Asianet News TeluguAsianet News Telugu

అద్దెకున్న వారి పనా.. ప్రేమోన్మాది ఘాతుకమా: రాధిక హత్యపై వీడని మిస్టరీ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కరీంనగర్ ఇంటర్ విద్యార్ధిని రాధిక హత్య కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే హత్య జరిగి గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క క్లూ కూడా దొరక్కపోవడంతో ఉన్నతాధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. 

Karimnagar Police Speed Up Investigation On inter student radhika murder case
Author
Karimnagar, First Published Feb 11, 2020, 6:55 PM IST

ఇది తెలిసిన వారి పనా లేక.. ప్రేమికుడా, లేక మరేవరైనా ఘాతుకానికి పాల్పడ్డరా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో అద్దెకు ఉండి... ఇటీవలే ఖాళీ చేసినవారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అన్నదానిపై ఖాకీలు ఆరా తీస్తున్నారు.

సంఘటన స్థలంలో దొరికిన కత్తిపై హంతకుడి వేలిముద్రల కోసం పరిశీలించినప్పటికీ ఫలితం దొరకలేదు. చివరికి డాగ్ స్క్వాడ్‌‌ను రప్పించి అణువణువు గాలించినా ఎలాంటి క్లూ లభించకపోవడంతో పోలీసు అధికారులకు సైతం అంతుచిక్కడం లేదు.

ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీపీ కమలాసన్ రెడ్డి నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే ఇంట్లోని కూరగాయలు కోసే కత్తితోనే హత్య చేయడంతో.. ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ కాదని, తెలిసిన వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.

Also Read:ఆగని ప్రేమోన్మాదుల ఆగడాలు... కరీంనగర్ లో మరో యువతి బలి

అయితే హత్యకు ఉపయోగించిన కత్తికి రక్తం మరకలు లేకపోవడంతో... హత్యచేసిన తర్వాత కత్తిని శుభ్రం చేసి ఉంటారని భావిస్తున్నారు. నిందితుడు హత్య చేసే ఉద్దేశ్యంతో రాలేదని... అనుకోని పరిణామం తలెత్తడంతో హత్యకు పాల్పడి ఉండొచ్చనే కోణంలో చూస్తున్నారు.

మరోవైపు మృతురాలి తల్లిదండ్రులు ముత్త ఓదెమ్మ- కొంరయ్యలు మాత్రం తమ ఇంట్లో కిరాయికి ఉండి, ఖాళీ చేసిన వారిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తమ కూతురు స్నేహితురాలి కుటుంబం గత కొద్ది నెలలుగా తమ ఇంట్లో కిరాయికి ఉండేదని... అయితే... స్నేహితురాలి తండ్రి పోచాలు రోజు తాగివచ్చి ఇంట్లో న్యూసెన్స్ చేసేవాడని... అంతే కాకుండా... ఈ మధ్య కొత్త వారిని కూడా ఇంటికి తీసుకువస్తుండడంతో వారిని బలవంతంగా ఇంటిని ఖాళీ చేయించామని చెబుతున్నారు.

Also Read:నమ్మించి తీసికెళ్లి ఐదుగురు మిత్రులతో కలిసి యువతిపై గ్యాంగ్ రేప్

పోచాలు కుటుంబ సభ్యులు ఎవరైనా... ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకుని హత్యకు పాల్పడ్డాడేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయి మర్డర్ పై మరో రకమైన కథనం కూడా కొనసాగుతుంది.

రాధికకు ఈ మధ్యే ఓ అబ్బాయి ప్రపోజ్ చేశాడని కానీ ఆమె అందుకు అంగీకరించకపోవడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పలువురు చెబుతున్నారు. మరోవైపు రాధిక కుటుంబసభ్యులను పరామర్శించిన మంత్రి గంగుల కమలాకర్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios