స్వలింగ సంపర్కం నేరం కాదు అంటూ పోప్ ప్రాన్సిస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. స్వలింగ సంపర్కాన్ని అందరూ పాపంగా చూస్తున్నారని అలా చూడకూడదంటూ పోప్ పేర్కొన్నారు. వాళ్లు కూడా దేవుడి బిడ్డలేనని వారికి కూడా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొనడం గమనార్హం. 

స్వలింగ పౌర సంఘాల ఉద్యమానికి తాను మద్దతు పలుకుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. స్వలింగ సంపర్కుల పట్ల సమాజంలో చిన్నచూపు ఉందని దాదాపు అన్ని దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉందని హోమో సెక్సువల్స్ లో చాలా మంది దారుణమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

వాటర్ ఆన్ ఫైర్ అనే డాక్యుమెంటరీతో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న రష్యన్ దర్శకుడు ఎవ్జిన్ అఫినెవ్ స్కీ తాజాగా పోప్ ఫ్రాన్సిస్ జీవితంపై ఫ్రాన్సిస్కో అనే మరో డాక్యుమెంటరీని రూపొందించారు. రోమ్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా బుధవారం దానిని తొలిసారిగా ప్రదర్శించారు. అందులో పోప్ తనను ఎక్కువగా బాధకు గురిచేసే అంశాలను ప్రస్తావించారు. పేదరికం వలసలు ఆకలిచావులు యుద్ధ పరిస్థితులు మానసిక ఆందోళనల తోపాటు హోమో సెక్సువల్స్ సమస్యలపైనా తాను ప్రార్థనలు చేస్తానని పోప్ చెప్పారు. ఎల్జీబీటీ ఉద్యమకారులకు స్వలింగ పౌరహక్కులకు మద్దతు పలికిన మొట్టమొదటి పోప్ గా ఫ్రాన్సిస్ రికార్డులకెక్కారు.

ఫ్రాన్సిస్కో డాక్యుమెంటరీ ప్రదర్శన తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎల్జీబీటీలు పోప్ కు ధన్యవాదాలు చెబుతున్నారు. ఆయన ప్రకటనతో తమ ఉద్యమానికి ఎంతో బలం చేకూరినట్లయిందని ఎల్జీబీటీ ప్రముఖులు వ్యాఖ్యానించారు. పోప్ పదవి చేపట్టిన తొలి నాన్ యురోపయిన్ ఫ్రాన్సిస్. అర్జెంటీనాకు చెందిన ఆయన.. స్వదేశంలో ఆర్చి బిషప్ గా ఉన్న సమయంలోనే సేమ్ సెక్స్ మ్యారేజీలకు అనుమతించి క్యాథలిక్ ప్రపంచంలో సంచలనం రేపారు.