సమీక్ష: గుడిపల్లి నిరంజన్
                  
కవిత్వం ఏమి చేస్తుందంటే మనిషిని పరమార్శిస్తుంది.  ప్రకృతిని పలకరిస్తుంది.  గుండెలవిసేలా  ఏడ్చే మనిషిని ఓదార్చుతుంది.  జీవితం పొడుగూతా గాయాలను మోసుక  తిరుగుతున్న మనిషికి స్వాంతన పలకడానికి దారులను నిర్మిస్తుంది. చీకట్లు మనిషిని చుట్టుముట్టకుండ వీరబాహుడై, గుత్ప  చేతుల పట్టుకొని కావలి కాస్తోంది.  ఒకరికి దుఃఖం ఎందుకు ఉందో, ఇంకొకరికి సంతోషం ఎందుకుందో ఇప్పి చెబుతుంది.  సమస్య మూలాలను అన్వేషిస్తూ సమతా విలువలు నిటారుగా తల ఎత్తుకునేలా చేస్తుంది.  సరిగ్గా ఇదే  భావన 'కొప్పోలు మోహన రావు'  కవిత్వం "ఒంటి నిట్టాడి గుడిసె" చదివితే తెలుస్తుంది.

కొప్పోలు మోహన రావు చేసేది   బ్యాంకు ఉద్యోగమైనా,  మనసంతా కవిత్వమై పలువరించాడు. రోజూ కరెన్సీతో కరస్పర్శ చేస్తున్నా, కవిత్వాన్ని కన్నులకు అద్ధుకున్నారు.

కవిత్వాన్ని ప్రేమించే ఏ మనిషి కుదురుగా ఉండలేడు. స్తబ్దంగా, నిశ్శబ్దంగా అసలే ఉండలేడు . అందుకే మోహన రావు కూడా కూలుతున్న సమాజపు విలువలకు తన కవిత్వపు నిట్టాడిని పూటీలుగా  పెడుతున్నారు.

రిటైరయ్యాక కూడా తడి ఆరని కవిత్వపు పదునుతో, బళ్ళున పొద్దెక్కినట్లు తెలుగు సాహిత్యంలో నిలబడ్డాడు.  విలువలకై  నిట్టాడిగా నిలబడడం మనిషి ధర్మంగా భావించారు.

64 కళల్లో కవిత్వం కూడా ఒక కళ.  సరిగ్గా మోహన రావు కూడా అరవై సంవత్సరాలకు పుస్తకం వేసుకోవడం యాదృచ్ఛికమే కావచ్చు, కానీ అవసరమైన సందర్భంలో అవసరమైన కవిత్వాన్ని తీసుకొచ్చారు.

అనుభూతిని కళగా అభ్యాసం చేయడం మోహన్ రావు గారికి బాగా ఇష్టమైన పని.  ప్రతి  సాహిత్య కార్యక్రమానికి హాజరై అనుభూతిని కొన్నాళ్లు రాసులు రాసులుగా పోసుకొని చివరికి  'ఒంటి నిట్టాడి గుడిసె' అయినాడు.

ఈ కవితల్లో  కవి గొంతు శాశ్వతంగా పీడితుల వైపే ఉన్నది.  అనుభవాత్మకమైన కవిత్వం కనుక, మనుసు పొరల్లోనుంచి  పలుకుతుంది.  అభివ్యక్తి కూడా అరువు తెచ్చుకున్నది కాదు.  వస్తు ఎంపికకు కవి ఇబ్బంది పడ్డ సందర్భం లేదు.

'వారసత్వం' అనే కవితలో కవి తన స్పష్టమైన మేనిఫెస్టోను ప్రకటించాడు.  తన దారిని, తన పోరును కూడా సూటిగా ప్రకటించాడు.  గుర్తింపు కోసం వెంపర్లాడే తత్వం లేదు.  వ్యక్తిత్వంలాగే కవిత్వం కూడా  నిరాడంబరత్వమును తెలుపుతుంది . ఈ సంపుటిలో 'వారసత్వం' అనే కవితను ఈ పుస్తకం  "ఆత్మ గా" చెప్పవచ్చు.

"కత్తులతో కోలాటం ఆడతాను
నెత్తుటితో  నీలి రాగం ఆలపిస్తాను.
నిప్పుల గుండం మీద అవలీలగా నడుస్తాను
జాతి కోసం పదునెక్కిన పాటనౌతాను.. అంటూ.....
"ఇప్పుడు రాజ్యాంగం నా రక్షణ కవచం/
అంబేద్కర్ నా ఇంటి దీపం/ రాజ్యాధికారం కోసమే ఈ నా పయనం".. అంటూ తన లక్ష్యాన్ని తన మార్గాన్ని స్పష్టంగా ప్రకటించారు.

"ఒంటి నిట్టాడి గుడిసె" కవిత్వంలో మానవుడు తన జీవన యానంలో ఎదుర్కొంటున్న అనేక ఘర్షణలు మనకు కనబడతాయి.  కుల ధర్మంతో ఊగిపోయి దాడులు చేసే కుల అహంకార  నిలదీత కనపడుతుంది.  అదేవిధంగా మతతత్వం నెత్తికెక్కి మదంతో,  దుర్గుణంతో మానవ విలువలు నాశనం చేసే మనిషి నిలదీత కూడా కనపడతుంది.

మోహన్ రావుకు నిరంతరం నిఘా పెట్టే లక్షణం ఉంది. ఈ నిఘా వల్లనే తనకి సునిశిత దృష్టి బాగా అలవడింది.  చెప్పలేని యాతనలను అనుభవించే వృద్ధుల పక్షం వహిస్తాడు.  ముసలి మూలుగుల్లోని పెయిన్ పై గొప్ప కవిత రాశారు

"మన కీర్తి సౌధాలకు పునాదులై నిలిచిన వాళ్లు/
వాళ్ళను మనసారా గౌరవించుకుందాం
ఎంత చేసినా రుణం తీర్చుకోలేని వారి త్యాగానికి/
తలలు వంచి సాదరంగా నమస్కరిద్దాం/
ఈ దేశపు మర్యాదస్తులై..
వారికి జేజేలు పలుకుదాం"
(ఈ దేశపు మర్యాదస్తులు)

కవిత్వం కీర్తి కోసం ఉపయోగించే సాధనం అనుకుంటే మోహన్ రావు  ఎప్పుడో పుస్తకాలు వేసేవారు.  అట్లా కాదులే అనుకున్నారు కాబట్టే ఇన్నాళ్లు తన లోపల ఉన్న భావాన్ని బాగా  మాగి మాగి, కట్టే శ్యాగ వారినట్లు అయ్యాక బయట పడ్డ కవితలే ఎక్కువగా ఉన్నాయి.
తొందరపాటు లేదు.  ఆవేశం అసలే లేదు.  ఆలోచించి ఆలోచించి సమాజ ఆలోచనలు విశ్లేషిస్తూ కవిత్వమై ప్రవహించడంలోనే ఈ కవి నిబద్ధత తెలుస్తుంది. నిబద్ధత, నిమగ్నత, నిరంతరత, అనేవి ఈ కవిలో ఉండే అత్యంత గొప్ప ఆలోచనలు.

వాస్తవికతకు దగ్గరగా ఉన్న కవితలే మొత్తానికి మొత్తం ఉన్నాయి.  కొన్ని కవితల్లో అత్యద్భుతమైన జీవన చిత్రం ఉన్నది. ఆలోచనా సరళి గాఢంగా ఉంటూ కవిత్వం సరళంగా ఉండడం ఈ కవిత్వం యొక్క ప్రత్యేకత.  భావగర్భితమైన భావజాలంతో బలంగా వస్తువును పలికించగల నేర్పు ఈ కవిలో కనపడుతుంది.

ధనవంతుల దౌర్జన్యాలను ఎండ కట్టగలరు.  దాడులకు గురైనవారికి భరోసా ఇవ్వగలరు.  స్వాభావిక స్థితిగతులను గొప్పగా చూపిస్తారు.  ప్రజల బతుకులను పీడిస్తున్నది ఎవరో స్పష్టంగా తెలియజేస్తారు.  సంఘటనలు మాత్రమే కాక దాని వెనకాల ఉండే కారణాలను దోషులుగా చూపుతారు. సాక్షాలతో, ప్రమాణాలతో, ఆధారాలతో మాట్లాడడం ఈ కవిత్వం యొక్క ప్రత్యేకత

"శిథిల జీవితం" అనే కవిత చాలా లోతుల్ని తడిమిన కవిత.  భూమి పొరల్లోని, మనసు పొరల్లోని మూలుగును పట్టించిన కవిత అది.  'పైకి కనిపించేది ప్రతిదీ వాస్తవం కాదని'  తెలియజేసే కవిత.  అందుకే ఇలా అంటున్నారు

"కళ్ళకింద నల్లటి వలయాలు /
ఎన్ని కలతల మోస్తున్నాయి చూడమంటున్నారు.

'పునరుజ్జీవం' అనే కవితలో సైకలాజికల్ మోటివేషన్ ఉంది.  ఈ కవిత చదివితే ఒక పాజిటివ్ శక్తి నరాల్లోకి వ్యాపిస్తుంది.  ఒక ప్రేరణ గుండె పొదుగును తలపిస్తుంది. ఒక కొమ్మలా చిగురించాలని అనిపిస్తుంది .
ఆ కవిత....

మోసుకొచ్చిన జీవిత రంగాల్ని/
కల కనేసి /ఎద మీద సరికొత్త రాగాల అంగీ కప్పుకొని /
పుర్రె నేలలో పడిన విత్తనం మొలకెత్తినట్టు  /
జీవమున్న మనిషిగా జీవించడానికి/ ఎన్నిసార్లైనా పునరుజ్జీవo పొందాలి'
అని అంటున్నాడు.

ఏడుపును కూడా కవితగా మలచటం కొత్తగా ఉంది. పోరు కవిత్వం చూశాను.  కానీ ఏడుపు కవిత్వంగా చేయడం ఇదే మొదటిసారి.  'కన్నీరు ఒక చుక్కున్నచో  ఎంతటి కష్టాన్నైనా భరింతును'  అని సత్య హరిశ్చంద్రుడు చెప్పినట్లు.. గుండెను ఏడుపు ఎంత దిటవుగా ఉంచుతుందో,  ఏడుపు ఎంత మందులా పని చేస్తుందో ఇలా చెబుతున్నారు .

"పుట్టుకనుంచి చచ్చేదాకా/
విరామ చిహ్నంలాగా /
ఏడుపు అప్పుడప్పుడు మనిషిని పరమార్శిస్తుంది/
కన్నీటి జలపాతాలు ఇంకి పోయేదాకా

"గుండెలవిసేదాకా.../ కడుపుమంటలారెదాక /
మనసుకు కమ్మిన దిగులు మబ్బులు కరిగే దాక/
ఏడుపు.. ఏడుపు..ఏడుపే/
దాని ముందు మనసుకు ఏ మందైనా దిగదుడుపు".

కొన్ని కవితల్లో మహనీయుల లక్ష్యాలు పరోక్షంగా కనిపిస్తాయి.  సత్యాలు, నిజాలు వెంటవెంటనే పలుకుతాయి.  అట్లా ఒక కవితలో బుద్ధుని సూత్రాలు చెప్పాడు.

"ఎంత మరుగు పరిచి ఏ మార్చినా/
రహదారులు గుంపుల్ని మాయం చేయలేవు /
ఏది ఉన్నచోట ఉండలేదు
ఎవరు చేతులొడ్డి ఆపలేరు
..............
............
ఇప్పుడు నువ్వు నడుస్తున్న దారి
మరో రోజు ఎడారిగా మారొచ్చు...

ప్రతిదీ మారుతుంది అని,  మార్పు అనివార్యం అని అది మనిషి కావొచ్చు, సమాజం కావొచ్చు, ప్రకృతి కావొచ్చు అని బుద్ధుడు చెప్పిన సత్యం  పై కవితలోని అంతరార్థంగా మనం భావించాలి.

ఈ సంపుటిలో మొదటి కవిత అమ్మతో ప్రారంభమై, చివరి కవిత నాన్నతో ముగుస్తుంది.  మధ్యలో మానవ సమాజం ఏర్పడాలనే తలంపుతో రాసిన కవితలు ఉన్నాయి.

మొత్తానికి తన చుట్టూ ఉన్న మనుషులు ఈ కవిత్వం నిండా పరుచుకున్నారు. సాధారణ దుమ్ముకాళ్ళ మనుషులైన, జానపద వెంకట నరసయ్య, అలాగే పేపర్ బాయ్, పాల అబ్బాయి, ఆకుకూరలు అమ్మేవాళ్ళు, పనమ్మాయి ఇట్లాంటి సామాన్యులే ఈ కావ్యంలో హీరోలుగా ఉండడం జరిగింది.  పై కవితల ద్వారా కావ్య వస్తువు పట్ల కవికి ఉన్న సామాజిక అవగాహన పరిపక్వతను అర్థం జేస్తుంది.
తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని "కవిత్వ ప్రపంచంగా" ఆవిష్కరించాలనే తపన ఈ కావ్యం ప్రత్యేకత.

అమ్మ తత్వం కేవలం అమ్మకే కాకుండా రాజ్యానికి, రాజ్యాంగానికి కూడా తండ్రి అంబేద్కర్ "ఆ తల్లితత్వాన్ని" అప్పజెప్పారు.  అందుకే మన అమ్మ  ఈ భూమ్మీద జన్మనిచ్చాక  ఆ బాధ్యతను చనిపోయే అంత వరకు రాజ్యం, రాజ్యాంగం మోస్తుంది.  అట్లాంటి సార్వజనీన తల్లితత్వం తన సొంత తల్లిలో మోహన్ రావు  చూసుకున్నారు .  అందుకే ఇలా అంటున్నారు

"ఇప్పుడామె....
శత్రు రాజ్యం మీద దాడి చేసి/
కాలం కడలిలో తేలి తీరు మార్చిన/ యుద్ధ శకలoలా ఉంది అమ్మ.."
అలాగే నాన గూర్చి రాస్తూ....బాధ్యతలను తెలుపుతున్నారు.
"నాన్న గుడికెళ్లడం ఎప్పుడూ చూడలేదు..
బడికి మాత్రం ఎంతో బాధ్యతగా వెళ్ళేవాడు" అని అంటారు.

తెలుగు నేలమీద ఇప్పుడు  విపత్కర పరిస్థితులు వ్యాపించాయి.  నిజానికి కవి స్థానం మహోన్నతము. కానీ ఇప్పటి అధికార కేంద్రాలను కవి ప్రశ్నిస్తున్నoదుకు కవుల పైన నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు.  "కవిని కష్ట పెట్టకండ్రా" అంటూ  వరవరరావు నిర్బంధాన్ని వ్యతిరేకించాడు. కవిత్వం అంటే రాజకీయ అధికారుల పాద సేవ కాదు "ఆధిపత్యాన్ని తిరస్కరించడం" అని చాటిచెప్పారు.  ఈ కవితలో వరవరరావు గురించి చెబుతూ ఇలా అంటున్నారు

"పుట్టుక తోనే చావుని ప్రేమిస్తారు/
బతుకంతా ఘర్షణని  మోస్తున్నాడు..
అంటూ ......
"ఆకలి కేకలు అక్కున చేర్చుకుంటాడు/ అన్యాయం మీద అణ్వస్త్రాన్ని ప్రయోగిస్తాను ....అని చెప్పారు.

తోటి మనిషి బాధను, కన్నీళ్లను చూసి స్పందించడం వల్ల ఈ కవిత్వానికి ప్రాసంగికత, సజ్జీవత ఏర్పడింది. ఇంత మంచి కవిత్వాన్ని అందించిన కొప్పోలు మోహన్ రావుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ..

జై భీమ్! జై భారత రాజ్యాంగం!!.

వెల రూ.100/-
అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలలో లభ్యం.