సమీక్ష అనే పదం పట్ల ఇప్పుడు సాహిత్యలోకానికి సదభిప్రాయంలేదు. సమీక్షకు, విమర్శకు,  పరిశోధనకు మధ్య వ్యత్యాసం తెలియకపోవడం వల్ల సాహిత్యలోకమూ గందరగోళంలో పడింది. సమీక్ష పైన మంచి అభిప్రాయం సాహిత్యలోకంలో లేకపోవడానికి రెండు కారణాలు కనిపిస్తాయి. ఒకటి ఇప్పటి పత్రికలు సమీక్షలుగా ప్రచురిస్తున్నవాటి రూపం, రెండు ఈ సమీక్షలు అందుతున శైలి లేదా పద్ధతి. ఒక తప్పును పత్రికలవాళ్ళు లేదా సదరు పేజీలను నిర్వహించేవాళ్ళు చేస్తుంటే, రెండవది సమీక్షకుల నుంచి వస్తుంది. సమీక్ష పట్ల ప్రణాళికా పూర్వకమైన అధ్యయనం మనకు లేదనేది అందరూ అంగీకరించాల్సిందే. ఇంగ్లీషులో సమీక్షా రచనకు ప్రామాణికమైన ప్రణాళికలు, పద్ధతులున్నాయి. 

ఇంగ్లీషులో "అ హాండ్ బుక్ టు రైట్ బుక్ రివ్యూ"అనే పుస్తకాన్ని చూస్తే మనకిలాంటిది ఒకటి ఉంటే కనీసంగా నన్న ప్రమాణాలు పుస్తక సమీక్షలో ఏర్పడేవి అని అనిపించకపోదు. నిజానికి ఆపుస్తకం కూడా సుమారు ముప్పై సంవత్సరాల క్రితం వచ్చినది. అప్పటికి ఇప్పటికి కూడా ఇంకా ప్రమాణాల విషయంలో, పరిమితుల విషయంలో మార్పులు జరిగి ఉండవచ్చు. జరుగుతాయి కూడా. సాహిత్య గతినిబట్టి అనుశీలనా మార్గాలు కూడా మారుతాయి.  నిజానికి సమీక్షకు ఉండే లక్ష్యాలేమిటి, ఆ లక్ష్యాలను చేరడానికి సమీక్షకునికి  కావలసిన అధ్యయనమెంత ? మన సమీక్షలు ఆదారిలో ఉన్నాయా లేవా? ఒక సాహిత్య కృషిని, సృజనను అనుశీలన చేసే విషయంలో సమిక్షకు, విమర్శకు, పరిశోధనకు మధ్య ఉన్న దూరమెంత ?  ఏవి ఎలాంటి బాధ్యతలను నిర్వహిస్తాయి ? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెదుక్కోకపోతే ఇప్పటి సమీక్షల ప్రయోజనం ఏమీ ఉండదు.

ఇప్పుడు పత్రికల్లో వస్తున్న వాటిని అభిప్రాయం, పరిచయం, వ్యాఖ్యానం, ఉటంకింపు ఇలా కొన్ని పేర్లతో పిలవొచ్చు. నిజానికి కొన్ని పత్రికలు మినహాయిస్తే చాలావరకు పత్రికల్లో సమీక్షలకు ఇస్తున్న స్థలం మరీ తక్కువదేమీ కాదు. కాని పుస్తకాన్ని పరిశీలనకు పెడుతున్న విధానంలోనే మొదటి తప్పటడుగు పడుతుంది.  సమీక్ష, విమర్శ, పరిశోధనతో రచయితకు లేదా రచనకు ఏమీ ఒరిగేదిలేదు, కనుక ఇవన్నీ వ్యర్థమైనవి.  పాఠకులకు రచయితకు మధ్య మరొకడు అవసరంలేదనే అభిప్రాయాలూ కనిపిస్తాయి. రచనను పాఠకుడే చదివి అర్థం చేసుకుంటాడు. అనుభవాన్నో, అనుభూతినో పొందుతాడు అంటూ చేస్తున్న వ్యాఖ్యానాలూ కనిపిస్తాయి. నిజానికి రచనయొక్క జీవితం కేవలం పాఠకుడు, రచయిత మధ్యదేనా అన్నది ప్రశ్న.  సమీక్ష, విమర్శ  రచనను ఒక్కోస్థానాల్లో  వివరంగా, విశ్లేషణాత్మకంగా చర్చించి, మొత్తంభాషా సాహిత్య చరిత్రలో, భారతీయ సాహిత్య చరిత్రలో దానికొక స్థానాన్ని నిర్ణయిస్తారు.  ఒక రచన అధ్యయనం కేవలం పాఠకుడికి, రచయితకు సంబంధించింది మాత్రమే కాదు.  అది సాహిత్య చరిత్రకు సంబంధించింది.  ఆమార్గంలో పూర్తిగా కాకపోయినా పాక్షికంగా నైనా సామాజికచరిత్రకు సంబంధించింది అనే విషయాన్నే సాహిత్యలోకం మరచిపోయింది.  విశ్వనాథ మాటను ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాల్సి ఉంది.

"కవి శక్తి నిర్ణయించి, యా గ్రంథమున కీయవలసిన స్థానము నిర్ణయించి యాస్థానము చెడిపోకుండ చూచుకొనుట యేదో కాలము చేయునని వదిలిపెట్టుదురు. లేదా విమర్శయని పేరుపెట్టి యందుగల రెండు స్ఖాలిత్యములు, రెండు మూడు శబ్ద దోషములు చప్పరింతురు. ఈ జబ్బు మన దేశమున పెద్దల మొదలు పిన్నలవరకు వ్యాపించినది."-(విశ్వనాథ.అసంకలితవ్యాసాలు)

ఇందులో విమర్శను గురించి ఆయన అన్నారుగాని,ఈ వ్యాధి సమీక్షలకు ఎక్కువ.  విమర్శ ఉందాలేదా ?ఉండాల్సిన లక్షణాలతో ఉన్నదా లేదా?  అన్న ప్రశ్నల గురించి తరువాత చర్చిద్దాం.  రెండు స్ఖాలిత్యాలను, ఒకటి రెండు శబ్దదోశాలను చప్పరించే అలవాటు సమీక్షల్లో,  విమర్శల్లోనూ ఉంది.  ఈ మాత్రం శబ్దదోశాలకే కవిత్వాన్ని చీల్చి చెండాడినట్టు చెప్పేవారూ లేకపోలేదు.  నిజానికి పెద్దలకు అతి జ్ఞానం వలన,  పిల్లలకు అజ్ఞానం వల్ల సమీక్ష సార్థకత చెడిపోయింది.  నిజానికి ఇప్పుడు రాస్తున్నవి నూటికి తొంభై పాళ్ళు  సమీక్షలు కాదు.  కవితావాక్యం కింద మళ్లీ కవితాత్మకమైన వ్యాఖ్యను రాసేవాళ్ళు,  నాలుగు కవితావాక్యాలను ఎన్నుకుని వాటికి ఉపోద్ఘాతాన్ని, వివరణను రాసేవాళ్ళు, అర్థతాత్పర్యాలను చెప్పేవారు, పుస్తకంతో కనీస సంబంధంలేని కవి జీవితాన్ని పరిమితికి మించి పరిచయంచేసేవాళ్ళు ఈ కాలానికి ఎక్కువ.  

కవికన్నా కవి సృజనకు, అదినిలబడ్డ చారిత్రకతకు   విలువ ఎక్కువగా ఉండాలన్న అంశం ప్రధానం.  ఇవి కాక ఒకవాక్యం చిరునామ, వెల, పేజీలతో పరిచయం అనడానికీ వీలులేని ఒకరూపం ఇప్పుడు అలవాటులో ఉంది.  అందాయి, చేరాయి, బుక్ షెల్ఫ్ లాంటి పేర్లతో పిలిచే పుస్తకాల రేఖామాత్రపరిచయాలకన్నా ఒకలైను ఎక్కువ.  ఇవన్నీటికి వేరే పేరేదైనా పెట్టుకోవాలి కాని సమీక్షలనడం సరికాదు. కనీస పరిచయం వస్తుందన్న సంతోషమేతప్ప వీటివల్ల ఎలాంటి సాహిత్య ప్రయోజనమూ లేదు.  సాహిత్య చరిత్రకు వీటివల్ల ఒరిగేదీ ఏమీ ఉండదు.  సమీక్షకుని శక్తివలన లఘురూపాల్లోనూ కొన్ని విలువైన విషయాలు చెప్పేవారూ ఇప్పుడు లేకపోలేదు.  అయితే వాటి పరిమితి చలా తక్కువ.  సమీక్షకుని పూర్తి పరిణతకూడా అందులో కనిపించదు.   

Also Readచింతన 1: రూపమూ ప్రక్రియా- కవిత్వం

సమీక్ష నిడివిని, రచనా క్రమాన్ని అది చేయాల్సిన పనిని గమనిస్తే ఆలోచిస్తే మన సమీక్ష ఎక్కడుందో అర్థమవుతుంది.   సమీక్ష నిడివిని 600-2000 పదాలుగా ఇతర భాషల సాహిత్య ప్రపంచం గమనిస్తుంది.  తక్కువలో తక్కువగా పది పేజీలన్నా అవుతుంది ఈ లెక్ఖన.  600ల పదాలనుకున్నప్పుడు నాలుగు పేజీలు.  మన పత్రికల్లో ప్రచురించే ప్రధాన వ్యాసం నిడివి ఇది.   ఉరామరికగా గమనిస్తే మన (ముద్రణలోని)పత్రికల్లోని సమీక్షల నిడివి 50- 200 పదాలు మించదు.   సమీక్ష అనేది అత్యంత లఘు రూపమని మనవాళ్లంతా నిర్ణయానికొచ్చారు.  నిజానికి సమీక్ష అనేది రూప సంబంధమైందే కాని నిడివికి సంబంధించింది కాదు.  కాని రూపం లేదా ప్రక్రియ చేయాల్సిన పనులకు  నిడివి కూడా ప్రధానమే. సాహిత్య పత్రికలు కూడా ఈ నిడివిని ఏ మాత్రం పాటిస్తాయనేది సంశయం.  పుస్తకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, చెప్పాల్సిన విషయాలను ఆధారపూర్వకంగా చెప్పడానికి ఈ మాత్రం నిడివి అవసరమే.  కనీసంగా వెయ్యిపదాల నిడివి ఇయ్యాల్సిన అవసరం ఉంది.  పత్రికలు నాలుగు సమీక్షలను ఒక పేజీలో ఇస్తాయి.   ఇటువంటప్పుడు సమగ్రమైన సమీక్ష సాధ్యం కాదు.  

పూర్వంలో సమీక్ష పేరుతో వచ్చిన పుస్తకాలు వందల పేజీల్లో ఉండేవి. దీపాల పిచ్చయ్యశాస్త్రి "సాహిత్య సమీక్ష" అనే గ్రంథం నాలుగువందల నలభై పేజీలు సుమారు. చిలుకూరి పాపయ్య శాస్త్రి శ్రీనాథ కృతి సమీక్ష నూరు పేజీలపైనే.  అందువల్ల సమీక్ష అనేది పరిశీలనా సంబంధమైందే తప్ప నిడివిది కాదని గమనించాలి.  వందా నాలుగువందల పేజీల్లో రాయకపోయినా ప్రధానంగా ఏ చారిత్రకక్రమంలో నిలబడుతున్నదనేదాన్ని కనీసంగా వివరించగలిగితే చాలు.  కాని ఇప్పటి సమీక్షలు ఆపని చేయడం లేదన్నది గమనించాల్సిన విషయం.  నిడివి విషయంలో కనీసంగా ఒక నాలుగువందల పదాల్లో సమీక్షను ప్రచురించగలిగి రాయగలిగితే;  ఆసమీక్ష పుస్తకానికి సంబంధించిన ఒక చారిత్రక నిర్ణయానికి సంబంధించిన ప్రతిపాదనలు  చేయగలిగితే భవిష్యత్ సాహిత్య చరిత్ర ఈ విలువైన పుస్తకాన్ని, అది తెచ్చిన పరిణామాలను కోల్పోదు.

Also Read: చింతన -2: కవిత్వం -ప్రయోజనం

సమీక్ష చారిత్రక నిర్ణయానికి ప్రతిపాదనలు చేయాలి.  అందుకోసం విలువైన ప్రతిపాదనలు చేయడానికి కనీస నిడివి కావాలి. దానితో పాటు సమీక్షకునికి కనీసంగా ఉండాల్సిన సాహిత్య పరిజ్ఞానం,  చారిత్రక అవగాహన గురించి కూడా మాట్లాడుకోవాలి.  సమీక్షకుడు సాహిత్య చరిత్ర అందులోని విభాగాలపట్ల బలమైన అవగాహన కలవాడై ఉండాలి.  సాహిత్య గమనాన్ని ,అందులోని పరిణామాలను ప్రక్రియ,రూపం ,వాదం ధోరణి మొదలైన అన్ని విభాగాల్లోంచి బాగా పరిశీలించగలవాడై ఉండాలి. అలాంటప్పుడే సరైన, బలమైన ప్రతిపాదనలు చేయగలడు.  సమీక్ష బలంగా ఉండడానికి సమీక్షకుని అధ్యయన బలం, వ్యక్తిత్వం అత్యంతవిలువైనవి. వీటిని గురించికూడా ఆలోచిస్తే సమీక్షా రచనలో మనమెక్కడున్నమో బాగా అర్థమౌతుంది.  సమీక్ష గురించి ఇంకా ఆలోచనలు,చర్చలు జరగాలి.