రాత్రిపూట చర్మ సంరక్షణ ఎంత ముఖ్యమో.. ఉదయం కూడా అంతే ముఖ్యమంటారు నిపుణులు. కొన్ని సహజ పదార్థాలతో ఫేషియల్ మసాజ్ చేస్తే మీరు మరింత అందంగా మారిపోతారని నిపుణులు చెబుతున్నారు.
ఉదయం లేవగానే ఇంటి పనుల్లో ఫుల్ బిజీగా ఉంటారు ఆడవాళ్లు. తర్వాత స్నానం చేశామా? పనులకు వెళ్లామా? అన్నట్టే ఉంటారు. కానీ చర్మ సంరక్షణను పట్టించుకోరు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఫేస్ వాష్ తో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం మాయిశ్చరైజర్ లేదా సన్స్క్రీన్ ను అప్లై చేయాలి. ఇకపోతే రాత్రిపూట తప్పని సరిగా ముఖాన్ని కడగాలి. దీనివల్ల ముఖంపై పేరుకుపోయిన నూనె, మలినాలు తొలగిపోతాయి. కానీ ఇలాంటివేమీ చేయకపోతే అకాల వృద్ధాప్యం, డల్ స్కిన్, మచ్చలు, మొటిమలు, పిగ్మెంటేషన్, డ్రై స్కిన్ వంటి సమస్యలు వస్తాయి. అయితే ఉదయం పూట కేవలం ఐదు నిమిషాలు మసాజ్ చేస్తే ఈ సమస్యలేమీ ఉండవు. ముఖం కూడా అందంగా మారిపోతుంది. ఉదయం పూట ఎలాంటి వాటితో ముఖాన్ని మసాజ్ చేయాలంటే..?
బొప్పాయి గుజ్జు
బొప్పాయిలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫోలేట్, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. అంతేకాదు ఇవి చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పోషకాలు చర్మ రంధ్రాలు మూసుకుపోవడానికి కారణమయ్యే చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి, మొటిమలను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. అందుకే ఉదయం బొప్పాయి గుజ్జులో ఫేస్ మసాజ్ చేయండి.
నువ్వుల నూనె
నువ్వుల నూనె మన ఆరోగ్యానికే కాదు అందమైన చర్మానికి కూడా సహాయపడుతుంది. నువ్వుల నూనెతో మీ ముఖాన్ని మసాజ్ చేస్తే ఎన్నో చర్మ సమస్యలు తగ్గిపోతాయి. నువ్వుల నూనెలో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె లు ఉంటాయి. ఇవన్నీ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. నువ్వుల నూనెలో ఉండే విటమిన్ ఇ చర్మ కణాలను రక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. మచ్చలు, మొటిమలు, దద్దుర్లను తగ్గిస్తాయి.
కొబ్బరి నూనె
డ్రై స్కిన్ ఉన్నవారికి ఈ నూనె ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది చర్మంపై తేమను పెంచుతుంది. డ్రై నెస్ ను పోగొడుతుంది. మలినాలను తొలగిస్తుంది. అంతేకాదు చర్మపు చికాకుల నుంచి ఉపశమనం కలిగించడానికి కూడా ఇది సహాయపడుతుంది.
షియా వెన్న
షియా వెన్నలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, విటమిన్ ఇ, విటమిన్ ఎఫ్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను పెంచుతాయి. అలాగే ఆరోగ్యకరమైన చర్మ కణాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తాయి.
తేనె, పసుపు పొడి
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 1 టీస్పూన్ తేనె, చిటికెడు పసుపును వేసి కలపండి. దీన్ని ముఖానికి బాగా అప్లై చేయండి. తేనె, పసుపు లో ఉండే శోథ నిరోధక లక్షణాలు మంటను తగ్గించడానికి సహాయపడతాయి. ఇవి మీ చర్మానికి పోషణ కూడా అందిస్తాయి. అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
