అనుభవసారం 'జీవన తాత్పర్యం'.. అన్నవరం దేవేందర్ కవిత్వం..

నేడు అన్నవరం దేవేందర్ కవిత్వం (1988 -2022 ) పన్నెండు సంపుటాల బృహత్ సంకలనం కరీంనగర్ లో ఆవిష్కరణ సందర్భంగా అన్నవరం 12వ కవిత్వ సంపుటి  'జీవన తాత్పర్యం' పైన నల్లగొండ నుండి  సాగర్ల సత్తయ్య రాసిన సమీక్ష ఇక్కడ చదవండి :
 

Anubhavasaram jivana tatparyam Annavaram Devender poetry

సౌందర్యాత్మక దృష్టి, సామాజిక స్పృహ, లోతైన అభివ్యక్తి, కవిత్వ నిర్మాణ మర్మం తెలిసిన వారి కవిత్వం ఎట్లా ఉంటుంది అంటే అన్నవరం దేవేందర్ కవితను దానికి ఉదాహరణగా చూపించవచ్చు. 'తొవ్వ' నుండి నేటి 'జీవన తాత్పర్యం' దాకా అన్నవరం కవిత్వంలో అడుగడుగునా  సామాజిక స్పృహ కనిపిస్తూనే ఉంటుంది. అన్యాయం పట్ల ధిక్కారస్వరం వినిపిస్తూనే ఉంటుంది. ఇందుకు 'జీవన తాత్పర్యం' కూడా మినహాయింపు కాదు.

'జీవన తాత్పర్యం' కవిత్వ సంపుటిలో  అడుగడుగునా స్త్రీలు ఎదుర్కొంటున్న  అణచివేతను  పురుషాధిపత్యాన్ని  నిరసించే కవిత 'ఆధిపత్యం'.   'సకల ఆధిపత్యాలను ధిక్కరిస్తేనే ధీరత్వం' అంటూ స్త్రీలకు ధైర్యం నూరిపోస్తున్నాడీ కవి. తన  చిన్ననాటి స్నేహితురాలి కూతురు ఎదురుపడ్డప్పుడు ఆమెలో తల్లి పోలికలను గమనించిన కవి నలభై ఏళ్ల కిందటి మధుర జ్ఞాపకాల తలపోత 'అచ్చం' కవిత.  అందరి జీవితాల్లోనూ ఇటువంటి అనుభవాలు ఉంటాయి కానీ సన్నివేశాన్ని కవి కవిత్వీకరించిన తీరు అబ్బురపరుస్తుంది.
"పాత జ్ఞాపకాల బ్యాకప్ పొరల నుంచి
 ఎంత సెర్చ్ చేసినా కొలిక్కి చిక్కని ఆకారం
   ....   ....   ....   ....   ....   ....   .....
 పదబంధ ప్రహేళికల్లో కూర్చే అక్షరాల్లా
నిలువు అడ్డం గడులతో ఆలోచిస్తున్నాను
నలభై ఏళ్ల కింది కాలమానిని కనిపించింది"
ఈ కవిత్వ పాదాలను చదివినప్పుడు చేయి తిరిగిన కవి మాత్రమే  ఇంత చక్కగా కవిత్వీకరించగలడనిపిస్తుంది.

Anubhavasaram jivana tatparyam Annavaram Devender poetry

ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపిన కరోనాకాలం  పలకరింపులను గురించి రాసిన కవిత 'నొసలు'.  ఒకప్పుడు ఒకరిని ఒకరు కలుసుకుంటే మనసు విప్పి మాట్లాడుకునే నిష్కల్మష  వాతావరణం ఉండేది.  మానవ సంబంధాలు మృగ్యమౌతున్న వేళ ఎదుటి వ్యక్తి మాటల్లోని స్వచ్ఛతను అర్థం చేసుకోవడానికి కంటి వెలుగులే ఆధారమని,  ముఖ కవళికలే సాక్ష్యం అని చెబుతూ  నేటి కరోనాకాలంలో
" ఇప్పుడు ఎవరి మౌఖిక సౌందర్యము
 మరొకరికి కనిపించని మాస్కుల కాలం" అంటారు.
కేవలం నొసలును చూసి పోల్చుకునే కాలం దాపురించిందనే ఆవేదన 'నొసలు' కవితలో కనిపిస్తుంది.

అన్నవరం దేవేందర్ ప్రకృతి ప్రేమికుడు, సౌందర్యోపాసకుడునూ.  వీరి 'పొద్దున్నే లేస్తే' కవిత ఇందుకు నిదర్శనం.  ప్రకృతితో తాను మమేకమైన తీరు ఈ కవితలో అందంగా ఆవిష్కరించబడింది.  'చూపులు' అనే కవితలోనూ ఈ కవికి గల ప్రకృతి పట్ల ప్రేమ ఎట్టిదో తెలుస్తున్నది.  చెరువు నీళ్ల అలలు, బడి పిల్లల క్రీడా మైదానం, విశాలమైన వినీలాకాశం, దట్టమైన అరణ్యం, కమ్మని పోపు వాసన, తెల్లని కాగితాలు నిండుగా పూసిన మల్లెతీగ ఇవన్నీ కూడా కవి అంతర దృష్టితో చూసి తాదాత్మ్యం చెందుతాడు. 

'చిటపట చినుకుల కాలం' కవితలో ప్రకృతి సమతుల్యత కోల్పోవడం వలన, మానవుడి స్వార్థంతో వనరుల విధ్వంసం జరగడం వల్ల ప్రకృతి ప్రకోపాన్ని తన కవితలో ప్రదర్శించారు. 'పరవశం' కవితలో  కేరళ అందాలను దృశ్యమానం చేశారు.

కాదేది కవిత కనర్హం  అన్నట్లు 'శబ్దం'పై రాసిన  కవిత పాఠకులను వివశులను చేస్తుంది.
"అల్లుకున్న అక్షరాల గళం పద శబ్దరూపం
ఆలోచనల సిరాసారం నిశ్శబ్దంగా సాగే వాక్యం " అంటారు శబ్దానికి వాక్యానికి వీరిచ్చిన నిర్వచనం నిత్య నూతనం.

అన్నవరం దేవేందర్ సామాజిక స్పృహ ఉన్న కవి. సమాజంలోని సమకాలీన  సంఘటనలపై  జరుగుతున్న అన్యాయాలపై ధర్మాగ్రహాన్ని ప్రకటిస్తారు. ఇటీవల కాలంలో తెలంగాణ రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన సమస్య ధాన్యం కొనుగోలు.  ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలుకు నిరాకరించినప్పుడు రైతు పక్షాన నిలబడి నిలదీసిన కవి అన్నవరం. వరి నారు మడి అనే కవితలో  ఈ విషయం మనకు అవగతమవుతున్నది.
"ఉత్పత్తి అవసరాలు మిగులుబాటు
కొనుగోలు సూత్రాలు మీ వ్యవహారం
అనాదిగా ఆకలి తీర్చడమే మా వ్యాపకం " రైతు తాను కష్టించకపోతే  ఈ జగతికి తిండి దొరకదు.  అటువంటి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేని దీనస్థితి ఈ దేశపు దౌర్భాగ్యం.  కావలసిన నీటిపారుదల సౌకర్యాలు కల్పించి యాసంగి పంట వద్దంటే ఎట్లా అని ప్రభుత్వాన్ని నిలదీశాడు ఈ కవి.  వరి నారుమడి  అనాదికాలం నుంచి రైతుల జీవితంలో సాంస్కృతిక పరంపర అని తేల్చి చెప్పాడు. 'నాగళ్లకు సంకెళ్లు' అనే కవితలో రిజర్వాయర్ల కోసం భూములు కోల్పోయిన గౌరెల్లి రైతుల ఆవేదన ఆర్ద్రంగా తెలియజేశారు. తెలంగాణ కోసం రణం చేసిన చేతులకు సంకెళ్లు  వేశారని దుఃఖించారు. మన్ను నుంచి అన్నం పుట్టిస్తూ ఆకలి తీర్చడమే వారి జీవన సంకల్పంగా జీవిస్తున్న రైతులకు అన్యాయం జరుగుతున్నదని వాపోయారు.

జీవన తాత్పర్యం సంపుటిలో లోతైన తాత్విక దృష్టి కలిగిన కవిత 'నీలోకి నీవే'.  మనిషి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరాన్ని గాఢమైన  వ్యక్తికరణతో తెలిపారు.
" నీ అంతరాత్మ కుహరంలోకి చెయ్యి పెట్టి
   ఏకాంతంగా దేవులాడుతుండు
   అహంకారపు మాటలు ఎవరినైనా గుచ్చి
   నొప్పించిన గుడిసెలు వేళ్లకు తగలవచ్చు "
అంటూ నిరంతరం మనకు మనమే మన చర్యలను, ఇతరుల పట్ల మన ప్రవర్తనను ఆత్మావలోకనం చేసుకోవాల్సిందిగా పిలుపునిస్తున్నాడు. నిరంతరం అంతరాత్మను ఎమ్మారై చేపిస్తేనే ఆత్మవలోకన పుష్పం వికసిస్తుందంటాడు.  ఈ కవిత చదివిన ప్రతి పాఠకుడు తనను తాను ఒకసారి తడిమి చూసుకుంటాడు.

పరిచయం అక్కరలేని జగమెరిగిన సాహితీవేత్త ఆచార్య ఎన్ గోపి.  'కవిచెట్టు' కవితలో  గోపి గారి మూర్తిమత్వాన్ని  సాక్షాత్కరింపజేశారు.
" తల్లి వేరు చుట్టూ మట్టి ముత్యాల రహస్యం
  వాక్యాలు వాక్యాలుగా వంగిన మండలు
  అది కవిత్వం విరబూసిన మహావృక్షం " అని గోపి గారిని మహావృక్షంగా అభివర్ణించారు.  ఆయన పక్కన నిలుచుంటే  ఆయన పద చిత్రాల పుప్పొడిని ఆస్వాదించవచ్చన్నారు. 

'పోయి రావాలె' అనేది గొప్ప నోస్టాల్జియా పోయెమ్. తన అమ్మమ్మ ఊరి మధుర జ్ఞాపకాలను, గ్రామ సీమలో ఉండే  అనుబంధాలను,  పల్లె సౌందర్యాన్ని గుర్తు చేసుకునే కవిత ఇది.  గ్రామంతో కవికి ఉన్న అనుబంధాన్ని, పల్లె పట్ల కవికి ఉన్న ప్రేమానురాగాలను ఈ కవిత ప్రతిబింబిస్తుంది. సృజన కారుడికి  ఒక కవిత రాయడం ఎంత కష్టమో అది రాసిన వారు తప్ప ఇతరులెరుగరు. తాను అనుభవించిన ఈ స్థితిని  అన్నవరం దేవేందర్ 'సృజన' కవితలో అందంగా వ్యక్తీకరించారు.  నూతనంగా కవిత్వ రంగంలోకి ప్రవేశించే వారికి మార్గ నిర్దేశం చేస్తున్నట్లుగా ఈ కవిత కనిపిస్తుంది.
"ఊరు వాడలు తిరిగితే  మాటలు ఏరుకోవచ్చు
  దృష్టి ఉంటేనే కవి చుట్టూ కవన తేజస్సు
   ....   ....   ....   ....   ....   ....   .....
  కవిత్వం అవలీలగా కమ్ముకోవాలంటే
  నులక అల్లే మెలకువ తెలిసి ఉండాలి
  తొడ మీద పగ్గం పేనుడన్నా చూసి ఉండాలి
  శ్రమైక జీవన అల్లిక పదాల పొందిక ఒక్క తీరే"
అనే కవితా పంక్తులు  కవికి గల కవిత్వం అల్లడంలోని అనుభవం, శ్రమ పట్ల గౌరవం ద్యోకతమవుతాయి.

శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లో  భావ ప్రసరణకు  సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత గోడలపై  రాజకీయపరమైన సైద్ధాంతిక రాతల హోరు కొంత తగ్గింది కానీ మూడు దశాబ్దాలకు పూర్వం గోడలన్నీ రాజకీయ భావజాలాన్ని వ్యాప్తి చేసే వేదికలుగా ఉండేవి. ' వాల్ పోస్టర్ ' కవితలో  ' వాల్ రైటింగ్ చేయడం అంటే తడారిన గొంతుకలకు ధిక్కారస్వరం అందించడం' అంటారు.  అలనాటి వాల్ పోస్టర్ ను ఒక కమ్యూనికేషన్ సిస్టంగా,  ఒక సమాచార దస్తావేజుగా అభివర్ణించారు. అన్నవరం దేవేందర్ కరీంనగర్ నివాసి.  ఉద్యమాలకు పురిటి గడ్డ అయిన కరీంనగర్ ఒకప్పుడు నక్సలైట్ ఉద్యమానికి ఊపిరిలూదిన నేల. ఎందరో వీరులు సమ సమాజాన్ని కాంక్షించి తమ జీవితాలను త్యాగం చేసిన ఆనవాళ్లు కరీంనగర్ పల్లెల్లో అడుగడుగునా కనిపిస్తాయి. వారి స్మృతిని  తలుచుకుంటూ అన్నవరం రాసిన 'తల పువ్వులు' కవిత  వారికి ఒక గొప్ప అక్షరాంజలి. ఆనాటి స్థితిని కవి మన కళ్ళ ముందు ఉంచుతూ
" దూసుకుపోతున్న తూటాలు తెగిపోయిన కంఠాలు
   చేను చెలకల్లో వాగు వంకల్లో నెత్తుటి చారికలు
   ఊరు అడవి వృక్షాలు ఒక యుద్ధ చరిత్ర
   చెట్ల ఆకుల్లోంచి ఇప్పటికీ కన్నీళ్ల భాష్పోత్సేకం..."

ఇంకా మరువలేని ఆనాటి యుద్ధ వాతావరణం, త్యాగనిరతికి దర్పణంగా నిలిచిన కవిత ఇది. అమ్మపై ఈ కవికి అనురాగం మెండు. తన తల్లి కాటరాక్ట్  కంటి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు తల్లి కంటిలో మందు చుక్కలు వేయడాన్ని కవిత్వీకరించిన నేర్పరి అన్నవరం దేవేందర్.
" అమ్మ నయనాల్లో డ్రాప్స్ వేయడం
   మాకు చూపునిచ్చిన కళ్ళను కన్నీళ్ళతో కడగడమే " అంటూ కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేస్తారు.  'జీవన తాత్పర్యం' కవితలో అమ్మ ఔన్నత్యాన్ని  ఎవరెస్టు శిఖరం పై నిలిపారు. అమ్మను శ్రమజీవన కావ్యంగా,  జ్ఞాన సముద్రంగా అభివర్ణించారు.

నేటి విలువలు లేని రాజకీయాలను తూర్పారాబడుతూ 'ఇక్కడ జిత్తులు అమ్మబడును' అనే కవిత రాశారు.
" తలకాయలో ఓట్ల గింజలు చల్లి
  వ్యూహ ప్రతి వ్యూహాల మొలకలు మొలిపించి
  పచ్చని చిలుకల పలుకుల పంటలు తీస్తాం "  అంటూ వ్యంగ్యంగా  నేటి రాజకీయ నాయకుల స్వార్థ బుద్ధిని ఎండగట్టారు.

ఇప్పటివరకు సాహిత్యంలో  వలస  పట్ల వ్యతిరేక ధోరణితో కూడిన కవిత్వమే  కనిపిస్తూ ఉంటుంది.  వలస అంటే అదేదో శాపం అయినట్లు వలస జీవుల పట్ల విపరీతమైన సానుభూతిని కురిపిస్తూ వచ్చిన కవిత్వం కోకొల్లలు.  వలసను కొత్తచూపుతో చూసిన కవి అన్నవరం దేవేందర్.  ఒక సానుకూల దృక్పథంతో  వలస వల్ల సమాజానికి జరిగే మేలును  'వలస' కవితలో అందంగా ఆవిష్కరించారు. సకల జీవులకు వలస ఒక అనివార్యత అని తేల్చి చెప్పారు.
" పుట్టిన నేల ఒక పురా జ్ఞాపకం
   ప్రయాణమే అసలైన జీవన సౌందర్యం
   వలసలన్నీ భాషా సంస్కృతుల మేలు కలయికలు " వలస జీవితంలో ఒక భాగం అని ఒక సాంస్కృతిక జాతీయతా సంపర్కం అని అంటారు. సూర్యోదయాలు అస్తమయాలు ఉన్నట్లే మనిషి జీవితంలోనూ జనన మరణాలు అత్యంత సహజం. జీవన తాత్పర్యం తెలిసిన ఈ కవి తన 'అగులు బుగులు' కవితలో ఈ మర్మాన్ని తెలియజేశారు.

" పొద్దు తనకు తాను అటు నుంచి ఇటు వాలడం ఖాయం
   ఎండా వాన గాలి సమస్తం అనుభవాల సారం
   మనిషికైనా కాలానికైనా  పరీక్షలే ప్రవాహ గుణశీలం "  అనే ఈ కవి మనిషి జీవితంలో ఎటువంటి పరీక్షలు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలని సందేశం ఇచ్చారు.

' జీవన తాత్పర్యం '  కవిత్వ సంపుటి పేరులోనే అన్నవరం దేవేందర్ గారి అనుభవమంతా నిక్షిప్తమై ఉంది. వారి ఆరు పదుల జీవన సారం ఈ కవిత్వంలో తొణికిసలాడుతుంది. ఒకానొక కవితలో గోపి గారి గురించి చెప్పిన కవిత్వ వాక్యాలు
  " కవి గత వర్తమానాల చరిత్ర సారభూతం
    కవి భవిష్యత్ కళ్ళ ముందు నిలిపే కాలజ్ఞాని
    కవిత్వం ఇప్పుడు నడుస్తున్న ఇతిహాసం  " అనే మాటలు అన్నవరం దేవేందర్ గారి కవిత్వానికి కూడా వర్తిస్తాయి. ఆస్వాదించగలిగే పాఠకులకు వీరి కవిత్వం బువ్వకుండ లాంటిదే.  అనుభవ సారాన్ని మేళవించి రాసిన ఈ కవిత్వం ఇకముందు కూడా  కొనసాగాలని తెలుగు సాహిత్యానికి మరెన్నో కృతులను అందించాలని ప్రగాఢ ఆకాంక్ష.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios