నోబెల్ సాహిత్య పురస్కార విజేత 'అన్నీ ఎర్నాక్స్'..
నోబెల్ పురస్కార విశేషాలు, 'అన్నీ ఎర్నాక్స్' సాహిత్య జీవిత నేపధ్యం గురించి డా. కె.జి.వేణు అందించిన ఆసక్తికరమైన వ్యాసం ఇక్కడ చదవండి :
ఆల్ ఫ్రెడ్ నోబెల్ సంకల్పం ప్రకారం సాహిత్య రంగంలో ఏ దేశానికి చెందిన రచయిత/ రచయిత్రికైనా ఈ పురస్కారం ప్రదానం చేయబడుతుంది. ప్రతి సంవత్సరం సాహిత్యంలో ఈ పురస్కారం కోసం సాహిత్య అకాడమీలు, వాటి సొసైటీ సభ్యులు, సాహిత్యం, భాషా ప్రొఫెసర్ లు, మాజీ నోబెల్ సాహిత్య గ్రహీతలు, రచయితల సంస్థల అధ్యక్షులు, పురస్కారం పొందటానికి అర్హులైన అభ్యర్థులను నామినేట్ చేయటానికి స్వీడిష్ అకాడమీసభ్యులు అనుమతిస్తారు.
అకాడమీలోని నలుగురు నుండి ఐదుగురు సభ్యులతో కూడిన వర్కింగ్ గ్రూప్, ఏప్రిల్ నాటికి వారికి అందిన నామినేట్ చేయబడిన అభ్యర్థుల సంఖ్యను 20కి కుదిస్తుంది. మే నెల నాటికి ఐదుపేర్లతో కూడిన చిన్న జాబితాను అకాడమీ ఆమోదిస్తుంది. తరువాత నాలుగు నెలలు ఎంపిక చేసిన ఆ ఐదుగురు అభ్యర్థుల రచనలను, చదవటం, సమీక్షించడం జరుగుతుంది. ఈ వ్యవహారం మొత్తాన్ని చాలా గోప్యంగా నిర్వహిస్తారు. అక్టోబరు నెలలో అకాడమీ సభ్యులు ఓటువేసి, సగానికి పైగా ఓట్లను పొందిన అభ్యర్థిని సాహిత్యంలో నోబెల్ బహుమతి విజేతగా ప్రకటిస్తారు. ఈ బహుమతి క్రింద విజేతకు 'ఒక బంగారు పతకం, డిప్లమా కలిగి ఉన్న ఒక సైటేషన్, పది మిలియన్ల స్వీడిష్ క్రోనార్ నగదును' అందజేస్తారు. ఈ నగదు ప్రస్తుత భారతదేశ కరెన్సీ 7.45 కోట్ల రూపాయలకు సమానం. ప్రతి ఏడాది 'ఆల్ ఫ్రెడ్ నోబెల్' వర్థంతి రోజు డిసెంబరు 10వ తేదీన స్వీడన్ లోని స్టాక్ హెూమ్ కన్సర్ట్ హాలులో విజేతకు ఈ బహుమతిని అందజేస్తారు.
అక్టోబరు 6, 2022న స్టాక్ హెూమ్ లోని స్వీడిష్ అకాడమీ, ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతి విజేతగా ప్రెంచి రచయిత్రి ‘అన్నీ ఎర్నాక్స్’ను ప్రకటించారు. ప్రతిష్టాకరమైన ఈ బహుమతిని 'అన్నీ ఎర్నాక్స్'కు “వ్యక్తిగత జ్ఞాపకశక్తి మూలాలు, దూరాలు మరియు సామూహిక పరిమితులను ఆమె వెలికితీసిన ధైర్యం మరియు క్లీనికల్ తీక్షణత కోసం” అందించబడింది. ఫ్రాన్సులో జీవించే సాధారణ మనుషుల రోజూవారీ జీవితం గురించి, ముఖ్యంగా మహిళల సమస్యలను గురించి అనేక నాన్ ఫిక్షన్ నవలలను రచించి, ఫ్రాన్సు దేశపు అత్యున్నత ప్రశంసలను పొందిన రచయిత్రి 'అన్నీ ఎర్నాక్స్'. 2014లో పాట్రిక్ మోడియానో తర్వాత సాహిత్య నోబెల్ బహుమతి గెల్చుకున్న మహిళ ఈమె. ఇప్పటివరకు 16 మంది మహిళలు సాహిత్య నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. వారి సరసన 17వ మహిళగా 'అన్నీ ఎర్నాక్స్' చరిత్ర పుటలకెక్కారు.
ఫ్రాన్స్ లోని లిల్లెటోన్ 'అన్నీడుచెస్నే'లో సెప్టెంబరు 1, 1940లో జన్మించిన 'అన్నీ ఎర్నాక్స్' నార్మాండీలోని యెవెటోట్ పట్టణంలో పెరిగి పెద్దదయింది. శ్రామికశక్తి నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి ఆమె వచ్చారు. ఆమె తల్లిదండ్రులు కిరాణ-కాఫీ దుకాణం నిర్వహించేవారు. ఈమె రూయేన్, బోర్డియక్స్ యూనివర్సిటీలలో చదువుకున్నారు. ఆధునిక సాహిత్యంలో ఉన్నత డిగ్రీని పొందారు. తరువాత కొంతకాలం మాధ్యమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. 1977 నుండి 2000 వరకు 'సెంటర్ నేషనల్ ది ఎన్సైన్మెంట్ ఫర్ కరెస్పాండెన్స్' లో ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహించారు. బాల్యం నుంచి విలక్షణమైన వ్యక్తిత్వాన్ని , ఉన్నతమైన, ఆదర్శవంతమైన భావాలను సొంతం చేసుకున్న సాహితీ శిఖామణి ఆమె.
'అన్నీ ఎర్నాక్స్’ తన సాహిత్య ప్రస్థానాన్ని 1974లో 'లెస్ ఆర్మోయిర్స్ విడెస్' అనే స్వీయచరిత్ర రచనతో ప్రారంభించారు. ఈ నవల అదే సంవత్సరం ప్రాన్సులో ప్రచురించబడింది. ఇదే నవల 1990లో 'క్లీన్డ్ అవుట్' గా ఆంగ్లంలోకి అనువదించబడింది. కల్పనలకు దూరంగా వుండి, చారిత్రాత్మక మరియు వ్యక్తిగత అనుభవాలను మిళితం చేసి ఆమె తన రచనలను కొనసాగించారు. ఆమె తల్లిదండ్రుల సామాజిక పురోగతి, ఆమె యుక్తవయస్సు, ఆమె వివాహం, తూర్పు యూరోపియన్ వ్యక్తితో ఆమె సంబంధం, ఆమె అబార్షన్, అల్జీమర్స్ వ్యాధి, ఆమె తల్లి మరణం, తన చుట్టూ వున్న సమాజం, సామాన్య ప్రజల జీవనరీతులు మొదలైన అంశాల నేపథ్యంలో ఐదు దశాబ్దాలుగా విశిష్టమైన రచనలను అందించారు.
1988లో ప్రచురించబడిన ఆమె నవలలు 'ఎ మ్యాన్స్ ప్లేస్', 'ఎ ఉమెన్స్ స్టోరీ' మరియు 'సింపుల్ ప్యాషన్ ది న్యూయార్క్ టైమ్స్' మొదలైనవి ఫ్రాన్స్ లో అద్భుతమైన క్లాసిక్ రచనలుగా ప్రశంసలు అందుకున్నాయి. 'అన్నీ ఎర్నాక్స్' తన ఆత్మకథను 'ది ఇయర్స్' గా వ్రాసినప్పుడు, ఈ రచనను ప్రెంచ్ సాహితీవేత్తలు అపూర్వంగా కొనియాడారు. ఈ నవలలో తనను తాను ప్రస్తావించుకుంటూ, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత 2000 వరకు ప్రెంచ్ సమాజంలో చోటుచేసుకున్న పరిణామాలను, అభివృద్ధి చెందుతున్న ఆ సమాజంలో ఒక మహిళ జీవించిన విధానాన్ని, ఎదురైన సవాళ్లను సరిక్రొత్త విధానంలో చిత్రీకరించటం జరిగింది.
ఈ నవల 2008లో ఫ్రాన్స్ లో ‘ప్రిక్స్ రెనాడోట్’ బహుమతిని, 'మార్గరీట్ డ్యూరాస్' బహుమతిని, 'ఫ్రెంచ్ భాషా' బహుమతిని, 2009లో 'ది 2009 టెలిగ్రామీడర్స్' బహుమతిని, 2016లో 'ప్రీమియో స్ట్రెగా యూరోపియో' బహుమతిని గెల్చుకుంది. దీనిని అలిసన్ ఎల్ స్ప్రేయర్ ఆంగ్లంలోకి అనువదించినప్పుడు, '31వ వార్షిక ఫ్రెంచ్ అమెరికన్ పౌండేషన్ అనువాద' బహుమతికి ఫైనల్ లో నిలిచి తన సత్తా చాటుకుంది. 2019లో 'మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్' కోసం నామినేట్ చేయబడింది. ఈ రచనను ఒక అసాధారణ సృజనాత్మక కళాఖండంగా ప్రచురణకర్త జాక్వెస్ టెస్టర్డ్ ప్రశంసించారు. ఈ రచన ద్వారా 'ఎర్నాక్స్' సాహిత్యంలో ఒక క్రొత్తదనానికి ప్రాణం పోశారని విమర్శకులు అనేకమంది కొనియాడారు.
‘అన్నీ ఎర్నాక్స్’ వ్రాసిన ‘ఎ ఉమెన్స్ స్టోరీ' 1988లో 'పబ్లిషర్స్ వీక్లీ బెస్ట్ బుక్' గా ఎంపికైంది. అంతేకాకుండా ఇదే నవల 2008లో 'టాప్ టెన్ బుక్స్' జాబితాలో చోటు దక్కించుకుంది. 'శుభ్రం చేశారు', 'వారు చెప్పేది చేయండి లేదా మరొకటి చేయండి’, ‘ఒక ఘనీభవించిన స్త్రీ’, ‘నాలుగు గోడలు ఎనిమిది కిటికీలు’, ‘ఒక మనిషి స్థలం’, ‘ఒక స్త్రీ కథ’, ‘బాహ్యభాగాలు’, ‘షేమ్’, ‘నేను చీకటిలో వున్నాను’, ‘చూసిన విషయాలు', 'జరుగుతున్నది', 'గెట్టింగ్ లాస్ట్', 'స్వాధీన', 'ది ఇయర్స్', 'ఒక అమ్మాయి కథ' మొదలైన ఆణిముత్యాల్లాంటి నవలలు ఆమె కలంనుంచి ప్రాణం పోసుకున్నాయి. ఆమె నవలలు అధిక సంఖ్యలో ఇతర భాషల్లోకి అనువాదం చేయబడ్డాయి. ఆమె రచనలు ఆమెరికాలోని స్టోరీస్ ప్రెస్ ద్వారా ఆంగ్లంలో ప్రచురించబడ్డాయి. యు.కె.లోని ప్రచురణకర్త ఫిట్జ్కరల్డో ఎడుషన్స్ 'ఎర్నాక్స్' ఎనిమిది రచనలను ప్రచురించారు. ఆమె సాహిత్యం ఎక్కువగా ఆత్మకథ, సామాజిక శాస్త్రంతో సన్నిహిత సంబంధాలు కలిగివుంటుంది.
సాహిత్యంలో ఆమె పొందిన అవార్డుల జాబితా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 1977లో ప్రిక్స్ డి హానర్ ను, 1984లో ప్రిక్స్ ఫ్రాంకోయిస్-మారియాక్ అవార్డును, మొత్తం ఆమె రచనలకు కలిసి 2008లో ప్రిక్స్ డిలా లాంగ్యూ ఫ్రాంకైన్ అవార్డును, 2014 లో సెర్గీ-పోంటోయిసే విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను, 2017లో సివిల్ సొసైటీ ఆఫ్ మల్టీమీడియా రచయితలచే ప్రిక్స్ మార్యురైట్ - యుర్సెనార్ అవార్డు, 2018లో ప్రీమియో హెమింగ్ వే అవార్డును, 2019లో ప్రిక్స్ ఫార్మేటర్ అవార్డును, 2019లో ప్రీమియో గ్రెగర్ వాన్ రెజోరీ అవార్డును, 2021లో రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ వారిచే ఇంటర్నేషనల్ రైటర్ అవార్డును… ఇలా లెక్కించటానికి వీలుకాని ఎన్నో అవార్డులు, రివార్డులు ఆమెను సగౌరవంగా వరించాయి.
సాహిత్యంలో సంపూర్ణ సాధికారితను సంపాదించుకున్న 'ఎర్నాక్స్' తన జీవితంలో అనేక కోణాలను చవిచూశారు. తన జీవితాన్ని అమితంగా ప్రేమించిన వ్యక్తి ఆమె. కష్టాలు, కన్నీళ్లకు ఏనాడు సాష్టాంగపడలేదు. తన చుట్టూవుండే వారి జీవితాలను, ముఖ్యంగా యూరప్ మహిళలు ఎదుర్కొన్న రకరకాల సమస్యలను, వారి మనోవేదనలను, ఎలాంటి దాపరికం లేకుండా అక్షరీకరణం చేసిన ఫ్రెంచి రచయిత్రి ఆమె. 82 సంవత్సరాల వయసులో సైతం ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ, సాహిత్యాన్ని తన శ్వాసగా మార్చుకుంటూ, నూతన పంథాలవైపు సాగే రచనలను ప్రోత్సహిస్తూ, ప్రపంచ మార్పుల్ని తన అభిరుచికి సాధనాలుగా మలుచుకుంటూ ఒక ఆదర్శ నమూనా జీవితాన్ని తన ఖాతాలో జమచేసుకున్న 2022 నోబెల్ సాహిత్య పురస్కార విజేత 'అన్నీ ఎర్నాక్స్'.