MahaShivaratri 2023: మహాశివరాత్రి నాడు శివలింగానికి నీటిని సమర్పించి.. పార్వతీపరమేశ్వరులను పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం. మరి ఈ మహా శివరాత్రి సందర్భంగా భారత దేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన కొన్ని ప్రసిద్ధ శివాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.. 

MahaShivaratri 2023: హిందువులు జరుపుకునే గొప్ప పండుగల్లో మహాశివరాత్రి ఒకటి. ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. ఈ రోజున శివభక్తులంతా నిష్టగా ఉపవాసం ఉండి.. శివారాధనలో గడుపుతారు. అయితే ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. మహా శివరాత్రి నాడు శివలింగానికి నీటిని సమర్పించి పార్వతీ పరమేశ్వరులను పూజిస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి.. కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయని నమ్మకం. అయితే శివరాత్రి సందర్భంగా ఎక్కడెక్కడో ఉన్న శివాలయాలకు వెళుతుంటారు. అయితే మన దేశంలో కొన్ని ప్రసిద్ధ, ప్రత్యేకమైన శివాలయాలు ఉన్నాయి. అక్కడి వెళితే అంతా మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం. మరి ఆ శివాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

రామేశ్వరం జ్యోతిర్లింగం (తమిళనాడు)

రామేశ్వరం సనాతన ధర్మానికి చెందిన పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఉంది. ఇది నాలుగు ధామాలలో ఒకటి. అంతేకాదు ఇక్కడ కొలువై ఉన్న శివలింగం పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణిస్తారు. భారతదేశానికి ఉత్తరాన కాశీకి ఎలాంటి గుర్తింపు ఉందో.. దక్షిణాన రామేశ్వరానికి కూడా అంతే గుర్తింపు ఉంది. రామసేతు నిర్మించడానికి ముందు శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని స్థాపించాడని నమ్ముతారు. ఇక్కడ శివుడికి పూజలు కూడా చేశారు. అందుకే ఈ ఆలయాన్ని రామేశ్వరం అని పిలుస్తారు. 

తుతి ఝార్నా ఆలయం (జార్ఖండ్)

తుటి ఝార్నా ఆలయం జార్ఖండ్ లోని రామ్ గఢ్ లో ఉంది. ఈ ఆలయంలో శివలింగానికి ఎవరూ అభిషేకం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సహజంగానే అభిషేకం జరుతుంది. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకతే ఇది. పూర్వం ఇక్కడి శివలింగంపై రాళ్ల నుంచి వచ్చే నీళ్లు పడేది. తరువాత గంగా దేవి విగ్రహం తయారుచేసి అక్కడి నుంచి నీరు వచ్చేలా చేశారు. అంటే శివలింగానికి అభిషేకం గంగా దేవి చేతుల్లో నుంచి జరుగుతుందని అనిపిస్తుంది. ఏడాది పొడవునా ఈ అభిషేకం జరుగుతుంది. ఈ ఆలయంలో పూజలు చేస్తే సకల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.

పౌరీవాలా శివధామ్ (హిమాచల్ ప్రదేశ్)

ఈ శివధామ్ హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మౌర్ జిల్లాలోని నహాన్ కు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలో మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తైన శివలింగాన్ని ప్రతిష్టించారు. ఈ శివలింగం త్రేతాయుగానికి చెందినదని, ప్రతి ఏడాది వరి గింజంతా పెరుగుతుందని నమ్ముతారు. ప్రతి భక్తుని కోరికలన్నీ నెరవేరుతాయని ఒక నమ్మకం కూడా ఉంది.

లింగరాజ ఆలయం (ఒరిస్సా)

ఒడిషాలోని లింగరాజ ఆలయం ఎంతో ప్రత్యేకమైంది. అయితే శివుడితో పాటుగా ఇక్కడ విష్ణువును కూడా పూజిస్తారు. అందుకే దీనిని హరిహర అని కూడా పిలుస్తారు. ఒరిస్సాలోని దేవాలయాల నగరంలో ఉన్న ఈ ఆలయం పెద్దది. గొప్ప చరిత్రను కూడా కలిగి ఉంది.

మృదేశ్వర్ మహదేవ్ (గుజరాత్)

గుజరాత్ లోని గోద్రాలో మృదేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది. ఈ శివలింగం పరిమాణం సంవత్సరానికి ఒక వరి గింజకు సమానంగా పెరుగుతుంది. లింగం పరిమాణం ఎనిమిదిన్నర అడుగులు అయిన రోజు అది ఆలయ పైకప్పును తాకుతుందని నమ్మకం కూడా ఉంది. ఇది జరిగిన రోజు విపత్తు వస్తుందని నమ్ముతారు. మృదేశ్వర్ శివలింగం ప్రత్యేకత ఏమిటంటే సహజంగా దాని నుంచి నీటి ప్రవాహం వస్తూ ఉంటుంది. అదే శివలింగానికి అభిషేకం చేస్తుంది. ఈ నీటి ప్రవాహం ఎప్పుడూ ఆగలేదట.

త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం (నాసిక్)

మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో ఉన్న త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇది శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి. ఆలయం లోపల మూడు చిన్న లింగాలు ఉంటాయి. వాటిని బ్రహ్మ, విష్ణు, శివుడి చిహ్నాలుగా భావిస్తారు . పురాతన కాలంలో ఈ ప్రదేశం గౌతమ ఋషి తపోభూమిగా ఉండేదని నమ్ముతారు. తనపై పడిన గోవధ పాపం నుంచి విముక్తి పొందేందుకు శివుని తపస్సు చేసి గోదావరిని ఇక్కడకు రప్పించాడు. అప్పటి నుంచి శివుడు ఇక్కడ త్రయంబకేశ్వరుని రూపంలో కొలువై ఉన్నాడని నమ్మకం.