కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద భూములు కోల్పోతున్న వారి త్యాగాల ప్రవాహాన్ని 'తేనె పట్టు' లో నిక్షిప్తం చేసిన డా. సిద్దెంకి యాదగిరి కవిత చదవండి. 

ఆకలి తీర్చే
మెతుకు పూల బోనమొండిన భూమి 
జగతి కూరాడు

తీరొక్క పూల పాదుల రమణీయం
చికిత్స చేసిన సంజీవని ఓషధుల సేకరణ
నాడిపట్టి ఒల్లంత స్కాన్ చేసే ప్రకృతి వైద్యం

తీర్తీరు పక్షుల కిలకిలల సంగీత సంగమం
జంతుజాల సమగ్ర జీవావరణం

కరువుల కలతలు తీర్చే చెరువులు, కుంటలు 
బంగారు తీగెల మెరుపులకలలు 
అలలై కదిలిన గొలుసుకట్టుతనమ్ 
పరిమళపు పరువులు నింపే సస్యరమ
సకల మతాలకు అక్షరాలు నేర్పి 
జ్ఞాన శిఖారాలను పేర్చిన బడి
‘వీసీ’ని అందించిన అక్షర విద్యాగంధం 

ఖిల్లగుట్ట ఆంజనేయడి లీలలు
మజీద్ సూఫీల తత్వ బోధన 
కరుణామయుని ప్రేమసుధల అంబుధి 
పాలూ నీళ్లలా ఊరుమ్మడి అమ్మతనం 
మూఢనమ్మకాలని నిరసించే హేతువులు 
కలుపుగోలుతనపు పరమత సహనం 

చర్నాకొలలై ఎగసిన ధర్నాలు
ఉవ్వెత్తున ఎగసిన ఊసిల్లు 
బంధ్ లన్నికబంధుడి బంధాలయిన ఐక్యత
ఒక్కొక్కటి ఒక్కో ప్రబంధం 
నినాదాలు కైగట్టిన పాటల పుట్టలు
భూ అంచులవరకు నిరసనాలంకారం 
పరిహారం కోసం మానవహారం

కల్పవల్లిలా దిగివోచ్చిన సింహాసనం 
పొట్లం కట్టిన నువ్వులూ బెల్లం
గుడికి గుడి 
బడికి బడి 
ఊరుకు ఊరు

వనమిడిసిన కోతుల్లా
ఊరుడిస్తున్న బతుకులు మోకాలుమంటి
అగాథంలో మల్లెల మమతలు జలసమాధా!
కాదు 
వారి త్యాగాలు వండివార్చే ఈ దేశపు దేకీసా 
రేపటికి కూడు పెట్టే పైరుశాల తెలంగాణ 
‘మల్లన్నసాగరు’డి భగీరాథాశయం
పాత పది జిల్లాల మట్టి నుదిటిపై 
ప్రవాహమవుతున్నత్యాగాల తేనెపట్టు వాగ్ధానం 
ముంపు వేములఘట్టు