లాహోర్: పాకిస్తాన్ లోని లాహోర్ లో దారుణమైన సంఘటన జరిగింది. జాతీయ రహదారిపై మహిళ మీద సామూహిక అత్యాచారం జరిగింది. దానికి పోలీసాఫీసర్ బాధితురాలినే తప్పు పట్టాడు. దానిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఓ మహిళ తన పిల్లలతో పాటు కలిసి ప్రయాణిస్తుండగా మధ్యలో కారు బ్రేక్ డౌన్ అయింది. 

ఆమె కారులో ఉన్న విషయాన్ని గుర్తించిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారు అద్దాలు పగులగొట్టి సమీపంలోని పొలాల్లోకి తీసుకుని వెళ్లి పిల్లల ఎదురుగానే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటన ఇటీవల జరిగింది. ఆ తర్వాత పోలీసులు స్పందించిన తీరుపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 

బాధిత మహిళ ఒంటరిగా వెళ్లి ఉండాల్సింది కాదని పోలీసు చీఫ్ ఉమర్ షేక్ అన్నారు. దీనిపై పాకిస్తాన్ ప్రజలు భగ్గుమంటున్నారు. అతన్ని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అర్థరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల ప్రాంతంలో ఆ దారుణ సంఘటన జరిగింది. 

ఆ కేసుతో సంబంధం ఉన్న 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో ఇంధనం అయిపోవడంతో పోలీసులకు ఫోన్ చేసి వారి రాక కోసం మహిళ ఎదురు చూస్తూ ఉంది. ఆ సమయంలో దుండగులు కారు అద్దాలు పగులగొట్టి ఆమెనూ ఆమె పిల్లలనూ కారు నుంచి బయటకు లాక్కొచ్చారు. 

ఆ తర్వాత పొలాల్లోకి తీసుకుని వెళ్లి మహిళపై పిల్లల ఎదురుగానే పలుమార్లు అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమె వద్ద ఉనన నగదును, ఆభరణాలను, బ్యాంకు కార్డులను తీసుకుని పారిపోయారు.