Asianet News TeluguAsianet News Telugu

నా పేరు లక్ష్మి

ఆడపిల్లలపై వివక్షను స్పృశిస్తూ అన్సారీ రాసిన నా పేరు లక్ష్మీ  తెలుగు కథను ఇక్కడ చదవండి . 

Ansari telugu novel naa peru lakshmi ksp
Author
First Published Jan 25, 2024, 4:57 PM IST | Last Updated Jan 25, 2024, 4:57 PM IST

తెలతెలవారుతుండగా... పెద్ద కూత పెడుతూ రైలు సికింద్రాబాద్ స్టేషన్ లో ఆగింది.  ఏడాది వయసున్న కొడుకు మీరా ని  చంకలో ఎత్తుకుని, ఇంకో చేత్తో మూడేళ్ల వయసున్న కూతురు ముస్కాన్  రెక్క పట్టుకుని జాగ్రత్తగా కిందకు దిగింది జాన్ బి. ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. అలా నడుస్తూ వెళుతున్నారు. పిల్లోడికి ఆకలి గుర్తొంచ్చిందేమో రొమ్ముకోసం తడుముకుంటున్నాడు. జాన్ బి నిన్నంతా తిన్నదే లేదు. ఎక్కడినుంచి వస్తయ్ పాలు? పక్కనున్న హోటల్ లో కాసిని మంచినీళ్లడిగి పిల్లలకి పట్టించింది. మళ్లీ నడక మొదలు పెట్టింది. టిఫిన్ బాక్సులు పట్టుకుని, కండువాలు కప్పుకుని దూరంగా కొంతమంది కనిపించారు. బహుశా అడ్డాకూలీలు అయ్యుంటారనుకుంది. 

దగ్గరికెళ్లి నడివయసులో ఉన్న ఒకామెను(లచ్చవ్వ) అడిగింది. "అక్కా ! పనికెల్తున్నారా? నాక్కూడా ఏదైనా పనిచెప్పక్కా... పిల్లలకి ఇంత అన్నం పెట్టాలి అని అడిగింది". "ఏవూరు నీది?, ఏడికెంచి అస్తున్నవ్?, పిలగాల్లను గూడా ఇట్లనే పనికితీస్కత్తవా?!" అందామె. "అవును అక్కా. ఇప్పుడే రైలు దిగాం. ఎక్కడికి ఎల్లాలో తెలీట్లా. ఏదైనా పనుంటే చెప్పక్కా" అంది జాన్ బీ. "అట్లనా..., ఇంట్ల కొట్లాడి అచ్చినవా ఏంది? పోని తీ. నీ కత నిమ్మలంగ ఇంట గానీ, ఈడ్నే గూసో, మా వోల్లకి జెపుతా, ఎవులన్న పిలిత్తే పనికి వోదం" అని కాస్త భరోసా ఇచ్చిందామె. తన కండవలో కట్టిన అరటిపళ్లు తీసి పిల్లలకు చెరోటి ఇచ్చింది. ఇంతలోనే పెద్ద కారులో ఒకాయన వచ్చాడు. 

గార్డెన్ చదునుచేసి, గుంతలు తవ్వి మొక్కలు నాటాలి, పదిమంది మనుషులు కావాలన్నాడు. పనోళ్ల లీడరు ఆయనతో మాట్లాడుతున్నాడు. వాళ్ల గ్రూపులో ఉన్న తొమ్మిదిమందితో పాటు జాన్ బీ ని కూడా పనికితీసుకెళ్లారు. పిల్లలిద్దరినీ ఒక చెట్టుకింద కూర్చోబెట్టింది. పనిచేసుకుంటూనే గమనిస్తూ ఉంది. లచ్చవ్వ కూడా మధ్యమధ్యలో జాన్ బీ ని చూస్తూనే ఉంది, బక్కచిక్కిన శరీరంతోనే అంత కష్టం చేస్తోంటే.., " ఏం కష్టమొచ్చిందో పొల్లకి" అని మనసులో అనుకుంది. మధ్యాహ్నం కావొస్తోంది. పిల్లలు ఆకలికి ఏడుస్తున్నారు. వాళ్ల బాధ చూడలేక మిగిలినోళ్లు తలా కొంచెం అన్నం పెట్టారు. జాన్ బీ ని కూడా తినమన్నారు, ముందు మొహమాటానికి వద్దన్నా సాయంత్రం దాకా పనిచేయాలి,సత్తువ కావాలంటే... ఒకముద్ద తినాల్సిందే అనుకుంది.  

కానీ దుఖంతో పూడుకున్న  గొంతులోనుంచి ముద్ద దిగడం కష్టమైంది. సాయంత్రానికి కూలి డబ్బులు నూటయాభై ఇచ్చారు. నిన్న రైలు ఎక్కినప్పటినుంచి పిల్లలకి పాలు కొనడానికి కూడా తన దగ్గర డబ్బులేదు. ఇప్పుడు ఈ డబ్బు చూస్తే చాలా ధైర్యం వచ్చింది జాన్ బీ కి. కానీ మళ్లీ అదే ప్రశ్న కమ్మేసింది. "ఇప్పుడు ఎక్కడకు ఎల్లాలి?" పొద్దున సాయం చేసిన లచ్చవ్వ దగ్గరికి వెళ్లింది. ఆమె కూడా అప్పుడే కూలి డబ్బులు తీసుకుని పక్కనే షాపులో పాన్ కొనుక్కుంటోంది. "అక్కా!" అని మెల్లగా పిలిచింది జాన్ బీ. " ఏంది పొల్ల మల్లచ్చినవా? పనిజేసినవ్, పైసలచ్చినయ్, ఇంగేంది?" అని అడిగింది. అంత కటువుగా అనే సరికి ఏం మాట్లాడాలో అర్ధంకాలేదు. "అక్కా, చిన్నపిల్లలున్నారు ఈ  రేత్రికి మీ ఇంట్లో ఉండనిస్తావా? రేపు నెను యేరే ఇల్లేదన్నా చూసుకుంటా" అని అభ్యర్ధించింది జాన్ బీ. 

"ఇసంట రమ్మంటే ఇల్లు సుత నాదే అన్నడంట నీ అసుంటోడే " అని నవ్వేసింది లచ్చవ్వ. " నువ్వు కష్టంలో ఉన్నవని కనవడతాంది..., కానీ తీ, పోదాం" అని  పాపని ఎత్తుకుంది లచ్చవ్వ. చాలా దూరం నడిచి వాళ్లుండే బస్తీకొచ్చారు. ఒక్కటే గది. బయట కాస్త స్థలం, అదే లచ్చవ్వ ఇల్లు. లచ్చవ్వ కాళ్లు, చేతులూ కడుక్కుని పిల్లకు కూడా మొహం కడిగి తాళం తీసింది. " బోనెల్లో నీళ్లు పోసి కడక్కరాపో"  అని జాన్ బీ కి చెప్పింది. ఆ లోపు డబ్బాలో ఉన్న బ్రెడ్డు ముక్క తీసి పిల్లలకిచ్చింది. ఆవురావురంటూ తింటున్నారు పిల్లలు. " పొయ్యి మీన బియ్యమెయ్యి, నేను బిర్రునొస్తా"  అని పోయింది లచ్చవ్వ. కాసేపటికి చేతిలో పాలప్యాకెట్, రెండు గుడ్లు, టమాటాలు తీసుకొచ్చింది. " అన్నం పెట్టినవా?! సరే గానీ గీ టమాటాల్ల గుడ్లు బొర్లిస్తా తిందం. పిలగానికి ఈ పాలుగాసి పట్టు. బిడ్డ కడుపంటకవొయ్యింది..," అంటోన్న లచ్చవ్వను చూసి కన్నీళ్లాగలేదు జాన్ బీ కి." ఇప్పుడేమాయే బిడ్డా ఊ కో!, పో పాలువట్టు" అంది లచ్చవ్వ . 

పిల్లలు పాలు తాగి పడుకున్నారు. అన్నం అవ్వగానే చెరోక పళ్లెంలో పెట్టుకొచ్చింది. ఒక పళ్లెం జాన్ బీ కి ఇస్తూ..., " ఇంగ నీ కతేందో చెప్పు. పొద్దుగల పొద్దుగల రైలుకచ్చినవ్? ఈడ ఎవ్వరు తెల్వకుండ ఇద్దరు పిలగాల్లతోని ఎట్ల బతుకుతవ్? " అడిగింది లచ్చవ్వ. జాన్ బీ కి ఎక్కడనుంచి మొదలుపెట్టాలో అర్ధం కాలేదు.....
  
అడపిల్ల పుట్టిందని తనని గుడ్డలో చుట్టి చెత్తకుప్పలో పడేశారు. జుమ్మా నమాజ్ చదివి వస్తున్న హుస్సేన్ సాయిబు చూసి, తనకు ఎవరూ లేకపోవడంతో అల్లానే ఇచ్చాడనుకుని ఆ బిడ్డని ఇంటికి తీసుకెళ్లాడు. ఆ పాపను పెంచుకోవడానికి కాలనీలో ఉండే పెద్దలు అభ్యంతరం చెప్పారు. ఏం కులమో, ఏం మతమో తెలియదు, ఎలా పెంచుకుంటావ్? అని అడిగారు. "బొడ్డుకూడా ఆరని పసిబిడ్డకి ఆటితో ఏం పని మౌలాసాబ్. నాతో పాటే తనుకూడా" అని జవాబిచ్చాడు హుస్సేన్ సాయిబు. ఇంకేం మాట్లాడలేదు వాళ్లు. తన ప్రాణానికి తోడు దొరికినందుకు పిల్లకి జాన్ బీ అని పేరు పెట్టాడు. రోజూ పక్కింటి ఆపా నీళ్లుపోస్తే, ముద్దుగా బువ్వ పెట్టి పెంచాడు బాబా.  

ఎలా కావాలంటే అలా ఉండేది తను.ఎటువంటి ఆంక్షలు లేకుండా.... చుట్టుపక్కల వాళ్లు మాత్రం " బడీ హుయీతో బచ్చీ బాత్ సున్తీనై " భయం చెప్పు ఉసేను అనేవారు. అయినా ఏ రోజు తనని పంజరంలో ఉంచిందేలేదు. ఆ కాలనీలో ఉండే ఆడపిల్లలందరికీ జాన్ బీ స్వేచ్ఛ మీద ఉండే ఈర్ష్యతో,  తను వినేలా ఎగతాళిగా మాట్లాడుకునేవారు. "అమ్మీ, అబ్బా నహీహై ఏ బచ్చీకో, కచెరేమే మిలీ" అంటూ.  కాస్త ఊహ వచ్చాక అర్ధమైంది తనకి ఆ విషయం. దాంతో దోస్తులు లేరు తనకు. వాళ్ల మాటలు వినబడితే బాధ అనిపించినా, బాబా మీద ప్రేమ,గౌరవం ఇంకా ఎక్కువయ్యాయి. స్కూల్ నుంచి రాగానే బాబా కి సాయం చేసేది. 

బాబా కుట్టిన జాకెట్లకి చేతిపని చేసి, చొక్కాలకి గుండీలు, కాజాలు కుట్టేది. ఖాళీ సమయంలో బాబా దగ్గర మిషనుపని నేర్చుకుంది. జాన్ బీ పదోతరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే  బాబా లాయర్ చదివిస్తానన్నాడు. తనకి ఫస్ట్ క్లాస్ వచ్చింది  ఈ విషయం బాబాతో చెప్పడానికి ఆనందంగా ఎదురుచూస్తోంది. కానీ బాబాని ఆటోలో తీసుకొచ్చారు, నమాజ్  చదువుతుండగా చనిపోయాడు. గొప్ప చావు. అని అందరూ అనుకుంటున్నారు. అప్పుడే అర్ధం అయింది బాబా గుండెపోటుతో చనిపోయాడని. జాన్ బీ మొదటిసారి భరించలేని దుఖాన్ని చూసింది. ఒక్కసారిగా తనచుట్టూ అంతా శూన్యం ఆవహించింది.

కొద్దిరోజులు గడిచాక మత పెద్దలం అని చెప్పుకునేవారి పెత్తనంతో బాబా ఇల్లు కట్నంగా ఇచ్చేలా మాట్లాడి ఖాసింతో పెళ్లి చేశారు. భర్త పని చేసేది పెళ్లిళ్లకి మేళం ఒప్పకుంటేనే. ఆ పని అయిపోగానే  రోజూ తాగడం, తన్నడం. ఇక కట్నం కింద తీసుకున్న ఇల్లు అమ్మించేసి కూతురి పెళ్లి చేసి పంపేశారు అత్త,మామ. " మా మామ కూడా తాగుబోతే. దమ్మిడీ సంపాయించడు.ఇయాల సాయంత్రం ఎవరు  ఊరికే మందు పోపిత్తారో ఆళ్ల కాడికి చేరతాడు. అదీ, ఇదీ అని నాలుగు మాటలు ఉబ్బేసి ఊరికే తాగేసొత్తాడు. అత్త ఏ పనీ చెయ్యదు . ఒకముద్ద అన్నం కూడా వండదు. ఆల్లకి, ఈల్లకి ఊసుపోని కబుర్లు చెబూతా ఉంటది ". చెప్పడం ఆపి కాసిని మంచినీళ్లు తాగి మళ్లీ గతాన్ని తలుచుకుంది. 

" సంపాదన సరిపోక నేను సెంటర్ లో మిషను కుట్టడానికి ఎల్లేదాన్ని. పీస్ వర్కు ఒక జాకీటు కుడితే పన్నెండురూపాయలు ఇచ్చేవాళ్లు. అట్టాగే ఇల్లు నెట్టకొత్తన్నా. పిల్లలు కడుపులో పడ్డా కష్టం తప్పకపోగా ఇంకా పెరిగింది. గవర్నమెంటు ఆస్పత్రి లోనే రెండు కాన్పులూ. పిల్లలు పుట్టినప్పుడు పదిరోజులు ఒండిపెట్టడానికి అత్త నానా మాటలంది. " పుట్టిల్లన్నా లేదు ముండకి, ఇట్టాంటి ముండని తగిలిచ్చారు" అని అందరూ ఇనేలా తిట్టింది. పిల్లలకోసం అన్నీ ఓర్చుకున్నా. చుట్టు పక్కలోళ్లు మాత్రం ఏం చేత్తారు? దైర్న్యం చెప్పేవాళ్లు. కాన్పైందని ఎవరైనా పండో,కాయో ఇచ్చినా ఆటినికూడా అత్తే తినేది. పిల్లని ఎప్పుడూ దగ్గరికి తీసుకున్న పాపానపోలేదు. అట్టాంటిదానా, ఇట్టాంటిదానా అని తిడతా ఉండేది. అబ్బాయిలతో ఆడుకోడం జూసిదంటే చాలు., " నీ అమ్మ గాలికి బుట్టింది, నువ్వు కూడా గాలికి పోతావా, పాడుముండా" అని తిట్టి లోపలికి తరిమేసేది. మూడేళ్ల పిల్లకేం తెలుసు? అవన్నీ.., నాని తిట్టింది అని ఏడుసుకుంటా లోపలికి ఎల్లేది". 

" పిల్లోడు పుట్టి ఏడాదైంది.నా కష్టం పెరిగింది, భర్త, మామల తాగుడు పెరిగింది, అత్త ఆరళ్లు పెరిగాయి. కానీ ఏం చెయ్యను ఆరోగ్యం ఎలా ఉన్నా కష్టపడాల్సిందే. అనుకుంటూ చంటోడ్ని తీసుకునే పనికి ఎల్తన్నా. అక్కడ పనిచేసే ఒకామె చెప్పింది. " జాగర్తమ్మాయ్  మీ ఆయన కనిపించినోడి దగ్గరల్లా అప్పులు జాత్తన్నాడంటగా? ఆ సారాకొట్టోడికి పదేలియ్యాలంట. ఆడి కన్ను నీ మీద ఉందని నిన్న మా ఆయనెవతోనో అంటంటే ఇన్నా. జాగర్తగుండు" అని. కాసేపు ఏం అర్ధం కాలేదు. కానీ  భర్త పనికి కూడా ఎల్లడం మానేసి అప్పులు జేసి తాగుతున్నాడన్నది అర్ధమయ్యింది. అయినా ఏం చేయలేను"... అంటూ కళ్లలో సన్నటి చారను దాచుకుని, తనని కాలు కిందపెట్టకుండా పెంచిన బాబాను తలుచుకుంటూ  మౌనంగా ఉండిపోయింది జాన్ బీ. పరిస్థితి అర్థమైంది లచ్చవ్వకు జరిగిందంతా అడిగి మరింత బాధ పెట్టాలనుకోలేదు." సరేలే బిడ్డా దైర్నంగుండు, పొద్దుగల మల్ల పనిదొవ్వబట్టాలే ఇంగ పండుకో బిడ్డా" అంది లచ్చవ్వ.కానీ గతం ఊరికే వదలదుగా, అంత పని చేసింది తనేనా? ఇది తెగింపో, ధైర్యమో అర్ధంకాలేదు తనకు. ఏదైతే ఏంటి, తను తీసుకున్నది సరైన నిర్ణయమే అనుకుంది.

రైలెక్కేముందు జరిగిందంతా గుర్తుకొచ్చింది......
రోజూలాగే ఆ రోజు కూడా పొద్దుగూకుతుండగా ఇంటికి వచ్చింది జాన్ బీ. ముస్కాన్ అమ్మీ అంటూ కాళ్లు చూట్టేసింది. "జర టైరో హాతాపావ్ దోకే ఆతే, బాయి కో లే" అని పిల్లాడిని ఇచ్చింది. రాగానే కాసిని చాయినీళ్లు తాగి వంటపని మొదలుపెడుతుంది. అప్పుడుకూడా  చాయి కాసి, అత్తకివ్వబోయింది.., అంతలోనే చాయి గ్లాసు విసిరికొట్టింది అత్త. నిశ్చేష్టురాలయ్యింది జాన్ బీ.ఎందుకలా చేసిందని ఆలోచిస్తుండగానే తిట్లపురాణం అందుకుంది అత్త. " పాడుముండా, నీకు గత్తరొచ్చిపోను, దరిద్రంలాగా తగిలావ్ నా ఇంటికి, నిన్ను నిఖా చేసుకున్నాకే, మేరే బచ్చా ఐసా హోగయా, రెండ్రురోజులయ్యింది ఇంటికొచ్చి, ఖాయే కీ నైకీ , నీ కడుపుకి మాత్రం మూడుపూటలా మింగుతున్నావ్ పాడుముండా" అని తిడుతుండగానే తూలుతూ ఇంటికొచ్చాడు జాన్ బీ భర్త, వెనకాలే మామ కూడా " ఒరేయ్ ఇల్లుపట్టకుండా తిరుగుతున్నావేంట్రా,  దో దిన్ హువా, కిదర్ గయారే తూ" అని ఖాసింని గద్దించింది అత్త. 

" అది బయటకెల్తేనే, మై ఘర్ కు ఆతే"  అన్నాడు తాగిన మత్తులోనే. ఎవరికీ ఏమీ అర్ధంకాలేదు. " ఏమంటున్నావ్ రా అది బయటకెల్లటవేంటి యివరంగా చెప్పు " అంది. ఏం మాట్లాడలేదు ఖాసిం. ఇంతలో మామ తూలుతూనే చెప్పడం మొదలుపెట్టాడు." ఈ డూ ఆ సా రా యాకుబు దగ్గిర అప్పు చేసాడు, పదేలియ్యాలి, ఆడు పీకమీద కూచ్చున్నాడు, ఆజ్ ఇవ్వకపోతే రాత్ కో జాన్ బీ ని పంపియ్యమన్నాడు, లేదంటే రేపు సారాకొట్టుదగ్గర కట్టేత్తానన్నాడు. ఏ కిదర్ సే లాతే పదేలు, అందుకే అమ్మాయిని పంపిత్తానని బోల్ కో ఆయా ". అదే జరిగింది అని చెప్పాడు ఏమాత్రం సంకోచం లేకుండా. అది విన్న జాన్ బీ కి నెత్తిమీద పిడుగు పడ్డట్టయ్యింది. అత్త వంక దీనంగా చూసింది. ఏమీ స్పందిచలేదు అత్త. "ఇదంతా నా వల్లే జరిగిందని, దీనికి శిక్ష నేనే అనుభవించాలని లోపల అనుకుంటున్నట్టుంది." అని జాన్ బీ కి అనిపించింది. కాసేపు చూట్టూ నిశ్శబ్దం నిండిపోయింది.

చివరికి గొంతు పెగల్చుకుని అత్తని అడిగింది జాన్ బీ " మై క్యా కరీ పుప్పూ, ఏ కైసే బాతాంకర్రే దేఖో, ఆప్ బోలో పుప్పూ " అని. అత్త ఏం మాట్లాడలేదు. వాళ్ళ గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. జాన్ బీ కీ  ఒకవైపు కళ్లలో నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి, ఇంకోవైపు ఆలోచనలు పరుగెడుతున్నాయి. నాలుగేళ్లయ్యింది పెళ్లయి. ఇన్నాళ్లలో  ఒక్కరోజుకూడా తను సుఖంగా లేదు. రెక్కలు ముక్కలు చేసుకుని ఇంటికోసం సంపాదించింది. కుటుంబాన్ని చూసుకుంటోంది. తనేమీ   మూడుపూటలా తినడంలేదు, కడుపుమాడ్చుకుని తన వాళ్లందరికీ కడుపు నిండా అన్నం పెడుతోంది. ఇన్నేళ్లలో మంచి, చెడు చెప్పినవాళ్లు లేరు. కష్టం వస్తే ఆదుకున్నవాళ్లు లేరు. ఒంటరిగా పోరాడింది. తన బలహీనపడుతున్నా, తన కుటుంబానికి బలం అయ్యింది. కానీ చివరికి ఏం మిగిలింది. ఆడదాని జీవితం ఇంతేనా అనుకుంటూ గుండెలు పగిలేలా ఏడుస్తూ గోడకి చారగిలబడింది. కాసేపటికి బాబా పిలుస్తున్నట్టనిపించింది " మేరీ ప్యారీ బేటీ, రోతే నహీ బేటా, తుమే క్యా మరిజీ ఓ కరో, అబ్ ఉటో బేటా" అంటున్నాడు. కళ్లు తెరిచిచూసింది. ఎవరూ కనబడలేదు. టైం ఎనిమిదవుతోంది. 

ఒక నిర్ణయం తీసుకుంది. తలుపుకొట్టి అత్తను లేపింది. తలుపు తీసింది అత్త, " క్యా గే క్యా గూర్రీ మై కుచ్ నై బోల్తీ, తూ క్యా బోల్తీ జాకో ఖాసింకో బోలో " అంది. అంతే అత్త చెంప ఛెళ్లుమనిపించింది జాన్ బీ.  నువ్వు అత్తవి కాకపోయినా ఆడజెన్మెత్తావు, కనీసం ఆడదానివయ్యుంటావనుకున్నా. " ఆకలితో పానం బోతన్నా నిన్నేం అనలే, కానీ మానం బోతుంటే కూడా నువ్వు అడ్డుజెప్పలేదు, అల్లా కబీ మాఫ్ నై కరేగా తుజే, మై జారీ హుం బచ్చోంకో లేకే, ఇన్ని రోజులు తలాఖ్ ఇస్తాడని భయపడి నా భర్తకు అడ్డుచెప్పలేదు, ఇప్పుడు నేనే ఖులా ఇస్తున్నా, నీ తాగుబోతు కొడుక్కి మత్తు దిగాక ఈ యిషయం చెప్పు, మళ్ల నా జోలికి, నా పిల్లల జోలికి వస్తే జాన్ సే మార్ దేతే, బోల్ ఉస్ కో " అంది. ఉన్నఫళంగా  పిల్లలిద్దరినీ తీసుకుని బయటకొచ్చేసింది. ఎక్కడికెళ్లాలో తెలీలేదు. అలా నడుస్తూనే ఉంది ఆ రాత్రి రైలెక్కే వరకూ.

తెల్లారింది. పిల్లలింక లేవలేదు. లచ్చవ్వ లేచి పనులు చేసుకుని చాయ్ చేసి, డబుల్ రొట్టె  తెచ్చిచ్చింది జాన్ బీ కి. రాత్రంతా లచ్చవ్వ కూడా జాన్ బీ గురించి ఆలోచించింది. చాయ్ తాగుతూ అంది లచ్చవ్వ, " ఇగొ జూడూ నేనొక ముచ్చట జెప్తా ఇను, గీ పోరగాల్లని తీసుకుని రోజు రోజు ఈ అడ్డకూలి కష్టం నీతోనిగాదు, ఏడ్నన్నా ఇండ్లల్ల పనికి పో , పైసలు మస్తుగిస్తరు. పొల్లని ఇస్కూలుకి కూడ తోలొచ్చు. జర సోచాయించు, ఇయ్యాల ఇంట్లనే ఉండు, చుట్టుపక్కల ఎవులుకన్నా అడుగు జెప్తరు, అట్టజెయ్యి"  అంటూనే  మనసులో ఉన్న అనుమానం మాత్రం బయటపెట్టకుండా టిఫిన్ బాక్స్ పట్టుకుని బయల్దేరింది లచ్చవ్వ.  

ఇద్దరు పిల్లల్ని తీసుకుని తొమ్మిందింటప్పుడు జాన్ బీ చుట్టుపక్కల వాకబు చెయ్యడానికి వెళ్లింది. ఎంత మందినడిగినా ఒకటే జవాబు " తురకోల్లకు పనియ్యరు ఈడ, ఇంగేడ్నన్నా జూసుకోపో " ఈ సమాధానం విని విని విసిగిపోయింది తను. చిన్నప్పుడు కూడా హిందీలో ఎక్కువ మార్కులొస్తే " తురుకోల్లు అందుకే వస్తయ్"  అనేవాళ్లు. ఆడపిల్లలకు ఫస్ట్ ర్యాంక్ వస్తే కొంతమంది దాతలు బహుమతులు ఇచ్చేవారు. స్కూల్ బ్యాగ్, బుక్స్, సైకిల్ వంటివి. తనకే ఈసారి బహుమతి అని చాలాసార్లు అనుకుంది తను. కానీ " ఆ తురకదానికి ఎందుకు ఇవ్వాలి మనవాళ్లకి రెండుమార్కులు ఎక్కువెయ్యండి" అని హెడ్ మాస్టారు టీచర్లకి చెప్పడం ఇప్పటికీ గుర్తుంది తనకు. 

దాంతో ఆ బహుమతుల మీద ఆశలు వదిలేసుకుంది. చిన్నప్పుడు ఆ వివక్షే, ఇంత జీవితం చూసినా, కష్టపడి బతుకుదామనుకున్నా ఇప్పుడూ ఆ వివక్షే. ఏం చేయాలో అర్ధం కాలేదు తనకి. పిల్లలవైపు చూసింది. తను లేకపోతే ఏమయిపోతారో అని భయం వేసింది. ఇప్పుడు తనకి జీవితంలో ఏదీ ముఖ్యం కాదు, అత్త, మామ, భర్త, ఇల్లూ ఏదీ ముఖ్యం కాదు. బతుకుతెరువు ముఖ్యం.తన పిల్లల భవిష్యత్తు మాత్రమే ముఖ్యం అనుకుంది. " తుమే క్యా మరిజీ హై ఓ కరో బేటా " బాబా మాట మళ్లీ వినిపించింది. ఒక పసుపుతాడు , తిలకం డబ్బా కొనుక్కుంది, లచ్చవ్వ ఇంటివైపు నడిచింది. సాయంత్రానికి వచ్చింది లచ్చవ్వ. " జాన్ బీ, జాన్ బీ "  అని పిలిచింది. " నా పేరు లక్ష్మి". అని స్థిరంగా చెప్పింది జాన్ బీ. తన అనుమానం తీరి, అంతా అర్ధం చేసుకుని చిన్నగా నవ్వింది లచ్చవ్వ.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios