కారా మాష్టారుకి నివాళి: మమ'కారా'నికి మరోరూపం
తెలుగు కథా రచయితలకు దిక్కుగా ఉంటూ వస్తున్న కారా మాష్టారుగా ప్రసిద్ధి పొందిన కాళీపట్నం రామారావు ఇటీవల కన్నుమూశారు. కారా మాష్టారుపై ప్రముఖ రచయిత గంటేడ గౌరునాయుడు రాసిన నివాళి వ్యాసం ఇది.
రచయిత: గంటేడ గౌరునాయుడు
కొందరే కొందరికి మాష్టార్లు కాగలరు కానీ 'కాళీపట్నం రామారావు గారు' అనే ఆయన మాత్రం అందరికీ మాష్టారే. అయితే ఆ గౌరవం, ఆస్థాయి ఎలావచ్చిందంటారు? సాహిత్య సమాజమేకాదు, సాహిత్యేతర సమాజం కూడా అతనిని మాష్టారిగానే గౌరవించడంలోని మర్మమేమిటి? ఆయనేంచేసారు సమాజానికి? ఈ ప్రశ్నలు ఇంజనీరింగ్ చదువుతున్న ఒక కుర్రాడు వేసినవి. మొన్న నాలుగో తేదీనాడు కథానిలయాన్ని మనకు వొదిలి కానరాని లోకాలకు తరలిపోయిన మహా కథకులు కాళీపట్నం రామారావు మాష్టారి గురించి టీవీల్లోను, వార్తాపత్రికల్లోనూ చూసి, ఈ ప్రశ్నలైనా వేసాడాకుర్రాడు. ఇదొక సాధారణమైన మామూలు వార్త ఈతరం కుర్రాళ్ళకి. ఔను ఈతరం కుర్రాళ్ళకి మాష్టారిగురించి తెలీదు. వాళ్ళకి సాహిత్యం అంటూ ఒకటుందని, అది సమాజాన్ని వ్యాఖ్యానిస్తుందని, సాహిత్యాధ్యయనం కొత్త మెలకువనిస్తుందని తెలియదనే ఆ కుర్రాడి ప్రశ్నలు చెప్తున్నాయి.
అందరూ ఇలాగే ఉన్నారా కుర్రాళ్ళు అంటే సమాధానం ఎక్కువ శాతం ఇలాగే ఉన్నారని.కాళీపట్నం రామారావు మాష్టారు గురించి నిన్నటితరానికి తెలిసినంతగా ఈ తరానికి తెలియకపోవడానికి కారణాలేమిటి? అదే ఒక సినిమా పాటల రచయిత అయితే బహుశా ఆ కుర్రాడు ఇలాటి ప్రశ్నలు వేసివుండేవాడా? ఖచ్చితంగా వేసివుండేవాడు కాదు. బుట్టబొమ్మా..బుట్టబొమ్మా పాట ఎవర్రాసేరో చెప్పగలరు గానీ యజ్ఞం కథ ఎవర్రాసేరో.. చెప్పలేరు. ఇది వాళ్ళ తప్పని నెపం వాళ్ళపైన మోపేయగలమా? బహుశా తరగతి గదులలో పిల్లలకు సాహిత్యస్పర్శ అందక పోవడమే ఒక కారణమని అనిపిస్తుంది. అయ్యేయెస్ కి ఎన్నిక కాబడిన ఒకవ్యక్తికి ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న వేసారట. మీ ప్రాంతంలోనే ఒక వ్యక్తి కథకి ఒక ఇల్లుకట్టారు. అదే కథానిలయం. ఎక్కడ? ఎవరా వ్యక్తి? అని. ఆ ప్రశ్నకు నాకు తెలీదు సర్ అని అయ్యేయెస్ కుర్రాడి జవాబు. ఆ కుర్రాడి స్వస్థలం టెక్కలి. దీన్నెలా అర్థం చేసుకోవాలి?
మీరు ఏదైనా ఒక సాహిత్యసభకు హాజరైనవారిలో చూస్తే ఉపాధ్యాయులు ఎందరుంటారు? అందులో భాషాబోధనచేసే ఉపాధ్యాయులు ఎందరుంటారు? దీనికి సమాధానం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మాష్టారి మరణం కొత్త ప్రశ్నల్ని మనముందుంచుతుంది. కొత్త ఆలోచనల్ని కలిగిస్తుంది. సాహిత్యజీవుల బాధ్యతను గుర్తుచేస్తుంది. కాళీపట్నం రామారావు మాష్టారు తన జీవితకాలమంతా శ్రమించింది, ఆశించిందీ సాహిత్యాధ్యయనం ప్రతితరంలోనూ జరగాలని. అందుకు బాధ్యత పడాల్సింది మాష్టర్లే అని మాష్టారి నిశ్చితాభిప్రాయం మాష్టారి మాటల్లో వ్యక్తమయ్యేది. మనమేకదా చెప్పాల్సింది పిల్లలకి అనేవారాయన. బడుల్లో పిల్లలకు చెప్పడం ద్వారా సాహిత్యం పట్ల ఆసక్తి కలించే అవకాశం ఎక్కువ ఉపాధ్యాయులకుంది. అందువల్ల ఉపాధ్యాయులకు సాహిత్య పరిచయం ఉంటే మంచిదని అనేవారు. "నువ్వు ఉపాధ్యాయుడవు కదా..నీ నెలజీతం లోంచి పుస్తకాలుకొనడానికి కొంత కేటాయించు." అని తొలిసారి మాష్టారితో కలిసినప్పుడు చెప్పిన మాట. ఏ వయసువారు ఏ పుస్తకాలు చదవాలో..చదవగలరో అవి ఎంచి ఇచ్చి చదవమని చెప్పి ప్రోత్సహించడం వారి ప్రత్యేకత. అంతే కాదు, రచనపట్ల ఏమాత్రం అభిరుచి కలిగివున్నా రచయితగా ఎదగడానికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చి రాసినవి దిద్ది ఒక సాదారణ కథ మంచికథ ఎలా కాగలదో చెప్పేవారు.
ఆంధ్రభూమి దినపత్రికలో మాష్టారు నేటికథ నిర్వహించినపుడు మాష్టారు చేసిన పని ఇదే. అప్పుడు నేటికథలతో కథారచయితలుగా పరిచయమైన వారిలో ఎందరో ఇప్పుడు మేటికథకులైనవారున్నారు. ఇదంతా మాష్టారి కృషి, శ్రమ ఫలితమే. అయితే ఈ కృషిగాని, ఈ శ్రమగాని కంటికి కనిపించనిది. మాష్టారు ఏ లక్ష్యం కోసమైతే నేటికథ శీర్షికను నిర్వహించారో.. ఆ లక్ష్యానికి దూరంగా కొందరు సరస శృంగార కథలతో పక్కదారి పట్టడం మాష్టారి మనసుకు కష్టం కలిగి ఆ బాధ్యతనుండి తప్పుకున్నానని మాష్టారు ఆవేదనగా చెప్పేవారు. నా తొలినాళ్ళ అనుభవమొకటి ఇక్కడ చెప్పాలి. నా తొలి కథ ఒకటి ఆంధ్రజ్యోతి వారపత్రికలో అచ్చయినపుడు అది చదివిన మాష్టారు ఎందరినో అడిగారట ఈ కథారచయిత నాగావళితీర గ్రామానికి చెందినవాడే ..మీకుతెలుసునా అని, ఒక సమావేశంలో నన్ను పట్టుకున్నారు. పట్టుకుని ఊరుకోకుండా తన అడ్రస్ చెప్పి ఇంటికి రమ్మన్నారు..వెళ్ళాను. ఆప్యాయంగా పిలిచి పక్కన కూర్చోపెట్టుకుని కథకి సంబందించిన చాలా విషయాలు ఓపికగా వెప్పారు. చదవాల్సిన కథల పుస్తకాలేవో జాబితా ఇచ్చారు, కొని చదమన్నారు. అలా అని ఊరుకోలేదు కార్డు రాసి ఏం చదువుతున్నావు ? ఏం రాస్తున్నావు? అని ఆరా తీసేవారు. ఇంత పని ఎవరు చేస్తారు? ఎవరైనా ఎందుకు చేస్తారు? ఎవరూ అలా చెయ్యరు చేస్తేగీస్తే అతను కాళీపట్నం రామారావు మాష్టారు అవుతారు.
కారా మాష్టారు మొదట తనకు తెలిసిన మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాల కథలు రాసినా తరువాత్తరువాత అవి అతనికి సంతృప్తి నివ్వలేదు. అతనే చెప్పుకున్నారు. నాకు నచ్చినకథలు వేరు, నాకు చాతనైన కథలు వేరు. నాకు ఇష్టమైన కథలు ఎలా రాయాలో నాకు నాడు తెలీదు. నాకు చాతనైన కథలురాసి ప్రయోజనం లేదు" అని. కథకొక ప్రయోజనముండాలని నమ్మి అలాటి కథలు రాయడానికి సమాజాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసాక కొన్నాళ్ళ వ్యవధితీసుకున్నాక రాసిన కథలే మాష్టారిని ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. "యజ్ఞం రాసేక నామీద నాకు నమ్మకం కుదిరింది " అన్నారు. మాష్టారికి సునిశిత పరిశీలనా శక్తివుంది. ప్రాపంచికదృక్పథం లేనివారు గొప్పకథలు రాయలేరనే ఎరుకవుంది. అటువంటి ఎరుకతో పరిశీలనానుభవంతో జీవితమంత సహజంగా కథలు చిత్రించి పాఠకులను ఆలోచనలో పడవేసారు మాష్టారు. అప్పట్లో యజ్ఞం కథమీద జరిగినంత చర్చ ప్రపంచ కథాసాహిత్యంలో మరే కథమీదా జరిగలేదేమో. తనకొక ప్రాపంచిక దృక్పథం ఏర్పడినాక రాసిన కథలు ఆర్తి, చావు, హింస, నోరూమ్, భయం, జీవధార, యజ్ఞం, శాంతి, వీరుడు_మహావీరడు, కుట్ర వంటికథలు ఒక గొప్ప ఆలోచనాపరుని మేథోమథనం నుండి ఆవిర్భవించిన గొప్పకథలు. తెలుగు కథాసాహిత్యంలో ఎన్నదగ్గ మేలిమిముత్యాలు.
ఆర్తి, చావు కథల్లో చూస్తే మనకు స్పష్టంగా కనిపించేవి మాలపేటల్లోని కష్టజీవుల నికృష్టజీవన వ్యధలు. వారి దుర్భర జీవితాలు. పేదరికం మనుషుల మధ్య గల అనుబంధాలను ఎంత దారుణంగా విచ్ఛిన్నం చేస్తుందో, ఎంత వికృతంగా మారుస్తుందో చూపిస్తుందీ కథ. ఎర్రెమ్మ, బంగారి కుటుంబాల మధ్య ఘర్షణకి మూలం దారిద్ర్యమే. సన్నెమ్మ కాపురం కన్నా ఆమె కూలిడబ్బులే ముఖ్యమైపోతాయి. కన్నోరింటికీ, అత్తోరింటికీ మధ్య అగాధం ఏర్పడటానికి కారణం కేవలం పేదరికం. శ్రమ సొమ్ముగా, వస్తువుగా రూపొందేక్రమంలో జరిగే వికృతరూపానికి దర్పణం ఆర్తి కథ.
కుటుంబంలో పేదరికం ఎంత దారుణంగా తన ముద్రను వేస్తుందో అత్యంత సహజంగా కళ్ళకు కట్టిన కథ చావు. కుటుంబసభ్యులందరూ చిన్నపిల్లల్ని , ముసలోళ్ళని వొదిలి పొరుగూరు చేనికోతకు వెళ్తారు దళితులు. అలా వెళ్తేగాని వారికి కడుపు జరగదు. ముసలమ్మ కన్ను మూస్తుంది. అప్పుడు పిల్లల పరిస్థితిని, తిరిగి వచ్చే కుటుంబ సభ్యుల డోలాయమాన సంకట స్థితిని వర్ణించిన విధం అద్భుతం. ఎంతో పరిశీలనా శక్తి ఉంటేగాని సాధ్యం కాదిది. ముసలమ్మ మరణంచిందన్న వార్త విన్న నారమ్మ మనసులో "గోయిందా.. నా సేతెండి కడియాలు గోయిందా " అని అనుకోడానికి కారణం శవదహనం కోసం డబ్బులుండాల..అందుకోసం వెండికడియాలు అమ్ముకోవడం తప్ప మరో మార్గం లేదు. పాలేర్ల చేత శ్రమచేయించుకునే గాని సాయం చేసే ధర్మాత్ముల కాలం కాదది. రాత్రికిరాత్రి శవాన్ని తగలెట్టకపోతే మరుసటిరోజు కూలికి వొప్పుకున్న పనికి ఆటంకం. కుర్రోళ్ళు ఒక ఆలోచన చేస్తారు. బుగతల కుచ్చిర్లలోంచి కట్టెలు పట్టుకొస్తారు చాటుగా. కథ సుదీర్ఘంగా ఉన్నట్టినిపించినా చదువుతుంటే గుండె కరిగి కన్మీరై ప్రవహించి..ఆ కన్నీటిబిందువులు నిప్పుకణికలుగా రాల్తాయి.
'కీర్తికాముడు' కథ లో వెంకయ్య నాయుడు గొప్పకోసం, దాత అనిపించుకోవడం కోసం, కీర్తికాముడై ఎలా చితికిపోయాడో చెప్తూ నిజానికి వెంకయ్యనాయుడు కీర్తికాముడు కావడానికి ఏ భావజాలం పనిచేసివుంటుందో ఆలోచించమంటారు. దానధర్మాలు చేస్తే కీర్తివస్తుందని చెప్పిందెవరు? బ్రాహ్మణవర్గాలే కదా. ధర్మరాజు, హరిశ్చంద్రుడు, శిబి మొ. కథలు ఎవరి ప్రయోజనంకోసం? గోదానం, భూదానం, హిరణ్య దానం మొ. బ్రాహ్మణులకేగదా ఇవ్వాలి..అంటే దానం పట్టి బాగుపడేది బ్రాహ్మణుడు, చితికిపోయేది దాతలు. ఎవడైనా కీర్తికాముడయ్యాడంటే దానివెనక పనిచేసిన భావజాలాన్ని గుర్తించాల్సిన అవసరముందని తొలిసారి సాహిత్యంలో చర్చకుపెట్టిన కథ.ప్రపంచాధిపత్యం కోసం ఆనాటి అగ్రరాజ్యాల కుతంత్రాలు, చిన్నదేశాల బానిస ప్రవర్తనను ప్రతీకాత్మకంగా చెప్పిన కథ వీరుడు_మహావీరడు .
మాష్టారు రాసిన మలికథల్లో ప్రతి కథా అట్టడుగు బడుగు వర్గాల జీవితాల్ని వారి జీవద్భాషలో రాసి ఉత్తరాంథ్ర మాండలికానికి పట్టం కట్టిన మహానుభావులు. కారా కథలు ఒకసారి చదివి పక్కన పెట్టవలసినవి కావు. చాల జాగ్రత్తగా లోతుల్ని గ్రహించాల్సిన కథలు. మాష్టారిలాగే మాష్టారి కథలు కూడా విస్తృతితో గంభీరంగా ఉంటాయి. మాష్టారి కథలు చదవడానికి పూర్వకథాజ్ఞానం కొంత అవసరం అనిపిస్తుంది. ఇక్కడ నాకో పోలిక చెప్పాలి. మాష్టారి కథలు చదువుతుంటే మా నాగావళి నది గుర్తుకొస్తుంది. భాద్రపదమాసపు చివరిరోజుల్లో నది ఒడ్డును వొరుసుకుంటూ విశాలంగా ..నిదానంగా ప్రవహిస్తుంది. లోతును ఒడ్డునుండి అంచనా వెయ్యలేం. మాష్టారి కథలుకూడా అంతే. అతనిలాగే లోతైనవి, గంభీరమైనవి.
ఒక గొప్ప కథకుడిని కోల్పోయాం. అతనక్కడ శ్రీకాకుళంలో ఉంటే మా మాష్టారున్నారని అదొక ధైర్యంలా ఉండీది. ఇప్పుడి శ్రీకాకుళం అంటే శూన్యం అనిపిస్తుంది. అక్కడ సోదరుడు అట్టాడ ఉండొచ్చు, దాసరి రామచంద్ర ఉండొచ్చు..కథానిలయమూ ఉండొచ్చు గానీ 'మాష్టారు లేని శ్రీకాకుళం' ఆ లోటు అది ఎవరూ తీర్చలేనిది. మాష్టారితో అత్యంత సన్నిహితంగా మెలిగే భాగ్యం మాది. మాష్టారి చివరి రోజుల్లో "నా కథాసంకలనం కొత్తది మీకే అంకితం మాష్టారూ" అని ఆయన చేతుల్లోపెడితే గొప్ప సంతోషపడిపోయారు. నాకదొక గొప్ప భాగ్యం. తొంభైయేడేళ్ళ వయసులో ఆ కథలన్నీ చదివి " గంటేడా నీ కథలపుస్తకం ఆమూలాగ్రం చదివాను, అండర్ లైన్ చేసుకున్నాను కొన్నిచోట్ల చూడు" అనడం నాకు ఆశ్చర్యమూ ఆనందమూను. తొంబయ్యేడేళ్ళ వయసులోనూ కథలు చదవడం మానలేదాయన. కథకోసమే పుట్టి, కథకోసమే జోలెపట్టి దేశమంతా తిరిగి, కథలు సేకరించి, తొలికథనుండి నేటిదాకా వచ్చిన వేలూ లక్షల కథల్ని ఒకచోట చేర్చి, కథలకొక ఆలయం కట్టి "కథకంచికి" అనే నానుడిని "కథ శ్రీకాకుళానికి" అని మార్చిన మహా కథకులు కాళీపట్నం రామారావు మాష్టారు కథానిలయం కట్టి ప్రపంచంలోనే శ్రీకాకుళానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. పరిశోధకులకు, కథాభిమానులకు, సాహిత్యాభిమానులకు ఒక ప్రత్యేక దర్శనీయ ప్రదేశంగా మార్చేసారు.
తాజమహల్ సౌందర్యం గొప్పదే కావొచ్చు..కానీ ఏంప్రయోజనం..కథానిలయం అందమైంది కాకపోవచ్చు.దీని ప్రయోజనం అనుపమానం. మాష్టారి హృదయం అనదగ్గ కథానిలయంలో మాష్టారి మూర్తిని ప్రతిష్ఠిస్తే స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మాష్టారి అభిమానులు, కథాభిమానులు ఈ పనికి పూనుకుంటే కథానిలయం ఒక దర్శనీయక్షేత్రంగా కూడా పరిపూర్ణత సంతరించుకుంటుందని భావన.
ఫొటో: కారా మాష్టారుతో రచయిత