గోపగాని రవీందర్ తెలుగు కవిత: ఏజెన్సీలో జాతర కాలం..!
భుజానికి తగిలించుకున్న సంచులతో/ కాలినడకన ఒకరి వెనుక ఒకరుగా/ బారుల్లా మునుముందుకు సాగుతున్నారని అంటున్నారు కవి గోపగాని రవీందర్. ఆయన కవిత ఏజెన్సీలో జాతర కాలం చదవండి.
ప్రకృతిలోకి
వసంత ఋతువు వచ్చినట్లుగా
ఏజెన్సీలోకిప్పుడు
జాతర కాలం ప్రవేశించింది
ఆదివాసీల లోగిళ్ళల్లో
విభిన్న రంగులు శోభిల్లుతున్నాయిప్పుడు
ఏ దారుల వైపు చూసినా
కుటుంబాలతో తరలివస్తున్నారు
సంబురాల జాతరల దగ్గరికి
అడవంతా పచ్చని కడలయిందిప్పుడు
తుడుం మోతల రాగాల కెరటాలతో
జింక పిల్లలు పరిగెడుతున్నట్లుగా
అడవి బిడ్డలు వడివడిగా కదులుతున్నారు..!
భుజానికి తగిలించుకున్న సంచులతో
కాలినడకన ఒకరి వెనుక ఒకరుగా
బారుల్లా మునుముందుకు సాగుతున్నారు
ఎక్కడో ఒక దగ్గర, నీటి వసతి ఉన్నచోట
ఒక చెట్టు కింద సేద తీరుతువుంటారు
అందంగా అలంకరించిన ఎడ్లబండ్లతో
తమ నేలలో తామే యాత్రలు చేస్తూ
బంధువర్గాన్ని కలుపుకు పోతూనే
విరామమెరుగని యాత్రికులవుతున్నారు..!
కోరిన కోరికలు తీర్చే
గుడి రేవులో వెలిసిన పద్మల్ పూరి కాకో దగ్గరికో
జంగు బాయి కొలువుదీరిన గుహల దగ్గరకో
ఖాన్ దేవుని దగ్గరకో, బుడుందేవుని దగ్గరకో
ఇంద్రాణి దేవి కొలువైన ఇంద్రవెల్లి దగ్గరికో
కేస్లాపూర్ నాగోబా కోవెల దగ్గరకో
మొక్కులు చెల్లించటానికి చేరుకుంటారు
దైవాన్ని ఆరాధించడం వాళ్ళ సంస్కృతి
విత్తనాలు భూమిపైన చల్లినప్పుడు
ఎదిగిన పంట చేతికి వచ్చినప్పుడు
జోరు వానలో చిక్కుకున్నప్పుడు
అనారోగ్యంతో కుమిలిపోయినప్పుడు
నమ్ముకున్న ఇలవేల్పు కరుణించిందని
తరతరాలుగా వాళ్ళు విశ్వసిస్తున్నారు..!
అంతరిస్తున్న జీవ జాతులను
పర్యావరణ ప్రేమికులు కాపాడుకున్నట్లుగా
సాలె గూడు లాంటి
ప్రపంచీకరణ మాయాజాలంలో
మూలవాసుల ఉత్సవాలు ధ్వంసం కాకుండా
కట్టుబాట్లకు కట్టుబడిన పెద్దల కట్టడితో
జాతరలింకా కనుమరుగు కాకుండానే
ఇప్ప పువ్వుల పరిమళాలై వ్యాపిస్తున్నాయి..!
(కేస్లాపూర్లోని నాగోబా జాతర సందర్భంగా)