కోయిల పాటకు పరవశం లేదు 
కొత్త చిగుళ్ళకు పులకరింత లేదు 
కవి సమ్మేళనానికి కదలిక లేదు 
కాలం ఎంత విచిత్రమైంది
కరచాలనం కూడదంటుంది
కలసికట్టుగా  సాగవద్దంటుంది 
కాళ్ళకు సంకెళ్ళు వేసిందీ ఉగాది 
దేశం కాదు కాదు ప్రపంచమే 
గజ గజా వణకుతుంది.
పెదవులపై చిరునవ్వులు మాయం 
హృదయాలలో స్పందనలు మాయం 
కాలం కరోనామయం 
కనిపించని శత్రువుతో 
యుద్ధం చేస్తున్నాం మనం 
ఆయుధం ఏకాకితనం 
అవును - ఒంటరిగా విడివడి 
సమైక్యంగా సమర భేరి మ్రోగిద్దాం
వీర స్వర్గం పొందిన వారు సరే 
విశ్వంపై మానవాళిని 
కాపాడుకోవాలి మనం.
ఇంటికే పరిమితమైతేనేం 
కంటిలో ప్రపంచాన్ని పొడవుకున్న వాళ్ళం కదా !
జనహితం కోసమే మనం 
జీవన స్రవంతి కోసమే మన కవనం 
కలంతో సవనం చేద్దాం 
ఇది కరోనాకు అంత్య సమయం 
కరోనాను జయించినప్పుడే అసలైన విజయం 

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature