అయిత అనిత తెలుగు కవిత: చేదాయెనా?!
తల్లిదండ్రుల మీద ప్రేమ లేకపోవడాన్ని అయిత అనిత తన కవిత ' చేదాయెనా ' లో ప్రశ్నిస్తున్నారు. చదవండి.
దేహపు తరువు
బాధల గాడుపుదుమారానికి
వడలుతున్నా
సడలని సహనంతో
నీకు జన్మనిచ్చె కదా!
వ్యాధుల పీడలు చీడలై
చిచ్చురేపుతున్నా
రక్తమాంసాల ఎరువును పోసి
పేగునే దారువు చేసి
నీ కడుపు నింపెను కదా!
గర్భగుడిలో నిను పదిలపరిచి
పోషకాల సంప్రోక్షణ చేసెను కదా!
తొమ్మిది నెలలు
నీ క్షేమమే ప్రాణంగా తలచి
నీ వ్యక్తిత్వ రూపానికి
రామాయణ భాగవతాలు పఠించెగదా!
నీ సంపూర్ణత్వానికై
వ్యాయామమో సంగీతమో
విధిగా ఆచరించెనుకదా!
తన అనురాగాన్ని పొత్తిళ్లు చేసి
తన మమకారాన్ని ఆయువుగా నింపి
నిను పెంచెనుకదా!
మరిప్పుడేంటి?
ఆ...కడుపు తీపి చేదాయే!
తీయని పలకరింపుకైనా నోచుకోలేదాయే!
బిక్కు బిక్కుమంటూ
వృద్దాశ్రమాల అంచుల వేలాడబట్టే!
గతపు పుస్తక పుటలను
ఓసారైనా తిరిగేయ్!
సంఘటనల సారాన్ని ఓ సారైనా తాగేయ్!
మేల్కొలుపుల అక్షరమొకటన్నా కనడుతుందేమో....!!!
నీ మది రీతినైనా కొంత మార్చుతుందేమో!