అర్ధరాత్రి
ఎక్కడనుంచో కాలుతున్న శవం వాసన..
సన్నని పొగ మెల్లగా ఊపిరితిత్తుల్లోకి చేరి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది!

దగ్గరికి వెళ్లి నిలబడ్డాను
నిల్చోబోయింది
విరిచివేయబడ్డ వెన్నముక తనను కుప్పకూల్చింది
ఏదో చెప్పబోయింది
సగం తెగ్గోయబడ్డ నాలిక తన మాటల్ని మింగేసింది

దుఃఖం దుఃఖం 
దుఃఖం దుఃఖం
దుఃఖిస్తూనే దేహంలోంచి వెన్నెముకను వొలిచి 
నా చేతికి అందించింది

కన్నీళ్లు కన్నీళ్లు 
కన్నీళ్లు కన్నీళ్ళు
కన్నీళ్ళను రాల్చుతూనే చితిమంటల్లో దగ్ధమై
అనంతవాయివును చేరింది

*

ఉదయాన్నే నిద్రలోంచి మేల్కొని,
బాల్కానివైపు నడుస్తూ కిందకు తొంగి చూసినప్పుడు
రోడ్డు మీద వేలాది వెన్నెముకలు ఒక నినాదమవుతూ
దేశాన్ని సరిగ్గా నిలబెట్టేందుకు సాగుతున్నాయి..