కరీంనగర్: దేశవ్యాప్త లాక్‌డౌన్ నేపథ్యంలో కరీంనగర్‌లో కరోనా కేసులు మరింత విస్తరించకుండా ఉండేందుకు జమాతే ల ఉలేమాలు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని ముస్లిం ఉలేమాల నిర్ణయాన్ని గౌరవించాలని ఎంఐఎం నగర శాఖ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం జుమా నమాజ్ ఆచరించేందుకు ఎవరూ మసీదులకు రావద్దని ఆయన కోరారు. ఈ విషయంలో పంథాలకు, పట్టింపులకు వెళ్ళవద్దన్నారు. 

మసీదుల్లో ప్రార్థనలు చేయకపోవడం బాధకరమే కానీ, బతికుంటే ఇలాంటి నమాజులు ఎన్నో చేసుకోవచ్చన్నారు. అన్ని జమాత్ ల ఉలేమాలు కలిసి జుమ్మా నమాజ్ ఎవరి ఇంట్లో వారిని ఆచరించాలని పిలుపు నిచ్చారని అహ్మద్ హుస్సేన్ తెలిపారు. గుంపులుగా ఉంటే వైరస్ సోకుతుందన్న విషయన్ని గమనించాలని సూచించారు. 

చైనా, ఇటలీ, ఇరాన్, అమెరికా వంటి దేశాలలో కరోనా వేలాది మంది ప్రాణాలు బలిగొన్నదని గుర్తుచేశారు. ఇంట్లో నుంచి ఎవరు బయటికి రావొద్దని గులాం ఆహ్మద్ వెల్లడించారు. స్వీయ నియంత్రణ పాటించి ప్రతి ముస్లిం ప్రభుత్వానికి సహకరించాలన్నారు. కరీంనగర్‌లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముస్లిం యువత సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.