డాక్టర్ పోరెడ్డి రంగయ్య కవిత: కొత్తదనం

కొత్తదనం కోసం తపిస్తున్న డాక్టర్ పోరెడ్డి రంగయ్య కవిత ఇక్కడ చదవండి.

Dr Poreddy rangaiah Telugu poem, Telugu literature

తల 
ఎంతగా గోక్కుంటే 
ఏం లాభం!
ఒక్క భావ శకలమైన
రాల్చనపుడు!

అడుగులు అవిశ్రాంతంగా
ఎన్ని లోయలు శిఖరాలు
దాటితేనేం!
లక్ష్యమే దారి తప్పినపుడు!

ఉక్క పోతంటూ
గగ్గోలు పెడితే 
స్వేదం ఆవిరవుతుందా!
గది తలపులే కాదు, 
విచ్చుకోవల్సింది
మది  రెక్కలు కూడా.

గోళ్ళు కొరుక్కున్నంత మాత్రాన
ఆశయం రూపు కడుతుందా!
ఆలోచన మొలకెత్తినపుడే కదా
పచ్చదనం నీ చిరునామయ్యేది.

కూచున్న చోటే ఎంతకాలం!
విసుగు దోస్తీ కడుతుంది.
ఒక్కసారి మారి చూడు
అలసత్వం తోక ముడిచి
 ఆశ చిగురు తొడుగుతుంది

విన్న మాటలే
ఎంతకాలం వింటాం!
చెవులు నిరసన జెండా 
ఎగరేస్తుంటే.
 శ్రవణం కొత్త దుస్తులు తోడగాలి
ఎప్పటికప్పుడు.

కొత్తదనం అంటే
కొండ నాలుకకు మందు ...కాదు.
ఎప్పుడూ చూస్తున్న పొద్దు కాదు
ఉదయం నీ హృదయం కావాలి.
 ఆ హృదయం   ఉదయించాలి కొత్తగా.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios