కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 2లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం పుష్కలంగా ఉంది. అయితే.. ఇన్ని దేశాలను కలవరపెడుతున్న వైరస్ కి ఇప్పటి వరకు ఎవరూ మందు కనుగొనలేకపోయారు. ఎన్నో పరిశోధనలు చేస్తున్నప్పటికీ.. మందు కానీ, వ్యాక్సిన్ కానీ కనుగొనలేకపోయారు. అయితే.. మలేరియా నివారణకు వాడే హైడ్రో క్లోరోక్విన్ నే వినియోగిస్తున్నారు.

ఇదే కాస్త ఉపశమనం కలిగిస్తోంది. అమెరికాలో ఈ మందు లభించక.. భారత్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. అయితే.. ఈ మందు గురించి తాజాగా కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. ఈ మందు వాడితే.. తీవ్ర సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరిస్తోంది.

దీని కారణంగా హృదయ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ పరిణామాల గురించి ఔషదానికి సంబంధించిన వివరాల్లో ముందుగానే పొందుపరిచి ఉన్నాయని గుర్తుచేసింది. రోగి పరిస్థితిని ఆస్పత్రిలో ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ.. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ప్రభావాన్ని తగ్గించవచ్చని తెలిపింది.

కరోనా సోకిన వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఏ ఔషధం వాడాలో అక్కడ ఉండే వైద్య సిబ్బందే జాగ్రత్తగా నిర్ణయించాలని సూచించింది. ఇప్పటి వరకు కోవిడ్-19కి మందు కనిపెట్టలేదని.. అప్పటి వరకు ఈ మందును మాత్రమే వాడాలని పేర్కొంది.

అయితే... సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే విషయాన్ని గుర్తుపెట్టుకొని.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీనిని వినియోగించాలని పేర్కొంది. కరోనా సోకిన వారందరికీ.. ఈ మందు ఇవ్వకూడదని.. కేవలం పరిస్థితి విషమంగా ఉందన్నవారికి మాత్రమే వినియోగించాలని సూచించింది. ఈ డ్రగ్ ని ఎలా వినియోగించాలనే విషయంపై వైద్యులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని పేర్కొంది.