పురుషులు ధరించే లోదుస్తువులు.. వీర్యకణాలపై ప్రభావం చూపుతాయా..? అవుననే అంటున్నారు నిపుణులు. సంతానప్రాప్తి కలగక పోవడానికి కూడా ఇదొక కారణం కావొచ్చని చెబుతున్నారు. వాస్తవానికి మగవాళ్లు వారికి సౌకర్యంగా ఉండే వాటిని లోదుస్తులుగా వేసుకొంటారు.

అయితే బాక్సర్లు వేసుకొన్న వారిలో స్పెర్మ్‌ కౌంట్‌ ఎక్కువగా ఉండగా.. బ్రీఫ్స్‌ లేదా జాకీలు వేసుకొన్న వారిలో ప్రతికూల ఫలితాలు కనిపించాయని హ్యూమన్‌ రిప్రోడక్షన్‌ జర్నల్‌లో ప్రచురించిన సర్వేలో వెల్లడించారు. 

మొత్తం 656మంది పురుషులపై ఈ విషయంలో సర్వే చేయగా.. ఈ విషయాలు వెల్లడయ్యాయి. వారి సర్వేలో బాక్సర్లు ధరించే వారిలో ఇతరులతోపోలిస్తే 25శాతం వీర్యకణాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తేలింది. కేవలం లో దుస్తుల విషయంలో మాత్రమే కాకుండా.. వారి ఇతర అలవాట్ల గురించి కూడా ఈ సర్వేలో పరిశీలించినట్లు తెలుస్తోంది.

మొత్తం సర్వేలో 656మంది పాల్గొనగా.. వారిలో 345మందికి బాక్సర్ షాట్స్ ధరించడం ఇష్టమని చెప్పగా.. మిగిలిన వారు బిగుతుగా ఉండే అండర్ వేర్స్ ని వేసుకోవడానికి ఇష్టపడుతున్నట్లు చెప్పారు. నిపుణులు మాత్రం.. వీర్యకణాల సంఖ్య తగ్గకుండా ఉండాలంటే.. కాస్త వదులుగా ఉండే లోదుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. 

వాస్తవానికి వీర్య వృద్ధి ఒక్కోవారం ఒక్కోలా ఉంటుందని, కౌంట్‌ తక్కువగా ఉన్నా సంతాన ప్రాప్తికి అడ్డుకాబోదని పలువురు యూరాలజిస్టులు చెబుతున్నారు. అయితే లోదుస్తులవల్ల స్పెర్మ్‌ కౌంట్‌ పడిపోతుందనే అంశంపై మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.