కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ఆరేళ్లుగా టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. కేంద్రం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులను  అభివృద్ధి కోసం వెచ్చించకుండా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా పనులు చేపడుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతలే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తారని విమర్శలు గుప్పించారు. 

రోడ్ల నిర్మాణం, కూడళ్ల అభివృద్ధి పేరిట పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేశారని విమర్శించారు. భారీగా నిధులు కేటాయించామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నప్పటికీ... క్షేత్రస్థాయిలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని మండిపడ్డారు. ఇవన్నీ కుంభకోణాలు కాదా అని ప్రశ్నించారు. 

నగరంలో స్వచ్ఛమైన నీరు, సరైన రోడ్లు కూడా లేవని అన్నారు. కేంద్రం నుంచి భారీగా నిధులు తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. స్వచ్ఛమైన పాలన కోసం బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు విస్తృతంగా పర్యటించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ప్రచారం  ముమ్మరంగా సాగుతోంది.  1, 2, 3, 24, 25, 26 డివిజన్ లలో బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

అపోలో రోడ్డులో అంబేడ్కర్ నగర్ కమ్యూనిటీ హాల్ నుంచి పాదయాత్ర ప్రారంభమైన  కిసాన్ నగర్,  తీగలగుట్టపల్లిలోని వివిధ కాలనీల్లో విస్తృతంగా జరిగింది. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన ఎంపీ బండి సంజయ్ బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.  

read more  కరీంనగర్ బిజెపి షాక్... టీఆర్ఎస్ లో చేరిన కీలక నేత

టీఆర్ఎస్ పార్టీ హామీల అమలు ఏమైంది?

టీఆర్ఎస్ ఎన్నికల హామీలైన 24 గంటల తాగునీటి సరఫరా, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల నిర్మాణం వంటి హామీలను విస్మరించిందని ఎంపీ సంజయ్ అన్నారు. మాటల గారడీతో ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని  హితవు పలికారు. ఆరేళ్లుగా టీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు.. ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను జనంలోకి తీసుకెళ్తామని స్పష్టంచేశారు. 

సీఏఏపై టీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి 

పౌరసత్వ సవరణ చట్టంపై... ఎంఐఎం తో కలిసి టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.   సీఏఏపై ముఖ్యమంత్రి వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. 

read more  మున్సిపల్ పోల్స్: కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు సవాల్

ఎన్.ఆర్.సిపై  కేంద్రం ఎలాంటి ప్రకటన చేయక ముందే రాష్ట్రంలో అమలు కానివ్వబోమని హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. కేంద్రం ఎలాంటి ప్రకటన చేయని ఎన్.ఆర్.సిపై మాట్లాడే ప్రభుత్వ పెద్దలు... ఇప్పటికే అమలులోకి తీసుకొచ్చిన సీఏఏపై స్పందన తెలపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం టీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని మండిపడ్డారు. దేశభక్తుల నిలయమైన కరీంనగర్ లో టీఆర్ఎస్, ఎంఐఎం కుట్రలు సాగనివ్వబోమని ఎంపీ సంజయ్ తేల్చిచెప్పారు.