మీ మూడ్ ఏం బాలేదంటే మీ శరీరంలో సెరోటోనిన్ స్థాయిలు తక్కువగా ఉన్నట్టే లెక్క. ఇలా అయితే మీరు నిరాశ, ఆంధోళన, ఒత్తిడి, నిద్రలేమి, అతిగా ఆలోచించడం, నెగివీట్ ఆలోచనలు, ఇతర మానసిక సమస్యలతో బాధపడతారు.
మన శరీరంలో సెరోటోనిన్ స్థాయిలు మెరుగ్గా ఉండాలి. ఇది మన శరీరంలో ఉండే ఒక హార్మోన్. ఈ హార్మోన్ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఈ సెరోటోనిన్ స్థాయిలు తక్కువగా ఉంటే మీ పూర్తి శరీర ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎవరి శరీరంలో అయితే ఈ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉంటాయో.. వారు ఒత్తిడి, నిరాశ, ఆందోళన, అతిగా ఆలోచించడం, నిద్రలేమి, ప్రతికూల ఆలోచనలు, ఇతర మానసిక అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. సెరోటోనిన్ మీ మానసిక స్థితి, మీ మొత్తం ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది. ఈ హార్మోన్ మీరు మంచి మూడ్ లో ఉండటానికి సహాయపడుతుంది.
అయితే చాలా మందిలో ఈ సెరోటోనిన్ హార్మోన్ తక్కువగా ఉంటుంది. అయితే ఈ హార్మోన్ ను పెంచడానికి ట్రిప్టోఫాన్ కలిగిన ఆహారాలు బాగా సహాయపడతాయి. ట్రిప్టోఫాన్ ఎక్కువగా ఉండే ఆహారాలు అమైనో ఆమ్లం సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. దీంతో మీ మానసిక స్థితి బాగుంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సెరోటోనిన్ స్థాయిలను పెంచడానికి ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అరటిపండ్లు
అరటిపండ్లలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరం 5-హెచ్టీపీ ని ఉత్పత్తి చేయడానికి ట్రిప్టోఫాన్ ను ఉపయోగిస్తుంది. ఇది సెరోటోనిన్, మెలటోనిన్ ను తయారుచేసే సమ్మేళనం. ఈ రెండు మానసిక స్థితిని, నిద్రను నియంత్రించే న్యూరోట్రాన్స్మిటర్లు. అందుకే మూడ్ బాగుండాలంటే అరటి పండును ఖచ్చితంగా తినండి. అరటిపండు మిమ్మల్ని ఎనర్జిటిక్ గా కూడా ఉంచుతుంది.
బాదం
బాదంలో ఫోలేట్, మెగ్నీషియంతో పాటుగా ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటుంది. సెరోటోనిన్ స్థాయిలను పెంచడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో బాగా సహాయపడుతుంది. బాదంలో విటమిన్ బి 2, విటమిన్ ఇ, విటమిన్ ఎ లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడతాయి. రోజూ గుప్పెడు బాదం పప్పులను తింటే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు.
ఎ2 మిల్క్
ఎ 2 పాలలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది సెరోటోనిన్ ను ఉత్పత్తి చేసే అమైనో ఆమ్లాన్ని కలిగి ఉంటుంది. ఈ పాలను తాగితే మీ శరీరంలో సెరోటోనిన్ స్థాయిలు పెరుగుతాయి. మీ మానసిక స్థితి మెరుగ్గా ఉంటుంది. అలాగే రాత్రుళ్లు ప్రశాంతంగా నిద్రపోతారు.
పైనాపిల్
పైనాపిల్ లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. పైనాపిల్ లో మీ మెదడులో సెరోటోనిన్ ను పెంచే ట్రిప్టోఫాన్ ను కలిగి ఉంటుంది. అంతేకాదు పైనాపిల్ లో బ్రోమెలైన్ అనే ప్రోటిన్ కూడా ఉంటుంది. ఇది శక్తివంతమైన శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది.
