అబోలీ ఆంగ్ల కవిత: పూలమాల
ఆంగ్ల కవయిత్రి అబోలీ కవితను ప్రముఖ తెలుగు రచయిత, కవి గీతాంజలి పూలమాల పేరిట తెలుగులో అందించారు. ఆ కవితను చదవండి.
నా జడలో స్వేచ్చగా ఊగుతున్న పూల మాలకి
ఆ మాత్రం స్వేచ్ఛ ఉండి తీరాలి !
స్వప్నావస్థలో ఉన్నట్లు
ప్రకృతి లాంటి అమ్మ అల్లే పూలమాల ...
నాతో కలిసి ఊయల లూగుతూ..
నా జడలో చేరి ..
ఈ లోకమంతా నేను గంతులు వేస్తూ తిరుగుతున్నప్పుడు...
ఊహల లోకంలో ఉన్న నన్ను పట్టుకోడానికో...లేదా..
నిశ్శబ్దంగా ... ఎవరితోనో గాఢంగా శ్వాసించబడ్డానికో ...
రోజు చివరి ఘడియల్లో ...
పొద్దు గుంకుతూ ఉన్నప్పుడు...
మౌనంగా రాలిపోతూ...
లేదా ప్రియుడిచే తొలగించ బడుతూ.. నా పూల మాల.
నా తలలో గుచ్చబడ్డ పూల మాల...
రాలిపోవడానికీ..
అక్కడే ఉండి పోవడానికీ మధ్య ఊగిసలాడుతూ..
అలజడిగా ఊగుతూ..
జడపిన్నులు గట్టిగానే పూల మాలని ఆపుతున్నాయి.
దయచేసి వాటిని ఆపకండి... తలలోంచి రాలిపోనివ్వండి
తాము చేసే జీవన ప్రయాణంలో... అలా నిర్లక్ష్యంగా నేల రాలి పోవాలని చూసే వాటిని ఆపకండి...!
నిజం చెప్పొద్దూ...
నిశ్శబ్దంగా రాలిపోవడానికీ...జడలోనే ఉండిపోవడానికీ మధ్య ఊగిసలాడుతూ ..
ఏ కోరికలూ లేకుండా
ఆ పూమాల చేసే ప్రయత్నం నాకు నచ్చింది !
ఆ మాత్రం స్వేచ్ఛ దానికి ఉంది.
అది రాలి పోవడాన్నే నేనూ కోరుకుంది.
కానీ.. అదిగో చూడండి..
మా అమ్మ మాత్రం ..
బోలెడంత ప్రేమతో... నా కోసం
మరో పూల మాల స్వప్నావస్థలో ఉన్నట్లుగా
శ్రద్ధగా అల్లుతూనే ఉంది.
స్వేచ్ఛానువాదం: గీతాంజలి