Asianet News TeluguAsianet News Telugu

అరుణ ధూళిపాళ కథ : అలాంటి తల్లులుండబట్టే..!!

"మాదీ హైదరాబాదే. వారానికి నాల్గు రోజులు ఉద్యోగం కోసం బెంగుళూరుకు వెళ్లి వస్తుంటాను" అన్నది ఆమె.

"ఓ..ఐ సీ. మరి మీ వారు?" అడిగాడు. ఒక్క క్షణం ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే అరుణ ధూళిపాళ రాసిన  ' అలాంటి తల్లులుండబట్టే..!! ' కథను ఇక్కడ చదవండి :

Aruna Dhulipala story - bsb
Author
First Published Feb 23, 2024, 1:33 PM IST | Last Updated Feb 23, 2024, 1:33 PM IST

హైదరాబాద్.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్..క్యాబ్ దిగి సీటులో నుండి బ్యాగ్ అందుకొని డ్రైవర్ కి డబ్బులిచ్చి లోపలికి అడుగుపెట్టాడు విరించి. క్యాబ్ తొందరగా బుక్ అవకపోవడం వల్ల ఆలస్యం అవుతుందేమోనని భయపడ్డాడు. కానీ  సమయానికి అరగంట ముందే చేరుకుని, హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకున్నాడు. బెంగుళూరుకు వెళ్లాల్సిన "ఎయిర్ ఏషియా" ఫ్లైట్ ఎక్కి సీటులో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకొని రెండు రోజుల ప్రయాణ బడలికతో అలసిపోయిన కనురెప్పలకు కొంత విశ్రాంతినిచ్చాడు.

హైదరాబాదులో పని చేస్తుండే విరించి ఒక మంచి అవకాశం రావడంతో సంవత్సరం క్రితం భార్య, నాలుగేళ్ళ కొడుకుతో ముంబైకి వచ్చాడు. ముంబైలో పెద్ద ఐటి కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్న విరించి తన మర్యాదపూర్వక ప్రవర్తనతో  కలివిడిగా ఉంటూ అందరికీ తలలో నాలుకలా మెదులుతున్నాడు.  తన కుటుంబీకులు, భార్య కుటుంబీకులు అంతా హైద్రాబాదులో ఉంటారు. SAP ( Systems Applications products in data processing)  బెంగుళూరులో  నిర్వహిస్తున్న "ఇంటర్నేషనల్ టెక్ మీట్" లో పాల్గొనడానికి విరించి ఉద్యోగం చేస్తున్న కంపెనీ ఎంపిక చేసిన ఆరుగురిలో తను ఒకడు కావడం అతని ఉద్యోగ నిబద్ధతకు అద్దం పడుతుంది.

(ఇదే సమయంలో దీపావళి పండుగ కూడా వస్తుండడంతో అందరితో గడిపేందుకు పది రోజులకు ఇంటి నుండి వర్క్ చేయడానికి పర్మిషన్ తీసుకొని హైదరాబాద్ వచ్చాడు. ఇవాళే మీటింగ్ అటెండ్ అవ్వాల్సివుంది. అందుకే ఈ టెన్షనంతా...)
                                  ****  ****

SAP ఆహ్వానం మేరకు వివిధ దేశాల నుండి నియమింపబడిన ఆయా వ్యాపార వాణిజ్య సంస్థల తరఫున వచ్చిన ప్రాజెక్టు మేనేజర్లు విస్తృతంగా చర్చలు జరిపారు. నాలుగు రోజులు వీరందరూ ఉండడానికి అధునాతనమైన ఏర్పాట్లు చేయబడ్డాయి. విజయవంతంగా పూర్తయిన ఆ కార్యక్రమంలో తానూ భాగమైనందుకు ఒకింత గర్వంతో కూడిన సంతృప్తి విరించి మనసులో నిలిచింది.  అదే రోజు సాయంత్రం "కెంపె గౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్" నుండి హైద్రాబాదుకు  తిరుగు ప్రయాణం అయ్యాడు.

విమానం ఎక్కి సీటు దగ్గరికి వెళ్ళేటప్పటికి చివరి సీటులో ఒకావిడ కూర్చొని ఉంది. తనది మధ్య సీటు కావడం వల్ల ఆమె లేచి నిల్చుని పక్కకు జరిగింది. విరించి లోపలికి వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు. కాసేపటికి ఇంకో మహిళ వచ్చింది. ముగ్గురు కూర్చునే సీటులో విండో సీట్ ఆమెది. వీళ్లిద్దరూ లేచి నిల్చుని ఆమెకు దారి ఇచ్చారు. అయితే ఇద్దరి మధ్య తాను కూర్చోవడం తనతోపాటు వారికి కూడా అసౌకర్యంగా ఉంటుందని చివరి సీటు ఆవిడను "మీరు మధ్యలో కూర్చుంటారా?" అని అడిగాడు మర్యాదపూర్వకంగా. ఆమె వెంటనే "అబ్బే! లేదండి. నాకు కాలు కొంచెం నొప్పి. అందుకే ఇక్కడే సౌకర్యంగా ఉంటుంది. పరవాలేదు" అన్నది. సరేనని చిరునవ్వుతో తలూపాడు. అప్పుడు గమనించాడు ఆమెని. దాదాపు 45 ఏళ్ళ వయస్సు ఉంటుంది. నిరాడంబరమైన వేషధారణతో ఉన్న ఆమెలో ఎంతో హుందాతనం. చూడగానే ఒక గౌరవభావం కలిగేలా...

మొదటి నుండి విరించికి మానవ సంబంధాలు, ఆత్మీయతల పట్ల మక్కువ ఎక్కువ. ఒంటరిగా ఉండడం ఎప్పుడో ఒకప్పుడు తప్ప నచ్చదు. అందరితో కబుర్లు చెప్పుకుంటూ, ఇష్టమైన ఆహారాన్ని  తినడం, అప్పుడప్పుడూ బయటి ప్రదేశాలకు కుటుంబంతో వెళ్లి ఆ వాతావరణాన్ని, అక్కడి ప్రత్యేకతను ఆస్వాదించడం అతనికి ఎంతో ఇష్టం. జీవితంలో ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్నవాడు కాబట్టి ఇతరుల బాధకు చలించిపోతాడు. ఒక్కమాటలో చెప్పాలంటే సున్నిత హృదయుడు. బాధల్లో ఉన్నవారికి ఏదో ఒక రకంగా ఉపయోగపడాలి అన్న విశాల దృక్పథం.
                   
                                 ****   ****

అటూ ఇటూ ఆడవాళ్ళ మధ్య కూర్చొని ఉండడం వల్ల అసౌకర్యంగా  అనిపించి యధాలాపంగా చివరి సీటు వైపు చూసాడు. అప్పుడే ఆవిడ కూడా విరించి వైపు చూసి పలకరింపుగా నవ్వింది. విరించి కూడా నవ్వాడు.

"నేటివ్ హైద్రాబాదేనా?" మాటలు కదుపుతూ అడిగింది ఆమె.
"అవునండీ. కానీ ముంబైలో జాబ్ చేస్తున్నాను. వారం రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చాను"  చిరునవ్వుతో  జవాబు ఇచ్చాడు విరించి.
మాట పూర్తయ్యేలోపు "బెంగళూరుకు ఏ పని మీద వచ్చారు?" ఆమె ఆసక్తిగా అడిగింది.
కంపెనీ తరఫున వచ్చిన విషయం అంతా చెప్తూ 'మీరెక్కడ?' అడిగాడు విరించి.
"మాదీ హైదరాబాదే. వారానికి నాల్గు రోజులు ఉద్యోగం కోసం బెంగుళూరుకు వెళ్లి వస్తుంటాను" అన్నది ఆమె.

"ఓ..ఐ సీ. మరి మీ వారు?" అడిగాడు.
ఒక్క క్షణం ఆమె ఏమీ మాట్లాడలేదు. సన్నటి కన్నీటి పొర ఆమె కళ్ళల్లో...
"అయ్యో! సారీ"
"పరవాలేదు.. మావారు రెండేళ్ల క్రితం యాక్సిడెంటల్ గా చనిపోయారు. అప్పటినుండీ నేను ఉద్యోగం చేయవలసి వచ్చింది" అన్నది దీర్ఘంగా నిట్టూరుస్తూ.
"అరరే... సో సాడ్. ఎలా జరిగిందసలు?" అడిగాడు ఆత్రుతగా విరించి.
                                ***    ***
నా పేరు దీప. రెండేళ్ల క్రితం వరకు ఎలాంటి అరమరికలు లేని, నాకే సొంతం అయిన అందమైన ప్రపంచంలో ప్రతీక్షణం ఆనందంగా గడిపాను. మావారు కిశోర్ సాఫ్ట్ వేర్ గా మంచి కంపెనీలో ఉద్యోగం చేసేవారు. మాకు ఒక్కడే కొడుకు ఆదిత్య. ఇంట్లో సరదాగా పెంచుకుంటున్న కుక్కపిల్ల జిమ్మీ. వీళ్ళే నాకున్న లోకం. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినప్పటికీ నాకు ఉద్యోగం చేయాల్సిన అవసరం రాలేదు. కిశోర్ కు నేను ఉద్యోగం చేయడం పట్ల అంత ఆసక్తి లేదు. నిర్ణయం నాకే వదిలేసాడు. ఈలోపు బాబు పుట్టడంతో, వాడి ఆలనా పాలనా చూసుకోవడం కష్టమవుతుందనుకున్నాను. మా వాళ్లంతా, వైజాగ్, విజయవాడ ప్రాంతాల్లో ఉన్నారు. కిశోర్ ఉద్యోగరీత్యా మేమిక్కడ సెటిలయ్యాం. అందుకే ఆ వైపు దృష్టి కూడా పెట్టలేదు.
          
రోజులు ప్రశాంతంగా గడిచి పోతున్నాయి. మాకు దగ్గరి బంధువు వాళ్ళ పెళ్లికి వైజాగ్ వెళ్ళవలసి వచ్చింది. మా అబ్బాయి పదవ తరగతిలో ఉన్నాడు. అయినా దగ్గరి వాళ్ళు కావడం వల్ల వెళ్లక తప్పలేదు. నేను, మావారు, మా అబ్బాయి, కుక్కపిల్లను కూడా తీసుకొని కార్లోనే బయలుదేరాం. డ్రైవింగ్ నాకు కూడా వచ్చు కాబట్టి ఇబ్బంది లేదు. పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది. తిరుగు ప్రయాణమయ్యాము.
                                  ***  ***

మా గమ్యానికి సగం దూరం అయినా వచ్చామో లేదో డ్రైవింగ్ సీట్లో కూర్చున్న మావారు "నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది నువ్వు డ్రైవ్ చేయి" అన్నారు.  పెళ్లిలో విశ్రాంతి లేకుండా తిరగడం వల్ల కావచ్చేమో అనుకుని సరేనన్నాను. పక్కకు ఆపగానే సీట్లు మార్చుకున్నాము. హైవే అవడం వల్ల నేను ప్రశాంతంగా కారును పోనిస్తున్నాను. ఏదో మాట్లాడిస్తున్నాను మావారిని. ఆయన ఊ.. కొట్టడం తప్ప సమాధానం చెప్పడం లేదు. అలసటతో పడుకున్నాడని నేను ఇక డిస్టర్బ్ చేయలేదు. ఇంతలో ఆయన బాగా అవస్థ పడుతూ పక్కకు ఒరిగారు. ఎంత పిలిచినా పలకడం లేదు. డ్రైవ్ చేస్తూ ఆయన భుజాన్ని ఊపుతూ పిలిచినా ఫలితం శూన్యం. నాకు ఏమీ పాలు పోవడం లేదు. అందునా మేము బయలుదేరింది సాయంత్రం పూట. చీకట్లు జుట్టు విరబోసుకున్న దయ్యాల్లా కమ్ముకున్నాయి.  కాస్త దూరంలో మిణుకు మిణుకు లైట్లతో  టౌన్ కనిపించింది.  నాలో  ధైర్యం పెరగసాగింది.  కొద్ది మంది మనుష్యులు ఉన్నచోట కారు ఆపాను.  డ్రైవింగ్ సీటు నుండి దిగి వాళ్ళను చూడమన్నాను. వాళ్ళు వెంటనే అంబులెన్స్ పిలిపించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. గుడ్డిగా అనుసరించాను ధారలుగా కారుతున్న కన్నీళ్ళతో.  స్ట్రెచర్ మీద ఐసియు లోకి తీసుకెళ్ళారు.

"వెయిట్ చేయండి ఇక్కడే" అంటూ లోపలికి వెళుతున్న డాక్టరు నన్ను అక్కడే ఆపారు. 
చిన్నవాడైన మా అబ్బాయి ఏం జరిగిందో తెలియక "అమ్మా! నాన్నకేమైందమ్మా?" అని అడుగుతున్నాడు నన్ను పట్టి ఊపుతూ.
"ఏం లేదు కన్నా!.నాన్న అలసట వల్ల నీరసించారు. కాసేపట్లో ట్రీట్మెంట్ అయిపోతుంది. వెంటనే వెళ్లిపోదాం" అని వాణ్ణి దగ్గరకు తీసుకున్నాను.

కొంతసేపటికి డాక్టర్ లోపలి నుండి వచ్చారు. "Iam so sorry.. he is brought dead. గుండెపోటు రావడం వల్ల అప్పుడే చనిపోయారు" అన్నాడు.
ఆయన చెప్పింది క్షణం సేపు నాకర్థం కాలేదు. ఆయన చెప్పిన ఒక్కొక్క మాట నా మెదడులోకి శూలాల్లా దిగబడుతూ విషయం అర్థమై 'నో' గట్టిగా అరిచాను. భూమి బద్దలై నేను దాంట్లోకి చొచ్చుకు పోయి పాతాళానికి పడిపోతున్నట్టుగా ఉంది. అంధకారపు వలలు నన్ను బంధించి నరనరాలను పిండేస్తున్నట్టు అనిపించింది. ఎత్తయిన కొండపై నుండి బండరాయి పైన పడ్డ ప్రాణిలాగా శక్తి విహీనమై అలాగే కొయ్యబారి పోయాను.

మాకు సహాయంగా నిలిచిన వాళ్ళు సానుభూతిగా చూస్తున్నారు. పోస్టుమార్టం చేయడానికి ఏవో కాగితాలు తెచ్చి సంతకాలు చేయిస్తున్నారు. "మీవాళ్ళు దగ్గరలో ఎవరైనా ఉన్నారా? తీసుకెళ్లడానికి అంబులెన్స్ మాట్లాడాలి కదా!" అడుగుతున్నారు. మెదడు మొద్దుబారింది. జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన కిశోర్...ఇంతసేపు నాతోనే ఉన్న కిశోర్...నా ఆనంద జీవితానికి  అధినేత అయిన కిశోర్....ఆదిత్యకు, నాకు భవిష్యత్తు ఆలంబన అయిన కిశోర్... మమ్మల్ని విడిచి మాకు దూ..రం..గా..!! బిగ్గరగా అరవాలని ఉంది. కిశోర్ ని కుదిపి బలవంతంగా లేపాలని ఉంది. అంతా అయోమయం. డాక్టర్ చెప్పిన విషయం విన్న ఆదిత్య తల్లిని చుట్టుకొని వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. వాణ్ణి గట్టిగా పట్టుకున్నాను. జిమ్మీ ఒక మూలన దీనంగా చూస్తోంది.

రాత్రయింది. జనమంతా పలుచబడ్డారు.  బయట కుర్చీకి అతుక్కుపోయాను. నా స్థితిని గమనించి నాకు సహాయంగా వచ్చిన వాళ్ళు ఆదిత్యను బలవంతంగా బయటకు తీసుకెళ్లి తినిపించారు. నాకు కూడా ఏదో పొట్లం తెచ్చి ఇచ్చి, తినుమని, ధైర్యం కూడగట్టుకోమని సలహా ఇచ్చి వెళ్ళిపోతుంటే దుఃఖం పెల్లుబికింది. చేతులు జోడించి నమస్కరించాను కృతజ్ఞతగా. నా ఒళ్ళో తల పెట్టుకొని ఆదిత్య. ఒక వైపు మోయలేనంత బాధ్యత, ఇంకో వైపు  నాకు కాస్త దూరంలో మార్చురీలో నిర్జీవంగా కిశోర్ తెంచుకున్న బంధంతో.  క్షణాల్లో జీవితం తలకిందులయింది. ఏమిటీ బంధాలు? అయిన వాళ్లంతా ఎక్కడెక్కడో ఉన్నారు? ముక్కూ మొహం తెలియని వాళ్ళు ఆపద్బాంధవులయ్యారు.  భగవంతుడు పెట్టే పరీక్ష ఇంత కఠినంగా ఉంటుందా? మరి కరుణామయుడు ఎలా అయ్యాడు? ఒక్క క్షణం చెప్పడం ఆపి ఊపిరి పీల్చుకుంది దీప. గొంతులో బాధతో కూడిన వణుకు.  బ్యాగులోంచి  బాటిల్ తీసి వాటర్ తాగింది. వింటున్న విరించిలో కూడా చలనం లేదు. అలాగే చూస్తున్నాడు తర్వాత వినబోయే విషయం కోసం ఆసక్తిగా.
                                  
                                    *** ***

ఆలోచన కర్తవ్యాన్ని తట్టిలేపింది. చేయాల్సిన విధిని ఎరుకపరుస్తూ, తప్పదన్న వాస్తవంతో ధైర్యాన్ని నింపింది. గబగబా కళ్ళు తుడుచుకుని కిశోర్ వాళ్ళ అన్నయ్యకు, మా అమ్మా నాన్నలకు ఫోన్ చేసి ఏడుస్తూ విషయం చెప్పాను. క్షణమో యుగంలా రాత్రంతా కుర్చీలో జాగారమే అయ్యింది.
          
ఉదయం కల్లా మా వాళ్లంతా చేరుకున్నారు. రోదనలు ఆసుపత్రి నిండా ప్రతిధ్వనించాయి. నాకు ఏడుపు రావడం లేదు. కన్నీరు గడ్డకట్టింది. ఇక మిగతా పనులన్నీ వాళ్లే చూసుకున్నారు. బిగుసుకుపోయి కూర్చున్నాను. పోస్టుమార్టం అయ్యేలోపే అంబులెన్స్ మాట్లాడారు. అంబులెన్స్ లో ముందు కిశోర్, వెనుక అనుసరిస్తూ కార్లో నేను, మొదటిసారి దూర ప్రయాణాలు చేస్తున్నాం. ఈ దూరం ఇక ఎప్పటికీ తరగదు అన్న ఆలోచన నన్ను దిక్కు తోచని పక్షిలా శూన్యంలో పడేసింది.

విరించి గారూ! తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచాడు. అన్నట్టు కొన్ని అనుభవాలకు హద్దులుండవని నాకప్పుడు బాగా అర్థమైంది. ఇలా ఎందుకంటున్నానంటే, మా ముందు వెళ్తున్న అంబులెన్స్ ఒక్కసారిగా ఆగింది. కిశోర్ వాళ్ళ అన్నయ్య దాంట్లోనే ఉన్నాడు. ఆయన దిగి విషయం తెలుసుకుని చెప్పిన విషయం అంబులెన్స్ ట్రబుల్ ఇచ్చిందని. ఇక నా మనస్సు అప్పుడు ఏ స్థితిలో ఉంటుందో ఊహించండి. మళ్లీ ప్రయత్నం చేసి ఇంకో అంబులెన్స్ వచ్చేటప్పటికి రెండు గంటలు పట్టింది.  తర్వాత జరగాల్సినవన్నీ యధావిధిగా జరిగాయి.
                               ****.  ****
"ఇక భవిష్యత్తు గురించి ప్రశ్న.  మా వాళ్ళు, కిశోర్ వైపు వాళ్ళు ఎన్నో చర్చలు చేసి వైజాగ్ కు నన్ను, మా అబ్బాయిని తీసుకెళ్లడమే సరియైన పరిష్కారం అని నిర్ధారించి నన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు. అందరి మాటలు విని "నేను హైదరాబాద్ లోనే ఉంటాను. పిల్లవాడు ఇక్కడే చదువుకుంటాడు. అడపాదడపా వచ్చి చూడండి. నేను ఎవరికీ భారంగా మిగలను" అని స్థిరంగా చెప్పాను. వాళ్లంతా వెళ్లిపోయారు. నలుగురం కలిసి ఉండే ఆ ఇల్లు ముగ్గురికి మాత్రమే ఆవాసమైంది.

కిశోర్ వాళ్ళ ఆఫీసు మేనేజ్మెంట్ వాళ్ళు తన జాబ్ నాకు ఇచ్చారు. అక్కడ ఖాళీ లేనందువల్ల బెంగుళూరుకు వేశారు. అందుకే వారంలో నాల్గు రోజులు వెళ్లి వస్తుంటాను. కిశోర్ స్నేహితులు, ఆదిత్య ఈ విషయంలో ఎంతో అండదండలుగా ఉంటారు. ఒక నెల క్రితం మెట్టు మీద నుండి జారి పడ్డానండీ.. నొప్పి ఇంకా తగ్గలేదు. అందుకే చివరి సీటులో కూర్చుంటానన్నాను".  అని ముగించింది.  విరించి కళ్ళనిండా నీళ్ళు.

"అయ్యో విరించి గారూ! నా పరిస్థితిని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? సారీ అండీ"

"అదేం లేదమ్మా! మనిషి జీవితంలో ఎప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో తెలియదు. ఈమాత్రం దానికేనా ఇన్ని ఆశలు? అనిపిస్తుంది. అయినా మనిషి మటుకు అహంకారం ముసుగేసుకొని తిరుగుతున్నాడు.  మీకోమాట చెప్తాను. పరిస్థితులు, పరిసరాలు ఏవైనా మీలాంటి జీవితమే మాది. నేను కూడా ఆక్సిడెంటులో మా నాన్నను కోల్పోయాను. మా అమ్మ కూడా ఇలాగే బాధ్యతలు నిర్వర్తిస్తూ నన్నింతటి వాణ్ణి చేసింది. మీలాంటి త్యాగమూర్తులైన కన్న తల్లులు ఉన్నారు కాబట్టే మనదేశంలో ఈ మాత్రమైనా  మానవ సంబంధాలు ఇంకా జీవం పోసుకుంటున్నాయి. ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా ఆదిత్యకు ఒక అన్నయ్య ఉన్నాడని ధైర్యంగా ఉండండి" అని దీప ఫోన్ నంబర్ అడిగి తీసుకొని తన నెంబర్ ఇచ్చి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విమానం దిగి ఆమె దగ్గర వీడ్కోలు తీసుకొని భారంగా ముందుకు కదిలాడు విరించి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios