Asianet News TeluguAsianet News Telugu

డాక్టర్ గాదె వెంకటేశ్ కథ : దేశగురువు

మనిషికి ఆత్మవిశ్వాసం ఎంత అవసరమో తెలియచేస్తూ డాక్టర్ గాదె వెంకటేశ్ రాసిన కథ  ' దేశగురువు ' ఇక్కడ చదవండి :

doctor gade Venkatesh story desha guruvu lns
Author
First Published Dec 27, 2023, 2:02 PM IST

         
యమధర్మరాజు కర్రెదున్న పోతునెక్కి యేటకొస్తున్నట్టు, ఎంకడు ఇంకా లేవనందుకు కొండమించి కండ్లెర్రజేస్తూ పైపై కొస్తుండు సుర్యుడు.  పొద్దుగాళ్ళనే లేసిన ఎంకని పెండ్లం ఆకిలూకి, సాంపి సల్లుతూ, "మాకు శని సుట్టకుంది కాని, గీయన గీ నడుమ మొద్దు నిదురపోతుండు. పిల్లల ఒళ్లేమో సుస్తుచేయ బట్టె" అనుకుంటూ దబదబ సాంపి సళ్ళింది. ఇయ్యాలనన్న పొద్దుగాళ్ళ కలుపుతీయ పోవాలనుకుంది. నిన్న పొద్దు పోయి పోతే పటేలు తిట్టిన మాటలు గుర్తొచ్చి.

పోయ్యి మీద “ఎసరు” కుతకుత కాగుతుంది. “ఈ దరిద్రం సల్లగుండ ఇకనన్నా లేవరాదయ్య, తెల్లంగ తెల్లారింది. ఒక్కనాడన్న దేవునికి ఒక ఒక కొబ్బరికాయ కొట్టి దీపం ముట్టించిన పాపాన బోకపోతిమి.  శని సుట్టుకోక ఎమిజేస్తది మరి” అంది ఏడుస్తున్న పోరగాళ్ళ సంజాయిస్తూ.  అంతలో ఎంకడు లేసి, యేప-పుల్ల ఏసుకొని శెంబుపట్టుకొని మర్రివాయి బొంద కాడంగా, మాదిగవాయి కంప సెట్లల్లకు పొయిండు. ఎంకని పెండ్లం నీళ్ళ కుండ పట్టుకొని సెదురు బాయికాడికి పోయింది. అక్కడ  ఆ..అక్క ఈ…అక్క ఊరి సుద్దులు చేప్పుకుంటు, మంది మచ్చట్లన్ని కుప్పపోసుకొని కొన నాలుకలతో సప్పరిస్తుండ్రు. ఆళ్ళ ఈళ్ళ మాటల్లో ఊరికి “దేశ గురువు “ వచ్చిండని, ఆయనకు మొక్కుకుంటే మంచి అయితని అందరు అనుకుంటుండ్రు.

ఎంకడు "మొఖం మీద దబ దబ ఇన్ని నీళ్ళు సల్లుకొని ఎమోఁ ఇంత బువ్వెయ్యి మేకల ఇడుసుక పోవాలే పొద్దు పోయింది” అన్నాడు. చిప్పల బువ్వ ఏసుకొచ్చి ఇచ్చింది. ఎంకడు "ఎందే పొద్దుగాళ్ళనే సద్దికూడు ఎసినవ్” అన్నాడు. “ఆఁ మరి నాతిరి నువ్వు తింటే ఇది ఉండేదా, లేత గోళల కల్లు బాగా తాగి, తింటందుకు కూడా సోయిలేక పంతివి.   నీకింత ఏసిన నేనింత పెట్టుకున్న” అంది.
“అయితెమాయగాని ఊరికి దేశ గురువు వచ్చిండంట గదా !" అంది.
"అవును అయన ఊరవతల పోలపాకోల్లబాయి పెద్ద మర్రిచెట్టు కింద దిగిండు, అయినా ఆయనొచ్చి మూడ్రోజులు అయిందిగదనే అయితేంది? "  
" అది కాదయ్య అందరూ ఆయనకు మొక్కొస్తుర్రంటగదా ! మనమూ పోకూడదూ ! ".
"మన దగ్గర ఏముందె ? అయినకియ్యడానికి !? బూడిద గుడ్డల బుడ్డగోషోళ్ళం గొంగడి బోత్త గోషిపాకోళ్ళం, ఏ రాత్రి కారాత్రి ఊడుసుక తింటోళ్ళం.” నిరాశగా సందేహం వ్యక్తం చేసిండు.
"అయితేందయ్యా, మేకల కాడికి పోయినప్పుడు ఎదో ఒకటి తెచ్చిమొక్కుకుంటే మనకు సుట్టుకున్న శనిపోయి మంచన్న జరుగుతది" అని తన బాదెనక ఇల్లు, పిల్లలు బాగుండాలన్నట్లుగా గావురంగా బతిలాడింది.
అప్పుడు ఎంకడు సరేగాని, చిన్నోనికి ఐస్క్రీమ్, చిరు దిండ్లు కొనియ్యకు ఇంకా సర్ది ఎక్కవయితది, నువ్వు కూడా మిర్యాల కారం కొట్టుకొని తిను సర్ది పొతది.  రోగం వచ్చినాక బాధపడే కంటే రాకమునపే పైలంగా ఉండాలన్నట్లు సెబుతూ, గొంగడి బుజానేసుకొని దుడ్డు కర్ర తీసుకొని మేకలతోలుకొని పోయిండు.
తెల్లారగానే  తానం జేసి నిన్ననే తెచ్చి,  కుండల  నీళ్ళు సల్లి పెట్టిన బంకోంటికూర, పాయిలి కూర, పొనగంటి కూర, పుంటి కూర ఇంకా రెండు మూడు కూరలను తీసుకొని, దేశ గురువు ఉన్న మర్రిసెట్టు దగ్గరికి పిల్లబాటన పోతుండు. వచ్చి పోయటోళ్ళ మాటల్లో అతను తీసుకొని పోతుంది అంత గొప్పదేం కాదని మరొక్క సారనిపించింది. “అయిన మొక్కు కోవడానికి పోతున్న గాని కానుకలు ఇచ్చుకోవడానికి కాదు కదా !” అని తనకు తానే మరొకసారి ధైర్యం చెప్పుకుంటు, అడుగులు ముందుకేస్తుండు. ఆళ్ళ మాటలను బట్టి సూస్తే గురువు గారు ఏయో మంత్రాలు సెపుతుండ్రని! ఎంకనికి అర్థం అయింది. భయము, ఉత్సహాము నిండిన ముఖంతో గురువుకు తెచ్చిన ఎచ్చగూర పచ్చగూరలు ఇచ్చి, కాళ్ళకు మొక్కిండు మాయ మర్మం ఎరుగని, నిండు మనసుతో.
మొక్కిన ఎంకయ్యను లేపి “ఏం వెంకయ్య బాగున్నావా” అని అడిగిండు. దానికి ఎంకడు 'మీ పుణ్యాన బాగానే ఉన్నామయ్య' అని అన్నాడు. మా ఆడది కూడా మిమ్ముల్ని అడగిందయ్యా” అని ఆడు రావాడానికి ఆమే కారణమన్నట్టు సెప్పిండు. ఎంకడు ఆ మాట ఈ మాట మాట్లడినాక అయ్యా అందరికి ఏయో ఉపదేశం సెబుతుడ్రంటగదయ్య” అని ఈడు ఏదో ఒకటి చెప్పమ్నట్టుగా చూసిండు. అడవి తప్ప అక్షరం తెలివని వాడికి కూడా మంత్రాలు శ్లోకాలు ఏమర్థం అయితయి అన్నట్లు కొంచెం సిన్న చూపుతో, గర్వంతో " ఏం చెప్పమంటావయ్యా ? నీకు చదువురాదుగదా ! అని అన్నాడు. “ఎదో ఒకటి చెప్పరాదయ్య మా మోటు బాషలో” అని తప్పదనట్లుగా ధీనంగా సూసిండు. తప్ప దనకున్న గురువు “ఎచ్చకూర పచ్చకూర గురువుకు తెచ్చిన " అని ఈ మంత్రం ఎప్పుడూ జపిస్తూ ఉండమని చెప్పిండు. మరొకసారి గురువు కాళ్ళకు మొక్కి, మేకల కొట్టుకు పోతందుకు పొద్దు పోయిందని ఎంకడు ఎనుకకు దిరిగిండు.

ఎడమ చెయ్యి తోనైనా ఎసు పోకుండా, పోగులేయడం అయ్య దగ్గరి నుండి నేర్చుకున్న మర్మంలేని ఎంకడు గురువు చెప్పిన మాటలను " ఎచ్చగూర పచ్చగూర గురువుకు తెచ్చిచ్చిన"  జపిస్తూనే ఉన్నాడు. అది అతనికి  ఊతపదం అయ్యింది. ఆ మాటలు అతనిలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి.

మేకలను సెలకలకు కొట్టుకుపోతుంటే ఎనుగు దుంకే మేకలను " గెగ్గా.... ఇస్సో.. ఇస్సో ఎచ్చగూర పచ్చగూర గురువుకి తెచ్చిచ్చిన ఈ మేకలను నక్కలు తిన ఎచ్చగూర పచ్చగూరు గురువుకి తెచ్చిఇచ్చిన " అంటుండేవాడు.  ప్రతి మాటకు అతనికి అది జపంలా నోట్లో నానుతుండే. ఒక రోజు మేకలకాస్తున్నప్పుడు పాము అతని మీదకు వస్తుంటే “ఇస్సో ఇస్సో.. ఎచ్చగూర పచ్చగూర గురువుకు తెచ్చిచ్చిన పాము పుట్టలకు పోక పక్కలకు వస్తదేంపనిరో దినికి” అనగానే అది పుట్టలకు పోయింది. ఇంకో సారి, కోడె రంకె ఏసుకుంటూ ఊళ్ళో అందర్ని పొడువొస్తుంటే ఎంకడు ఎదురుగా గొంగడి సదురు కుంటూ దుడ్డుకర్ర చేతుల పట్టుకొని కండ్లు ఎర్ర చేసుకొని "ఎచ్చకూర పచ్చకూర గురువుకు తెచ్చిన అరె…కోడెకు ఏంపని లేదారా ఇటొస్తుంది,  దొడ్లోకి పోక ” అనుకుంటూ ఎదురు పోయిండు. ఎద్దు వెంటనే ఎనకకు తిరిగిపోయింది. అందరు చూసి ఆశ్చర్యపోయి, ఏంరా ఎంక ఏంచేసినవ్రా కోడెను అంటే  “ఏముంది నా కండ్లను ఎర్రగా చేసిన, పశువులకు ఎరుపును చూస్తే బెదురతయిగా అందుకే అట్లా ఎనుకకు మళ్ళి పోయినట్టుంది. అని నిరాడంబరంగా జవాబిచ్చిండు.  కాని, అతనిలో ఏమి ఎలితిగుణం, కొంచెం చేష్టలు కనిపించలేదు. అంతే కాకుండా ఏదైనా ఆత్మ విశ్వాసంతో చేయ్యలని చెప్పకనే చెప్పుతున్నాడు.

గూడెంలోకి ఇంకోసారి పులి వొచ్చి నానా బీభత్సం చేస్తుంది. అప్పడే ఎంకడు మేకల కొట్టు కొచ్చి దొడ్లదోలి వస్తుండు. అందరూ కేకలు అరుపులు పెడుతుండ్రు. ఎంకని ఇల్లు ఊరవతల ఉంది.  ఎవ్వరి ఇండ్లల్లఆళ్ళు దాసుకుండ్రు. బజార్ల  పోతున్న వాళ్ళ ప్రాణాలు పైపైనే పోయినవి.  ఎంకడు గొంగడి సైసేసుకుండు‌.  కట్టె పట్టుకొని “ఎచ్చకూర పచ్చకూర గురువుకు తెచ్చిన పులికి పనిలేదారో … ?ఊళ్ళకి వచ్చింది.?” అనుకుంటూ ఎదురుగా పోతనేవుండు. పులి ఒక్కసారి అతని మీదికి గ్రాడ్రించి దూకింది. అప్పుడు ఎంకడు తెలివిగా గొంగడి దీసి పులి మొఖం మీదకు ఇసిరి దాన్ని బిగ్గరగా పట్టుకుంటా, భూమి మీద అనగవెట్టిండు.  అపుడు అందరూ వచ్చి కట్టెలతో కొట్టి సంపిండ్రు పులిని. అప్పటి నుండి అందరూ ఎంకనిలో ఏవో మహిమలు ఉన్నాయి అనుకుంటుండేవారు.  కానీ,  ఎంకడు మాత్రం ఏకలవ్యుడు. గురువు నేర్పడం కాదు ముఖ్యం అలాంటిది ఒక రూపం ఉంటే ఎకాగ్రత వస్తదని నమ్మిండు.   అలాగే నాకు ఒక ఆయుధం ఉందని అది ఏమైనా చేయగలదనే నమ్మకంతోనే అన్ని సేస్తున్న అంటుండేవాడు.

మల్లేడుకు ఒచ్చిన గురువుకు ఎంకడు ఏదైనా చెయ్యగలడని దేనినైనా ఎనక ముందు సూడుకుండా ఎదిరించగలడని, ఏదైనా ఆడు చెప్పినట్టు ఇంటదని, ఎంకని ఏకాగ్రతను, ఎంకని ఎదుగుదల, పనులను గురించి ఎరిగినోళ్ళంత గురువుకు పూసగుచ్చినట్లు చెప్పిండ్రు. “ముక్కు మూసుకొని కూర్చుని, హంగు ఆర్బాటలతోనే మోక్షం అనుకొనే గురువుకు అది తప్పు అని అవకాశం వస్తే ఎవ్వరికి తీసిపోమని నిరూపించిన ఎకలవ్వుని ,శంబుకున్ని మరిపించాడు ఎంకడు.  గురువు దగ్గరికి ఎంకడు వస్తూ పోతూనే ఉన్నాడు.  "ఎచ్చగుర పచ్చిగూర గురువుకి తెచ్చిచ్చిన" జపిస్తునే ఉన్నాడు.

పక్షం రోజులయ్యింది. పద్ధతి ప్రకారం పొరుగూరు పోవల్సిందేనాయే. అటుకాక ఇసారి అవూరోళ్ళకు పొలిచేస్తనని మాటించ్చిండు. పొయినెడే చెయ్యలేదని  వాళ్ళు నారాజయిండ్రు. గిప్పుడు పోదామని అనుకునే సరికి ముసురుపెట్టవట్టె.  ఊరోళ్ళంత “తెల్లారినాక పోదురు లేరాదు గురువు గారు ఆడ ఎల్లుండాయే పొలి చేసేది” అని అన్నరు.  అట్లనే అని రెండ్రోజులు ఉన్నా వాన తగ్గలేదు. వాన గుమ్మరిస్తుంది.  పక్క ఊఉ పోవాలంటే ఏరు దాటాల్సిందే. అది నిండుగా పోతుంది. ఆటో ఇటో వాన జర తగ్గింది. ఈ రోజన్న పోదాం అనుకొని సదురుకుంటుంరు గురువు గారు.  ముంగలి తొట్లో ఎండుగడ్డి మోపు ఎంకడే ఏసిండు. ఏకధాటిగా ముసురు కురుస్తున్నందున గురువును  సాగనంపేందుకు తక్కువ మందే వచ్చింరు.  వారు యేరుకాడికి రాగానే వడి వడిగా, జోరుగా నిండుగా పారుతున్న యేరు దర్శనమిచ్చింది.    వచ్చిన వానకు ఇంకా యేరు వర్రె కోసింది. గురువుకు ఎటు తోస్తలేదు. ఈ ఏడు పొలికె పోకుంటే మూడేండ్ల దాకా ఆ వూరి మొఖం చూడొద్దాయే. మూడేండ్లు పోకుంటే ముడ్డెండుతదాయే! అందుకని ఎట్టయినా ఏరు దాటి పోవాలి.  కాని, బండి దిగబడుతుంది. ముసురుకు ఒంటెద్దు, బండిలో ముసల్ది వణుకుతుంది.  ఎవరు యేరు దాటించడానికి ముందుకు సాహసిస్తలేరు. ఎనుకంగా ఉన్న ఎంకడు " ఏందయ్యా సూస్తుండ్రు. ఎచ్చగూర పచ్చగూర గురువుకు తెచ్చిచ్చిన” అని ఎద్దు పగ్గాలు ముక్కుతాడు ఒక చేతిలో,  దుడ్డు కర్ర ఉంకో చేతిలోపట్టుకొని ఎరిగిన కాడంగా కట్టెతో పొడుసుకుంటు… పొడుసుకుంటూ… తొవ్వతీస్తుండు. ఎడ్లబండిని అవతలికి తీసిండు.

ఎంకడు అదంతా మేకలకాస్తు తిరిగిన తలమేనాయే. ఏడ ఎత్తు ఉంది. ఏడ ఒంపు ఉంది. ఎంకనికి కొట్టిన పిండె.  దేశ గురువు బండిదిగి ఎంకన్ని “ఇంత ధైర్యం నీకు ఎలా వచ్చింది ? ” అని అడిగిండు.
“ఆఁ ఎం లేదు అయ్యగారు, ఏరు అవతల ఎల్లడు, 'ఓరి ఎంక అయ్యగారిని యేరు దాటించురో ' అని కూత బెట్టిండు.  నేను 'సరేరో అని మళ్ళ కూతపెట్టిన'  ఆ రెండు మాటలు ముడేసి, ఒక చేత ఆ ముడేసిన దాన్ని, మరొక చేత ఎద్దు పగ్గాన్ని పట్టుకొని తొవ్వదీసి దాటించిన "  అన్నాడు. గురువు గారు ఎంకని ఆత్మ విశ్వాసాన్ని, నిరాడంభరత్వాన్ని, ఏదైనా నమ్మకం ఉంటేనే  చేయగలమనె ధీమాను చూసి చేతులెత్తి మొక్కకుండ ఉండలేక పోయిండు. 

Follow Us:
Download App:
  • android
  • ios