కనీవినీ ఎరుగనంత భారీస్థాయిలో రవాణా చేస్తున్న డ్రగ్ రాకెట్ ను ఇండియన్ కోస్ట్ గార్డ్స్ విచ్ఛిన్నం చేసింది. శ్రీలంక నుంచి అరేబియా సముద్రంలోని లక్ష ద్వీప్ మినికోయ్ దీవుల గుండా డ్రగ్స్ ను తరలిస్తున్న ఈ ముఠాను కోస్ట్ గార్డ్ సిబ్బంది అరెస్ట్ చేసింది. వారి నుంచి భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాలు, తుపాకులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మూడు బోట్లను సీజ్ చేశారు.

ఈ ఘటన మార్చి 18న జరిగింది. కాగా దీనికి సంబంధించిన వివరాలు ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు ఇవాళ మీడియాకు వెల్లడించారు. శ్రీలంక ఫిషింగ్ బోట్ రవిహాన్సిలో 300 కిలోల హై గ్రేడ్ హెరాయిన్, 1000రౌండ్లతో కూడిన ఐదు, ఎకె-47 రైఫిల్స్ ఇండియన్ కోస్ట్ గార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. 

అంతర్జాతీయ మార్కెట్లో ఈ మాదక ద్రవ్యాల విలువ సుమారు రూ. 3000కోట్ల వరకూ ఉంటుందని అంచనా. మూడు పడవలతో పాటు 19మంది సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డ్స్ అరెస్ట్ చేశారు. వీరందరినీ దర్యాప్తు కోసం కేరళలోని విజింజంకు తరలించారు. 

అయితే,మార్చి 18న తెల్లవారుజామున ఎప్పట్లాగే కోస్ట్ గార్డ్ సిబ్బంది అరేబియా సముద్రంలో గస్తీకి వెళ్లారు. ఐతే మినికోయ్ ద్వీపం సమీపంలో మూడు మత్స్యకారుల బోట్లు అనుమానాస్పదంగా కనిపించాయి. 

అవి శ్రీలంకకు చెందిన బోట్లు కావడంతో అనుమానించిన కోస్ట గార్డ్స్ వాటినివెంబడించారు. అయితే కోస్ట్ గార్డ్స్‌ను చూసి వారు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఒక దశలో ఫైరింగ్ చేసేందుకు కూడా ప్రయత్నించారు. 

అయినా చాకచక్యంతో కోస్ట్ గార్డ్స్ సిబ్బంది వెంబడించి వారందరినీ పట్టుకుని భారీ స్థాయిలో ఉన్న అత్యంత నాణ్యమైన డ్రగ్స్, ఆధునిక తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ భారీ డ్రగ్ దందా మూలాలు ఏంటీ? ఈ రాకెట్ వెనక ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.