జీవిత విమర్శనమే కవిత్వం (Poetry is criticism of life) –మాథ్యూ ఆర్నాల్డ్.

కాలం చలనశీలం. కదిలే కాలం ఎవరికోసమూ ఆగదు. కాలంతో పరుగెత్తుతూ ఆగని కాలాన్ని అందుకున్నవాళ్లే విజేతలు. విజేతల విజయం మానవాళి నుదిటిపై చరిత్ర. నూతనత్వం దిద్దిన మహత్తు. మానవ మనుగడకు ప్రతిబంధకంగా మానవీయత లోపిస్తున్న సంధి కాలం. మనిషి తనం లుప్తమవుతున్నసందర్భం.

అణువణువున అనుమానం.  కరచాలనాల మధ్య కత్తులు మొలిపిస్తున్న కాలం.  బంధాలు, బంధుత్వాలు, రక్త సంబంధాలు ఏవీ లేవు.  ప్రేమలు పెనవేసుకున్నమనుషుల మధ్య పొంచి ఉన్న కనపడని శత్రువు భయపెడుతున్నదుస్థితి.  కాలం కరవాళంతో కసాయి.  ఆరడుగుల దూరముంచిన కరోనా కాలం.  కనికరం లేని మృత్యుతాండవం.  ఆశలు కొట్టేసుకున్న వాళ్ళు అంపశయ్యపై చావును ఆహ్వానించారు.  ఆవాహన చేసుకున్నారు.  కాలం కౌగిట్లో అంతర్ధానమయ్యారు.  అయినవారు దర్శించుకోలేని, స్పర్శించలేని అంధకారం.  పెంచి పెద్దచేసిన వాళ్ళను కడచూపు చూడనివ్వని కర్కశత్వం మిగిల్చిన కాలం.  ఆశలుగా ఆశయాలుగా వాళ్ళ కళలు ఇంకా మిగిలే ఉన్నాయి.

మానవత్వం పునరావృతం అవ్వాలని, మనిషి బతుకాలని కలలుగనే వారిలో ముందుంటాడు కవి. తన అక్షరాలకు పదును పెడ్తాడు.  ప్రాణం పోస్తాడు. నిశ్శబ్ద నిశాచర కాలంలో బతుకుపై ఆశలు రేకెత్తిస్తాడు. దుర్మార్గపు కాలానికి చరమగీతం పాడుతాడు. అచ్చం అలాంటి లక్షణాలు గల కవి చిత్తలూరి ఆర్ద్రతతో మనిషి తనముండాలనీ సాహితీ లోకానికి అందిస్తున్న పుస్తకమే  ‘మనిషి అలికిడి లేక’

అక్షరాలతో మనిషితనాన్నివిత్తుతూ మనిషిలోని విధ్వంసాన్ని, విరిగిపడుతున్న విలయంలో అక్షరాలా తన కవితలతో భరోసా గీతాలు ఆలపిస్తున్నాడు చిత్తలూరి సత్యనారాయణ.  ఫేస్ బుక్ లాంటి మాధ్యమాల్లోనూ, పత్రికల్లోనూ తరుచుగా సుపరిచితమైన పేరే చిత్తలూరిది.  అవి కవితలు కాదు ఎతలు అనడం సమంజసమేమో.  పిట్ట పీసుమననీ జనారణ్యంలో, కరోన కాలం లోనే కాదు నిజ జీవితంలోని మనిషి తనాన్ని, మనసులని తట్టి లేపుతూ, రాసిపోసిన తన కవితల కుప్పకు 'మనిషి అలికిడి లేక' అనే పేరుతో మనీషితనం ఎలుగెత్తి చాటుతున్నాడు.

‘ఏ ముఖం ఎవరిదో తెలియకుండా
అనేకానేక మాస్కులు తొడుక్కున్న ఇన్ని ముఖాల మధ్య
ఏ మాస్కూలేని స్వచ్ఛమైన తేట నీటి లాంటి
పారదర్శకమైన అద్దంలాంటి
ఒక మానవ ముఖం కావాలి
నాకో ముఖం కావాలి’ (నాకో ముఖం కావాలి)అని కరోనా కాలంలో మనిషి గురించి మానవత్వంతో ఆలోచించిన, మనిషి అలికిడి లేని కాలాన పొద్దు పొడిచిన అక్షరంగా నాకో ముఖం కావాలంటాడు.  ఆ ముఖం వారికొక్కరికేనా? కాదు. సమస్త మానవాళికి, భయం గుప్పిట్లో బతుకుతున్నవాళ్ళకీ,  ప్రతి ఒక్కరికీ అవసరమే కదా!

 కోవిడ్ -19 వల్ల కొత్త పదాలు పరిచయమయ్యాయి. లాక్ డౌన్, కోరంటైన్, ఐసోలేషన్, మొదలైన పదాలు ప్రతీకలయ్యాయి. పతాకలయ్యాయి.  కవిత్వానికి కొత్త వస్తువు అయింది.  ఈ కవి స్త్రీ దృక్పథంతో లాక్ డౌన్ గురించి రాస్తూ వేదనలను,  అవిశ్రాంత విధి నిర్వహణనూ గుర్తుకు తెస్తాడు.

ఏ లాక్ డౌన్ ను ప్రకటించినా  
మాకు గృహమే కదా బందిఖానాలంటూ
శోక గీతాలే తప్ప
గృహ మీదే కదా స్వర్గసీమ లంటూ
మీలా కరోనా కవితలు ఎక్కడివి?
మా శ్రమల జైలు నుంచి మాకు విముక్తి లభించిందెపుడని’ స్త్రీ స్వరమై ప్రశ్నిస్తాడు.

 లాక్ డౌన్ వల్ల స్తంభించిన రవాణా.  బతకడమే బాధ.  బాధతో బతుకడమే జీవితం. ఎక్కడుండాలి? ఉండడానికి ఇల్లులేదు. తనడానికి తిండి లేదు. బతికేదెట్ల? పట్నం నుంచి వందల కిలోమీటర్ల దూరమున్న పల్లెతల్లి ఒడికి పాదయాత్రలు.  వాళ్ళకు అలుపు లేదు. వాళ్ళ గెలుపు ఇల్లు చేరడమే.  వారి లక్ష్యం పోతున్న ప్రాణాలు నిలుపుకోవడం.  దారంటా సరిపడే ఆహారం లేదు. తాగడానికి నీళ్ళు లేవు. అడుగడుగుకు తండ్లాటలు.  కొంతమంది, కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేరదీసినా సహాయం సరిపోతలేదు. వాళ్లు ప్రస్తుతం అభాగ్యులు వారికి ఎదురెల్లుదాం అంటాడు.

అన్నం పొట్లాలమై ఎదురెళ్దాం
నడక పాదాల మీద పూలు చల్లకపోయినా
ఆకలి మంటల్ని ఆర్పేసే
మెతుకు పూల వానై కురుద్దాం (మెతుకు పూల) పాదయాత్ర చేస్తున్న ప్రజలను చూసి హత్తుకుందామని కవిత్వమై వేడుకుంటాడు.

ఈ కవితా సంకలనంలో కరోన కాలంతో పాటూ అనేక సమస్యల మధ్య సతమతమవుతున్న మనుషుల జీవితాల్నీ చిత్రిస్తాడు. గాలానికి చిక్కి విలవిల్లాడుతున్న చేపల్లాంటి మనుషుల్నీ, మనసుల్నీ చెరుగని పుట్టుమచ్చలా ఆవిష్కరిస్తాడు.

 దేశంలో ఇప్పటికీ వయసొచ్చిన ఆడపిల్లలకు, స్త్రీలకూ నెలసరి దినాల్లో పడే బాధని తదాత్మయమ్ చెంది రాస్తాడు. కవితను ఎత్తుకోవడం లోనే కవి ప్రతిభ కనపడుతుంది చూడండి.

ఇంతగా అభివృద్ధి చెందిన నా దేశంలో
ఆమె ఇంకా ఒక గుడ్డ ముక్క కోసమే వెతుక్కోవటం
కంటనీరు తెప్పిస్తోంది

          .............

ఒక చిన్న నెత్తురు చుక్కను దాచుకునేందుకు ఇప్పుడు దేశమంత శానిటరీ పాడ్‌ కావాల్సిందే! (దేశమంతా) కవితలో శానిటరి ప్యాడ్ ల అవసరతను ఖచ్చితత్వంతో వివరిస్తాడు.

గతుల కోసం సుతులు.  సుతుల కోసం గతులు అనే సామెతను అనుసరించి పిల్లల కోసం తల్లి తండ్రుల తపన.  పెళ్లి చేసుకొని తల్లి తండ్రుల్నీ వదిలి అనాధలను చేస్తున్నఉరుకుల పరుగుల జీవితాలకు వాస్తవాలనీ తేటతెల్లం చేస్తూ రాసిన కవితలో 

మీరు తినే పళ్లెంలోంచి
ఓ ముద్ద కూడు
ఆకు రాలిన చెట్టయి మిగిలిన
ఆ ఎముకల గూడును
ఆప్యాయంగా అల్లుకునే
పూల తీగల్లాంటి మీవయిన

ఓ నాలుగు ప్రేమపూర్వకమైన మాటలు (ఏం  కావాలి వాళ్లకు!) మనకు జీవితాన్నిచ్చి, ఉన్నతికి కారణమైన తల్లి తండ్రులకు మీవైన (మనవైన) నాలుగు ప్రేమ పూర్వక మాటలే కదా! వాటిని కూడా అందించకపోతే ఎట్లా అని ప్రశ్నిస్తాడు.

బంధాలు, బంధుత్వాల గురించి చిక్కన్ని అనుబంధాల్ని అల్లుతాడు.  మనల్ని తన కవిత వింటినారికి బిగించి గుంజుతాడు. తన తల్లి గురిచి చెబుతూ ఏమీ చెప్పననీ ఎంతో గొప్పదనం చెప్పుతాడు.

ఎవరి ద్వేషాన్నయినా
ఎందరి ఆవేశాన్నయినా
గుండెల్లోనే దాచుకుని
 ప్రేమను మాత్రమే పంచి పెట్టే
ఒట్టి పిచ్చి తల్లి మా అమ్మ
మా అమ్మ గురించి
అంతగా చెప్పుకోదగిందేముందిలెండి! (పిచ్చి తల్లి!)

 తనకంటూ ఏమీ మిగుల్చుకోనీ తండ్రిని తన కవితా పంక్తులుగా చిత్రిస్తాడు.  డాడీ స్వార్థ పరుడు కాడు గనుకనే అతని వారసులుగా ఉన్నామనీ ఒక నిర్వేదంతో ఒక దు:ఖ తెరను పాఠకుల మీదికి విసిరి మనసును తడిబట్టలా పిండుతుంటాడు.

ఇన్ని రకాల పనులు మీదేసుకుని
అందరికీ అన్నీ పంచిపెడుతూ
 తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా
ఒంటరిగా మిగిలిపోతున్న డాడీ
మంచోడెలా అవుతాడు?
అవును డాడీ మంచోడు కాడు!  (డాడీ మంచోడు కాడు!)  

రూపాయలుంటే రూపమనుకునే సమాజంలో కులం తోకలు పేరు చివరన చేరీ ఏలుబడి చేస్తున్నాయని గేలి చేస్తూ,  మానసికంగా మభ్యపెడుతున్న తీరును తులనాడుతూ రాసిన కవితను పరిశీలిస్తే, తనపై తోకలతో దాడి చేసే వారిపై ఎలా కలబడుతాడో తెలుస్తుంది. వారి కొట్లాట తోకలతో కాదు. తోకలు చూపే అహంతో, వివక్షతో.

నిజానికి నాకు తోకలతో పనేముంది?
ఆధిపత్య తోకలను కత్తిరించి
తలెత్తుకుని నిలబడే ఆత్మగౌరవ శిరస్సు నాది(తోకలు)

 జనాభా లెక్కలు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ గురించి కరోన కంటే ముందు పెద్ద ఎత్తునా దేశమంతా రాద్దాంతం జరిగింది.  ఈ దేశ మూలవాసులమైన మమ్ము లను పరిచయం చేయడానికి నీవెవరు? అని కుట్రను పసిగట్టి ప్రశ్నిస్తాడు.  

నన్నివాళ కొత్తగా పరిచయం చేసుకోమనే కుట్రేంది?
అనేక రకాల రంగుల పూలను
గుబాళిస్తున్నదేశభక్తి నాది
కొత్తగా నా భక్తికి పరీక్షలేంది
పిడికెడు మట్టిని చేతుల్లోకి తీసుకుని చూడు
ఈ దేశ మూవాసుల నెత్తురూ కన్నీళ్లతో
తడిసి మొలకెత్తిన నా దేశం కనిపిస్తుంది!(ఒకానొక పరిచయం)  ఈ దేశ మూలవాసుల పరిచయం, వాస్తవం తెలిసేలా వివరిస్తూ, రాజకీయ కుట్రలను ప్రశ్నిస్తాడు.

కవి అనధికార ప్రజా ప్రతినిధి.  కవి ప్రజల పక్షాన నినదిస్తాడు. బలం లేనోళ్ల బలమైన గొంతుకగా మారిన తన కవిత్వంలో వారి ఆత్మ కనబడుతుంది.  బలహీనుల పక్షంగా గొంతెత్తుత్తాడు.

మీ కాళ్ల కింద చెప్పుగానో
మీ పిర్రల కింద పీటలగానో తప్ప
మీ భుజాల మీదకి ఎక్కించుకుందెప్పుడని
మమ్మల్ని  (తెలుసులెండి) అనే కవితలో ముక్కుపట్టి కొట్టినట్లు అడుగుతాడు.  ఆ భావజాలాన్ని కడుగుతాడు.

 ఏ కవినైనా, కళాకారుడినైనా ప్రజలవైపు మాట్లాడినా, బడుగు బలహీనుల తరుపున రాసినా, ఆ తంటా నీకెందుకు? నీ కవిత్వమేదో నీవు రాసుకో. నిజం నిష్టూరం. యదార్థవాది లోక విరోధి. వొద్దు. ఉన్నది ఉన్నట్టు రాయకు అనే బోడి సలహాలను చూసి ...

 మనిషిగా చచ్చిపోయి
రెండు దండలూ నాలుగు శాలువాలూ  మీదేసుకుని
బతకనేర్చిన కవిగా ఊరేగమంటున్నారు
ఛీ! అంతా తొండి (ఛీ అంతా  తొండి!) సున్నితంగా తిరస్కరిస్తున్నకవి అంతరంగం అక్షరాల్లో కనపడుతుంది. 

మనం మనుషులం. మనుషుల మధ్య ప్రేమ, స్నేహం, సమానత్వం పెంపొందించాలి కానీ వైరుధ్యాలను కాదనీ గట్టిగా నమ్ముతాడు చిత్తలూరి.  అదే వారి అంతరాత్మగా అగుపిస్తుంది. విశ్వ నరుడనని ప్రకటించిన జాషువా లాగా,  ఆకశం భీజ ప్రధాతగా/ అవనీయే ఆది మాతగా చూసే జనాలకు సమాజమంతా ఒకే కుటుంబంగా కనబడుతుందన్న సినారె కవితా పంక్తులు తప్పకుండా గుర్తుకొస్తాయి.

మనిషిని విత్తనం చేసి మొలకెత్తించటం
దేశాన్ని ఆకుపచ్చని పంట చేను చేసి పరవశించటం కదా
మనిషి ఆశయం కావాలి
మనుషులెక్కడైనా మనుషులే కదా

          -------

ద్వేషానికి సరిహద్దులు చాలా వుంటాయి
కానీ మనిషిని ప్రపంచ మానవుడిగా ప్రేమించటానికి
 ఏ భౌగోళిక సరిహద్దులూ లేవు
 ప్రపంచమే ఒక దేశం, దేశమే ఒక ప్రపంచం!      (దేశమే ఒక ప్రపంచం)

చిత్తలూరి కవిత్వం నేలవిడిచి సాము చేయదు.   జీవితంలోంచి, జీవితం కొరకు, జీవితం చేత రాయించిన కవిత్వమే వీరి వస్తువు.  నాకు తెలిసి ఈ పుస్తకం ఎవరు చదువుతున్నా వారి జీవితమే కనిపిస్తుంది.  కనిన, వినిన, కాంచిన కథలు, గాథలు, కన్నీళ్లని దాటుకొనే బతుకును సూచిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

 చిత్తలూరిని,  వారి కవిత్వాన్ని ఎవరో పరిచయం చేయడమేంటి? విడ్డూరంగా.  మీరూ చదవండి.  మీకూ సుబోధకమవుతుంది. ఎందుకంటే జీవితమే కవిత్వమై, కవిత్వమే జీవితమై, అక్షరమై, బాసిస్తూ ఉంటాడు గనుక.  కావలసినన్ని ప్రతీకలు, భావచిత్రాలు, పదచిత్రాలు ఉన్నాయి ఇందులో.   వస్తు నవ్యత, ఆకట్టుకునే వినూత్నశైలి, నూత్న అభివ్యక్తి, సమతులాహారంలాంటి సమపాళ్ళ కవిత్వం  ‘మనిషి అలికిడి లేక.’  ఇది వారి నాలుగో పుస్తకం.  ఈ పుస్తకంలో మొత్తంగా అరువై ఏడు కవితలున్నాయి.  జీవితంలోని దాదాపు అన్నీ కోణాలు దర్శింపజేస్తాడు.

 ఎటు కదిలినా గుచ్చుకునే రాకాసి ముళ్ల మధ్య
 ఏ ఆచ్ఛాదనా లేని బతుకు తలపైన కురిసే
అకాల రాళ్ల వర్షాల నడుమ
మనిషన్నవాడు నిత్యం గాయపడటమే (రాకాసి ముళ్లు )

 వారు జీవితతత్వమెలా పట్టుకుంటారో  కవిత్వమే మనసు ప్రతిబింబంగా చూపుతుంది.  మనిషిన్న వాడు గాయపడుతూనే ఉంటాడు. ఆ గాయంలోంచి ఒక బోధ, ఒక అనుభవం రావాలి.  ఆ అనుభవం ఇతరులకు జ్ఞానం కలిగించాలనీ, తపనపడే కవిగా జీవిత సారాన్నిచెప్పుతాడు.   నిజాల ఇజాన్ని ప్రకటిస్తాడు కవి చిత్తలూరి.