1.

సుల్కుసుల్కున పొడిచే సూదుల ప్రవాహం నుంచి తప్పిచ్చుకుని దూరంగ పారిపోవుడొక్కటే తెలుసు.ఎదురుతిరిగి దాడిచెయ్యలేనితనమైతే కానే కాదు.బొమ్మలెక్క నిల్సోని పెయ్యంత తూట్లుపొడిపిచ్చుకునుడు సరదా అంతకంటేగాదు.

2.

అట్నుంచి గురిపెట్టి బాణాలేసుడు ఆగిపోతే బాగుండనిపిత్తది.ఎదుటోని అహం ఏడ దెబ్బతిందో తెల్సుకుని మలాం రాసే పనిలో లోలోపలి దేశదేశాలు బైరాగిలెక్క తిరుగుతనే వుంటవు.ఎక్కన్నో ఏ మూలన్నో సట్న దొరికినట్టే దొరికి దాగుడుమూతలాడుడు తీక్షణంగ పరిశీలిత్తనే వుంటవు.

3.

కనబడే ఎల్తురంతా నిజంగాదని కొద్దికొద్దిగ తేటతెల్లమైతనే వుంటది. పచ్చగ కళకళలాడే ప్రకృతి ఎన్కమర్ల ఊహకందని విధ్వంసమేదో జరుగుతాందని మనసు పదేపదే ఘోషిస్తూనే వుంటది.

4.

యుద్ధం తప్పదని తెల్శినా ఒకరోకు కోల్పోవడానికే మొగ్గుసూపుతవు.శత్రువును జయించాలని కంకణమైతే కట్టుకోవు.సాయితగూడెతందుకు వశీకరణ మంత్రం కోసం ఆపచ్చనపడుతాంటవు.శాంతికోసం,సయోధ్య కోసం,సరైన సమయం కోసం క్షణాల్ని యుగాలుగ కొల్సుకుంట ఎదురుసూసుట్లనే అసలైన విజయం దాగుందని అప్పుడప్పుడు సోయిలకొత్తాంటది.

5.

తోటోని బాధను బరాబరి కాంటేయనంతవరకు, మనసు నిమ్మలపడే మాటలు పొదగనంతవరకు అది ఒగ బాధగాదని ఎరుకైతది.

కొస్సకు కాలమే రేపటి గాయాల్ని మాన్పే అసలైన మందని చేతులు దులుపుకుంటవు.

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature