దేవనపల్లి వీణావాణి తెలుగు కవిత: గుడ్డ ముక్క
మనకు ఏదీ శాశ్వతం కాదని తెలిసినా ఏదో ఒక ఆరాటం మనల్ని శాశ్వతంగా వెంటాడుతుందంటూ దేవనపల్లి వీణావాణి తన కవిత 'గుడ్డ ముక్క' లో ఎలా వ్యక్తీకరించారో చదవండి.
శాశ్వతంగా ఉండే
గుడ్డ ముక్క ఏదీ లేదు
రంగుల దారాలు
చమ్కీలు , జరీ పోగులు
కొద్ది కాలమే మెరుస్తాయి
అయినా మెరుగులద్దడానికి
వెరువ కుండా
కుడుతున్నాను
కొంత కత్తిరించాను
నాకు తగ్గట్టుగా కుట్టడానికి
రెండు చేతులా రెండు సూదులతో
రేయింబవళ్ళూ
చితుకుల్ని అతికిస్తున్నాను
అయినా
అతుకు అతుకే కదా...
చిరిగిన చోట
నప్పకపోయినా
మాసికలు కూడా వేసుకుంటున్నాను
ఏదీ ఒంటికి సరిపడ్డం లేదు
సరిపడే గుడ్డ ముక్క
ఎప్పటికీ కుదరదు
ఏ గుడ్డ ముక్క శాశ్వతంగా
ఉండిపోదు..
నేను కుట్టుకున్నది కూడా...
నేనిప్పుడు
నా వద్ద నున్న గుడ్డ మీద
అద్దాలు కుడుతున్నాను
అన్ని అద్దం ముక్కలలో
నేనే కనబడుతున్నాను.
మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature