ఒక ఉద్యమ జయపతాకం! వనపట్ల సుబ్బయ్య కవిత్వం!!

రాజకీయ శాస్త్రం లో ఎం,ఏ చేసి ఒక చేత్తో క్షవరాన్నీ ,మరో చేత్తో అక్షరాన్నీ ఆవాహన చేసుకున్న సమాజ సంక్షేమ  మంగళుడు ఈ వనపట్ల సుబ్బయ్య.

Dr Radheya writes on Vanapatla Subbaiah's Telugu poetry

రచయిత: డా.రాధేయ

"నాది కష్టజీవుల చెమట చుక్కల కుర్చీ నాకు రోడ్డు పక్కన గజం చోటు చాలు నాది తరతరాల నుంచి తుప్పు పట్టని తుమ్మ కుర్చీ 

నాకుర్చీ లో 
జనమంతా రాజులే
నాది ఆకలి తీర్చే ఆదెరువుకుర్చీ నాది బతుకు పోరాట కుర్చీ
నా కుర్చీ పేదవాడి చర్చి
నా కుర్చీమంగలి బాలయ్య స్వరూపం"
(కుర్చీ..పుట..119)

ఇది అధికార సింహాసనాన్ని సవాలు చేస్తూ శ్రమ జీవుల చెమట చుక్కలతో
ఘనీ భవించి,బతుకు పోరులో నిత్యం
ఆకలి కావ్యం రాసుకొంటున్న
ఓ కొయ్యకుర్చీ ధిక్కార స్వరం.

ఈ స్వరం మరెవరిదో కాదు.మంగలి బాలయ్య వారసత్వ కులవృత్తిని జీవిక గా నమ్ముకున్న కొడుకు సుబ్బయ్యది.

రాజకీయ శాస్త్రం లో ఎం,ఏ చేసి ఒక చేత్తో క్షవరాన్నీ ,మరో చేత్తో అక్షరాన్నీ ఆవాహన చేసుకున్న సమాజ సంక్షేమ  మంగళుడు ఈ వనపట్ల సుబ్బయ్య.

ఈ యనది బహుజన వాద మనుకున్నా,అస్తిత్వవాద మనుకున్నా
నా కెలాంటి అభ్యంతరం లేదు కూడా.

అంతే కాదు, తెలంగాణా అస్తిత్వ వాదం లో నిక్కచ్చిగా,నిజాయితీ గా తనదైన ప్రాపంచిక దృక్ఫథం వైపు నిలబడ్డ నాగర్  కవి కోయిల వనపట్ల.

అయితే ఈ కోయిల వసంతాన్ని నమ్మదు. ఋతువుల మోసాన్ని నమ్మదు,అధికార వ్యామోహం లో తన నేలకు మోసం చేసే పెద్ద మనుషుల్ని నమ్మదు.ఏండ్ల తరబడి దగా చేస్తున్న రాజకీయ ఊసర వెల్లుల్ని నమ్మదు.

"కులవృత్తికి సాటి రాదు గువ్వచెన్నా"అంటూ 18 వ శతాబ్ది లో ఓ శతక కారుడన్నట్లు,ఆనాడు గ్రామీణాభివృద్ధికి కులవృత్తులు పట్టుగొమ్మలై ప్రధాన పాత్ర వహించాయని చెప్పవచ్చు. 

1990 తర్వాత భారతదేశంలో ఆర్థిక సరళీకృత విధానాల వల్ల అన్ని రంగాల్లోనూ ప్రపంచీకరణ ప్రభావం ప్రత్యక్షంగా కనిపించసాగింది .దీని వల్ల మానవ సంబంధాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి.కుల వృత్తుల విధ్వంసం జరిగింది వాటిమీద అ ఆధారపడి జీవించేవారికి బ్రతుకు తెరువు పోయింది. 

అప్పులతో వలసలతో జీవితం కకావికలమైంది గ్రామీణ వ్యవస్థ ఛిద్రమై , వలసల పాలై పట్టణాల్లో జీవికవెతుక్కొంటుంది.ఇవాళ అదేశతకకారుడు జీవించి ఉంటే'కులవృత్తులు కూలిపోయే గువ్వలచెన్నా' అని ఆక్రోశించేది వాడేమో.

ఇక్కడ కవి ఉన్నత విద్యావంతుడైనా,0 తండ్రి వారసత్వ వృత్తిని తన జీవిక గా మలుచుకొని,ఒక గొప్ప ఆత్మవిశ్వాసం తో బతుకుతున్న కవి మిత్రుడు మన వనపట్ల సుబ్బయ్య.

ఈ కవి నా కంటే17 ఏళ్ళు చిన్నవాడైనా సుబ్బయ్య కవిత్వం నా కిష్టం,ఇతని ఆత్మవిశ్వాసం నా కిష్టం,తన ప్రాంతం వెనుకబాటు తనం పట్ల తన ఆవేదనా,ఆక్రోశం కూడా నాకిష్టమే.

ఎప్పుడు పుట్టాయో,ఎవరు చెప్పారో గానీ,ప్రతికులానికీ చిత్ర విచిత్ర మైన సామెత లుండేవి.అవి జానపదుల నోళ్ళలో సజీవంగా ఉండేవి.అవి లిఖితంగా ఉండవు.వాళ్ళ నాల్కల మీదనే ఉంటాయ్. చదువు రాని వాళ్ళు సైతం,ఎంతో సమయస్ఫూర్తితో,అనుభవ పూర్వకంగా చెబుతున్నట్లే ఉండేది.

అప్పట్లో (1982) నేను ఓ పల్లెటూరి హైస్కూల్ లో ఉపాధ్యాయుడి గా పనిచేస్తున్న కాలంలోనే మా ఉపాధ్యాయుల మధ్య మంగలి వృత్తి పట్ల ఒక సామెత చర్చనీయాంశమైంది
"పనిలేని మంగలి పిల్లితల గొరిగెను'.
ఇదీ సామెత, మంగలి వాడికి పని లేకపోయి,ఏమీ తోచక దారినపోయే 
పిల్లిని పట్టుకొని తల గోరిగి నాడట. ఇది ఎలా సాధ్యం?,పిల్లిని పట్టుకోవడమే కష్టం, దాన్ని మచ్చిక చేసుకొని వొళ్ళో కూర్చో బెట్టుకొని తలగొరగడం..ఆ మంగలి వాడికి కష్ట సాధ్యంకదాఅన్నారు.

అంతలో మా హెడ్ మాస్టర్ గారు జోక్యం చేసుకొని, అది కాదు మీరు పలకడం లోనే అపశృతి ఉంది.

"పని లేని మంగలి పిలిచి తల గొరిగెను"
అని ఉంటుంది."పిలిచి" అనే పదం రాను రాను వాడకంలో "పిల్లి" అయిఉంటుంది.
అని ఎంత బాగా వివరించాడో.. నలబై ఏళ్ళైనా ఇప్పటికీ నాకు గుర్తే. సందర్భం వచ్చింది గనుక గుర్తు చేశాను.

సమాజంలో ప్రతి వృత్తీ గౌరవప్రదమైనదే. ఏదీ ఎక్కువా కాదు,తక్కువా కాదు.1984 తర్వాత వృత్తి జీవనంలో బతికే వారి నందరినీ"బహుజనులు" అంటున్నారు. వీరు 85 శాతం ఉన్నారు.అగ్రవర్ణులు గా,ఆధిపత్య కులాలుగా 15 శాతమే ఉన్నా,వారే అధికారం చెలాయించడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం.

నేను గత దశాబ్ది కాలంగా వనపట్ల సుబ్బయ్య గారిని గమనిస్తూ ఉన్నాను.
వీరి భావాల్లో ఆర్తిని,ఆక్రోశాన్ని,గమనిస్తూ వస్తున్నాను.ఒక కవికి ఉండే నిబద్ధత,ఒక ఉద్యమ కార్యకర్త కుండే నిజాయితీ వీరి భావాల్లో ప్రస్ఫుటంగా కంపించింది నాకు. సకల జనుల సమ్మె తో కవిగా రంగ ప్రవేశం చేసి "వొల్లెడ"ను దీర్ఘకవిత వెలువరించారు.

1 వొల్లెడ..(సకల జనుల సమ్మె) 
దీర్ఘ కవిత ..2011

2 మాశాల్ (తెలంగాణా మహోద్యమ కావ్యం)..దీర్ఘకవిత..2014

3 ఊర చెరువు..దీర్ఘకవిత..2015

4 కుర్చీ( కవిత్వం)..2016

5 జనశంకరుడు..దీర్ఘకవిత..2017

7 తడి (కవిత్వం)..2017 

2011 నుండి 2017 దాకా అంటే ఆరేళ్లలో 7 కవితా సంపుటాలు తెచ్చాడు 

సబ్బండ కులాల సామూహిక  జన కేతనం..'వొల్లెడ' దీర్ఘకవిత (2011)

సబ్బండ శ్రామిక కులాల ,వారి వారి కులవృత్తుల పనిముట్ల స్వచ్చంద సహాయ నిరసన స్వరమే ఈ వొల్లెడ. దళిత బహుజన కులాలు కదను తొక్కుతూ సమైక్యంగా ముందుకు సాగడమే వొల్లెడ అంతరార్థం అంటాడు కవి. ఉత్సవాల్లో,శుభకార్యాల్లో,బోనాల్లో,తిరుణాల్లో బహుజనులు వారి తలలపై ఒక వస్త్రాన్ని నాలుగు చెరుగుల్లో నలుగురు చెయ్యెత్తి పట్టుకుంటే ఆ వస్త్రం కింద ఒక గుంపుగా సందడిగా,సామూహికంగా కదిలిపోవడమనే ఒక సంప్రదాయాన్ని మనం చూస్తుంటాం.

దీన్నే మా రాయలసీమ ప్రజల ఆచారం లో వొలిగం పట్టడం అంటాం.దీన్నే తెలంగాణాలో వొల్లెడ పట్టడం అనటం లో పెద్దగా నాకు తేడా అనిపించలేదు.

నలబై రెండ్రోజుల పాటు జరిగిన చారిత్రాత్మక సకల జనుల సమ్మెలో అసువులు బాసిన అమరవీరులకు,
నివాళులర్పించడమే ఈ వొల్లెడ అంటున్నాడు కవి.

"ఎర్రటి రుమాలు మెడలో శాలువా 
నడుం కు గంటలు భుజాన జోలెలు చేతుల్లో డమరుకాలు 
అంబ పలుకు జగదాంబపలుకు శారదాంబపలుకుసోనియమ్మఉలికిపాటుఅర్ధరాత్రే మేలుకొలుపు 
కంచు కంఠాలతో బుడబుక్కలు

పొద్దెక్కినట్టే 
పోటెత్తుతున్న జనం
అంబట్యాలకే ఉద్యమ వాగిడి.
సకల జనుల సమ్మె 
సాలులోతు ఉద్యమం
కమ్మటి మట్టి వాసన.
(పుట..20)

దీర్ఘ కవితకు,వస్తునిష్ఠ,తో పాటు ఏకసూత్రత ,సనుభూతుల్లో గాఢత ఉండాలి.చివరి దాకా కవిత్వ ధార కుంటుబడకూడదు.ఈ జాగ్రత్తలు తీసుకున్నాడు కవి.ఎక్కడా విషయాన్ని  పక్కదారి పట్టించలేదు. అక్కడక్కడా వచనంగా కొంతతేలిపోయినా,సామాజిక అంశాల్ని కవిత్వం గా మలచటంలో కవి ఫెయిల్ కాలేదు.ఉద్యమంతో మమేకమై ఉండటమే ఒక కారణం.

రాసుకున్న ఒప్పందాలు 
దోచుకునే ఫత్వాలు 
అంతరాలలో మంటలు 
కంచాలలో ఖజ్జురాలు 
ఆగని ఆకలికేకలే
సబ్బండ జాతుల ఊపిరి
(పుట..24)

ఎవరు విస్మరించినా, ఎవరు విభేదించినా సమన్యాయం, సామజిక న్యాయం పక్కదారి పట్టకుండా రాష్ట్ర పునర్నిర్మాణం లో ప్రధాన పాత్ర వహించడమే ఈ వల్లెడ ఆశయం గా పలికించాడు కవి.

"సకల జనుల సమ్మెలో 
సద్దుల బతుకమ్మలు 
శివసత్తులు ఒగ్గు కథలు 
పోతురాజుల పొలికేకలు 
జడకోపు కోలా టాలు
చిడుతల అడుగులు
తాళం మద్దెల భజన బృందాలు సబ్బండ కులాల సింగిడి
(పుట..35)

పోరాట దృశ్యాలను లైవ్ గా చూపడమే  మాట తప్పడం రాజకీయనాయకుల రాజనీతి కావచ్చు నేమో, మడమ తిప్పడం ఉద్యమకారుల లక్షణం కాదని నిరూపించిన దీర్ఘకావ్యమే.. వొల్లెడ
దీర్ఘకవిత్వ లక్ష్యం.

తెలంగాణా మహోద్యమానికి ఎత్తి పట్టిన కాగడా..మశాల్ (2014)

ఆకాశంలా అనంతమైన ఉద్యమంలో ఎలుగెత్తిన ఆత్మగౌరవ పోరాటమే వనపట్ల మశాల్ . త్యాగాలు,బలిదానాలతో రాజీ పడకుండా వీరుల త్యాగఫలాలకు అక్షర రూపమే ఈ సుదీర్ఘ కావ్యం.

ఆత్మగౌరవం
మాంసం ముద్దలైన మట్టి మీద
వెండి కిరీటాలు లేకపోయినా పర్వాలేదు మాకిప్పుడు మేమడిగిన 
పది జిల్లాల తెలంగాణనే కావాలి! అంటూ మొదలవుతుందీ కావ్యం..
వర్తమాన తెలంగాణా లో ప్రజలు ఎటువంటి పీడన అనుభవిస్తున్నారో,
వారి వేదనలో ఎటువంటి భవిష్యత్తుని కోరుకుంటున్నారో "మశాల్" కావ్యం లో తెలియ జేస్తుంది.కులాల ఆధిపత్యం కూడా ఉద్యమంలో భాగస్వామ్యమైంది. చరిత్రలో జరిగిన మోసాన్ని పదే పదే గుర్తుకు తెచ్చు కొంటోంది.

"అమరులు నడిచిన తోవల 
రాచరికపు రక్తపు పాదాలతో 
మీరు నడుస్తూ ఉంటే 
ఈ నేల కుంగిపోతున్నది 
మీ అమ్మ చేతిలోని బైబిల్ సాక్షిగా
మీ తండ్రి పోతిరెడ్డిపాడులో
దోచిన నీళ్ల సాక్షిగా ఈ
నేల అడుగుతున్నది 
ఇంకెన్నాళ్లు మా సమాధులు దాటుకుంటూ నడుస్తారని'
(పుట..88)

ఒక వైపు ప్రజాపోరాటాలతో,మరోవైపు మార్పులేని రెక్కాడితే డొక్కాడని బతుకుల పరిస్థితిలో, మరో వైపు ప్లోరైడ్ విషం చిమ్మే జలాలతో జనజీవనం అతలాకుతలం గాఉంది.తెలంగాణాలో ఏ బంతి పువ్వు నడిగినా మా బాధ తెల్పుతుంది అంటాడుకవి.

ఈ బంతి పువ్వు నడిగినా
బతుకమ్మ బాధ చెప్పుతది 
ఏ గరిక పొస నడిగనా
పాలమూరు గోస చెపుతది
న ఏ కన్నీటి చుక్క నడిగినా
కరీంనగర్ కథ చెప్పు తది
ఏ బంధం అడిగినా నల్లగొండ విషాదాన్ని చెప్పుతది 
(పుట..89)

కవి ఇది ఉద్యమ కావ్యం అన్నాడు గనుక.ఇందులో కవిత్వాన్ని మనం పెద్దగా ఆశించలేం.అందులోని భాష, భావం,అభివ్యక్తి,అన్నీ ఉద్యమ నేపథ్యం లోంచీ వచ్చినవే.

ఎక్కువగా రాజకీయ నాయకుల పైనా,ప్రాంతీతరులపై ఆక్రోశం,ఆగ్రహం,
నిందలు, శాపనార్థాలతో విరుచుకు పడే సందర్భాలే మనకు కనిపిస్తాయి.

పైగా ఈ కావ్యానికి పరిచయాలు, ముందు మాటలు రాసిన వారు కూడా రాజకీయ నేపధ్యంతో ,విశ్లేషించిన వారే.విమల గారు కూడా దీన్ని ఉద్యమ కవిత్వంగానే నిర్వచించారు.

కావ్యం నిండా రాజకీయ కామెంట్స్, స్టేట్మెంట్స్ కవిత్వాన్ని వచనం చేసి పలుచన చేశాయనిపించింది నాకు. అయితే ఒక మహోద్యమ తీవ్రత కుండే భాష తో భావ వ్యక్తీకరణను చక్కగా చేశాడు.

తెలంగాణా గుండె ఆత్మకథ.. 'ఊర చెరువు'..2015

చెరువు ఊరికి గుండెకాయ, చెరువు లేని ఊరు తల్లిలేని అనాథలా
బావురు మంటుంది. తెలంగాణా చెరువులకు ఒక గొప్ప చరిత్ర ఉందనీ,చేరువులన్నీ నీళ్లతో నిండితే సామాజికంగా అన్ని వర్గాలకు మేలు కలుగుతుందనీ, న్యాయం జరుగుతుందనీపాలకులకూ తెలుసు, కానీపట్టించుకోరు

ఆ చెరువులనే కబ్జాచేసి వాటిమీదే కాంక్రీట్ హర్మ్యాలు నిర్మించడమే తెల్సు. ఈ స్థితిలో కొత్త ఏర్పడిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కాకతీయ మిషన్ పేరిట చెరువుల్లో పూడికతీయడం మొదలు పెట్టింది ఆచరణాత్మక ఈ చర్యల పట్ల హర్షం ప్రకటిస్తూ కవి వనపట్ల సుబ్బయ్య ఇది సబ్బండ కులాల సింగిడి గా అభివర్ణిస్తూరాసిన దీర్ఘకవితే ఊరచెరువు. ఊరచెరువు తన వేదనామయ దీన గాథను మనతో పంచుకొంటోంది.

ఎండిపోయి
నీసు సువాసనొస్తుంటే 
ముక్కు మూసుకొని పోతిరి గాని
అయ్యో! మాకు బువ్వపెట్టిన కన్నతల్లని 
ఎవ్వడు విచారించలె
ఎవ్వడు మళ్లీ సూడలె
నేను చెదలు పడ్తుంటే
మీరు ఊరిడిస్తిరి 
నా పిల్లలనుకున్న మీరంత
ఆనాడే పట్టించుకుంటే 
నాగతి ఇట్లెందుకుంటది ఇట్లెందు కైతది
మీరు గాక నాకె రున్నరు 
నేనున్నది మీ కోసమే గదా 

నా కట్టమీదనె జమ్మిచెట్టు 
తల నిండా కలువలు 
మువ్వల హారంలా సింతోలకాయలు

పొట్టనిండా నీళ్లుంటే 
పేరుగోలె మడి కట్లు!
పిట్టలు గూళ్ళుకట్టుకొని 
నా ఒడ్డు మీదనే కాపురాలు 
ఏ మూల చూసినా గాలాలె 
చూపులన్నీ బెల్ల మీదనే

పొట్టనిండా నీళ్లుంటే 
పెరుగోలె మడికట్లు 
మడికట్లకు బింకె మొస్తది 
లుంగలు లుంగలు గా వరి
మునుం మునుం కో జానపదం

నా నిండా నీళ్లుంటే 
కడుపునిండా సేతానం 
ఇంటి నిండా వడ్లు 
కడుపునిండా బువ్వ
కంటినిండా నిద్రుండే
మీ కడుపెప్పుడైనా మాడ్చినానా
మీ కన్నా నాకెవరెక్కువ 
నేనెవరికీ తలవంచలే 
వొంగి వొంగి దండాలు పెట్టలే
నేనెప్పుడూ పార్టీలు మారలె..
పుట..29

ఇలా ఊరచెరువు ప్రజల నిర్లక్ష్యానికి, పాలకుల నిరాదరణకు గురై ఉన్న దీనదశను మనతో చెప్పుకుంది.

ఇంతలో రాష్ట్రం సొంత మైంది.పాలక పగ్గాలు చేతికొచ్చాక కొత్త పాలకులు ముందుగా చేపట్టిన చెరువుల పూడిక పథకమే "కాకతీయ మిషన్"

ఈ చర్యతో చెరువుల గర్భ శుద్ధి జరిగి స్వచ్చంగా నవ్వుతూ,జలకళ 
సంత రించుకున్నాయని ఇక్కడ కవి పాలక పక్షాన్ని కీర్తిస్తున్నాడు .కాకతీయ మిషన్ ఆపరేషన్ తర్వాత నవ్య ప్రాభవం  సంతరించుకున్న ఊర చెరువు ఇలా అంటోంది..

హరిత తెలంగాణకు 
ఆకు రాయి సాన 
మిషన్ కాకతీయ
దేశానికే తలమానికం
గ్రామ వికాసానికి పునాది
గ్రామ సౌభాగ్యానికి అనాది చెరువు చెరువు 
చల్లని సముద్ర గర్భం 
వాగులు పాల ధారలు 
వడ్డేపల్లి గట్టుపైఇరవై అడుగుల పైలాన్

కవిత్వానికి వస్తువులా
దీపానికి సమురులా
యుద్ధానికి బాణంలా 
సదువుకు బడిలా
మనిషికి కిడ్నీలా
బండికి ఎడ్ల లా
శరీరానికి రక్త ప్రసరణలా
వ్యవసాయానికి చెరువు 

తెలంగాణ తల్లి 
తొలికోడి కూసింది 
తుడుం మోగింది 
తప్పెట్ల తీన్మార్ లతో
కొమ్ములు స్వాగతం 
చెరువు గట్టు మీద
సూర్యుడు పొద్దెక్కు తున్నడు 
మన ఊరు 
మన చెరువుల సంరక్షణకై 
కదంతొక్కి కదులుతున్న మిషన్ కాకతీయ అలా అడుగులేస్తూ ప్రజలంతా చేయి చేయి కలిపి 
చెరువులే తోడితే
కాకతీయుల కాలంనాటి కాలువలే వస్తయి 
బంగారు తెలంగాణ బాటలే పడ్తయి తెలంగాణతల్లి కోటికాంతులై వెలుగుతది... 
( పుట.. 71)

ఇలా ఊర చెరువు దీర్ఘ కవిత ఆత్మకథాత్మక కావ్య గానంలా సాగిపోతుంది,ఎక్కడా విసుగని పించదు. విరామం తీసుకోవాలనిపించదు. చెరువులతో గ్రామాలకున్న అనుబంధం,గ్రామప్రజలకున్న ప్రేమాను బంధాలూ అన్నీ సహజాతి సహజంగా కవిత్వమై పలికించాడు కవి.

అయితే ఇక్కడ కవి సర్కారు పథకానికి కవిత్వ ప్రచారకుడు
పనిచేశాడు.ఈ కావ్యానికి ముందు మాటల్లో పాలకులే ప్రధాన పాత్ర వహించారు.నిజమే ప్రభుత్వం ప్రజాపయోగ కార్యక్రమానికి పూను కున్నప్పుడు సమర్థించవలసిందే.అయితే అందులోని లోపాలను కూడా ఎత్తి చూపవలసిన బాధ్యత కూడా కవులదే. పురాణ వైభవాన్ని కీర్తించడం, గత పాలకుల్ని నిందించడమే ధ్యేయంగా పెట్టుకోకూడదు.కవి ఎల్లప్పుడూ ప్రతిపక్ష పాత్రవహిస్తూ,ప్రజలకు,పాలకులకుమధ్య సమన్వయకర్తగావ్యవహరించాలి.

ఎందుకంటే తెలంగాణ లో జరిగే అన్ని ఉద్యమాల్లో కవులుకళా కారులే కీలక పాత్ర పోషిస్తారనేది నగ్నసత్యం.

బహుజన జీవన సమరానికి  సాక్ష్యంగా నిల్చిన ...కుర్చీ (2016)

తెలంగాణా ఉద్యమమే నన్ను కవిగా మలిచిందనీ,దళిత బహుజన భావజాలం నాకు స్ఫూర్తి నిచ్చిందని నిజాయితీ చెప్పుకుంటున్న కవి వనపట్ల సుబ్బయ్య  2016 లో "కుర్చీ" కవిత్వాన్ని ప్రకటించాడు.

ఇక్కడ కుర్చీ తన వృత్తికి మూల విరాట్టుగా,నిత్యం తనజీవన పోరులో చేదోడు గా భావించుకున్నాడు కవి. 

ఇందులోని మొదటి కవితలో భూమ్మీద తంగేడు పూలు బతుకమ్మ'కు ప్రతిరూపంగా, తెలంగాణా తల్లికి కిరీటంగా, యుద్ధంలో గెలిచిన తెలంగాణ పువ్వుగా భావిస్తాడు కవి

రోహిత్ మరణాన్ని గురించి చెబుతూ.. అతనిది ఆత్మహత్య కాదు హత్య చేయబడ్డాడు భారతంలో కర్ణుని లా చంపబడ్డాడు అని ప్రకటించాడు కవి.

సమ్మక్క సారలమ్మలు నేటి అస్తిత్వ పోరాటాలకు నడకనేర్పినవీర మాతలుగా కొనియాడతాడు కవి.

మరొక కవితలో వట్టికోట ఆళ్వార్ స్వామి స్మృతిలో..

వట్టికోట త్యాగం బహు గొప్పది
ఒక వృక్షం 
వేల ఫలాలకు పురుడు పోసి 
సమాజం ఆకలి తీర్చుతే
ఒక మగ్గం 
కోట్ల తానుల బట్టలు వేసి 
నాగరికతకు నాంది పలికింది 
ప్రజల మనిషి నవల తో 
ప్రజల భాషకు 
దండ కడెం తొడిగిండు..
పుట..39

చెట్టుకు మరణమే లేదంటాడు కవి.
బహుజన శ్రేయస్సుకై బరిగీసి నిలబడ్డ
కొండాలక్ష్మణ్ బాపూజీకి. నివాళులర్పిస్తాడు.

వీర తెలంగాణా కి నగారా, విముక్తి ఉద్యమాలకు ఆయువు పట్టు, నేటి తెలంగాణా మహోద్యమానికి అస్తిత్వ పతాక మైన త్యాగమూర్తి చాకలి ఐలమ్మ ను స్మరించుకుంటాడు కవి.

బహుజనుల బోనాల పండుగను మన కళ్ళముందు నిలుపుతాడు.గోల్కొండ ఖిల్లా సాక్షిగా బోనం బహుజనులదే నని ధీమా ప్రకటించాడు...

"బువ్వలేనమ్మ నే
తెలంగాణ మహోద్యమానికి 
బోనం వండింది 
రేపటి బహుజన రాజ్యాధికారానికి బహుజన బోనం వండే
బహుజన వీరమాతలు కావాలి బహుజన యోధులు నడుం కట్టాలి రేపటి గోల్కొండ ఖిల్లా మీద 
బోనం బహుజనదే...
పుట..55

నడవాలి,కాలం తో పాటు నడవాలి,లాంగ్ మార్చ్ లా నడవాలి,వెయ్యి మైళ్ళ ప్రయాణ మైనా
ఒక్క అడుగు తోనే మొదలు పెడదాం అంటున్నాడు కవి.

చరిత్రలో చావిడి జ్ఞాపకాన్ని పదిల పర్చుకుంటాడు.అమ్మలాంటి భాషను "అమలాపురం" చేసి,కించపర్చిన చలనచిత్ర కమర్షియల్ బిజినెస్ ని తీవ్రంగా ఎండగట్టాడు కవి.

తెలంగాణా రాష్ట్రవ్యతిరేకంగా పని
చేసిన అగ్రవర్ణ ఆధిపత్యాన్ని,కుల
సంస్కృతిని నిగ్గదీసి ప్రశ్నించాడు.
బస్సు ప్రమాదంలో అసువులు బాసిన పాలమూరు జానపద కళాకారులకు శ్రద్ధాంజలులు సమర్పించాడు

విశ్వనరుడు జాషువాకు అంజలి ఘటిస్తాడు.విశ్వ దార్శనికుడు డా.కత్తి పద్మారావు కు ఉద్యమ వందనాలు చేశాడు కవి.

66 కవితలున్న ఈ 'కుర్చీ' కవిత్వం బహుజన కవిత్వానికి బాసట గా నిల్చింది. తెలంగాణా మహోద్యమ కెరటాలు గా నినదించింది.

నీటి స్వప్నం లోంచీ భావోద్వేగ "తడి"(2017)

నీళ్ళే జనజీవనం,నీళ్లే సంపద, నీళ్ళే నాగరికత ,నీటి తడి లేకుంటే నేల కైనా,మనిషికైనా జీవనం లేదు.మన చారిత్రక, సాంస్కృతిక మలుపులన్నీ నీటి కథలే తెలియ జేస్తాయి.

అలాంటి నీటి వనరులు లేని రాష్ట్రంలో జీవిస్తూ ప్రకృతి విలయం,పాలకుల నిర్లక్ష్యం తో కళ్ళముందే బావులు చెరువులు, ఎండిపోయి పాలమూరు వలసలతో కడుపు దహించుకు పోతుంటే కొత్త ప్రభుత్వం పూనికతో చెరువుల పూడిక తీత వల్ల జలకళ మెరిసింది కవి గుండె తడిసింది.తడి లోంచీ కవిత్వం పెల్లుబికింది...

చెరువులు కొత్త బట్టలు కట్టుకుంటుంటే దిక్కుతోచని మొండి చేతులు 
దుమ్మెత్తి పోస్తున్నవి  మిషన్ భగీరథలు ఇంద్రధనస్సులై తుంటే 
మొలల్ల ఉరుములు దిగుతున్నయి కుండలల్ల కూడుడుతుంటే 
కండ్లు కారాలు చిమ్ము తున్నయి 
నిలబడి గెలవ నోన్కి 
గర్క నిలిచిన అసహనమే
పుట..21

నేల విముక్తి కోసం దోసెడు నీళ్లను కలగన్నానని,గుడిపల్లి రిజర్వాయర్ నీటిని వదిలినప్పుడు ఆనందంతో  పరవశించి పోయాడు కవి.
రెండు చినుకులు రాల్తే ప్రాణం పులకిస్తుందనీ,కవిత అచ్చయినంత తృప్తి కలుగుతుందని కవి సంతోష పడుతున్నాడు.

అమ్మలా ఆడించి,పాడించి జోకొట్టి జోల పాడిన తన ఊరివాగును తలుచుకుంటాడు కవి. పాలమూరు నదితో ముచ్చట్లాడుతాడు కవి.

మనిషికి ఏం కావాలి
నీళ్లు కావాలి
మనిషి ఓడిపోవట మంటే
నీళ్లు లేకపోవటమే 
చారెడు వడ్లు కండ్ల జూడాలని
పుట్టెడు వడ్లుబండి ఇంటికి రావాలని నీళ్లు ఎదురొస్తే ఎంతానందం
తల్లి ఎదురొచ్చినంత ఆనందం బిడ్డలు కనిపించినంత మహానందం

నీళ్లను చూడగానే 
బతుకమ్మను చూసినంత ఆనందం 
'నీరు పల్ల మెరుగు' లాగా 
నీరున్యాయ మెరుగు అనేవి 
సార్వత్రిక సత్యమై ఉంటే 
ఎంత బాగుండన్న
బాల గోపాలు మాటలు 
మనకెప్పుడూ బోధపడలే

వేలవేల స్వప్నాల
లక్షలాది ఆకాంక్షల 
ఆశలకు సంకేతం
తరతరాల జీవితాలకు 
వెలుగు బాటలు నీళ్లే..
పుట..81

ఈ పుస్తకం పేరు తడి అన్నమాటే గానీ కుర్చీ కవితా సంపుటికి పొడిగింపుగానే  అనిపిస్తుంది. గత పాలకుల రాజకీయ వివక్షలు,ద్రోహాలు, కొనసాగింపుగా ఉన్నాయ్.

తెలంగాణా దిశా నిర్దేశకుడు- జనశంకరుడు (2017)

తెలుగు ప్రజలకు తల్లులు ఇద్దరు. ఒకరు తెలుగు తల్లి, మరొకరు తెలంగాణా తల్లి. అలాగే దేశానికి జాతిపిత గా గాంధీని కీర్తిస్తే,తెలంగాణా రాష్ట్రపితగా  జయశంకర్ ను ప్రతిపాదించారు తెలంగాణా సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి గారు అంతే కాదు రాష్ట్ర సిద్ధాంత కర్తగా,కూడా గౌరవించారు 

ఈయన స్మృతిలో కవి వనపట్ల సుబ్బయ్య గారు "జనశంకరుడు" శీర్షికతో దీర్ఘ కవితను రాశాడు.

మట్టిని ముద్దలు చేసి 
ఆశయానికి ఆయువు పోసి
వికాసాన్ని బోధించి 
అగ్గి రవ్వల చేసిండు

పాయలు
పాయలైన కాలువల్ని
మైదానాలకు మళ్ళించి
జనసంద్రం చేసిండు...అంటూ మొదలు పెడతాడు కవి

అతను నడిచిన అడుగుల నిండా
తంగేళ్ళ వనమే 
అతని మనసు నిండా 'వట్టి కోటలే' తెలంగాణ రంగవల్లులే
గట్టు కూలి కట్ట తెగినా
అవమానాలు నిర్బంధాలుప్పొంగినా అతని భుజాల మీద తెలంగాణ జెండా సునామొచ్చినా, చుక్కలు రాలినా తెలంగాణకై అతనిది 
వొడువని యుద్ధమే
కన్నీటితో తల్లి పాదాలు కడిగి కుప్పగూల్చిన కలల్ని 
జయకేతనం ఎగరేసిన అజేయుడు మన జయ శంకరుడు..
పుట..26
అంటూ ఆయన ను తమ ఆత్మ గౌరవ పతాక గా కొనియాడతాడు కవి.కావ్యముగింపులో ఆయన కలగన్న ఆశయం నెరవేరి స్వరాష్ట్రం సిద్దించక 
ముందే ఆ మహనీయుడు అమరుడు కావడం పట్ల కవి తల్లడిల్లి పోయి
కవి గొంతు ఆర్ద్రమైంది.ఈ కవితా వాక్యాలు చదివితే ఎవరైనా కన్నీళ్ళతో
వణికి పోవాల్సిందే...

అరవై ఏళ్ల ప్రయాణములో 
ఆశయం అంకురించక ముందే అస్తమించిన సూర్యుడు 
చాణక్యుడు బోధించిన 
చంద్రగుప్తులు గెలువకమునుపే అంతరించిన చిరంజీవుడు

అతను 
గురితప్పని ఏకలవ్యుడు 
వెన్ను చూపని వాలి
కావడి దించని శ్రవణుడు 
వాదాన్ని వదలని జయశంకరుడు

మార్క్సిజానికి కారల్ మార్క్స్ 
స్వామ్య వాదానికి లోక్ నాయక్ లా ప్రజాస్వామ్య వాదానికి నెహ్రూలా సామాజిక న్యాయానికి పూలే
అంబేద్కర్ లా 
తెలంగాణా కు జయశంకర్
అజేయుడు జన శంకరుడు..
(పుట..65)

అంటూ చాలా అద్భుతంగా, ఆర్ధ్రంగా, గద్గద స్వరంతో పలికాడు కవి.
తెలంగాణా వాదానికి ఆయనెంత సూత్ర దారుడో, అందుకోసం ఆయనెంతగా శక్తి వంచన లేకుండా పరితపించాడో, వారి స్మృతిలో ఈ కావ్యాన్ని అంతే చిత్తశుద్ధితో గౌరవించి వారికి అంజలి ఘటించాడు ఉద్యమ కవి వనపట్ల సుబ్బయ్య గారు.

కరోనామరణ మృదంగం- సెల్ఫ్ లాక్ డౌన్ (2020)

ప్రపంచదేశాలనే వణికిస్తున్న ఒక ప్రాణాంతక వైరస్ మొదట చైనా సమస్యగా నే గుర్తించబడి అతి స్వల్పకాలం లోనే యావత్ ప్రపంచ దేశాలనే తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. ఒక కంటికి కన్పించని శత్రువు ప్రజల జీవితాలనే అతలా కుతం చేస్తోంది.వర్తక,వాణిజ్య,సామాజిక జీవనం కుప్పకూలిపోయింది.కళ్ళముందే విద్వంసం జరిగిపోతోంది. సామాన్యుడు మొదలుకొని శ్వేతసౌధం అధిపతిదాకా ఎవర్నీ వదిలే ప్రసక్తి లేదని నిరూపిస్తోంది.

ఎందరో మేధావుల్నీ,కవుల్నీ, కళా కారుల్నీ ,మంత్రుల్నీ, రాజకీయ నాయకుల్నీ పొట్టనపెట్టుకుంది.తెలుగు నాట అమరగాయకుణ్ణి తన వెంట తీసుకు పోయింది. 

ఈ నేపథ్యంలోంచీ కవులు కళాకారులు 
తమ కవిత్వాలతో,పాటలతో ఈ మహమ్మారి కోరల్లో బడి అంతం గాకుండా ప్రజల్ని చైతన్య వంతుల్ని చేస్తున్న క్రమంలో సెల్ఫ్ లాక్ డౌన్ అక్షర సైన్యం తో మన ముందుకొచ్చిన కవి 
వనపట్ల సుబ్బయ్య గారు.

కల్లోల స్థితిలో చారిత్రక మలుపులో 
ఒక్కడై నిలబడి అందర్నీ జాగృత పరుస్తున్న ఈ కవిని మనసారా అభినందిద్దాం రండి.

ఈ మహమ్మారి దాడి లో ప్రాణాలు విడిచిన,ప్రజా గాయకుడు నిస్సార్,
ఉద్యమాల సూర్యుడుఉ.సాంబశివరావు కు కన్నీటి నివాళులు అర్పించాడు కవి.

ఇవాళ ఇల్లు,ఊరు,రాష్ట్రం, దేశ ప్రజలంతా కోడి రెక్కల కింద తల దాచుకునే పిల్లల్లా ఉన్నారనీ,ఇక క్రీస్తు పూర్వం గాదు, కరోనా పూర్వం గా బతుకు తయారైందని వాపోతున్నాడు కవి.
ఒకనాడు నమస్తే అంటే 
రెండు చేతులతో దండాలు 
చేతికి చెయ్యి కలపక పోవడమే 
ఆనాటి ఫ్యూడల్ ఆదర్శం 
నేడు 
చేయికి చేయి కలిపితే అనారోగ్యం
ఇది కరోనా కాలం.
(పుట..57)

దేవుళ్ళు తలుపులు మూసుకొని గర్భగుడిలో కూర్చున్నారు.పండుగలు లేవు,పెళ్లిళ్లు లేవు,బళ్లులేవు, సరదాలు లేవు,సంబరాలు లేవు,అసలు బతుకు తెరువే భారమైపోయింది.

ఇప్పుడు శత్రు దేశంపై 
గెలవడమే యుద్ధం కాదు 
మనపై మనం గెలవడమే 
మూడో ప్రపంచ యుద్ధం 
అందరి యుద్ధం కరోనాపైననే 
నాదిప్పుడు 
మైదానంలో యుద్ధం కాదు 
ఇంట్లోనే కనిపించని మహమ్మారిపై యుద్ధం 
నా మీదనే నా యుద్ధం 
గౌతమ బుద్ధుడిచ్చిన ఆయుధం
(పుట..72)

ఈ స్థితిలో జీవదాతలైన డాక్టర్లు,నర్స్ లకు వందనం చేస్తాడు.పారిశుధ్య కార్మికులకు పదాభివందనాలు చేస్తాడు  కవి. పూట గడవని కార్మికులు, వృత్తి పనివాళ్ళు,దిన కూలీలు బతుకులు రోడ్డున పడ్డాయి.

బతుకు లేక రోడ్డున పడితే 
రోడ్డు బతుకులే 
మా పూట బతుకులైనవి
ఆరోడ్డే బందయింది 
ఆ రోడ్డే లేకుంటే మా బతుకు లెట్ల 
రోడ్డు ఆకలి గీతం పాడుతున్నది 
బతుకు దుఃఖ గీతం పాడుతున్నది
(పుట..159)

ఇలా ఇందులోని 56 కవితలన్నీ కరోనా నేపథ్యం లోంచీ సాగుతాయి.

వనపట్ల సుబ్బయ్య గారి కవితా ప్రస్థానాన్ని స్థూలంగా పరిశీలించినపుడు
గత పదేళ్లుగా వారి కవితా ప్రస్థానం కొనసాగుతూ వస్తోంది.

ఈపదేళ్ల లో ఎనిమిది కవితా సంపుటాలు వచ్చాయి.ఇందులో మూడు దీర్ఘ కవితా సంపుటాలు.

"తెలంగాణా ఉద్యమమే నన్ను కవిగా తీర్చి దిద్దింది" అంటున్న వనపట్ల సుబ్బయ్య లో కవిని పక్కన బెట్టి ఒక ఉద్యమ కార్య కర్తను చూడాలి.వీరికి ఆవేశం పాలు ఎక్కువ.కవిత్వం లో భావనా బలం కంటే భావోద్రేకమే
ప్రధానంగా వినపడుతోంది. 

ఒక్కోచోట ప్రాంతీయ దూషణల్లో  ఈ ఉద్రేకం పతాక స్థాయిని చేరిన సందర్భాలు కూడా వీరి కవిత్వం లో కనపడతాయి. ఒక ఉద్యమ కార్యకర్త తన ప్రాంతం పట్ల ప్రేమ,తన నేలపట్ల ఎంతగా మమేకం అవుతాడో, వీరి కవిత్వమే పట్టిస్తుంది. తన వృత్తి, జీవనంలో ఒక గొప్ప ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది.

కవిత్వం చదువుతున్నంత సేపూతిట్లు, శాపనార్థాలు, ద్వేషం, కసి ప్రస్ఫుటంగా కన్పిస్తుంది. చారిత్రక అనుభవాలు, గాయాలు,వైఫల్యాల గురించిన వాస్తవాలున్నాయ్.

ఈ కవి మనతో ఎలా మాట్లాడుతాడో కవిత్వం లోనూ ఎలాంటి ముసుగులూ దాపరికం లేకుండా అంతేస్పష్టంగా మాట్లాడుతాడు. మన రాజ్యాంగ వ్యవస్థలో రాజకీయ తీర్మానాలూ,రాసుకున్న ఒప్పందాలూ వేర్వేరుగా ఉంటాయ్. అవే రానురాను ప్రాంతీయ అసమానతలకు దారితీస్తూ ఉంటాయ్.

ఇందులోఆయా ప్రాంతీయ రాజకీయ శక్తులు అభివృద్ధికి అడ్డుపడుతూ విభజనోద్యమాలకు ఆజ్యం పోస్తూ ఉంటాయన్నది గత అరవై ఏళ్లుగా అవిభక్త ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే జరిగింది. అటు తెలంగాణా, ఇటు రాయలసీమ ఇదే వివక్షకు గురైంది.రాజీలేని పోరాటంలో ముందున్నారు కాబట్టి అధినేతల మెడలు వంచి రాష్ట్రం సాధించుకున్నారు. అందుకు మేమంతా అప్పనందించాం, అభినందించాం. నాలుగు జిల్లాల సీమ పరిస్థితి తాగునీరు,సాగునీరు కరువైన నేల మాది. రాయలసీమ వాళ్లే ముఖ్యమంత్రులైనా
మా బతుకుల్లో ఏమాత్రం మార్పులేదు.

ఎప్పుడో అయిదు వందల ఏళ్లక్రితం కృష్ణదేవరాయలు కేవలం 20 ఏళ్ళు పరిపాలిస్తే అది ఒక స్వర్ణయుగం గా ఇప్పటికీ ఆయన పేరే చెప్పుకుంటూ బతుకుతున్నాం తప్పఇన్నేళ్లు గడిచినా మా బతుకుల్లో అభివృద్ధి రాలేదు.మా గోడు ఎవరితో చెప్పుకోవాలి? 

దేశంలోనే అత్యల్ప వర్ష పాతం గలజిల్లా 
అనంతపురం.గడచిన వందేళ్ళ లో 66 కరువులు చవిచూసిన జిల్లా.
"రాయల సీమలో వ్యవసాయం కంటే
రాజస్థాన్ ఎడారి లో సేద్యమే నయం"
అన్నడొక మహానుభావుడు.

శ్రీకృష్ణ కమీషన్ సైతం ..
తెలంగాణా కంటే దయనీయ దుర్భిక్ష ప్రాంతం రాయలసీమ జీవితం అని వ్యాఖ్యానించడం అందరికీ తెల్సిన విషయమే..

మీ ప్రతి కవితలో,ప్రతి వాక్యంలో సీమాంధ్రుల పట్ల నిందారోపణలే కన్పిస్తాయి.మా సీమ జనజీవితంలో కూడా వాస్తవ కోణం చూడాలి.
2003 లోనే నేను రాయలసీమ జనజీవితమే వస్తువుగా "క్షతగాత్రం"
రాశాను.ఇప్పటికి 17 ఏళ్ళు గడిచినా
మాపరిస్థితి లో మార్పులేదు.

మా అప్పులేమో ఊట బావులు
మా ఆదాయం ఎండమావులు 
మా రెప్పల కింద జలాశయాలు
మా రెక్కల కింద అగాధాలు

నాగేటి చాళ్లలో ధార పోసిన స్వేదం
మట్టి పుట్టి ఇళ్లలోఇంకిపోయి 
అగ్ని శ్వాసమారి పోతున్నప్పుడు 
ఈ గుండెల్లో గునపాలు దించినంత దుస్సహమైన బాధ
మట్టి పొరల్లోంచీ అంకురం మొలకెత్తుతున్న ప్పుడు 
తప్పి పోయిన మా పిల్లవాడు
మా ఇంటికి చేరుకున్నంత ఆనందం 
కంకి మీద గింజ కనిపిస్తే చాలు 
మాఅర చేతుల్లోకి అన్నం ముద్ద చేరినంత సంతోషం 
ఇది పిరికివాడి స్వర్గం 
శరణార్ధుల శిబిరం 

ఇది ఎండిన నేల 
ఎడారి ఉపరితలం
మా సీమ జన జీవితం
జీవరసం ఇంకిపోయిన మట్టి చరిత్ర
నేతల నిర్లక్ష్యం చూపుల్లోంచీ 
జారిన గాజుపాత్ర

ఇది ఎండిన నేల
ఎడారి ఉపరితలం
(రాధేయ-క్షతగాత్రం-2003)

వనపట్ల సుబ్బయ్య గారి రాష్ట్రభక్తి,ని నేను మనసారా అభినందిస్తున్నాను. కవిగా నిబద్ధుడు. ఉద్యమ కారుడి గా తీవ్రవాది. ఇవాళ సోకాల్డ్ మార్క్సిస్ట్ మేధావుల కన్నా కార్యాచరణం ముందు నడిచే కవితా సైనికుడు అనడం లో నా కెలాంటి అభ్యంతరాలూ లేవు.కవికి ప్రతిభ ముఖ్యంగానీ ప్రాంతం,కులం, వర్గం ముఖ్యం కాదని నా నమ్మకం. నేను ఈ మాటమీదే నిలబడి గత 32 ఏళ్లుగా నేను ఇస్తున్న ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డుల్లో పదిహేను మంది తెలంగాణ కవులే స్వీకరించారని గుర్తు చేస్తున్నాను. 'విశ్వనరుణ్ణి నేను' అని జాషువా సగర్వంగా ప్రకటించుకున్నాడు.

అందుకే వనపట్ల సుబ్బయ్య ను నేను ప్రాంతాల కతీతంగా సోదరుడిగా ప్రేమిస్తాను, కవిగాఅభిమానిస్తాను. తెలంగాణా మహోద్యమంలో వారి కవిత్వ చిత్తశుద్ధిని అభినందిస్తున్నాను

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios