Asianet News TeluguAsianet News Telugu

ఈ కాలాన్ని వెలిగించిన కవిత్వం

ప్రముఖ కవయిత్రి మెర్సీ మార్గరెట్ కవిత్వ సంపుటిని చిగురాల్ పల్లి ప్రసాద్ సమీక్షించారు. మెర్సీ మార్గరెట్ కవిత్వంలోని సామాజికాంశాలను ఆయన విశ్లేషించారు.
Chiguralpalli Prasad reviews Mercy margaret poetry
Author
Hyderabad, First Published Apr 16, 2020, 1:30 PM IST
నదులు పాయలు పాయలుగా చీలి  సముద్రంలో కలుస్తాయి. ఆకులు రాలి రాలి అడవి కొత్తగా చిగురిస్తుంది. చినుకులు ఒక్కొక్కటి రాలి జడివానగా మారుతుంది.అలాగే మూసుకున్న సమాజపు తలుపులు బద్దలు కొట్టి తెరిస్తే ఇటువంటి పుస్తకం బయటపడుతుందనేది సత్యవాక్కు. తెలుగు సాహిత్యంలో జాతీయోద్యమ, కాల్పనిక, అభ్యుదయ, భావకవిత్వోద్యమాల తర్వాత అత్యంత ప్రభావం చూపిన కవిత్వం స్త్రీవాదకవితోద్యమమని గర్వంగా చెప్పుకోవచ్చు.

స్త్రీవాదంలో తొలి కవిత...

ఓల్గా.."ప్రతి స్త్రీ ఒక నిర్మల కావాలి" అని రాసిందాన్ని  అక్షరాల నిజం చేస్తూ ప్రస్తుతం సమాజంలో కవయిత్రులు ముందుకు రావడం శుభపరిణామం. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే స్త్రీల ఉనికి, కుటుంబంలో తమ స్థానం, కుటుంబం నుండి బయటకు వచ్చినప్పుడు సమాజ స్పందన ఇలా ఎన్నో విషయాలను స్త్రీవాదం వివరిస్తుంది వీటితోపాటు సమాజానికి పట్టిన ప్రతి సమస్యను వివరంగా గాలించడం స్త్రీలు ఏర్పరుచుకున్న నైజం

"Every book of poems is essentially a diary"అన్న ఆంగ్ల కవి మాటలను బలపరుస్తూ ఆయా కాలంలో వచ్చిన కవిత్వం ఆ కాలాన్ని వెలిగిస్తుంది అది మన సాహిత్య బండాగారాన్ని చదివితే తెలుస్తుంది. మరి అప్పుడున్న కవిత్వ సుగంధం ఇప్పుడుందా! అంటే ఉందనే చెప్పాలి రాబోయే కాలంలో కూడా ఉంటుందని నమ్మాలి,ఇలా కాలని వెలిగించే కవిత్వం రాస్తున్న నేటి కవయిత్రులను అభినందించాలి ఇలా కవయిత్రులు తమ తమ స్థాయికి తగ్గ కవిత్వం రాస్తున్న కవులలో ఈ మధ్యనే ఆవిష్కరించిన పుస్తకం "కాలం వాలిపోతున్న వైపు" రచయిత "మెర్సీ మార్గరేట్" ఈ మధ్యనే కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్నది. కవిత్వంలో నాణ్యత,శైలి,పరిణతి.శిల్పంతో పాటు ధైర్యం, ఆలోచనశక్తి, తార్కికబుద్ది ఇలా వివిధఅంశాలపై పట్టుంటే పరుగెడుతున్న కాలాన్ని కూడా వొడిసి పట్టుకోవచ్చు ఇలాంటి ప్రయత్నం చేస్తున్న కవయిత్రి మెర్సీ మార్గరెట్.

     మాటల్ని చీకట్లోకి విసిరాక
     ఆమె ముడుచుకుపోయిన దేహంతో 
     వణుకుతున్న కాళ్ళతో 
     కపోతంలా అల్లల్లాడిపోయింది 
     ఆమె అరుపులకు అప్పటివరకు
     వాక్య సందేశాలు విన్న దేవాలయగోడలు 
  ఎందుకు కూలిపోలేదో" అని ప్రశ్నించింది (జ్వలిత)

అవును ఎందుకు కూలిపోలేదు అని కలం (గళ్ళ)పట్టి అడిగింది. ఒకాటారెండా పూర్వం రాజుల పాదాలకాడ  ఆరిపోయిన చిరుదివ్వెల నుండి నేడు కూలిపోతున్న కొమ్మల వరకు ఓ మానని పాటను ఎత్తుకుందీ మెర్సీ. కామాన్ని మోస్తున్న ఈ ప్రపంచాన్ని ఓ మనిషిని చేయాలని ప్రతి కవి కోరుకుంటాడు మరది నెరవేరిన రోజే కవి రచించిన పుస్తకానికి విలువొస్తుంది దుమ్ము పట్టిన దేహాన్ని ఒంపేసి వీలైతే ఒక భుజం వెతుకుదాం కామాన్ని మంటల్లో తోసి బోసినవ్వుల అక్షరాన్ని వెలిగిద్దాం!ఈమె తన కంటపడిన ప్రతిక్షణాన్ని అక్షరబద్ధం చేసుకుంటూ వెళ్లినందుకు ఈ పుస్తకం పురుడు పోసుకుంది పుస్తకం నిండా సమాజంలో జరిగిన సంఘటనలే ఉన్నాయి అందుకు క్రింది ఉదాహరణ చదవండి

        "కబ్జా భూముల్లో ముళ్ళ తుంపలు వెక్కిరిస్తుంటే 
         బల్లకింద చాచిన చేతులకి 
         రూపాయల దాహం తీరుస్తుంటే 
         నడ్డిమీద తన్నినా అసహాయతకీ
         ఏడ్వనీ ఓ బక్కతాత"!

దేశభక్తుడని ఓటడుగుతూ నీ ముందుకు వచ్చినప్పుడు కసిధీర ముఖంమీద ఉమ్ముదువుగానీ అంటూ మట్టి పాట రాసి దేశాన్ని కాపాడాలని ప్రయత్నించింది దేశంలో జరిగిన,జరుగుతున్న వివిధ సంఘటనలు ఎత్తిచూపి దాన్ని కవిత్వం చేసి ఓ పుస్తకమే కుట్టింది దేశంలో జరుగుతున్న సంఘటనల దృష్ట్యా  ఆమె నేర్చుకున్న అనుభవమే ఈ పుస్తకం ఈ విధంగా చూస్తే కవిత్వం చదివేటప్పుడు ఆడ, మగ,పేరు,కులం,మతం  చూడకూడదని పెద్దపెద్ద ప్రసంగాలలో వింటుంటాం అది చాలా సమయాలలో నిజం అవ్వకపోవచ్చు. శోభయమానంగా అల్లిన నాలుగక్షరాలు మనసుకు కట్టి ఎగరేస్తే అది కవిత్వమౌతుందా!సమాజం ఎడారి కాకముందే అక్కడక్కడా కొన్ని ఒయాసిస్సులు కట్టాలని కవిత్వం నేర్చుకోవాలి వాగు తెగిపొకముందే నదిని దాటాలి సమస్యలు సుడిగుండాలు కాకముందే సంతోషాల సముద్రపు పునాదులెయ్యాలి నువ్వు చూసే అందమైన దృశ్యం సమాజం నేర్చుకోవాలి ఇలాంటి బాణీ కవిత్వం అందుకొని వందభుజాల బలం పూసుకోవాలి గదికి తలుపులు కిటికీలు పెట్టుకుంటాం కొంత వర్షం కొంత గాలి ఇంకా రావాలని అయితే ఇక్కడ మనిషి గది ఒకటేనని కవి భావన ఆవిష్కృతమైంది.

అవును రెండు ఒకటే గది ఎంత అందంగా అలంకరించుకుని మనిషిని కూడా అంతే అందంగా ముఖ్యంగా మనసును కూడా అంతే అందంగా నిర్మించుకోవాలని గొప్ప భావం ఆవిష్కరించిందీకవయిత్రి. ఒక కవి ఏది రాసుకున్న దాని వెనుక ఒక మర్మం దాగి ఉంటుంది కదా ఎవరి కవిత్వం చదివిన అతడు/ఆమె గురించి కొంతైనా తెలుస్తుంది అనేది వాస్తవం.అక్షరాలు తనవైన అప్పుడు ఆత్మ భావం కూడా తనదే అవుతుందని కదా.
    "కాలం వాలిపోతున్న వైపు 
     నువ్వు చూపు సారించు 
     ఎంతటి ఆశ ముడుచుకుపోయే దేహానికి
     ముడతలు పడ్డ ఇంటికి 
     దొంగిలించిన రెండు కిరణాల్ని జేబులో పెట్టుకుని       
     దారంతో కుట్టేస్తూ ఉదయానికి విత్తనాన్ని      
     నాటాలని ఆశ"
ఎంతటి ధనవంతుడైన ఎంతటి పేదవాడైనా  ఎవరి కోసం కూడా కాలం నిరీక్షించదు ఆశ అనేది  అందరికి ఉంటుంది జీవితమంటే ఒక అద్భుతమైన సందేశాన్ని కొట్టొచ్చినట్లు నిర్వహించడం జరిగింది.ఇందులో ఎవరి జీవితాన్ని కూడా వదలకుండా అందరి జీవితాలను కుట్టే ప్రయత్నం చేసింది.

అయితే ప్రతి మనిషి ఒక అద్భుతమైన జీవితాన్ని ఆవిష్కరించుకునే సమయంలో ఎన్నో ఒడిదుడుకులకు కాలం అడ్డుపడుతుంది అయినా ఎదురీదుతూ ఉన్నతమైనటువంటి జీవితం నిర్మించుకునే బాధ్యత మన పైనే ఉంటుందని నమ్మాలి  మన ఉదయానికి ఒక కొత్త విత్తనాన్ని నాటాలని కవయిత్రి ఆశ పడుతుంది. ఇందుకు ఆమె ఒక కావ్యంలో నడుస్తూ మనందరితో నడిచే ప్రయత్నం చేస్తుందీ మెర్సీ మార్గరెట్.

- చిగురాల్ పల్లి ప్రసాద్ 
Follow Us:
Download App:
  • android
  • ios