చాలా మంది పేరెంట్స్ పిల్లలు తమ మాట వినడం లేదని కంగారుపడుతుంటారు. వద్దన్న పని చేస్తున్నారని విసుక్కుంటారు. దీంతో... పిల్లలను కంట్రోల్ చేయడానికి పేరెంట్స్ చాలా ప్రయత్నాలు  చేస్తుంటారు. వారి మీద చెయ్యి చేసుకోవడం..  ఇలానే చెయ్యి.. అలా చెయ్యిద్దు అంటూ చెప్పడం.. లాంటివి మొదలుపెడతారు.

పిల్లలు వాటిని వినకపోతే... వారిని కంట్రోల్ చేయడానికి అరవడం లాంటివి, భయపెట్టడం చేస్తారు. అయితే.. అది మంచి పద్ధతి కాదంటున్నారు నిపుణులు.అతిగా అదుపు ఆజ్ఞల్లో పెట్టటం మంచిది కాదని.. దీంతో పిల్లల్లో భావోద్వేగాలను నియంత్రించుకునే సామర్థ్యం కుంటుపడుతోందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

ఎదిగే వయసులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటంలో.. ముఖ్యంగా సంక్లిష్టమైన స్కూలు వాతావరణంలో ఇలాంటి పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. భావోద్వేగాలను, ప్రవర్తనలను నియంత్రిచుకోలేకపోతున్నవారు ఇతరులతో స్నేహం ఏర్పరచుకోలేకపోవటంతో పాటు తరగతి గదుల్లోనూ ఇబ్బందులకు గురవుతున్నారని వివరిస్తున్నారు.

అంతేకాదు పిల్లలు గమనించరులే అని వాళ్ల ముందు పేరెంట్స్ గొడవపడటం, కొట్టుకోవడం.. తిట్టుకోవడం లాంటివి కూడా చేయకూడదు. అవి పిల్లలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.