో బల్దేర్ బండి కవిత్వాన్ని పోల్చడం ఈ పిల్లవాని సహజకవిత్వాన్ని పోగొట్టడమే అవుతుంది. అపుడే తనను ఎవరెవరితోనే పోల్చి చెడగొట్టకపోతే బాగుండు. తన కవితాసంకలనం కొత్తది. కవిగా తాను కొత్తవాడు. జిగేల్ మన్న ప్రతిదీ కవిత్వం చేసే అమాయకత్వం తనది. ‘మాజికల్ రియలిజమ్’ పెయింటింగ్ నుంచి కవిత్వంలోనికి ఒంపిన ఒక ధోరణి. అటువంటి ధోరణి బల్దేర్ బండి కవితలలో అక్కడక్కడ కనిపిస్తుంది. కొన్ని కవితలలో అనేక కవితలు కలిసిపోయినట్లు రాస్తుంటాడు రమేశ్ కార్తీక్. చిన్న వయసులో అద్భుత కవిత్వసృష్టి చేస్తున్నాడు. అభినందించతగిన వాడు. బల్దేర్ బండి పురస్కార యోగ్యమైన కవితా సంకలనమే. 
ఇక్కడ రమేశ్ కార్తీక్ నాయక్ కవిత్వ ప్రస్తావన మాత్రమే చేసాను..తన కవిత్వాన్ని మరోసారి పూర్తిగా విశ్లేషణ చేయాలి. అప్పటిదాకా సశేషం..
 
- శ్రీ రామోజు హరగోపాల్

Follow Us:
Download App:
  • android
  • ios