చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం లాంటి సమస్యలు మొదలౌతాయి. దీని కారణంగా.. వయసుకు మించి కనపడుతూ ఉంటారు. చేదేమి లేక చాలా మంది జుట్టుకి రంగులు వేయడం మొదలుపెడతారు. దాని వల్ల జుట్టు నల్లగా మారినా.. నేచురల్ గా కనిపించదు. మరి ఈ సమస్యకి పరిష్కారమే లేదా అంటే.. ఆహార నియమాల్లో మార్పులు చేసుకుంటే.. ఈ తెల్లజుట్టు సమస్యను అధిగమించవచ్చంటున్నారు నిపుణులు.

చిన్నతనంలో జుట్టు నెరవడం అనేది చాలా మందికి వంశపారపర్యంగా వస్తూ ఉంటుంది. ఇంకొందరికీ థైరాయిడ్ సమస్య వల్ల కూడా వస్తుంటుంది. దీనిని పూర్తిగా ఆహారం ద్వారా నివారించకపోవచ్చు. కానీ.. కొద్దిలో కొద్దిగా దాని వేగాన్ని నియంత్రించవచ్చు.

ఆహారంలో ప్రోటీన్, విటమిన్-బి12, జింక్, ఐరన్, కాపర్ వంటి పోషకాలు అధికంగా ఉండేలా చూసుకోవాలి. మాంసాహారం, పాలు, గుడ్లతోపాటు కంది, సెనగ, పెసర్లు వంటి పప్పులో ఏదో ఒకటి భోజనంలో ఉండేలా చూసుకోవాలి. బాదం, వాల్నట్స్, పిస్తా, వేరు శెనగ వంటి వాటిని కూడా తరచూ తీసుకోవాలి. 

శారీరకంగా, మానసికంగా ఒత్తిడి తగ్గించుకోవాలి. కనీసం 7నుంచి 8గంటల నిద్ర చాలా అవసరం. కాలుష్యానికి దూరంగా ఉండాలి. అదేవిధంగా ధూమపానానికి కూడా దూరంగా ఉండటం మంచిది.