అప్పటి వరకు బాగానే ప్రిపేర్ అయ్యి.. ఎగ్జామ్స్ అనే సరికి ఒత్తిడికి గురయ్యే వారు చాలా మందే ఉన్నారు. ఒత్తిడి వల్ల చాలా మంది సరిగ్గా తినరు. నిద్రపోరు. దీనికి తోడు ఎలాంటి క్వశ్చన్స్ వాస్తాయోనని తెగ ఆలోచిస్తుంటారు. స్ట్రెక్ కి తోడు ఈ అతి ఆలోచనలు మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాదు శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి.
ఎగ్జామ్స్ టైంలో ఒత్తిడికి గురికావడం సర్వ సాధారణ విషయం. ఫ్యామిలీ లేదా స్కూల్ వల్లనో విద్యార్థులు ఒత్తిడికి గురవుతుంటారు. నిజానికి పిల్లలపై ఎప్పుడూ ఒత్తిడి తీసుకురాకూడదు. ఎందుకంటే ఇది వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ స్ట్రెస్ వారి నిద్ర, వారు తినే ఆహారంపై ఎంతో ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు ఒత్తిడిని తగ్గించడానికి బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..
కెఫిన్ ను ఎక్కువగా తీసుకోకూడదు
ఎగ్జామ్స్ టైంలో కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ లేదా టీ లను తాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి మీ నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. ముఖ్యంగా మీ శరీరం తగినంత విశ్రాంతిని పొందకుండా చూస్తాయి. కాఫీ, టీ , కార్బోనేటేడ్ పానీయాలను ఎక్కువగా తీసుకోకండి. ఎందుకంటే వీటిలో ఉండే కెఫిన్ మిమ్మల్ని ఎక్కువ సేపు మెలుకువగా ఉంచుతుంది. మీకు నిద్రలేకుండా చేస్తుంది. సరిగ్గా నిద్రపోకుంటే మీరు చురుగ్గా ఉండలేరు. నిద్రలేకపోవడం వల్ల విషయాలను కూడా మర్చిపోయే అవకాశం ఉంది.
సమయానికి తినండి
సాధారణంగా పరీక్షల సమయంలో చాలా మంది సరిగ్గా తినరు. కానీ ఎగ్జామ్స్ టైంల్ భోజనం చేయకపోవడం వల్ల అనారోగ్యం, చికాకు, శక్తి తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తుంది. అందుకే టైం టూ టైం భోజనాన్ని మిస్ చేయకుండా తినాలి. తినాలని ఏవి పడితే అవి తినకూడదు. మిమ్మల్నిశక్తివంతంగా ఉంచే ఆహారాలనే తినాలి.
హైడ్రేట్ గా ఉండండి
నీరు ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది. అందుకే నీటిని పుష్కలంగా తాగాలి. అప్పుడే మీ శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. మీ స్టడీ డెస్క్ పై ఖచ్చితంగా వాటర్ బాటిల్ ను పెట్టుకోండి. కావాలనుకుంటే వాటర్ లో కొన్ని పుదీనా ఆకులను, నిమ్మముక్కలను వేయొచ్చు. ఈ సీజన్ లో శరీరం చాలా సువులుగా డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగండి.
జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలను తినండి
కొన్ని రకాల ఆహారాలు మెమోరీ పవర్ ను బాగా పెంచుతతాయి. అయితే జ్ఞాపకశక్తి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు బాగా సహాయపడతాయి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే వాల్ నట్స్, అవిసె గింజలు, గుమ్మడికాయ విత్తనాలు, నువ్వులు, సోయాబీన్ నూనె వంటి ఆహారాల్లో కూడా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కావాలనుకుంటే మీరు సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు.
ఒత్తిడిని తగ్గించే ఆహారాన్ని తినండి
పరీక్ష ఒత్తిడిని తగ్గించడానికి విటమిన్ బి-కాంప్లెక్స్, విటమిన్ సి తో పాటుగా నీటిలో కరిగే కొన్ని విటమిన్లు బాగా సహాయపడతాయి. అలాగే జింక్ వంటి ఖనిజాలు మన శరీరానికి చాలా అవసరం. ఈ ఖనిజాలు అడ్రినల్ హార్మోన్ల ఉత్పత్తికి, పనితీరుకు సహాయపడతాయి. ఇవి మన శరీర ఒత్తిడిని తగ్గించే హార్మోన్లు. బాదం, బ్రౌన్ రైస్, గుడ్లు, పండ్లు, తాజా కూరగాయలను తింటే మీ ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుంది.
