పుస్తక సమీక్ష: నూటికి నూరు మార్కులు

జొన్నవిత్తుల శ్రీరామచంద్ర మూర్తి రాసిన  నూటొకటో మార్క్   సిలబస్ లో లేని చదువు కథలను దేవనపల్లి  వీణావాణి సమీక్షించారు. చదవండి.

Devanapalli Veenavani reviews Jonnavithula Ramachandra Murthy novel

మూడేళ్ళ క్రితం వాడ్రేవు చిన వీర భద్రుడు గారి 'కొన్ని కలలు కొన్ని మెలకువలు' అన్న పుస్తకం చదివాను. వారు ఎంత లోతైన మనిషో.. హేమంతంలోని తుషారాలను పోగుపోసినట్టు గంభీరంగా పొదిగిన అక్షరాలు యే సుగంధ సౌమ్య తీరంలోనో కూర్చోబెట్టి భాషా సౌందర్యాన్ని కళ్ళతో దిద్దిస్తారు. మూడొందల పేజీల పై చీలుకు పేజీలున్న పుస్తకంలో వారి అనుభవము, వారు తరచి తరచి వెతుక్కున్న సాహితీమూర్తులు, అలవోకగా లంకె వేసే ఇతర రచనలతో ఆద్యంతం ఆసక్తి ని కొనసాగిస్తూ రాసారు. నేను ఎంతో లీనమై చదివాను.. విద్యార్థులు, గురువులు ( ఇప్పుడు ఉపాధ్యాయులు) వారి అనుబంధం...గురించి పది కాలాలు నిలిచే రచనచేశారు. నేను ఒక సమీక్ష రాస్తూ ప్రతి ఉపాధ్యాయుడు తప్పక చదివి తీరవల్సిందని తీర్మానించాను. ఆ సమీక్ష చదివి వారు ఆశిస్సులు అందించారు కూడా. 

అయితే నాలాంటి తల్లిదండ్రులకు  కూడా కొంత జ్ఞాన బోధ చేసే రచనలు ఉంటే బాగుండునని. గుడ్ పేరెంటింగ్ అనీ, పిల్లల పెంపకం అనీ జనసంచారంలో అమ్మబడే పుస్తకాలు కాకుండా జీవితం నుంచి ఏరుకున్న, జీవితాన్ని గుప్పిట పట్టి జ్ఞాన నేత్రాన్ని కమ్మిన పొరను  తొలగించే రచనలు ఉంటే బాగుండునని అనిపించి,  అలా అనుకొని ఇక ఆ విషయం మర్చిపోయాను. కాకపొతే పది నెలల క్రితం జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారు "నూటొకటో మార్కు" పుస్తకాన్ని మరికొన్ని పుస్తకాలతో నాకు పంపించారు. ఆ పుస్తకాన్ని ఎటూ కుదరని సమయంలో చదవాలని మొదలు పెట్టి , నాయనమ్మ ప్రాణమున్న లాప్టాప్ ఎందుకైంది అని తెలుసుకొని ముచ్చటపడి మొదలు పెట్టి తుదివరకు చదివి..తేలిక పడి నచ్చినవి అండర్లైన్ చేసి ఈ నాలుగు ముక్కలూ రాస్తున్నాను. మొదటి కథనూ తరవాత కథలనూ చదివాక నాకు ఒక విషయం అర్థం అయింది, వారు రాయాలని రాస్తే గాక తాను పరిశీలించిన విషయాన్ని మాత్రం  గొప్పగా చెప్పగలరని.. కదిలించగలరనీ. 

ఎవరో కొందరు నియంత్రిచిన సిలబస్ పసి జీవన గమనాన్ని నిర్దేశించక పోతే జీవితమే గొప్ప సిలబస్ ను నిర్ణయిస్తుంది. ఇది వారికి స్వానుభవం కూడా. అలా    సిలబస్ లో లేని జీవితాన్ని కథలుగా మలిచి పద్దెనిమిదిని కూర్చి ఈ పుస్తకం వేసారు. 

చిన్న కథలలో వారు పొదిగిన విషయం మాత్రం చిన్నది కాదు. భాష మాండలీకమైనా బతుకు పోరు సార్వత్రికం.  ముప్పై ఏళ్ల క్రితం చదువు అందుకోవాలంటే దాట వలసిన సామాజిక న్యూనతను నేర్పుగా పసి నోళ్ళతో చెప్పించారు. న్యూనత మూలం అప్పుడు సామాజికం ఇప్పుడు ఆర్థికం..అంతే తేడా. పిల్లల హృదయాలకు గాయం చేసే ఉపాధ్యాయులు , వాటిని నిష్కర్షగా ఎదురుకొనే విద్యార్థులు ఈ కథలలో కనిపిస్తారు. కన్నవారి హెచ్చులుపోయే తనమూ  కళ్ళకు కట్టినట్టు రాసారు.

పంచన్ లామా, బాటా కంపెనీ అన్న పదాల గుట్టు తెలిసి రగిలిపోయిన పిల్లవాళ్ళ స్పందనకు కదిలిపోతాం. పిల్లల్ని అందునా విద్యార్థులను అత్యంత ప్రభావితం చేయగలిగే ఉపాధ్యాయులు  ఎంత జాగ్రత్తగా మెలగాలో ఈ కథలు చదివితే తెలుస్తుంది.  కథలలో మన జీవితాల్లో జరిగిన సంఘటనలు కళ్ళ ముందు ఎదురుపడతాయి.

రెడ్డప్ప శాస్త్రి పేరు పెట్టినవ్యక్తి చెప్పిన మాట " రంగుల వైవిధ్యాన్ని  మింగిన తెలుపు " ,డెత్ ఆఫ్ లాస్ట్ ఇండియన్ అన్న మాట, డోంట్ డిక్టేట్ నెక్స్ట్ జనరేషన్ అన్న మాట, అలవోకగా అక్కడక్కడా విసిరిన చమత్కారాలు అవీ నిజ జీవిత సంభాషణలు నాకు నచ్చిన అంశాలు. ఇక అన్ని కథలలో కనిపించే ముష్టూరు బహుశా RK నారాయణన్ గారిలా మాల్గుడి కావచ్చునని అనిపించింది.  

మంచి పుస్తకం అచ్చువేసి, ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేసిన  జొన్నవిత్తుల వారు ఎంతైనా  అభినందనీయులు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios