దర్భముళ్ల  చంద్రశేఖర్ కవిత: వాగ్గేయ-వితంతువులు

మళ్లీ మొదలైన పాలస్తీనా, ఇజ్రాయెల్ యుద్దానికి   చలించి దర్భముళ్ల  చంద్రశేఖర్ రాసిన 'వాగ్గేయ-వితంతువులు' కవిత ఇక్కడ చదవండి

Darbhamulla Chandrasekhar Telugu poem, Telugu literature

పాలిచ్చే  స్తనాలైనా 'పాలస్తీనా' పేలుళ్లలో తెగి రాలుతాయి...!
'గాజా' లో 16 రోజుల పండుగ పూర్తి చేసుకోని గాజుల చేతులైనా
గవ్వ పెంకుల్లా పగిలిపోతాయి...!
హమాసు దాడుల్లో 
హవిస్సు అందించే ఋషుల శిష్యుల్లాంటి మూగజీవాలు             
మంచినీళ్లు కలపని  కబేళా మాంసపు ముద్దల్లో కలివిడిగా కలిసిపోతాయి!
ఇసుక రాళ్ల తుఫాను కురిసే ఇజ్రాయెల్లో
ఉదయించే పసి  సూర్యుళ్ల దేహాలని 
నరమేధం నలుపు మేఘాలు కమ్మి
ఒద్దికగా వొరిగి సొమ్మసిల్లించి శవజాగరణ చేయిస్తాయి!
ఎన్నో రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా సాగుతూ....
అటూ ఇటూ ఎటూ తేలని యుద్ధంలో...
వందల పంటలు...
వేల పక్షులు... 
లక్షల జీవజాతులు... ఒక్కటే 'శాంతి' చంపపడుతూనే ఉంటాయి!
మరో తమాషా ఏంటంటే........ మగరాయుళ్లంతా  ఒక్కొక్క పోరాటంలో
చచ్చి వీరస్వర్గం
పొందుతుంటే...
వాక్కు  గేయాల్లాంటి కొడుకు భర్త లైన 
మగ పిచ్చుకలన్నీ మరుభూమికి మళ్ళిపోతుంటే...
దినసరి దీనాలాపనల
దిగులు నిండిన జీవన పోరాటంలో 
తల్లడిల్లే ఈ మగువలు... 
తల్లి విపంచికలు...
తంతులు తెగ్గోసుకున్న వాగ్గేయ వితంతువులుగా మిగిలిపోతుంటారు!!!

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios