మానవ సంబంధాలన్నీ మరీ దారుణంగా తయారౌతున్నాయి. తాను తప్పుచేసి.. ఆ శిక్ష నుంచి తప్పించుకునేందుకు అమాయకురాలైన చెల్లిని ఇరికించింది ఓ యువతి. ఈ సంఘటన ఫ్లోరిడాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... జాక్లీన్ హ్యుమినీ. ఫ్లోరిడాలో నివసిస్తోంది. కాగా.. ఆమెకు టీచర్ కావాలనేది చిన్నప్పటి కల. ఆ కలను నిజం చేసుకునేందుకు కష్టపడుతోంది. కాగా.. గతేడాది నవంబర్ లో తొలిసారిగా ఆమెకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. మున్సిపల్ కార్యాలయం నుంచి 33డాలర్ల జరిమానా కట్టాలంటూ ఆమెకు నోటీసులు అందాయి.

అనుమతి లేకుండా ఇంట్లో వ్యభిచారం చేస్తున్నారనే కారణంతో ఆమె పేరిట ఈ నోటీసులు అందడం గమనార్హం. ఆ నోటీసు చూసి ఆమె ఒక్కసారిగా కంగుతిన్నది. వెంటనే సంబంధిత అధికారులను కాంటాక్ట్ అయ్యింది. ఏదో పొరపాటు జరిగిందని.. తనకు వ్యభిచారంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. కానీ అధికారులు వినిపించుకోలేదు. దీంతో..ఆమె తప్పు చేయకుండానే జరిమానా కట్టాల్సి వచ్చింది.

మళ్లీ కొద్దిరోజులకు ఆమె మళ్లీ అలాంటి నోటీసులే వచ్చాయి. తన తప్పులేదని నిరూపించే సాక్ష్యాలు చూపించినప్పటికీ.. అధికారులు ఆమెను వదలలేదు. దీంతో.. ఆమె ఓ ప్రైవేటు డిటెక్టివ్ ని ఆశ్రయించింది. తీరా వాళ్ల దర్యాప్తులో జాక్లీన్ హ్యుమినీ సొంత అక్క సమంత హ్యుమినీ ఇదంతా చేసిందని తేలింది.

జాక్లీన్ ఇంట్లో లేని సమయంలో.. ఆమె పేరుతో సమంతే వ్యభిచారం నిర్వహించింది. దీంతో.. బాధితురాలు న్యాయపరంగా తనపై పడిన నిందను తొలగించుకునేందుకు ప్రయత్నిస్తోంది.