దేహ ఆరోగ్య స్థితి అయినా
దేశ ఆర్థిక స్థితి ఐనా
ఇప్పుడు హరితాన్ని కోల్పోకుండా వుండడమే
ప్రగతికి సుగమం-సుకరమూ
హరిత రక్షణే ప్రస్తుత ధర్మం, క్షేమమూ
భవిష్యత్తరాలకు అదే మనం చూపించే మార్గం
వృక్ష పత్రాల హరితం లాగానే
మనిషి మనసులోని ఆత్మ విశ్వాసం కూడా అంతే
ఈ విపత్కర పరిస్థితుల్లో అందరికీ అది విదితమే
ప్రపంచ రాజ్యాల సమస్త రంగాలూ
హంగూ ఆర్భాటాల రంగుల్ని పేలవించుకుంటున్నాయ్
విష క్రిమి ఉచ్వాస నిశ్వాసాల్లో హరితం కోల్పోతూ
ఇంటి గుండె గదుల్లో బంధాల ప్రసరణనూ
ప్రకాశాన్నీ భద్రంగా కాపాడుకోవాలి
రోగపు శత్రు దానవమూకపై
తెల్ల రక్త కణ సైన్యాన్ని మోహరిద్దాం
మనసూ ఇప్పుడు మనిషిలా సంయమనం కోల్పోరాదు
ఆత్మ విశ్వాసపు ప్రాణ వాయువునీ
ఆశావాదాన్ని స్వీకరించడమూ అనివార్యమే
ప్రాణాల్ని రక్షించు కోవడమూ అవశ్యమే
నిన్ను నీవు రక్షించుకోవడమంటే
పరివారం..సమాజం.. దేశాన్ని రక్షించుకున్నట్టే
ఇక పచ్చని పొలాల హరితం
కావాలి మనకు సతతం, అదేగా మనకు ఆహారం
ఆకలి జీవితాలకు ఆధారం
పచ్చ పచ్చల ఆశల హారాలతో
మనుషులు పల్లవించాల్సిందిప్పుడే కొత్త మనుషులై
ఆరోగ్యం, సందేశం-దేహానికి దేశానికి అవసరం ఇప్పుడే..

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature