అహోబిలం ప్రభాకర్ తెలుగు కవిత: ఎవరికి వలయం
ఎవరు ఎవరికి దూరమవుతుంరు ? అసలు వలయాలు ఎక్కడి నుండి మొదలవుతున్నవి ? అహోబిలం ప్రభాకర్ ఆర్టిస్టు రాసిన ఈ కవితలో చూడండి.
పేరు మోయడం అంటే
ఎన్నో పొగడ్తల మీద
మనసు వంచించు కోవడం
భజన మనిషిని
వలయపు దండల మద్యన
శిలను చేయవచ్చు
ప్రాణమైన వాడి
కప్పెడు చాయి పంచుకున్న
చాయలు ఆవిరవుతుండొచ్చు
బాల్యపు భరోసా చేయి
ఇప్పుడు బలహీనం కావచ్చు
అప్పుడు పంచుకున్న గలగలలు
ఇప్పుడు ఉత్తగాయి స్వరాలు కావచ్చు
పేరు కొచ్చిన తంటా
తాయిలాల తాళాల తంతుల
ఆ కుప్పమీది పెద్ద కూలీవైతివి
ఆ నీతుల చేతలకు
అందనంత దూరంగా గొప్పంగనే ఉన్నవ్
దిశలు మారిన అనుభవాలు
దశదశలుగా వెలితి
నాదా నీదా దృష్టి ఎవరిది
తీయటి భారాన్ని మోస్తూన్నది ఎవరు
ఆత్మీయతకు రేషం ఎక్కువ
ముక్కుపుటల నిండా రోషమై అడ్డొస్తుంటవ్
దస్కం శూన్యమైనప్పుడు
మనసు శేషం బొడ్డుపేగై తిరగాడుతుంటది
తీరిక తిరగబడ్డప్పుడైనా
ఎగిరి రావోయ్
ఆనాటి ఛాయల నిండా
తిరిగి వద్దాం
మిగిలిన జీవితానికి
ఒక ఊపిరి చాయి తాగుదాం.