చేసే పొరపాటు
చిన్నదనుకోకు
పోయేప్రాణం
పెద్దదని మరువకు

వేకువ విలువ తెలిసేది
చీకటిలోనే
స్వేచ్ఛ విలువ తెలిసేది
చెరసాలలోనే

కాలం కరుణిస్తే
కీర్తి ఖాతాలో జమ
కాలం కోపిస్తే
కర్మ సిద్ధాంతం నమః 

అనుమానం ఆవహిస్తే
అన్యోన్యత ఆవిరే
ఆంధ్రభోజుడు అప్పాజీని
అంధుని చేసిన తీరే

అతివ ఏనాడైనా 
అబల కాదు సబలే
కురుసభలో ప్రశ్నించిన
పౌరుషాగ్ని పాంచాలే

కనబడకుంటే కారణాల ఆరాలు
కనబడుతుంటే కారాలు మిరియాలు
కలహాల కీలలలో
కాపురాల కర్పూరాలు

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature