అది రాత్రికి అర్ధరాత్రికి మధ్యకాలం. పట్నం రోడ్లే కాదు మనుషులు కూడా సగం జనాభా నిద్ర పోలేదు. నైట్‌షిప్ట్‌ ఉద్యోగాల వల్ల కొందరు, వారిని గమ్య స్థానాలకు చేర్చాల్సిన...డ్రైవర్‌ ఉద్యోగాల వల్ల కొందరు, అపార్ట్‌మెంట్‌లకు కాపలా కాయడం వల్ల సెక్యురిటీ గార్డులు మరికొందరు నిద్రలేని రాత్రుల్ని గడుపుతున్నారు.

ఇంకా వాహనాల రొద సద్దుమణగలేదు. ఇలాంటి రాత్రి వేళ, ఎప్పటిలాగే పుస్తకం చదువుతూ నిద్రను మరికొంత సేపటికి వాయిదా వేసుకున్నాడు సూర్యం.

సూర్యానికి ఇది అలవాటే. అందుకే సూర్యాన్ని పుస్తకాల పురుగంటరు తోటి ఉద్యోగులు. ఏ కొత్త పుస్తకం వచ్చినా వెతికి వెతికి కొనుక్కొని చదువుతాడు. ఐడియాలజీ, ఫిలాసఫీ, లిటరేచర్‌ ఏదైనా సరే తనకు కొట్టిన పిండే. కూలినాలి చేసుకునేటోల్ల ఇంట్ల పుస్తకాలు ఎందుకుంటయి? ఈ విషయం సూర్యానికి కూడా తెలుసు. తనకు పుస్తకాలు చదవడం ఎట్లా అబ్బిందో వెనక్కి తిరిగి చూసుకుంటే తనకే ఆశ్చర్యం కలుగుతది.

....... ........ .......

చిన్ననాటి నుండి చదువులో సూర్యమే ముందుండేవాడు. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు ఊరిలో ఉండే గవర్నమెంట్‌ స్కూల్‌లో టీచర్స్‌ డే. అందుకే స్వయంపాలన దినోత్సవంనాడు తన తోటివారు తీసుకోవడానికి సాహసం చేయలేక వదిలేసిన ఇంగ్లీష్‌ సబ్జెక్ట్‌ను తానే బోధిస్తానని యిష్టంగా తీసుకున్నాడు. పైగా తనకు బాగా యిష్టమైన సబ్జెక్ట్‌ కూడా అది.

సూర్యం ఎప్పుడూ అంతే ఊరందరిది ఒక దారైతే ఉలిపికట్టెది మరో దారి అన్నట్టు అందరూ కష్టమనుకునే పనిని సులభంగా చేయాలనుకునేవాడు. అందుకే మ్యాథ్స్‌, సైన్స్‌, ఇంగ్లీష్‌ సబ్టెక్ట్‌లల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకునేవాడు. అలాగని మిగిలిన సబ్జెక్టులల్లో తక్కువ తెచ్చుకునేవాడని కాదు.

టీచర్స్‌ డే రోజు ఉన్న జతబట్టలను బాగా ఉతికి, ఇస్త్రీ చేసుకొని, పక్కింటి మిత్రుణ్ణి ఆ పూటకు షూస్‌ కావాలని అడిగి వేసుకున్నాడు. పైగా ఇన్‌షర్ట్‌ చేసి, రోజూ కొంటే మరింత అందంగా తయారయ్యాడు. తనతోటి మిత్రులు కూడా అందరూ అలాగే ''ఒక్కరోజు సీఎం'' లాగా ''ఒక్కరోజు ఉపాధ్యాయుల'' గెటప్‌తో బడికొచ్చారు.

బడి పాతదే. అయినా ఇవాళ ఏదో కొత్త కళతో ముస్తాబయ్యింది. సర్కార్‌ బడికి కూడా యూనిఫాం పెట్టినా, తిండికి లేనోళ్లు బట్టలకు ఏడికెళ్లి తెస్తరు. అందుకే మురికి, ముతక బట్టలతోటే బడికొచ్చే పిల్లల బడి అది. ఇవాళ మాత్రం బుజ్జి బుజ్జి టీచర్ల సందడితో బడి హొయలు పోతున్నది. వేలెడంత లేనివాళ్ల పంచకట్ల కష్టాలు చూసి అసలు ఉపాధ్యాయులు ముసిముసిగా నవ్వుకుంటున్నారు.

ఇక బడిగంట మోగడంతో ప్రార్థన అయిపోయాక పిల్లలు క్లాసుల్లో కూర్చున్నారు. ఒక్కరోజు
ఉపాధ్యాయులుగా నటిస్తున్నవారంతా సార్లతో పాటే స్టాఫ్‌ రూమ్‌లో కూర్చోని, వంతుల వారిగా క్లాసులు చెప్పడానికి వెళ్తున్నారు. సూర్యం క్లాసు టీచర్‌గా తన క్లాసుకే ఇంగ్లీషు పాఠ్యపుస్తకంతో పాటు వెళ్లాడు.

ఇక అసలు ఉపాధ్యాయులు ఈ ఒక్కరోజు ఉపాధ్యాయుల్లో బెస్ట్‌ టీచర్‌ ఎవరో తేల్చే పనిలో పడ్డారు. అందుకోసం సూర్యంలాంటి వారు చెప్పే పాఠాలకు మార్కులు వేయడానికి కిటికీల్లోంచి చాటుమాటుగా గమనిస్తున్నారు. ఇక మరోవైపు అదే కాలనీలో ఉండే శివకుమార్‌, సంజయ్‌ వంటి యూత్‌ కూడా ''బెస్ట్‌ టీచర్స్‌''ప్రైజ్‌ను ఇవ్వడానికి మార్కులు వేస్తున్నారు. వారు కూడా ఒకప్పుడు ఈ బడి విద్యార్థులే. బడిరుణాన్ని ఈ రకంగా కొంత తీర్చుకుంటున్న తృప్తి ఉంది వారిలో.

సూర్యం తనదైన స్టైల్‌లో పాఠం చెప్తున్నాడు. బోర్డు మీద పిల్లలకు తెలియని పదాలకు అర్థాలు చెప్తున్నాడు.

పాఠం సారాంశాన్ని, అందులోని నీతిని చాలా చక్కగా వివరించాడు. సూర్యం చెప్పే పద్దతికి ఆ బడి
ఉపాధ్యాయులే కాకుండా బహుమతులిచ్చి ప్రోత్సహించడానికి వచ్చిన పూర్వవిద్యార్థి శివకుమార్‌ వంటి వారు సైతం ఆశ్చర్యపోయారు.

సాయంత్రం బహుమతి ప్రదానోత్సవానికి ముందే శివకుమార్‌కు సూర్యం గురించి తెలుసుకోవాలనిపించింది.

ఎవరు ఈ పిలగాడు? చాలా ఉషారున్నాడు. ఇంత చిన్న వయసులోనే ఇట్లా చదువుతున్నడంటే, ఖచ్చితంగా ఈ బడికి ఏదో ఒకనాడు పేరు తీసుకొస్తాడని గుర్తించాడు. తన పక్క కాలనీలో నిరుపేద దంపతుల కుమారుడే సూర్యమని తెలిసి శివకుమార్‌ ఆశ్చర్యపడ్డాడు. అన్ని సౌకర్యాలు ఉన్నా సరిగా చదవని పిల్లలున్న కాలంలో ఏమీలేని సూర్యానికి చదువుపట్ల అంత శ్రద్ధ ఉండడం శివకుమార్‌ను ఆకర్షించింది. సూర్యాన్ని మనస్ఫూర్తిగా అభినందించడమే కాదు, గుండెల నిండా కౌగిలించుకోవాలనిపించింది.  తనకు బెస్ట్‌ టీచర్‌గా ప్రైజ్‌ ఇవ్వడానికి ''నిత్య జీవితంలో రసాయణ శాస్త్రం'' పుస్తకాన్ని కొని తీసుకొచ్చాడు. ఆ బడి తెలుగు ఉపాధ్యాయుడు వెంకటాచారి సార్‌ చేతుల మీదుగా సూర్యానికి అందించాడు శివకుమార్‌.

సూర్యానికి శివకుమార్‌ ఇచ్చిన బహుమతే కాదు, ఆ బడి ఉపాధ్యాయులు వేసిన మార్కుల్లో కూడా తానే ఉత్తమ ఉపాధ్యాయునిగా నిలిచాడు. అట్లా మరో ఇంగ్లీషు డిక్షనరీని కూడా సొంతం చేసుకున్నాడు సూర్యం.

శివకుమార్‌కు సూర్యం గురించి తెలుసుకున్నాక ఏదో తెలియని అభిమానం ఏర్పడింది. కారణం పేదింటి పిల్లలు బాగా చదవాలి. అలాంటి వారిని ప్రోత్సహించాలనే తన మంచి మనసు. అందుకే సూర్యాన్ని ఇలా అందరిలో అందరిలాగా అభిమానించడం సరిపోదనుకున్నాడు.

తనను ప్రత్యేకంగా అభినందించాలని బహుమతి ప్రదానోత్సవం అయిపోయే వరకు వేచి ఉన్నాడు. ఆ తరువాత సూర్యాన్ని ప్రత్యేకంగా పరిచయం చేసుకొని తనతో బయటికి రావాల్సిందిగా కోరాడు. బిఎస్‌ఎల్‌ఆర్‌ సైకిల్‌ మీద చౌరస్తాకు తీసుకుపోయి, ఒక బేకరీలో కూర్చోబెట్టాడు. సూర్యానికి శివకుమార్‌ అభిమానం చూస్తుంటే ముచ్చటగా ఉంది. తనకంటే వయసులో పదేండ్ల పెద్దవాడు శివకుమార్‌.

తన మీద ఎందుకు అంత అభిమానమో కాసేపయ్యాక గానీ సూర్యానికి తెలిసింది.

''సూర్యం నీకు తెలుసా ఈ రోజు నా బర్త్‌ డే'' అన్నాడు శివకుమార్‌.

''అరె..అవునా అన్నా, పుట్టినరోజు శుభాకాంక్షలు'' విష్‌ చేసి, చెయ్యికలిపాడు సూర్యం.

''నా పుట్టినరోజు నాకు బాగా యిష్టమైన వాళ్లతోనే జరుపుకోవాలని ఎదురుచూసేవాణ్ణి. ఈ సంవత్సరం ఆ కోరిక తీరింది ''

సూర్యానికి కూడా నెమ్మదిగా శివన్న మీద అభిమానం మొదలయ్యింది.

''నేను నీలాగే చిన్నప్పుడు బాగా చదివేవాణ్ణి సూర్యం. కాకుంటే కుటుంబ పరిస్థితుల వల్ల చదువు మానేయాల్సి వచ్చింది. అందుకే నీలో నన్ను చూసుకుంటున్నా. నువ్వుయినా బాగా చదువుకొని మన బడికి, మన గుడిసెలకు పేరు తీసుకురావాలి'' ఒకలాంటి ప్రాధేయతను గంభీర స్వరంతో పలికాడు శివకుమార్‌.

సూర్యానికి ఇప్పుడు అర్థమయ్యింది. తన మీద శివన్న ఎందుకంత అభిమానం చూపిస్తున్నాడో తెలిసి వచ్చింది.

ఎంత మంచి మనసున్నోడు శివన్న?!  తనలా మరొకరి చదువు ఆగిపోవద్దని ఎంత గొప్పగా ఆలోచించాడు అని గ్రహించాడు సూర్యం.

''అందుకే సూర్యం నీకు ఈ పుస్తకాన్ని కొనుక్కొచ్చాను. నువ్వు బాగా చదువుకొని గొప్పోడివి కావాలి. నువ్వు మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలన్నదే నా కోరిక''

అప్పటిదాకా ఏ గురువు చెప్పని ఉపదేశంలా తోచాయి శివన్న మాటలు. ఇప్పటి దాకా తన తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలనుకున్నాడు సూర్యం. ఇప్పుడు ఆ ఆశయంలో శివన్న ఆకాంక్ష కూడా జతైంది.

''తప్పకుండా అన్నా'' అని మాటిచ్చాడు సూర్యం.

శివన్న లేచి చిన్న కేకు ఒకటి ఆర్డరిచ్చి తెచ్చి తన ముందు పెట్టి కట్‌చేసి సూర్యానికి తినిపించాడు.

సూర్యం కూడా శివన్నకు తినిపించి, అతడి సైకిల్‌ మీదే తిరిగి కాలనీ వరకు వచ్చాడు. ఆ రోజు నుండి శివన్న అన్నా, ఆయన ఇచ్చిన పుస్తకమన్నా సూర్యానికి చెప్పలేని అభిమానం పెరిగింది. పాఠ్యపుస్తకాలే కాకుండా ప్రపంచంలో చదవాల్సిన పుస్తకాలు చాలా ఉన్నాయి అని ఆ రోజే తెలిసొచ్చింది సూర్యానికి. మంచి పుస్తకాలను మరింత బాధ్యతగా చదువుతూ తన మనో ప్రపంచాన్ని మరింత విశాలం చేసుకున్నాడు. అలాగని తను చదవాల్సిన పాఠ్యపుస్తకాలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. వాటిని మరింత బాధ్యతతో చదివాడు. ఒక్కో తరగతి దాటుతూ ఎమ్మేలో గోల్డ్‌ మెడల్‌ కూడా సాధించాడు. కాకుంటే శివన్నతో దూరం పెరిగింది.

కాలం డాటా అందని నెట్‌లా బఫరింగ్‌ అయి గిరగిరా తిరిగింది. చూస్తుండగానే ముప్పయేండ్లు గడిచిపోయింది.

ఎవరి బతుకుపోరాటం వారిదయ్యింది. మళ్లీ కలుసుకోలేకపోయారు.

సూర్యం పై చదువులకు ఊరిని వదిలిపెట్టాల్సి వచ్చింది. ఉన్నత చదువులు పూర్తి చేసి, ఉద్యోగం సాధించాడు.
కానీ, శివన్న వల్ల అలవడిన పుస్తక పఠనం మాత్రం అలాగే కొనసాగుతోంది. ఈ మంచి అలవాటును అలవాటు చేసినందుకు గుర్తుకొచ్చినప్పుడల్లా శివన్నకు మనసులో ధన్యవాదాలు చెప్తూనే ఉన్నాడు.

...... ....... .......

బెడ్‌ రూమ్‌లో భార్యా పిల్లలు నిద్ర పోతున్నారు.

గోడకున్న గడియారంలో సెకన్‌ల ముల్లు చప్పుడు స్పష్టంగా వినిపిస్తున్నది.

చిన్నముల్లు పెద్దముల్లు కౌగిలించుకున్నాయి. సమయం కరెక్టుగా పన్నెండు.

తాను ఈ రోజు చదువుతున్న పుస్తకం చివరి పేజీల్లో ఉన్నాడు. మరో యాభై పేజీలైతే ఈ పుస్తకం పూర్తి చెయ్యొచ్చు. మళ్లీ దీన్ని రేపటి వరకు వాయిదా వేయడం ఎందుకనుకున్నాడు.

అనుకున్నట్టుగానే పుస్తకం చదవడం కాసేపట్లోనే పూర్తయ్యింది.

ఇక నిద్రపోదామనుకొని పుస్తకం పక్కన పెట్టి

లైట్‌ ఆఫ్‌ చేసి మంచం మీద అలా ఒరగబోతున్న సమయంలో  మోగింది ఫోన్‌. ఈ టైంలో ఎవడ్రా సామీ అని తిట్టుకుంటూనే ఫోన్‌ వంక చూశాడు. ఇట్లా అర్ధరాత్రి పూట ఫోన్‌ మోగితే తన గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఏ చావు కబురు వినాల్సి వస్తుందోనని గబరా పడతాడు సూర్యం. ఇలాంటి అనుభవాలు అనేక సార్లు కలిగాయి. అందుకే ఇప్పుడు భయం భయంగానే ఫోన్‌ లిఫ్ట్‌ చేశాడు.

సందేహపడినట్టే అవతలి నుండి చావు కబురు.

గుండె జబ్బుతో బాధపడుతున్న అమ్మ తరుపు బంధువు చనిపోయాడు. వరసకు మామయ్య అవుతాడు.

ఆ రాత్రి భార్యా పిల్లలను డిస్టర్బ్‌ చేయలేక, రాత్రంతా ఎప్పుడు తెల్లారుతుందా అని నిద్రకాచాడు సూర్యం. మామయ్యతో అంతగా అనుబంధం లేకపోయినా, అత్తమ్మ వారి పిల్లల గురించి ఆలోచించాడు.

వారిని ఓదర్చాలి. ధైర్యం చెప్పాలి. ఉదయమే బయలుదేరి వెళ్లాడు.

........ ........ ........

ఊళ్లల్ల నుండి బంధువులంతా వచ్చారు.

అందరికంటే ఎక్కువ దూరం నుండి వచ్చింది తానే.

అష్టకష్టాలు పడి ఊరు చేరుకున్నాడు.

తనను చూడగానే చుట్టాలంతా బావురుమన్నారు. అందరినీ ఓదార్చి, అంత్యక్రియల కోసం కావాల్సిన ఏర్పాట్లు చూసుకోవడానికి ముందుకు కదిలాడు సూర్యం.

నిజానికి ఆ పనుల కోసం కూడా చాలా మందే పెద్దమనుషులు ఉన్నారు.

తనను కలవడానికి వచ్చిన మిత్రులతో అలా మాట్లాడుతూ చావింటి నుండి ముందుకు కదిలాడు. ఇదే కాలనీలో తను కలుసుకోవాలనుకున్న శివన్న గుర్తుకొచ్చాడు. కారణం శివన్న ఉండే యిల్లు ఆ పరిసరాల్లోనే అని తెలుసు. కాకుంటే ముప్పయి యేండ్లు గడిచాయి. తాను ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో తెలియదు.

శివన్న యింటికి వెళ్లి పలకరిద్దాం అనుకున్నాడు. అంతలోనే ఎవరో వచ్చి చెప్పారు... శవాన్ని పాడెకెత్తారని.

శివన్నను మళ్లీ ఎప్పుడైనా కలుద్దాంలే అనుకుని అంతిమయాత్ర వైపు కదిలాడు సూర్యం.

........... ............ ..........

మనుషులు బతికున్నప్పుడు పట్టించుకోని వారే  చనిపోయాక హడావుడి చేస్తారనడానికి సాక్ష్యంలా ఉంది అక్కడి పరిస్థితి. డప్పుల ముందు దగ్గరి బంధువులే తాగి డ్యాన్సుల చేస్తున్నారు. ఏడుపు రాకున్నా మరింత ఎక్కువగా నటిస్తున్న బంధువులూ ఉన్నారు. మరోవైపు కొంతమంది యూత్‌,  చావును కూడా సెలబ్రేట్‌ చేస్తున్నారు.

చావులో ఒకప్పుడు డప్పులు మాత్రమే ఉండేవి. కొంతకాలానికి బ్యాండు కూడా చేర్చారు. అది సూర్యానికైతే ఇప్పటికీ ఆశ్చర్యమే. బ్యాండు మేళం అంటే పెళ్లిళ్లకు మాత్రమే వాడేవారు. ఇప్పుడు డబ్బులు ఎక్కువైనవారు చావును కూడా ఘనంగా చేయాలనే ఆలోచన చేసినట్టున్నారు. అట్లా బ్యాండు మేళం చప్పుడు వినపడితే అది పెళ్లి అనుకోవడానికి లేదిప్పుడు. ఇంకా కొంత కాలమైతే చావులో డీజేలు కూడా రావనే గ్యారెంటీ ఏమీ లేదు.

ఇక ఈ చావులో సూర్యానికి వింతగా అనిపించింది టపాసులు కాల్చడం.

పెళ్లిళ్లకు, విజయోత్సవాలకు కాల్చే బాణాసంచను చావులో కాల్చి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో సూర్యానికి ఎంతకూ అంతుపట్టడం లేదు. అది కూడా మామూలుగా కాదు. బాణాసంచను  సంచులలో వేసుకొని ఓ పదిమంది, ఆ పని కోసమే కేటాయించబడినట్టున్నారు.

ఎవడి పిచ్చి వాడికి ఆనందం అన్నట్టు బాంబులు కాల్చడంలో మునిగిపోయారు స్థానిక యూత్‌.

చెవులు దద్దరిల్లుతున్నాయి. సంటిపిల్లలు, ముసలిముతక అదిరిపడుతున్నారు. ఆ చప్పుళ్లకు చెవులు పోయేలా ఉన్నాయి. ఆ మోతకు ట్రాలీ ఆటోను సమీపంచి శవాన్ని చూడడానికి కూడా ఎవ్వరూ సాహసించడం లేదు. దూరంగానే ఉంటున్నారు.

సూర్యం శవానికి కొంచెం దూరంగా నిలబడి అంతా గమనిస్తున్నాడు.

నిజానికి చనిపోయిన మామ కుటుంబం తన లాంటి పేదల జాబితా నుండి ఏనాడో మధ్య తరగతిలోకి చేరిపోయింది. నూటికో, కోటికో ఇలాంటి ఒక్క కుటుంబం చాలు, ఎస్సీలకు ఏం తక్కువైంది. మస్తు బాగుపడ్డరని చూపడానికి. ఇక ఈ చావు కూడా అందుకు మినహాయింపు కాదు. మధ్యతరగతి రేంజ్‌ను దాటి ''ధనవంతులం మేము'' అని చూపించడానికి అందరికీ మందు తాపుతూ, తాము తాగుతూ ఊగుతున్నారు ఆయన కొడుకులు, బంధువులు.

అది ఎంత విడ్డూరంగా ఉందంటే...కరువు బాధితుల నడుమ ధగధగలాడే బట్టలేసుకున్నట్టు ఉంది. అంతా కోలాహలంగా మారిపోయింది. మనిషి సచ్చిపోతే కూడా ఇంత చేయాలా అని ముక్కున వేలేసుకునేవారు వేస్తున్నారు. తాగి తందనాలు ఆడేవారు ఆడుతున్నారు. ఈ రకమైన అలవాట్లేవి లేని సూర్యం, తన చిన్ననాటి మిత్రుడు శేఖర్‌ కలిస్తే అతడిని వెంటతీసుకొని నేరుగా స్మశాన వాటికకు అంత్యక్రియలకు ముందే చేరుకున్నాడు.

ఆ రకంగానైనా ఆ బాణాసంచా హడావుడికి దూరంగా ఉండొచ్చని భావించాడు. స్మశానవాటికకు వెళ్లే దారిలో డాంబర్‌ రోడ్డు మీద చాక్‌పీసులతో పెద్దపెద్ద అక్షరాలతో చనిపోయిన మామకు జోహార్లు అర్పిస్తున్నారు. అది కూడా ఒకలాంటి ఇబ్బందే. వచ్చిపోయే లారీలను పక్కకు తరలించాలి. ఆ వాహనాలు ఆ చాక్‌పీస్‌ గీతల మీది నుండి వెళితే, మనిషి మాయమైనట్టే అతడి పేరు కూడా కాసేపట్లోనే మాయమవుతుంది. అది తెలిసి కూడా రోడ్ల మీద అంత భారీ ఎత్తున పేర్లు రాసి దీపాంతల బొమ్మలు గీస్తున్నారు ఔత్సాహిక ఆర్టిస్టులు.

అవన్నీ చూసుకుంటూ మండుతున్న ఎండలో స్మశానానికి చేరుకున్నాడు సూర్యం. బాల్య స్నేహితుడు శేఖర్‌ను ఏవో కుశల క్షేమాలు కనుక్కుంటున్నాడు. మన క్లాస్‌మేట్స్‌ బాగున్నారా? ఎవరెవరు ఏం చేస్తున్నారు? రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నోళ్లు ఎవరో వాకబు చేస్తున్నాడు. వాటన్నింటికి సమాధానం చెప్పాడు శేఖర్‌.

''రెండుమూడు సార్లు పట్నం వచ్చినా, నిన్ను కలవలేకపోయినరా'' అన్నాడు.

'ఔనా?!' సూర్యంలో ఆశ్చర్యం. ఫోన్‌ చేస్తే కలిసేవాళ్లంకదరా అన్నాడు సూర్యం. అలా మాట్లాడుకుంటూ సూర్యం, శేఖర్‌లు స్మశానంలో సమాధుల మధ్య నడుస్తున్నారు.

నిజానికి తన బాల్యమంతా గడిచింది ఈ స్మశాన పరిసరాల్లోనే. అందుకే సూర్యం స్మశానాన్ని కూడా తన జ్ఞాపకాల పందిరిగానే చూస్తాడు. కొత్తగా ఏమేం సమాధులు వెలిశాయి.

చివరిసారి ఎవరి చావుకొచ్చాడు?

ఎవరెవరు అకాల మరణాల పాలయ్యారో శేఖర్‌ను కనుక్కుంటూనే ఉన్నాడు.

శేఖర్‌కు స్మశానవాటిక అలాకాదు. ఎప్పుడూ చూసేదే. అంతే.

కానీ, సూర్యం మాత్రం ప్రతీ సమాధి మీద ఉన్న శిలాఫలకాలను చదువుతూ ముందుకు కదులుతున్నాడు.

సూర్యం ఆలోచనల్లో మనిషి జన్మ విలువను తెలుసుకోవాలనే అన్వేషణ. అందుకే స్మశానంలోని సమాధుల మీదున్న శిలాఫలకాలపై వారు జన్మించిన తేది, వారు మరణించ తేది గణించి వారు ఈ భూమ్మీద ఎంతకాలం జీవించారో, జీవించడానికి ఎన్ని కష్టాలు అనుభవించారో మౌనంగా ఆలోచిస్తూ శేఖర్‌తో కలిసి ముందుకు సాగుతున్నాడు.

అలాంటి సమాధుల తోట కూడా ఒక్కటిగా లేదు. కులాలు, మతాలుగా విడిపోయే ఉంది.

జీవితాంతం బద్ధశత్రువుల్లా కొట్టుకు సచ్చిన అన్నదమ్ముల సమాధులు పక్కపక్కనే ఏర్పాటు చేయబడ్డాయి. కనీసం ఇప్పుడైన కలుసుకున్నారు అనుకున్నాడు సూర్యం.

కలకాలం కష్ట సుఖాలను కలిసి పంచుకున్న పైస నర్సమ్మ, నర్సయ్యలు స్మశానంలోనూ విడిపోలేదు.

అరుదైన దంపతులని మనసులోనే అంజలి ఘటించాడు.

తనకంటే రెండేళ్లు చిన్నే అయినా తనకంటే ముందే స్మశానానికి చేరుకున్న విజయ్‌ సమాధిని చూసి చలించిపోయాడు. అతనిది వ్యవస్థ చేసిన హత్య అని నిట్టూర్చాడు.

బతికున్నప్పుడు వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటది అని పేరు మోసిన శత్రువుల సమాధుల మధ్య నిజంగానే ఇప్పుడు పచ్చగడ్డి మొలిసింది. కాకుంటే భగ్గుమనడం లేదు.

అయినా ఏ మనిషి విలువైన తేలాల్సింది సమాజంలో కాదు స్మశానంలోనే.

వెనుకబడిన కాలనీలు బాగుపడనట్టే వారి స్మశానమూ బాగుపడలేదు. అంతా ఒక చిన్నపాటి అడవిలా ఉంది.

ఎవ్వరూ పట్టించుకోని పాడుబడ్డ బావిలా ఉంది. రాళ్లు రప్పలు, చెట్ల తుప్పలు. నడవడానికి దారికి అడ్డంగా పెరిగిన కంపమండలు. మనిషి సచ్చిపోతే పాతిపెట్టడానికి జాగే లేకుండా పోతున్నది.

బతకడానికి జాగలేదు. చస్తే ఆరడుగుల నేల గతిలేదు.

అందుకే స్మశానం ఇరికిరుకుగా మారింది. అయినా ఇది పేదల స్మశానం ఇలాగే ఉంటుంది. ఇది శుభ్రంగా

ఉండడానికి ఇదేమైన బలిసినోళ్ల ''మహాప్రస్థానం'' కాదుకదా.

ఇట్లా ఏవేవో ఆలోచిస్తూ, సమాధుల మీది పేర్లు చదువుతూ వెళ్తున్న సూర్యం కాళ్లు ఒక్కచోట ఆగిపోయాయి.

ఆ సమాధి మీద పేరు తనకు షాక్‌ కలిగించింది. శిలాఫలకం కూడా కొత్తగానే ఉంది.

ఈ మధ్యే వెలిసిన సమాధిలా ఉంది.

ఆ సమాధి శిలాఫలకం మీదున్న పేరు బాగా తెలిసిన పేరు.

తనను యిష్టపడ్డ మనిషి పేరు.  

తను బాగుండాలని, బాగా చదువుకోవాలని, ఇతరులకు ఉపయోగపడాలని కోరుకున్న శివన్న సమాధి అది. ఒక్కసారిగా దు:ఖం పొగిలి పొగిలి వచ్చింది. గుండె పగిలిపోయినంత పనైంది. టపటప కన్నీళ్లు రాలిపడుతున్నాయి. ఇప్పుడు చనిపోయిన మామయ్య తనకోసం ఏమీ చేసినవాడు కాదు. అందుకే తనకోసం పెద్దగా కన్నీళ్లు రాలేదుగానీ, చిన్ననాడే తనను గుర్తించి అభిమానించిన శివన్న కోసం సూర్యం చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నాడు.

అది చూసి శేఖర్‌ ఆశ్చర్యానికి గురయ్యాడు. శివన్నతో సూర్యానికి గల అనుబంధం సూర్యం ఏడుపే తెలియజెప్పింది. ఏడుస్తున్న సూర్యంతో చెప్పాడు శేఖర్‌...''మన వాళ్లందరి చావులు నీకు తెలిసినవే కదరా. అర్ధాంతరపు చావులు. ఉపాధిలేదు,  ఉద్యోగం లేదు. బతుకంతా ఆకలి పోరాటమే. బాధలకు తట్టుకోలేక తాగి తాగి చస్తున్నవాళ్లే ఎక్కువ''.

శేఖర్‌ మాటలు విన్న సూర్యం...బతకడానికి శివన్న ఎంత విలవిలలాడాడో, ఎంత బతుకుపోరాటం చేశాడో  ఊహిస్తున్నాడు.

శివన్న బతికున్నప్పుడు కలుసుకోవాల్సిందని పశ్చాత్తాప పడ్డాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించాక కలవాలనుకున్నాడు. కాలం గడిచిపోయింది. కలవలేకపోయాడు. తన జీవితం మాత్రం ఎక్కడ కుదురుగా ఉందని?! తన అశక్తతను తానే తిట్టుకున్నాడు సూర్యం. శివన్న కూడా ఏనాడు సూర్యం గురించి పట్టించుకోలేకపోయాడు.

ఎక్కడో ఒక చోట బానే ఉంటాడులే అనుకున్నాడు. అంతలోనే ఇలా తీరని రుణమై మిగిలిపోయాడు.

ఇప్పుడు శివన్నకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని... మరెంతోమంది ఉత్తమ విద్యార్థులను తయారు చేయాలి. చదువుతోనే బతుకులు మారుతాయన్న శివన్న ఆశయాన్ని నిజం చేయాలి. ఇదే శివన్నకు నిజమైన నివాళి.

ఆ సాయంకాలం సమయాన ఉదయించే సూర్యుడై పట్నానికి కదిలాడు సూర్యం.